వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం 20వ శతాబ్దంలో ఊహించని మార్పులు సంతరించుకుంది. కాల్పనిక , భావ, అభ్యుదయ, విప్లవ, దిగంబరోద్యమాల తరువాత అస్థిత్వ ఉద్యమాలు తెరపైకి వచ్చాయి. అంతవరకున్న వర్గ దృక్పథం స్థానంలో కుల అస్థిత్వ వాదాలు, మత, కుల, సాహిత్య వాదాలు ఒక్కసారిగా విజృంభించాయి. సరికొత్త ఆలోచనలు రేకేత్తించాయి.
అలాంటి వాదాల్లో దళిత, స్త్రీ వాద, ముస్లీం, అస్థిత్వ వాదాలు ప్రధానమైనవి. ఆ వాదాల నేపథ్యంలో ఎందరో కవులు, రచయితలు తమ కలాలకు పదును పెట్టి అక్షరాలను అగ్గిరవ్వలుగా రగిలించి భావాల లావాలుగా ఉప్పొంగి అద్భుత సాహిత్యం సృష్టించారు.
వారిలో ముస్లీంల సమస్యలను వారిపై జరిగిన దమనకాండలను.. హత్యోదంతాలను.. దోపిడీ దౌర్జన్యాలను అమానవీయ.. అమానుష దృశ్యాలను బలమైన కవిత్యంగా అక్షరీకించిన ప్రగతిశీల భావాల కవి .ముస్లిం సాహిత్య వినీలాకాశంలో మెరుపు తీగల్లాంటి భావాలతో కవితలల్లారుఖాదర్ మొహియుద్దీన్’.
స్వతంత్ర భారతంలో జన్మించిన ముస్లీంలను పరాపరాయీలకు భావించి వారిపై దాడులు నిర్వహించి, హత్యాకాండలు కొనసాగించిన హిందూత్వ మతోన్మాదుల దాష్టీకాన్ని.. బాబ్రీ విధ్వంసం, గుజరాత్ లో ముస్లీం జాతి నరమేధాన్ని.. రక్త చరిత్రను నిరసిస్తూ రక్తాశ్రువులను చిందిస్తూ భావోద్విగ్న కెరటమై ఎగసిపట్టి పుట్టుమచ్చ లాంటి దీర్ఘ కవితను సృష్టించిన సృజనశీలి ఖాదర్ మొహియుద్దీన్.
“నేను పుట్టకముందే
దేశ ద్రోహుల జాబితాలో
నమోదై ఉంది నా పేరు”!!
అంటూ బలమైన అభివ్యక్తితో ఆయన కవిత్యం.. రాశారు. సాహిత్యం లోకం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేశారు. అఖండ భారత దేశపు మాతృ గుండెను రెండుగా చీల్చి పండుగ చేసుకున్న పెద్దల నిర్వాకాన్ని భారతదేశపు ముస్లీంలు తీవ్రంగా నష్టపోయిన వైన్యాన్ని,ఉన్న ఊరును కన్నతల్లిని వదిలి వెళ్లలేక, తమ మూలాన్ని వేర్లను తెంచుకుని వెళ్లలేక, పుట్టిన గడ్డ ఎదనే హత్తుకని భయంభయంగా…. ఉండిపోయిన ఈ దేశపు ముస్లీంల దుర్గతిని ఈ కవి ఎంతో హృదయ విదారకరంగా అభివర్ణించారు.
“పార్లమెంట్ భవనంలో వాలేందుకు
నానెత్తురు పాద లేపనమవుతుంది
నా రక్తం పదవీ సోపానానికి
అభయ హస్తమవుతుంది
నా రక్తం భరతమాత నుదిటి
తిలకమవుతుంది, పూజా కమలమవుతుంది.”!
అంటూ ఈ దేశపు రాజకీయ చదరంగంలో …
కరుడుగట్టిన హిందూ మతోన్మాదుల అకారణ ధ్వేషంతో పాటు అధికారకాంక్ష జ్వాలల్లో అన్నెం పుణ్యం ఎరుగని అమాయక ముస్లీంలు ఎలా బలి పశువులవుతున్నారో ఖాదర్ మొహియుద్దీన్ తన కవితలో ధర్మాగ్రహంతో ప్రశ్నించారు.
*హిందీ హిందూ హిందుస్తాన్
ముస్లీం జావో పాకిస్తాన్
ముసల్మాన్ కే దోహీస్తాన్
పాకిస్తాన్ యా ఖబ్రస్తాన్”!
అంటూ ఇలాంటి ఒక నినాదం రూపొందించి ముస్లింలను శత్రువులుగా, రకరకాలుగా ప్రచారం చేసి వారిని పాకిస్తాన్ కు పారద్రోలడమో లేదా చంపి వేయడమో చేయాలని ముస్లిమేతరులను రెచ్చగొట్టిన హిందూత్వ వాదులను దుశ్చర్యలను ఖాదర్ మొహీయుద్దీన్ తన దీర్ఘ కవిత ‘పుట్టుమచ్చ’లో ప్రశ్నించారు.
అంతేకాదు..
ఇక్కడి కుహనా మేధావులు, పాలకులు, హిందూత్వ వాదులు, మాతృ దేశంలోని ముస్లింలను కించపరుస్తూ అవమానిస్తూ వారి మనస్సులను ఛిద్రం చేస్తూ వారిని చివరకు చిల్లర వ్యాపారులుగా బతకమని శాసించిన..శపించిన దుర్నీతిని, దురన్యాయాన్ని తీవ్రంగా అధిక్షేపిస్తూ ఆవేశాన్ని, ఆవేదనను కలగలిపి హృదయాలను…. కదిలించే కవిత్వంగా రాశారు.
“పట్టెడన్నం కోసం
పేవ్ మెంట్ల మీద పూలనమ్ముకుంటాను
పళ్లమ్ముకుంటాను..పల్లీలమ్ముకుంటాను
గొడుగులు బాగు చేస్తుంటాను
గడియారాలు బాగు చేస్తుంటాను
దూదేకుతుంటాను దినం గడుపుకుంటాను”.
అంటూ ఈ దేశంలోని ముస్లీంల జీవన వాస్తవిక దయనీయ దృశ్యాలను అక్షరీకరించారు. అయినా వాళ్ల బతుకును వాళ్లలా బతుకుతుంటే అలా వదిలేయకుండా ఏవేవో కారణాలతోనిర్ధాక్షిణ్యంగా చంపడాన్ని ఈ కవి నిరసిస్తూ కవిత్యం రాశారు.
“నా పేరులోంచి చావు వాసన
పుట్టబోయే బిడ్డకు నేను పెట్టబోయే
పేరులోంచి చావు వాసన”.!!
అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్నో కవితలు రాశారు. హింను నిరసించారు. లౌకికత్వాన్ని నిలదీశారు. మతతత్వాన్ని గర్హించారు. మానవత్వమే కవిత్వంగాధ్వనించారు. కలతను కవిత్వంగా శిల్పీకరించారు.
100 కవితా సంపుటాల్లో మేలైన ఉత్తమ కవితా సంపుటిగా ‘పుట్టుమచ్చ’ కావ్యాన్ని ఇండియాటుడే, తానా సంస్థలు ఎంపిక చేశాయి. సుప్రసిద్ధ సాహితీ వేత్తలు రామచంద్ర గుహ, వేల్చేరు నారాయణరావు, ఎం.శ్రీధర్ తదితర సాహితీ విమర్శకులు ఖాదర్ మొహీయుద్దీన్ ‘పుట్టుమచ్చ’ కవిత్వ గొప్పదనాన్ని ఎంతగానో కొనియాడారు.
కవిసంధ్య సాహిత్య సాంస్కృతిక సంస్థ, వారి శిఖామణి జీవన సాఫల్య పురస్కారాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు..
–ఎ.రజాహుస్సేన్