సమ సమాజమే బ్రహ్మ సమాజం లక్ష్యం
  • మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య
  • భాగ్యనగరంలో అఖిల భారత బ్రహ్మ సమావేశాలు ప్రారంభం

ఆర్ధిక, హార్దిక, రాజకియంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ విద్య ప్రాముఖ్యత తెలుసుకుని ముందడుగు వేయాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య పిలుపునిచ్చారు. దేశ సౌభాగ్యత సమసమాజ అభివృద్ధి కోసం రాజారామ్ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం ప్రస్తుతం విస్తృతంగా ప్రాచుర్యం లోకి రావలసిన అవసరం ఉందని, యువత ను ఎక్కువగా భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. శనివారం ఈడెన్ గార్డెన్స్ లో వున్న కచ్చి భవన్ లో దక్కన్, ఆంధ్ర బ్రహ్మ సమాజాల సంయుక్త ఆధ్వర్యంలో అఖిల భారత బ్రహ్మ సమాజం 131వ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన జస్టిస్ జి. చంద్రయ్య లాంఛనంగా జెండా ఎగురవేసి బ్రహ్మోపాసన చేసి సమావేశాలను ప్రారంభించారు.

జస్టిస్ జి. చంద్రయ్య మాట్లాడుతూ సమాజ అభివృద్ధి, మానసిక పరిపక్వత కోసం బ్రహ్మ సమాజం అవసరం ఎంతయినా ఉందన్నారు. బ్రహ్మ సమాజ వ్యవస్థాపకులు రాజా రామ్ మోహన్ రాయ్ సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని, బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు పాటిస్తే సమాజంలో శాంతి చేకూరుతుందని చెప్పారు. కుల మతాలకు వ్యతిరేకంగా ఉండాలని, మానవులందరూ ఒక్కటే, భగవంతుడు ఒక్కడే అనే సమ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్ళి సనాతన భారతీయ సంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగించేందుకు కృషి చేసారని కొనియాడారు. సభాధ్యక్షత వహించిన అఖిల భారత బ్రహ్మ సమాజం అధ్యక్షులు డాక్టర్ అరూప్ కుమార్ మాట్లాడుతూ 27 ఏళ్ళ తరువాత బ్రహ్మ సమాజం సమావేశాలకు చారిత్రక భాగ్యనగరం వేదిక కావడం అభినందనీయం అన్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా 350 మంది ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలిపారు. రెండు రోజుల సదస్సులో వివిధ అంశాలపై చర్చించి ఆధ్యాత్మిక నైతిక విలువలు, సామాజిక సూత్రాలను ఆదర్శ భావాలను విస్తృతం చేస్తామని ప్రకటించారు. దక్కన్ బ్రహ్మ సమాజం అధ్యక్షులు సి. హెచ్. కేశవ్ చంద్ మాట్లాడుతూ భవితకు ప్రోది అనే నినాదంతో ఈ సమావేశాలు జరుగుతాయని, యువత డిజిటల్ వ్యసనం, ఆరోగ్యం, సంక్షేమం, హేతుబద్ధ ఆలోచనా సరళి, సామాజిక విలువలు పెంపొందించడంలో బ్రహ్మ సమాజం పోషించాల్సిన పాత్ర పై విస్తృతంగా చర్చించి రానున్న ఐదేళ్ల ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ప్రారంభ సదస్సు లో అఖిల భారత బ్రహ్మ సమాజం కార్యదర్శి సౌరవ్ డే (కోల్ కతా), హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పద్మావతి రాహుల్ శాస్త్రి, దక్కన్ బ్రహ్మ సమాజం కార్యదర్శి అజయ్ గౌతమ్, సమావేశాల కమిటీ చైర్మన్ అనిందిత గౌతమ్, డాక్టర్ జ్యోత్స్న ఇలియాస్, బ్రహ్మ సెంట్రల్ కౌన్సిల్ అధ్యక్షులు పి. కృష్ణ, వేదాచార్య బి. రవి శంకర్, ప్రవీణ్ వేమ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap