అక్షర బద్ధుడు – పసుపులేటి

రాయడమే తప్పు.. బతకడం తెలీని బడుగు జర్నలిస్టు అక్షరాన్ని ప్రేమించిన మంచి మనిషి. సగటు మధ్య తరగతి మనిషి! ఇటీవల కన్నుమూసిన సీనియర్ సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు గురించి నాలుగు ముక్కల్లో చెప్పమంటే, తెలిసిన ఎవరైనా అనే మాట ఇదే! ఇంటి దగ్గర ఏ జిల్లా గ్రంథాలయానికి పొద్దున్నే తలుపు తెరిచే టైమ్ కే వెళ్ళి ‘విజయచిత్ర’లూ… ‘ఆంధ్రప్రభలూ.. ‘ఆంధ్ర జ్యోతులూ చదివిన రోజుల నుంచీ…. బెజవాడలో ఏ సినిమా హాలు దగ్గరో గంటకు పావలా పెట్టి ‘జ్యోతి చిత్రలూ, సితారలూ, ‘శివరంజను లూ ఆబగా తిర గేసిన రోజుల నుంచీ నా లాంటి వేలమంది సినిమా పిచ్చోళ్ళకు ఆయన పేరు తెలుసు!.
పాతికేళ్ళ క్రితం మద్రాసులో ఏ సినిమా ప్రెస్ మీటుకు వెళ్ళినా… అర్జునరావు… జగన్.. ఉమామహేశ్వ రరావు… ‘ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు… జగన్మోహన రావు. పాటిబండ్ల విజయలక్ష్మి.. బి.కె. ఈశ్వర్.. ఎం.ఎల్. నరసింహం.. నారాయణవర్మ.. బి. జయరాజు. ఇలా ఎంతోమంది! వాళ్ళందరితో ఉంటూనే.. అందరికీ కాస్తంత భిన్నంగా…. తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా… తలకు రుమాలు… చంకకు గుడ్డ సంచీ.. సైకిలు (తరువాత ఎప్పటికో టీవీఎస్ 50) సీరియస్ గా…. ముందు వరుసలో వంచిన తల ఎత్తకుండా, కాగితం మీద పెన్ను ఆపకుండా.. పెద్ద అక్షరాల కలిపి రాతతో రాసుకుంటూ పోతూ ఉండే సాదాసీదా మనిషి పసుపులేటి రామారావు. చివరి వరకు అదే పసితనపు ఉత్సాహం, అంతే నిబద్ధత. ఉదయాన్నే ఏడు గంటల కల్లా సైకిలెక్కి స్టూడియో రౌండప్, సినిమా ఆఫీసుల విజిట్లతో… నట, దర్శక, నిర్మాతలతో మాట్లాడుతూ.. సమాచారం, స్టిల్స్ సేకరిస్తూ- ఇంటర్వ్యూలు చేసేస్తూ. రాత్రి దాకా – కష్టపడడం.. ఒంటి చేతితో సంచిక మొత్తం వార్తలు రాసేయడం- అదీ ఆయన తత్త్వం. ‘విశాలాంధ్ర’, ‘జ్యోతిచిత్ర రోజుల నుంచి ‘సంతోషం’ మ్యాగజైన్ దాకా అదే పద్ధతి!!

రామారావు ప్రస్థానం …
రంగుహంగుల ప్రపంచంలో రోజూ తిరిగినా, వచ్చిన దారిని మర్చిపోని మనిషి ఆయన. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజువరంలో నాన్న, అమ్మ, పిన్నమ్మల దిగువ మధ్యతరగతి వ్యవసాయ కష్టం మీద పెరిగినవాడు కనక, జీవితంలో కష్టసుఖాలు తెలుసు. విద్యార్థి దశలోనే నాటకాలు రాయడం, వేయడం, డైరెక్ట్ చేయడం, రంగుల బొమ్మలు గీయడం, ఎస్.ఎఫ్.ఐ. ప్రజానాట్య మండలితో రాజకీయాలలో తిరగడంతో సామాన్యుల కష్టాలపై అక్కరా పెరిగింది. చివరి దాకా ఆయన రూపం, ప్రవర్తన, మాటలు, రాతల్లో అదే కనపడేది..

అభ్యుదయ భావాలతో …
ప్రకాశం జిల్లాలో పత్తి రైతుల ఆత్మహత్యల వార్త చదివి, నిజనిర్ధారణకు అక్కడకు వెళ్ళాచ్చి మరీ ఆ కుటుంబాలను అప్పటి సుప్రీమ్ హీరో తన శత దినోత్సవంలో ఆదుకొనేలా ప్రేరేపించింది. పసుపు లేటే. అభ్యుదయ భావాలను జనానికి చేర్చడం లోనూ నిబద్ధత చూపాలని మాదాల, టి.కృష్ణ మొదలు ఆర్.నారాయణమూర్తి సినిమాల దాకా చాలావాటికి మీడియా ప్రచారకర్త ఆయనే. ఇరవై ఏళ్ళకే 1970లో బతుకుదెరువు వెతుక్కుంటూ మద్రాసు చేరిన రామారావు ‘మిక్కీ. మౌస్’, ‘బాలభారతి’ లాంటి పిల్లల పత్రికల్లో కొన్నాళ్లు.. ఆపైన కమ్యూనిజం ఉత్సాహంతో ‘విశాలాంధ్రలో కొన్నేళ్ళు పని చేశారు. ‘సోవియట్ భూమి’ శ్రీకాంత్ ఆదరణతో నిలబడ్డారు. ‘విశాలాంధ్రలో వంద రూపాయల జీతం. పెళ్ళి కాని జీవితం. రామారావు సిన్సియారిటీ చూసి, జర్నలిస్టు మోహన్ కుమార్ సాక్షాత్తూ ‘జ్యోతిచిత్ర లాంటి పెద్ద పత్రికలో చేరమని ఆఫర్ చేస్తే, పెట్టుబడి దారుల పేపరులోనా ” అంటూ తటపటాయించిన సత్తెకాలపు మనిషి ఆయన. చివరకు ‘ఆంధ్రజ్యోతి’ గ్రూపులో చేరి, సంస్థ పత్రికలన్నిటికీ ఒంటి చేతితో పుంఖానుపుంఖాలుగా సినిమా సమాచారం రాస్తూ, పాతికేళ్ళ పైనే పనిచేశారు. మధ్యలో దాసరి ‘ఉదయం’, ‘శివరంజని’ పత్రికల వైపు వెళ్ళినా, కొద్ది రోజులకే తన మాతృసం స్థకు వచ్చేశారు. జ్యోతిచిత్ర వీక్లీలో ఎన్టీఆర్ ‘నా దేశం’ సినిమా గురించి సీరియల్ రాసింది, అభినేత్రి సావిత్రి జీవచ్చవంలా మంచంపై పడి ఉంటే, ఆ విషాదానికి కారణమైన పరిస్థితులు, వ్యక్తులపై గ్రౌండ్ రిపో రుతో 1981లో వరుస సంచలనాత్మక కథనాలు ‘జ్యోతిచిత్ర లో, సీరియగా ‘వనితాజ్యోతి’లో రాసిందీ ఆయనే సావిత్రిపై వచ్చిన బయోపిఖ్ కు ఆయన కథనాలు ‘అద్భుత నటి సావిత్రి పుస్తకమూ ఆధారమైంది. అయితే, దర్శక, నిర్మాతలు ఆయన పేరెక్కడా ప్రస్తావించనైనా లేదు. పరుషంగా మాట్లాడడం తెలియని రామారావు అప్పుడు ఆంతరంగికంగా ఆవేదన చెందారే తప్ప. మాటల్లో మాత్రం అదుపు తప్పలేదు.

మారని మనిషి …
కాలం మారింది… స్టార్లు మారారు. సినిమా మారింది. పరిశ్రమ మద్రాసు నుంచి భాగ్యనగరానికి మారింది. ప్రెస్ పెరిగిపోయింది. అనుబంధాలూ మారిపోయాయి. కానీ, చనిపోయే దాకా ఆయనే ఏమీ మారలేదు. టీవీలు, వెబ్ సైట్లు, యూ ట్యూబులు… ఇలా అనేకం వచ్చి, క్షణం కూర్చొనే తీరిక, ఆవతలి వ్యక్తి అంతరంగాన్ని ఒడిసిపట్టుకొని జూగ్రత్తగా సమాచారం సేకరిద్దామనే ఓపిక లేనిరోజుల్లో.. మనుషుల్లో… ఏడుపదుల వయసులోనూ రామారావు కొద్ది నెలల క్రితం దాకా రోజూ సినిమా వార్తల సేకరణకు వస్తూనే ఉన్నారు… ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. రాస్తూనే ఉన్నారు.. పత్రికలో వేస్తూనే ఉన్నారు. పని చేసే పత్రికతో సంబంధం లేకుండా.. అక్షరాల మీద ప్రేమలో ఆయనది నిత్య సంతోషం. ఆ వయసులోనూ వృత్తి పట్ల ఆయన శ్రద్ధ, అంకితభావం, నిజాయతీ సమకాలీన సినీ పత్రికా పత్రికారంగంలో కొత్త తరానికి ఓ కను విప్పు. రాయడం… పసుపులేటి రామారావుకు ప్రాణవాయువు. ఆయనకు తెలిసిన విద్య కూడా అదే. ఎన్టీ యార్, ఏయన్నార్, యస్వీఆర్ నుంచి ఈనాటి అనుష్క దాకా స్టర్లు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీ షియన్లు… చివరకు సెట్లో లైట్ బాయ్స్ దాకా అందరూ ఆయనకు తెలుసు! వాళ్ళందరికీ ఆయనే వరో, ఎంత సీనియరో బాగా తెలుసు! కానీ వచ్చిన చిక్కేమిటంటే.. ఇన్నేళ్ళ రంగుల ప్రపంచపు అనుభవం తరువాత… రామారావుకు చాలా సంగతులు తెలీదు. తెలియలేదు. మనుషుల్ని పట్టుకోవడం ఆయనకు తెలీదు. పైరవీలు చేయడం అస్సలు తెలీదు! ఉద్యోగంలో ఇస్తానన్న జీతం, చేసిన పీఆర్వో పనికి ఇవ్వాల్సిన పారితోషికం, అవతలివాడు తన దగ్గరే తీసుకున్న అప్పు – ఎగొట్టినప్పటికీ వాళ్ళను నిలదీయడం చివరి రోజుల దాకా రామారావుకు తెలీదు. ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బు ఆగిపోయిన సినిమా మిత్రుడికిచ్చి, ఆఖరుకు తన డబ్బులు తానే అడగలేనంత మొహమాటస్తుడు. ఇవాళివాళ్ళ లెక్కలో బతకడం తెలియనివాడు. లేకపోతే, దాదాపు అయిదు దశాబ్దా లుగా సినీ పత్రికారంగంలో ఉన్న రామారావుకు… ఎన్ని (నంది) అవార్డులు రావాలి! ఎన్ని రివార్డులు ఇవ్వాలి! ఈ పాటికి ఆయన ఎన్ని మేడలు కట్టాలి! ఎన్ని మిద్దెలు సంపాదించాలి! ఆ మాటే రామారావుతో అంటే నవ్వేసేవారు. మద్రాసు టీ నగర్ చారీ సందుకు హీరో చిరంజీవి పరుగెత్తుకుంటూ వచ్చి, ఆప్యాయంగా భోజనం చేసిన చిన్న ఇంట్లో ఉన్నప్పటి నుంచి… ఇప్పుడు హైద రాబాద్ అన్నపూర్ణా ఏడెకరాల దగ్గర బస్తీలో లేకలేక కలిగిన ఇంటర్ వయసు పిల్లాడు, భార్యతో మధ్యతరగతి జీవితమే గడి పేసిన దాకా… ఆయనలో ఆదే చిరునవ్వు..

ఎన్నో పుస్తకాలు …
‘వెండితెర విషాదరాగాలు, అభ్యుదయ దర్శక అరుణకిరణం టి. కృష్ణ. తెర వెనుక దాసరి, శ్రీదేవి కథ – ఇలా ఓ డజను పుస్తకాలు ఆయన రాశారు. చనిపోయే ముందు కూడా మాదాల రంగారావు మీద పుస్తకం రాసే పనిలోనే ఉన్నారు. కానీ రామారావు పుస్తకంగా తెచ్చినవాటి కన్నా.. తీసుకురాని సంగతులే ఎక్కువ అవీ సమగ్రంగా, సరైన పద్ధతిలో తేవాలని మిత్రులు చెబుతూనే వచ్చారు.
కానీ, ఆయనది స్వతంత్ర పంథా, అభిమానానికే తప్ప, ఎవరి ఆదేశానికీ ఓ పట్టాన లొంగే రకం కాదు. ఆటోబయాగ్రఫీ లాంటి 46 ఏళ్ళ సినీ ప్రస్థానంలో పదనిసలు’ ఈ మధ్యనే అలాగే తనదైన పద్ధతిలోనే తెచ్చారు…

అర్థ శతాబ్దం పాటు అలుపెరుగక…
పుస్తకాల ప్రొడక్షన్ విలువలు పక్కన పెట్టి, రామారావు రాసిన అక్షరాలలో ఆర్థతను చూస్తే కన్నీళ్ళు వస్తాయి. సావిత్రి మద్యానికి బాని సైంది ఎలా? శ్రీదేవి, బోనీ కపూర్ని ఎందుకని పెళ్ళాడారు. దర్శకుడు రాజా రవిచంద్ర హత్య వెనుక ఉన్నదెవరు? గాయని జమునారాణి గొంతు నొక్కేసిన సినీ పాలిటిక్స్ ఏంటి డేట్లు చూడమన్న సిల్క్ స్మితను… ఉరికి వేలాడుతున్న శవంగా చూసినప్పటి మానసిక సంఘర్షణ ఏమిటి? తాగుడు మింగేసిన రాజబాబులు, హరనాధరాజులు.. ఆర్థిక ఇబ్బందుల కోరలకు చిక్కిన జయకృష్ణలు… ఆప్యాయంగా పలకరించే దిక్కు లేక అలమటించిన రంగనాథ్ లు, అవకాశాల కోసం అర్థించిన రాజనాలలు.. కావీ స్టెప్పులు చేయనంటూ స్టార్ హీరోను కాదని కోపంలో కెరీర్ పోగొట్టుకున్న సలీమ్ మాస్టర్లు… బతికి చెడ్డ మహానటులు. బతకలేక చావును కౌగిలించుకున్న అందాల తారలు.. ఎందరెందరో ఆయన రాతల్లో కనిపిస్తారు. కన్నీళ్ళు తెప్పిస్తారు. ఆ రచనలు సావిత్రి నుంచి సాయిధరమ్ తేజ్ వరకు ఎంతో మందిని కలిసి, మాట్లాడి రామారావు రాసిన మన సినిమా చరిత్ర. క్యాన్సర్ తీసుకుంటూ, అపోలోలో ఆప్తమిత్రుడైన నటుడు మాదాల రంగారావు చేతిలో దర్శకుడు టి.కృష్ణ కన్నుమూసిన ఘట్టం లాంటి చారిత్రక ఘటనలెన్నిటికో పసుపులేటి రామారావు ప్రత్యక్షసాక్షి. మద్రాసు అరుణాచలం స్టూడియోలో షూటింగ్ లో పొద్దుటి నుంచి టీ నీళ్ళు తప్ప మరేమీ తాగక చేతులు వణుకుతున్న సావిత్రికి స్వయంగా ఇన్సులిన్ ఇంజక్షన్ చేసిందీ ఆయనే. ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ లాంటి ఎందరినో సిని రంగంలోకి తెచ్చి, నిలదొక్కుకొనేలా ప్రోత్సహించిందీ రామారావే. ప్రాణం ఖరీదు’ రిలీజైనప్పుడు చూసి, తొలిచిత్రమైనా చిరంజీవి అనే నటుడు బాగా చేశాడంటూ, వృద్ధిలోకి వస్తాడంటూ పత్రికలో వ్యాసం రాశారాయన. అది చదివిన చిరంజీవి ఉబ్బితబ్బిబ్బయి, వెతుక్కుంటూ వచ్చి మరీ కృతజ్ఞతగా కొన్ని నోట్లు జేబులో పెట్టబోతే, ఉద్యోగాభిమానాన్నీ, అక్షరాన్ని వెలకట్టరాదని సున్నితంగా తిరస్కరించిన నిస్వార్థపరుడు రామారావు, 88 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో 50 ఏళ్ళు మరోవైపు చూపు లేకుండా, నిరంతరాయంగా రాస్తూ, సినిమాతో కలసి నడచిన అరుదైన సినీజర్నలిస్టు కాబట్టే రామారావుది ఒక మరవలేని అధ్యాయం. ఎక్కడ ఏ ప్రెస్ మీటైనా నిర్ణీత సమయం కన్నా ముందే ఉండాలి, రాత్రి ఎంత పొద్దుపోయినా సరే ఆనాటి వార్తలు ఆనాడే ఆఫీసులో రాసి మరీ ఇంటికి వెళ్ళాలి – ఇవీ రామారావు జీవితాంతం పాటించిన సూత్రాలు, అయిదు దశాబ్దాల సినీ పత్రికా రచనలో రామారావు చేతి సంచీ నిండా సంపాదించుకొని ఉండకపోవచ్చు. కానీ ఎంతోమంది అభిమానం, గౌరవం సంపాదించుకున్నారు. కృతజ్ఞత తగ్గిపోతున్న ఈ నిరుపేద సినీరంగానికి మరెంతో తన సంచీ నుంచి ఇవ్వాల్సి ఉండగానే వెళ్ళిపోయారు. నమ్ముకున్న వృత్తికే అంకితమైన అక్షరజీవికి ఇది నాలుగు అక్షరాల ఆత్మీయ నివేదన!
– డాక్టర్ రెంటాల జయదేవ
(అంధ్రజ్యోతి సౌజన్యం తో …)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap