(జయదేవ్ బాబు గారి ‘బెస్ట్ ఆఫ్ జయదేవ్ కార్టూన్స్’ పుస్తకం విడుదల)
మంగళవారం సాయంత్రం (డిశంబర్ 20న) జయదేవ్ బాబు గారి ‘బెస్ట్ ఆఫ్ జయదేవ్ కార్టూన్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జూమ్ మీటింగ్ లో విజయవంతంగా జరిగింది. ఆర్మూర్ కు చెందిన ప్రముఖ వైద్యులు, సుప్రసిద్థ కథా రచయిత నక్కా విజయ రామరాజు గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి జయదేవ్ గారితో ఉన్న అనుబంధాన్ని తెలియచేశారు. యంగ్ కార్టూనిస్ట్, స్వర్గీయ ఇళయరాజా (డా. విజయ రామరాజుగారి తనయుడు)ను ఈ సందర్భంగా జయదేవ్ గారు స్మరించుకున్నారు. నిజానికి ఈ పుస్తకాన్ని ఆ యువ కార్టునిస్ట్ కే అంకితం ఇవ్వాలనుకున్నానని, అయితే… ఇటీవల కన్నుమూసిన తన శ్రీమతి రాజలక్ష్మి గారి చివరి కోరికగా వచ్చిన దీనిని ఆమెకు స్మృత్యాంజలిగా సమర్పిస్తున్నానని జయదేవ్ గారు తెలిపారు. ఆమె మృతికి సంతాపసూచకంగా కార్యక్రమంలో పాల్గొన అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్టూన్ల పుస్తకం రూప కల్పనలోని సాధకబాధకాలను జయదేవ్ గారు చెబుతుంటే ఈ వయసులో ఆయన ఎంత కష్టపడ్డారో కదా అనిపించింది. శ్రీమతి మళ్ళ జ్యోతిర్మయిగారు ఇటీవల చెన్నయ్ వచ్చినప్పుడు ఈ కార్టూన్లను మరోసారి ఒడపోసే బాధ్యతను ఆమెకు అప్పగించానని జయదేవ్ గారు తెలిపారు. ఆ రకంగా అత్యద్భుతంగా రూపొందిన ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం శ్రీమతి సునీల గారి ఆధ్వర్యంలో ఆసక్తికరంగా సాగింది.
త్వరలోనే ‘జర్నీ విత్ జయదేవ్’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నామని జ్యోతిర్మయి గారు తెలిపారు. జయదేవ్ గారి జీవన ప్రయాణాన్ని తెలిపే ‘గ్లాచ్యూమీచ్యూ’ ద్వితీయ భాగాన్ని వెంటనే తీసుకు రావాల్సిందిగా డాక్టర్ విజయ రామరాజు గారు కోరారు. అలానే జయదేవ్ గారి నుండి సైలెంట్ కార్టూన్స్ బుక్, ఇంగ్లీష్ కార్టూన్ల పుస్తకం కూడా వస్తే బాగుంటుందని సునీల గారు ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాలకు, రాష్ట్రాలకు చెందిన కార్టూనిస్టుల కలయికలో ఈ వేడుక చక్కగా సాగింది. అనివార్య కారణాల వల్ల ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనలేకపోయిన బ్నింగారు ముందు చూపుతో తన సందేశాన్ని వీడియోగా పంపారు. ఈ పుస్తకం రూపకల్పనకు సాయం చేసిన శ్రీ కళాసాగర్, శ్రీ పుక్కళ్ళ గార్లకు జయదేవ్ గారు ధన్యవాదాలు తెలిపారు.
కార్టూన్ పుస్తకం గురించి….
రాయల్ డెమ్మి సైజులో పేజీకి ఒక కార్టూన్ చొప్పున, 338 రంగుల పేజీలతో వెలువడిన ‘బెస్ట్ ఆఫ్ జయదేవ్ కార్టూన్స్’ పుస్తకంలో ప్రతీ కార్టూన్ ఒక రసగులికే… తెలుగు కార్టూన్ చరిత్రలో వచ్చిన పెద్ద కార్టూన్ సంపుటి బహుశా ఇదే కావచ్చు. ఈ కార్టూన్ పుస్తకంలో పెళ్ళిళ్ళు, శోభనాలు, ఆడాళ్ళు-అసూయలు, మొగుడు-పెళ్ళాల గిల్లికజ్జాలు, షాపింగ్ సరదాలు, పండగలు, రాజకీయాలు, సొషల్ మీడియా, పిల్లలు-పెద్దలు, సామెతలు, కవులు, కళాకారులు, సామాన్యుల గురించే కాదు… పురాణాలు, ఇతిహాసాలపై కూడా తన దైన శైలిలో గీతల మాయజాలం చేశారు జయదేవ్ గారు. అతి విలువైన, ఖరీదైన ఈ పుస్తకం కాపీలు చాలా పరిమితంగా ఉన్నాయి. ప్రతి కార్టూనిస్ట్ దగ్గర ఓ రిఫరెన్స్ బుక్ గా ఉండాల్సిన దీనిని జయదేవ్ గారు అదనపు ప్రింటింగ్ ఖర్చులను తానే భరించి, కేవలం ఐదు వందల రూపాయలకే కార్టూనిస్టు మిత్రులకు అందించాలనే యోచన చేశారు. ఈ పుస్తకం ఏ బుక్ స్టాల్ లోనూ, బుక్ ఎగ్జిబిషన్ లోనూ దొరకదు. కాబట్టి, పుస్తకం ధరతో పాటు పోస్టల్ ఖర్చులను పంపితే, మీ ఇంటికే పుస్తకం చేరే వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో… కార్టూనిస్టు మిత్రులు, కార్టూన్ అభిమానులు త్వరపడి, కాపీలు అయిపోకముందే… దీనిని సొంతం చేసుకోండి.
పుస్తకం కావలసినవారు… ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించండి.
Copies can be had of the Printer & Publisher, YUVA BOOKS, 10-B/2 Nagakanni Amman Koil Street Venkatapuram, AMBATTUR OT, Chennai – 600053, Ph: 9486633443, e-mail: hosursv@gmail.com
Price : 620/- (పుస్తకం ధర: 500/-, పోస్టల్ ఖర్చు: 120/- అదనంగా)
గూగుల్ పే: 9486633443
Give Name & Address in Block letters, Pincode and Phone number.
Very good information Kalasagar garu.. అందరి దగ్గర ఇది ఒక కాపీ ఉండవలసిందే. అయితే అందరం కలసి తెప్పించుకుంటే రేట్ ఏమైనా తగ్గుతుందేమో?..
తెలుగు కార్టూన్ చరిత్రలో ఉన్నత స్థానంలో వుంచదగిన పుస్తకం ఇది. నేను వేరే చోట ఇరుక్కుపోవడం వల్ల ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాను. గురుతుల్యులు జయదేవ్ గారి ఆశీస్సులు మనందరిమీద ఎప్పటికీ వర్షిస్తూవుంటాయి.
గురువు గారు శ్రీ జయదేవ్ బాబు గారి కార్టూన్ ల అధ్భుతమైన పుస్తకం నేను తెప్పించు కుంటున్నాను. ఎప్పుడే ప్పుడు చూస్తా నా అని ఆతృతగా ఉంది . ఈ పుస్తకం కోసం కృషి చేసిన అందరికి ధన్యవాదములు .