ఓ ‘జర్నలిస్ట్ డైరీ’

జర్నలిస్ట్ డైరీ పేరుతో యూట్యూబ్ లో ఒక న్యూస్ చానల్ ను ప్రారంభించి రెండు లక్షల పైగా చందాదారులతో దూసుకుపోతున్న జర్నలిస్ట్ సతీష్ బాబు ఒకరు. జర్నలిస్టుల అనుభవాలతో పుస్తకాలు ఈ మధ్య ఎక్కువగానే వస్తున్నా టీవీ కార్యక్రమాలను పుస్తకరూపంలో తీసుకురావటం తెలుగులో చాలా అరుదైన విషయమనే చెప్పాలి. రవిప్రకాష్ ఎన్కౌంటర్, వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ తరువాత ఇప్పుడు సతీష్ బాబు ‘జర్నలిస్ట్ డైరీ’ వచ్చింది. తెలుగు టీవీ రంగపు తొలితరం జర్నలిస్టు సతీష్ బాబుది ఒక విలక్షణమైన శైలి. జర్నలిస్ట్ డైరీ శీర్షికతో దృశ్యమాధ్యమంలో ఆయన చేసిన సంపాదకీయ వ్యాఖ్యల అక్షరరూపం అదే పేరుతో ఇప్పుడీ ‘జర్నలిస్ట్ డైరీ’గా మనముందుకొచ్చింది. తేదీలు వేయనివి వదిలేస్తే ఇందులో ఎక్కువ భాగం 2012, 2013 సంవత్సరాల్లో ప్రసారమైనవే. మొత్తం 82 ఎపిసోడ్ను ‘గుండె గుప్పిట్లో బతుకు పుస్తకం‘, ‘ప్రాథమిక చికిత్స’, ‘నా నోటి మాట’ అనే మూడు భాగాలుగా విభజించి, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టిన తొలినాటి టీవీ ప్రయోగం ‘ధర్మపీఠం’ గురించి రాశారు. అందులో ఎన్టీయార్, వైఎస్సార్లను ప్రశ్నించిన తీరు గురించి గుర్తు చేయటంతో బాటు తన జర్నలిజం కెరీర్ గురించి చెబుతూ, అన్యాపదేశంగానే కొత్త తరానికి మార్గదర్శనం చేశారు.

జర్నలిస్ట్ డైరీ కేవలం నడుస్తున్న చరిత్రమీద వ్యాఖ్యానం కాదు, అనేక సామాజిక అంశాలమీద ధర్మాగ్రహం. చుట్టూ ఉన్న సమాజపు మౌనాన్ని ప్రశ్నిస్తూ, సగటు మనిషిలో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేయటం అడుగడుగునా కనబడుతుంది. ఒక జర్నలిస్టు ప్రతిపరిణామాన్నీ, ప్రతి సంఘటననూ ఎలా చూడాలో, ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా స్పందించాలో చెప్పటం జర్నలిస్ట్ డైరీ ప్రత్యేకత. మంచిని మెచ్చుకోవటమైనా, చెడును ఎండగట్టటమైనా వెనకడుగు వేయకుండా మీడియాకు సైతం చురకలంటించటం సతీష్ బాబు స్వభావం. బహుశా ఆయన స్పృశించని అంశ మంటూ లేదేమో అనిపించేంత వైవిధ్యం ఆయన ఎంచుకున్న విషయాల్లో కనబడుతుంది. సుతిమెత్తని విమర్శలకు కాలం చెల్లిందన్న ఆయన మాటలకు అద్దం పట్టేలా పదునైన వాగ్బాణాలతో ఆయన దాడి సాగిపోతుంది. అందుకే అదొక ఫైర్ బ్రాండ్ కామెంటరీగా చరిత్రలో నిలిచిపోతుంది.

పదాల విరుపుతో, లయబద్దంగా సాగే గంభీరపు పఠనంతో సమాజాన్ని ప్రశ్నిస్తూ, హెచ్చరిస్తూ, చివర్లో ఒక పదునైన వ్యాఖ్యతో ముగించటం ఆయన సంతకం. జర్నలిస్ట్ డైరీ ప్రసారమవుతున్నప్పుడు చూడని (వినని) వారు ఇప్పుడు చదువుకోవటానికి ఈ పుస్తకరూపం వెసులుబాటు కల్పించింది. అయితే, ఆ వ్యాఖ్యలను ఆయన గొంతులో విన్నప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో ఆస్వాదించ గలుగుతారన్నది నిజం. ఇంతకుముందు జర్నలిస్ట్ డైరీ ఎపిసోడ్స్ చూసినవారందరికీ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు కచ్చితంగా ఆయనే తన గొంతుతో వినిపిస్తున్న అనుభూతి కలుగుతుంది.

భావవ్యక్తీకరణలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి అయితే, పదగాంభీర్యంతోనే బలంగా చెప్పవచ్చునన్నది సతీష్ బాబు నిశ్చితాభిప్రాయం. అందుకే ఒక్కోసారి భావాన్ని మించిన పదప్రయోగం కనిపిస్తుంది.
మొదటి భాగానికి ఎంతగానో నచ్చి ఆయన పెట్టుకున్న పేరు ‘గుండె గుప్పిట్లో బతుకు పుస్తకం’ లాంటి పదబంధానికి అర్థం ఆలోచిస్తూ కూర్చుంటే మనం ముందుకు సాగటం కష్టం. “దాదాపు అన్ని ఛానళ్ళలో నా జేడీ పేజీల్ని తిప్పాను” అంటూ ఆయన ప్రస్తావించిన జాబితాలో తెలుగు చానల్స్ తో బాటు ఎన్డీటీవీ ఉండటం ఆయన చెప్పుకునేదాకా తెలియకపోవటం మన దురదృష్టం.

నాలుదశాబ్దాల జర్నలిజం కెరీర్లో ప్రింట్, టీవీల మీదుగా నడిచి డిజిటల్లో కొనసాగుతున్న సతీష్ బాబు రెండున్నర దశాబ్దాలకు పైగా పనిచేసిన టీవీ రంగంలో కొన్ని ప్రయోగాలు మాత్రమే ఇందులో ప్రస్తావించారు. జర్నలిస్ట్ డైరీ – 2 కు పరిచయవాక్యాలతో ముగించటం ద్వారా ఆయన రెండో భాగం రాబోతున్నట్టు కూడా చెప్పేశారు. కచ్చితంగా ఇది ఆయన అభిమానులకు శుభవార్తే. మొదటిభాగం చదివినవాళ్లు రెండో భాగం కోసం ఎదురుచూడవచ్చు.
-తోట

ప్రతులకు :
పుస్తకం వెల: రూ. 350/
క్రింది లింక్లో ఆర్డర్ చేయండి…
http://www.journalistdiary.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap