ఓ ధ్రువతార రాలింది …

5 దశాబ్దాలపాటు జర్నలిజం రంగంలో ధ్రువతారగా వెలుగొందిన సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) 5-3-2020 వ తేది కన్నుమూశారు అన్న వార్త జర్నలిస్టు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అజాతశత్రువుగా జర్నలిజం లో పేరు ప్రఖ్యాతులు గడించిన పొత్తూరి మృతి జర్నలిజం రంగానికి తీరని లోటే. జర్నలిస్టులకు ఉపయోగపడే ఎన్నో రచనలు ఆయన కలం నుండి జాలువారాయి. ఎంతో మంది జర్నలిస్టులకు ఆయన మార్గదర్శి. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితులు పొత్తూరి. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేశారు. ప్రముఖ తెలుగు పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారు.
పొత్తూరి తో నాకూ అనుబంధం వుంది. కావలితో కూడా వారికి పరిచయం వుంది. 1980 దశకం ప్రారంభం రోజుల్లో లెక్చరర్ ఎన్వీ రమణయ్య గారు నవవికాస్ లో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమానికి పొత్తూరి విచ్చేసారు. పొత్తూరిని రైల్వే స్టేషన్ నుండి నవవికాస్ కు చేర్చే బాధ్యత ఎన్వీ రమణయ్య గారు నాకు అప్పగించారు. పొత్తూరి రైలు దిగగానే వారిచేతిలో బ్యాగ్ తీసుకొనే ప్రయత్నం చేసాను. వారు ఇవ్వలేదు. ఎవరి వస్తువులు వారే మోయాలి అనిచెప్పి నాకు జ్ఞానోదయం కలిగించారు. అలా పొత్తూరితో నా అనుబంధం కొనసాగుతూ వచ్చింది. హైద్రాబాద్ లో పొత్తూరి ఆంధ్రప్రభ సంపాదకులుగా ఉన్నరోజుల్లో తరచూ ఆయన్ను కలిసేవాడిని. గత 5 సంవత్సరాలక్రితం వార్త దినపత్రిక సంపాదకులు దామెర్ల సాయిబాబాతో కలిసి హైద్రాబాద్ లోని పొత్తూరి నివాసానికి వెళ్ళాము. పొత్తూరి పాదాలకు నమస్కరించుకొన్నాను. సాయిబాబా నన్ను పొత్తూరికి పరిచయం చేసే ప్రయత్నం చెయ్యగా – ప్రభాకర్ నాకు ఎంతో ఇష్టుడు అనిచెప్పాడు. చాలాకాలంగా తెలుసునన్నాడు. వారి నోట ఆ రోజు విన్న మాటలు నేటికీ నా చెవ్వుల్లో గింగురుమంటూనే వున్నాయి. అదే పొత్తూరి సార్ ను నేను చూసిన చివరి చూపులు.
2006 లో నేను ” నది ” మాసపత్రిక సంపాదకులుగా హైదరాబాద్ లో వున్న సమయంలో అందులో ” తప్పటడుగుల నుండి ….” అనే శీర్షిక నిర్వహించాను. ఆ శీర్షిక తొలి వ్యాసం పొత్తూరి తోనే ప్రారంభించాను. తరచూ సభల్లో సమావేశాల్లో కలిసేవాడిని. ఆతర్వాత కావలిలో ” బామా ” సంస్థ అబ్దుల్ ఖాదర్ అఫాన్ సహకారంతో ప్రవేశపెట్టిన ” ది గ్రేట్ జీకే రెడ్డి అవార్డు ” తొలిసారిగా అందుకొన్నది పొత్తూరి వెంకటేశ్వరరావు గారే. ఆ అవార్డు కు 10 వేలు పారితోషికంగా ఇస్తే ఆ డబ్బు తిరిగి సంస్థకు ఇచ్చి వెళ్లిన ఆదర్శనీయులు పొత్తూరి. అప్పట్లో నేను బామా సంస్థ ఆర్గనైజర్ గా వుండేవాడిని. నాతో వారికున్న చొరవతో నేను అడగ్గానే ఆ అవార్డు అందుకోడానికి అంగీకరించారు. కావలి జవహర్ భారతి కళాశాలకు యాజమాన్యం పిలుపు మేరకు కొన్ని సమావేశాలకు పొత్తూరి వచ్చారు. ఇలా నన్ను ఎంతో ప్రేమించిన పొత్తూరి ఇక లేరన్న వార్త టీవీలో చూసి కృగిపోయాను.

పొత్తూరి భౌతికంగా మరణించినా ఆయన అమరజీవి. జర్నలిజం ప్రపంచం వున్నంతకాలం పొత్తూరి పేరు వెలుగొందుతూనే వుంటుంది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ
-ప్రభాకర్ జలదంకి

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap