లలిత సంగీత చక్రవర్తి  కృష్ణమోహన్

“లాలిత్యమే ప్రాణంగా, సరళత్వమే మార్గంగా, రసభావాలు ఆధారంగా, పండిత, పామరజనాన్ని రంజింపజేసేదిగా విలసిల్లే కవితా సుధా ఝరుల సుందర సాహిత్యమే లలిత గీతం” అని ప్రముఖ లలిత గీతాల విద్వన్మణి చిత్తరంజన్ గారు సెలవిచ్చారు. అన్ని రకాల సంగీత రీతులను తనలో ఇముడ్చుకునే తత్త్వం లలిత సంగీతానికి వుంది. తేలిక పదాలద్వారా తక్కువ వాద్య పరికరాల సమ్మేళనంగా ప్రజలను చైతన్యవంతులను చేసే లక్షణం లలితగీతానికి, ఆ సంగీతానికి వుంది. మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ‘గీతావళి’ అనే పేరుతో లలిత సంగీత కార్యక్రమాలను బాలాంత్రపు రజనీకాంత రావు గారు ప్రసారం చేయిస్తూ వుండేవారు. మల్లిక్, గోపాల శర్మ, కామేశ్వర శర్మ, నారాయణ అయ్యర్ వంటి కళాకారులతో లలిత గీతాల రికార్డింగ్ కోసం ఒక వాద్యబృందాన్ని రజనీకాంతరావు యేర్పాటుచేశారు. ‘రమ్యలోకం’ పేరుతో రజనీ కాంతరావు గారు లలిత గీతాలను ప్రసారం చేయిస్తుండేవారు. అప్పట్లో వైజయంతిమాల తల్లి వసుంధరాదేవి, డి.కె. పట్టమ్మాళ్, టంగుటూరి సూర్యకుమారి, రావు బాలసరస్వతీదేవి, సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల, ఎం.ఎస్. రామారావు ఈ లలితగీతాలను ఆలపించేవారు. ఈ గీతాలకు ఈమని శంకరశాస్త్రి, ద్వారం వెంకటస్వామి నాయుడు, ఎస్. బాలచందర్ స్వరాలు సమకూర్చి రికార్డు చేయించేవారు. విజయవాడ, హైదరాబాద్, కడప ఆకాశవాణి కేంద్రాలు రూపు దిద్దుకున్న తర్వాత శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వేదవతి ప్రభాకర్, కనకదుర్గ, ఎం.ఎస్. రామారావు, రమణమూర్తి, ఓలేటి వెంకటేశ్వర్లు, KBK మోహన్ రాజు, NCV జగన్నాధాచార్యులు మొదలైన గాయకులు ఎన్నో లలితగీతాలకు ప్రాణప్రతిష్ట చేశారు. చిత్తరంజన్, మల్లిక్, బి. గోపాలం, పాలగుమ్మి విశ్వనాథం, వంటి మహానుభావులు లలిత గీతాల సాహిత్యానికి స్వరాలు అల్లి శ్రవణపేయంగా వాటిని సంగీత ప్రియులకు అందుబాటులోని తెచ్చారు. వర్తమాన కాలంలో అటువంటి సంగీత దర్శకులలో కలగ కృష్ణమోహన్ గారు ప్రధములు.

కలగ కృష్ణమోహన్.. గురించి…
కలగ కృష్ణమోహన్… ఈ పేరు సంగీత రసజ్ఞులకు చిరపరిచయమే. రేడియో శ్రోతలకు ఇంకా ఎక్కువగా పరిచయం. ఐదు దశాబ్దాలుగా లలిత, భావ గీతాలకు అద్భుతంగా స్వరాలు అల్లి, లలిత గీతాలు రాసి, వాటిని ఆలపించి, సంగీత నిర్వహణ చేస్తూ సంగీత సరస్వతికి సేవచేస్తున్న సంగీత జ్ఞాని కృష్ణమోహన్. ఆల్ ఇండియా రేడియో, హైదరాబాదు కేంద్రంలో సంగీత శాఖకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. సంగీత రచనతోబాటు దాశరథి, డాక్టర్ సి. నారాయణ రెడ్డి, ఆచార్య తిరుమల, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి సాహితీ మూర్తుల సాంగత్యం వలన, నిరంతర అధ్యయనం వలన గేయరచనా నైపుణ్యాన్ని కూడా అందిపుచ్చున్నారు. అలా అనేక గీతాలకు రూపకల్పనచేసి, వాటికి సంగీతం సమకూర్చారు. కృష్ణమోహన్ గారు శ్రీ రావి కొండలరావు గారిచే స్థాపించబడి, సాహిత్య సంగీత సేవలు అందిస్తున్న సాహిత్య సంగీత సమాఖ్యలో సభ్యులుగా వున్నారు. ఆ సంస్థకు నేను (షణ్ముఖాచారి) కార్యదర్శిని కావడం నా అదృష్టం.

Kalaga Krishna Mohan

కృష్ణమోహన్ గారి తండ్రి రామజోగేశ్వర శర్మ గారిది పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం. తల్లి గారిది గుంటూరు జిల్లా. వారు రక్షణ శాఖలో పనిచేసేవారు. ఉద్యోగ రీత్యా కృష్ణమోహన్ గారి కుటుంబం 1962లో హైదరాబాద్ నగరంలో స్థిరనివాసం యేర్పరచుకుంది. తల్లి పద్మావతీదేవి ద్వారా కృష్ణమోహన్ కు సంగీత జ్ఞానం అబ్బింది. హైస్కూల్ చదువులు హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ బాలుర పాఠశాల లో పూర్తిచేశారు. సైన్స్ విద్యార్థిగా హైదరాబాద్ అన్వర్-ఉలూమ్ కాలేజీలో పట్టభద్రుడయ్యారు. కర్ణాటక, హిందూస్తానీ సంప్రదాయ సంగీతం తోబాటు, వెస్ట్రన్ సంగీతంలో కూడా కృష్ణమోహన్ నిష్ణాతులు. పియానో, తబలా, వయొలిన్ వంటి వాద్యాలను అద్భుతంగా వాయించగల నేర్పరి. ఆయన సోదరి కూడా సంగీత విద్వాంసురాలే. కృష్ణమోహన్ ఆమెను చిన్నతనంలో విద్యానగర్ కాలనీలోని మల్లాది అన్నపూర్ణమ్మ గారి వద్ద సంగీత పాఠాలు నేర్పించేందుకు తీసుకొనివెళ్ళి ఇంటికి తీసుకొని వచ్చేవారు. ఆమె క్లాస్ పూర్తయ్యేదాకా కిటికీ ప్రక్కనే కూర్చుని ఆ సంగీత పాఠాలను తనుకూడా వల్లెవేస్తుండడంతో సంగీతం మీద జిజ్ఞాస ఎక్కువయింది. అన్నపూర్ణమ్మ కేవలం అమ్మాయిలకు మాత్రమే సంగీతం నేర్పేవారు. ఒకసారి తన సోదరికి నేర్పుతున్న కీర్తనను వింటూ అప్రయత్నంగా తనుకూడా ఆలపించడం మొదలెట్టారు. ఆది గమనించిన అన్నపూర్ణమ్మ గారు బయటకువచ్చి కృష్ణమోహన్ ని లోనికి తోడ్కొనివెళ్లి సంగీతం నేర్పారు. జంధ్యాల సీతారామశాస్త్రి గారి వద్ద కర్ణాటక సంప్రదాయ సంగీతాన్ని అభ్యసించారు. స్కూలుకు వెళ్ళేటప్పుడు ఆయన నేర్చుకున్న కీర్తనలు, పాటలు బాలానందంలో పాడుతూవుండేవారు. బాలానంద కేంద్రంలో రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు గారు వారి కార్యక్రమంలో ‘కొంటెకృష్ణయ్య’ అనే హాస్యపాత్ర ద్వారా చిన్నారులకు హాస్యంతో కూడిన నీతిని బోధిస్తూ, వారి సంస్కారాన్ని పెంచేవారు. ధ్వని ఎఫెక్ట్స్ ఎలా వుండాలో కృష్ణమోహన్ అక్కడే వారిద్వారానే నేర్చుకున్నారు.

కృష్ణమోహన్ గారి ఇంటికి దగ్గరలోనే శాంసన్ అనే కుటుంబం వుండేది. వాళ్ళ ఇంటిలో 40 మంది సభ్యులుండేవారు. వారంతా పాశ్చాత్య సంగీత కళాకారులే. వారివద్ద కృష్ణమోహన్ వెస్ట్రన్ మ్యూజిక్ అభ్యసించారు. శాంసన్ ప్రోత్సాహంతో బెంజమిన్ మార్తాండ్ వద్ద పియానో, అతని సోదరునివద్ద వయొలిన్ వాయించడం నేర్చుకున్నారు. సమాంతరంగా హిందూస్తానీ క్లాసికల్ తోబాటు తబలా వాయించడం కూడా నేర్చుకున్నారు. 1970 ప్రాంతంలో ఆకాశవాణి లో ‘యువవాణి’ అనే కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఆ ప్రారంభ కార్యక్రమంలో పాటలు పాడిన నలుగురు యువ గాయకులలో కృష్ణమోహన్ ఒకరు. అప్పుడే కృష్ణమోహన్ కు చిత్తరంజన్, పాలగుమ్మి విశ్వనాథం వంటి మహానుభావులతో పరిచయం యేర్పడింది. చిత్తరంజన్ గారు లలిత సంగీత పాఠాలు నేర్పారు. సాహితీవేత్త కొంపల్లె శివరాం గారి ప్రోత్సాహంతో రేడియో ప్రచార కార్యక్రమాలకోసం కృష్ణమోహన్ జింగిల్స్ చేసి ఇచ్చారు. కేవలం 30 సెకన్ల వ్యవధిలో వాణిజ్య ప్రకటనకోసం సంగీతం సమకూర్చడం కత్తిమీద సాము వంటిదే. సంగీత దర్శకుడు రెహమాన్ కూడా సినిమా అవకాశాలకోసం ఎదురుచూస్తున్నప్పుడు జింగిల్స్ ఎక్కువగా చేసేవారు. అలా కృష్ణమోహన్ కూడా వందలాది జింగిల్స్ కు రూపకల్పన చేశారు. దాంతో ఆయన సంగీత పరిజ్ఞానం పదును తేలింది. అలా రాయల్ అకాడమీ వారి గ్రేడ్ 1 పరీక్షలకు హాజరయ్యారు. అందుకోసం ఎగ్జామినర్లు గా విదేశాలనుంచి వచ్చారు. వారు కృష్ణమోహన్ ప్రజ్ఞను పరీక్షించారు. వారు సంతృప్తి చెంది, కృష్ణమోహన్ కు సంగీత నిర్వాహకుడిగా ఉజ్వల భవిష్యత్తు వుందని దీవించారు. తర్వాత 1979లో కృష్ణమోహన్ సీఫెల్ ఎడ్యుకేషన్ బ్రాడ్కాస్టింగ్ ప్రాజెక్టులో చేరారు. సీఫెల్ సంస్థ రూపొందించిన పాఠాలను శారదా శ్రీనివాసన్ చేత రికార్డు చేయించి, తెలంగాణాలో పల్లెపల్లెలన్నీ తిరుగుతూ ఆ పాఠాలను విస్తృతంగా ప్రచారం చేశారు. 1980లో ఆకాశవాణిలో చేరారు. అందులో చేరిన తొలిరోజుల్లో కృష్ణమోహన్ కు తనకు వెస్ట్రన్ మ్యూజిక్ నేర్పిన గురువుగారు ఇచ్చిన సలహా గుర్తుకొచ్చింది. ‘’సంగీతంలో యేమి చేసినా అది నీదై వుండాలి. అప్పుడే నువ్వు రాణించగలవు’’ అనేదే ఆ సలహా. ఆ సలహాను కృష్ణమోహన్ చిత్తశుద్ధితో పాటించారు. కడప రేడియో స్టేషన్ లో ‘’ఈ మాసపు పాట’’ అనే వినూత్న కార్యక్రమానికి కృష్ణమోహన్ శ్రీకారం చుట్టారు. ఇంకా కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా చేపట్టారు. తర్వాత విజయవాడ ఆకాశవాణిలో 12 సంవత్సరాలు వున్నారు. అక్కడ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఉషశ్రీ వంటి సాహితీమూర్తులతో కలిసి అరుదైన రూపకాలను చేసి, సినిమాలను మరిపించే స్థాయిలో వాటిని తీర్చిదిద్దారు. కృష్ణమోహన్ సంగీతం అందించిన ‘గంగావతరణం’ అనే రూపకం ప్రిక్స్ ఇటాలియా అంతర్జాతీయ పోటీకి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఆ తర్వాత హైదరాబాద్ ఆకాశవాణికి బదిలీపై వచ్చి, ‘ఆనోటా…ఆనోటా’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకానికి బాపు అట్టమీది బొమ్మను వేయగా, గుంటూరు శేషేంద్ర శర్మ ముందుమాట రాశారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖుల చేత ఆ లలిత గీతాలను, భక్తి గీతాలను ఆలపింపజేసి దాదాపు 20 ఆల్బమ్ లను రూపొందించారు. రెండు చలనచిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. మరొక రెండు డాక్యుమెంటరీ చిత్రాలకు కూడా సంగీతం అందించారు. ‘పాపం పసివాళ్లు’ అనే 52 ఎపిసోడ్ల టెలివిజన్ ధారావాహికకు సంగీత దర్శకత్వం వహించడంతోబాటు ఆ సీరియల్ కు గీత రచన కూడా చేశారు. ఈ సీరియల్ కు అందించిన పాటల సాహిత్య సంగీతానికి కృష్ణమోహన్ కు నంది బహుమతి లభించింది. కృష్ణమోహన్ ఆకాశవాణిలో ఐదు సార్లు జాతీయ బహుమతులు గెలుచుకున్నారు. ప్రముఖ నేపథ్య గాయనీమణులు సునీత, సురేఖామూర్తి లు కృష్ణమోహన్ గారి శిష్యబృందమే. వీరితోబాటు ఎందరో మేటి శిష్యులను తయారు చేసిన ఘనత కృష్ణమోహన్ గారిది. వారిది లలిత సంగీతంలో ఒక ప్రత్యేకమైన ముద్ర.
-ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap