నేలతల్లి తనువుకు గడ్డి చీర చుట్టిన తనయుడతడు ఆయనే మువ్వా చిన కృష్ణమూర్తి. తెలివి ఎవరి సొత్తూ కాదు. కృషితో పట్టుదలతో, సృజనాత్మకతతో ఎందరో మనసులను దోచుకుని వారి ఆదరాభిమానాలను తన హృదయంలో దాచుకున్నారు కృషి వలువడు’ ఈ కృష్ణమూర్తి. చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో పెట్టగలిగిన చీరను తయారుచేశారని చరిత్ర ద్వారా మనకు తెలుసు. వారు దారంతో తయారుచేసిన చీర అది. కానీ దానికి భిన్నంగా పశుగ్రాసమైన వరిగడ్డిని దారంగా పేని దానితో చీర, జాకెట్ ను తయారుచేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్నారు ఈ కర్షక వృద్ధుడు. .
ఆరుగాలం కష్టించి, చెమటోడ్చి, శ్రమకోర్చి పంటపండించడం కర్షకుడికి తెలుసు. అలాంటి కర్షకుడు తన శ్రమకు సృజనాత్మకతను జోడిస్తే ఎంతటి ఘనకార్యాన్ని సాధించవచ్చునో ఈయన తేటతెల్లం చేశారు. వివరాల్లోకి వెళదాం.
బాల్యం, విద్యాభ్యాసం :
కృష్ణమూర్తి ప్రకాశం జిల్లా, పర్చూరు మండలం, కొమరనేనివారి పాలెంలో 7-4-1941న మువ్వా సుబ్బయ్య, హనుమాయమ్మ పుణ్యదంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. ఐదవ తరగతి వరకు అదే గ్రామంలో చదువుకున్నారు. ప్రాధమిక పాఠశాల విద్యతోనే తన విద్యాభ్యాసానికి ముగింపు పలికారు.
కుటుంబం:
కృష్ణమూర్తి వీరన్నపాలెం గ్రామానికి చెందిన వెంకాయమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వివాహం జరిపించారు. ప్రస్తుతం వీరు వీరన్నపాలెం గ్రామంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
వృత్తి :
12 ఎకరాల స్వంత భూమిని కలిగిన కృష్ణమూర్తి బాల్యంలోనే వ్యవసాయం వైపు మొగ్గుచూపారు. కొంతకాలం ప్రపంచఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి గిత్తలను పెంచారు. ఓ పక్క వ్యవసాయం చేస్తూనే పశుప్రదర్శనల్లో, పశువుల అందాల పోటీల్లో తన గిత్తలను ప్రదర్శించారు. గోగునార, జనపనారతో తయారుచేయడానికి బదులు వరిగడ్డితో చెర్నాకోల తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదే ఆయన వరిగడ్డితో వివిధ రకాల వస్త్రాలు, శాలువాలు, కండువాలు తయారు చేయడానికి నాంది అయ్యింది.
వస్త్రాల తయారీ :
వయసు పెరుగుతున్నా ఆలోచనా విధానంలో ఎక్కడా మార్పులేదు. 1960 నుండి గడ్డిపరకలతో తన జీవితం పెనవేసుకుని పోయిందంటారు కృష్ణమూర్తి, వరిగడ్డిని పశువుల మేతకు ఉపయోగిస్తారు అందరూ. కానీ ఈ గడ్డినే వస్త్రాల తయారీకి ఉపయోగించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం.
ఎండిన గడ్డిపరకలను తీసుకుని వాటిని బ్లేడు సహాయంతో సన్నగా చీల్చి పోగులు విరిగిపోకుండా తడిపి దారాలుగా పేనుతారు. పేనిన దారాన్ని చీర, రవిక, శాలువా, కండువా వంటివి తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఈ విధంగా తయారుచేసిన వస్త్రానికి రంగులు అద్దడం సాధ్యపడదు. అంచులు మాత్రం రంగులతో కూడిన నూలుతో అల్లి మిగిలిన భాగాన్ని వరిగడ్డితోనే తయారుచేస్తున్నారు.
రాష్ట్రపతి ప్రసంశ:
2015వ సం.లో ఢిల్లీలో జరిగిన ప్రదర్శనలో గడ్డిపరకలతో తాను తయారుచేసిన కండువా, జాతీయ జెండాను ప్రదర్శించారు కృష్ణమూర్తి. అప్పటి రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఈ ప్రదర్శనను తిలకించిన సమయంలో కృష్ణమూర్తి తయారుచేసిన ఈ చేతివృత్తులను చూసి ముగ్ధుడై ప్రశంసించారు. వెంటనే కృష్ణమూర్తి తయారుచేసిన కండువాను ప్రణబ్ ముఖర్జీకి కానుకగా అందించారు. కేంద్రమంత్రి సుజనాచౌదరితో పాటు పలువురు మంత్రులు, అధికారులు ఈ ప్రదర్శననను తిలకించినవారిలో ఉన్నారు.
అవార్డులు, పురస్కారాలు :
కృష్ణమూర్తి ప్రతిభను గుర్తించిన ఎందరో ప్రముఖులు ఆయన్ను తగురీతిన సత్కరించడం ముదావహం. 2011వ సం.లో బాపట్ల వ్యవసాయ కళాశాల వారు ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించారు. ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు కృష్ణమూరి తయారుచేసిన చెర్నాకోలాను చూసి ముచ్చటపడి అభినందించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఉదయలక్ష్మి కూడా కృష్ణమూర్తి ప్రజ్ఞాపాటవాలకు అబ్బురపడి సత్కరించారు. కృష్ణమూర్తిని చూడగానే గడ్డిపరకలతో ఓ కొత్త వస్తువు తయారుచేశాడేమో అని ఆయనవైపు ఆత్రంగా, ఆసక్తిగా అందరూ చూస్తుంటారు.
ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి నైపుణ్యంతో ప్రకాశం జిల్లా నిత్యం ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎనభై ఏళ్ళ వయసులో అహరహం గడ్డిపరకలను పేనుతూ కళ్ళజోడు సాయంకూడా లేకుండా వస్తువులను తయారుచేస్తున్న కృష్ణమూర్తి భావితరాలకు ఆదర్శమూర్తి. తెలుగు ప్రజలకు ఘనకీర్తి. చేతి వృత్తుల వారికి కళల స్ఫూర్తి. వీరిని కేంద్రప్రభుత్వం గుర్తించి ‘పద్మశ్రీ’ ఇచ్చి సత్కరిస్తే సృజనాత్మకతకు పట్టం కట్టినట్లే. ఆరోజు వస్తుందని మనందరం వేచి చూద్దాం.
–డా॥ తూములూరి రాజేంద్రప్రసాద్ (94 90 33 23 23)
good article….
చాలా సంతోషం.
కృష్ణ మూర్తిగారికి ఆరోగ్యమస్తు.
ఆర్టికల్ పంచిన మీకు కృతఙ్ఞతలు.
Proclaim and papularze such great personalities by publication with their histories is not an ordinary job. My special appreciation to you Rajendra gaaru, with thanks.