రంగుల ప్రపంచంలో సతీశ్ గుజ్రాల్ కుంచెకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన వయోసంబంధ సమస్యలతో గురువారం (26-3-20) రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. సతీశ్ కు భార్య కిరణ్, కుమార్తెలు అల్పన, రసీల్, కుమారుడు మోహిత్ ఉన్నారు. భారత మాజీ ప్రధాని (ఐకే గుజ్రాల్) సోదరుడిగా కాకుండా, ఒక చిత్రకారుడిగా, శిల్పిగా, మ్యూరలిస్ట్ గా సతీశ్ గుజ్రాల్ (94) భారతీయ చిత్రకళారంగంలో తనదైన ముద్ర వేశారు.
25 డిసెంబర్, 1925 న పాకిస్తాన్ లో పుట్టిన గుజ్రాల్ చిన్నతనంలో వినికిడి సమస్య కారణంగా పాఠశాలలో ప్రవేశం దొరకని కుర్రాడు చిత్రకళపై మక్కువను పెంచుకుని ఆ దిశగా అడుగులేశాడు. లాహోర్ లోని ‘మాయో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో అప్లయిడ్ ఆర్ట్స్ చేసిన తర్వాత సతీశ్ గుజ్రాల్ 1944లో ముంబయికి చేరుకున్నారు. ఆ తర్వాత స్కాలర్‌షిప్ సాధించి మెక్సికోలో తన కళకు మెరుగులు దిద్దుకున్నారు. దేశ విదేశాల్లో అనేక ఆర్ట్ షోల్లో పాల్గొన్న గుజ్రాల్ పెయింటింగ్స్, శిల్పాలు, మ్యూరల్స్ ప్రపంచవ్యాప్తంగా కొలువుదీరాయి. ఆయన వర్క్ పై డజనుకు పైగా డాక్యుమెంటరీలు వచ్చాయి. 1999లో గుజ్రాల్ ను భారత దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన ‘పద్మవిభూషణ్ తో గౌరవించింది. సతీశ్ చిత్రకారుడు, శిల్పి మాత్రమే కాదు, ఆర్కిటెక్ట్, గ్రాఫిక్ ఆర్టిస్ట్ కూడా. ఆయన మృతిపై దేశ ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు.
-కళాసాగర్