విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 47
ఆంధ్రజాతి ఆత్మాభిమానానికి అక్షర బీజం, ఆంధ్రఖ్యాతికి వెలుగైన తెలుగు తేజం, ఆంధ్రపత్రికా భారతి అనే ప్రభంజనం, అరుదైన ఆవిష్కరణ అన దగ్గ అమృతాంజనం, అన్నిటా ప్రకాశించిన ప్రజ్ఞావంతుడు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. తొలుత మద్రాసులో వ్యాపారం ప్రారంభించిన పంతులు గారు కలకత్తాలో కొంత కాలం గడిపి బొంబాయిలో కూడా ఒక కార్యాల యంలో పనిచేశారు. స్వతంత్ర భావాలు కలిగిన యువ నాగేశ్వరరావు పంతులు శ్రామికునిగా జీవితం మొదలు పెట్టి పారిశ్రామికునిగా మారారు. 1893 వ సం. లో అమృతాంజనం సంస్థను స్థాపించి తలనొప్పికి తిరుగులేని మందుగా జనం ముందుకు తెచ్చారు. తెలుగువారి కోసం మొట్ట మొదటి సారిగా 1908 లో ఆంధ్రపత్రిక అనే దినపత్రికను స్థాపించి స్వాతంత్ర్యో ద్యమానికి తనవంతు కృషిగా అక్షర సాక్ష్యంగా ఆంధ్రపత్రికను నిలిపారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారికి సమకాలీనులైన నాగేశ్వరరావు పంతులుగారు రాజకీయ రంగంలో కూడా విశేషంగా రాణించారు. విరివిగా దానధర్మాలు గావించిన వీరి వితరణ శీలానికి మెచ్చిన గాంధీ మహాత్ముడు వీరిని ‘విశ్వదాత’గా అభివర్ణించాడు. తరతరాలకు స్ఫూర్తిదాత, వెరు పెరుగని ధైర్యశాలి, అలుపెరుగని కార్యశీలి, అసాధారణ వితరణశీలి కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు నేటికీ మన ధృవతార.
(కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు జన్మదినం 1 మే 1867)