డాన్సర్లు మనకళ్లకు అడుతూ పాడుతున్నట్లే అనిపించవచ్చు. కానీ, చాలాసార్లు వారి పాదాల కింద అగ్నిసరస్సులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ స్థితిలోనూ లక్ష్యం కోసం ప్రవాహానికి ఎదురీదిన వారే తాము అనుకున్న తీరాన్ని అందుకోగలిగారు. డాక్టర్ పద్మశ్రీ శోభానాయుడు పేరు కూచిపూడి నాట్యాకాశంలో దేదీప్యంగా వెలుగొందడానికి వెనుక ఆమె ఎదురీదిన అగ్నిసరస్సులు ఎన్నో ఉన్నాయి. జీవితంలో నాట్యం కాదు, నాట్యమే జీవితమైపోయిన ఆమె మూడు దశాబ్దాల సుదీర్ఘ నాట్య ప్రస్థానంలో ఎదురైన కొన్ని అరుదైన సంఘటనలు ఆమె మాటల్లో చదవండి.
నా మొదటి గురువు పి.ఎల్.రెడ్డిగారు నాట్యరంగంలో నాకెంతో భవిష్యత్తు ఉందని తరుచూ చెబుతూ ఉండేవారు. అయితే, ఉన్నట్లుండి ఒకరోజు ఆయన చనిపోయారు. అది నా మనసును తీవ్రంగా కుంగదీసింది. నేనింక నాట్యమే నేర్చుకోనన్నాను. అప్పుడు మా అమ్మ “గురువు గారు తరుచూ ఏమనేవారో ఒకసారి గుర్తు చేసుకో. ఇంకెక్కడ నేర్చుకున్నా అది లెక్కలోకి రాదు. చెన్నయ్ వెళ్లి నాట్యం నేర్చుకుని గుర్తింపు పొందితేనే నువ్వు నిజమైన డాన్సర వవుతావు అనే వారా కాదా? పద చెన్నయ్ వెళదాం!” అంది. నేను వినేదాన్ని కాదు. అమ్మను వదిలి ఉండడం నా వల్ల అయ్యే పనికాదు. ఈలోగా నాన్నగారికి ఏలూరు ట్రాన్సఫర్ అయ్యింది. మా అమ్మ అక్కడ నన్ను ఓ డాన్స్ మాస్టర్ వద్ద చేర్పించారు. నాన్నగారికేమో నన్ను డాక్టర్‌ను చేయాలని ఉండేది. అందుకే అమ్మాయితో ఇంకెన్నాళ్లు డాన్స్ చేయిస్తావు? అంటూ ఉండేవారు. అయినా మా అమ్మ “ దానితో ఒక సారైనా ఆరంగేట్రం చేయించాలి. అది కూడా ఇక్కడ కాదు చెన్నయ్”లో అంటూ ఉండేది. అందుకు “సరే! నీకు కావలసింది ఆరంగేట్రమే కదా! చెన్నయ్ లోనే చేయిద్దాం కానీ, ఆ తరువాత మాత్రం అమ్మాయి ఇంకెప్పుడూ నాట్యం చెయ్యదు” అన్నారు. ఆ ఒప్పందం మీద గురువుగారితో మాట్లాడి ఆరంగేట్రానికి సిద్ధం చేశారు. గాయాన్నే సవాలుగా తీసుకుని….
ఆరంగేట్రం కోసం చెన్నయ్ లో థియేటర్ బుక్ చేశారు. రానూ పోను ట్రయిన్ టికెట్లు తీశారు. ఆరంగేట్రానికి సంబంధించిన దుస్తులు. నగలు అన్నీ సమకూర్చుకున్నాం. ఏలూరు స్టేషన్ కు ఎదురుగానే మా గురువు గారి ఉండే బంగళా ఉంది. ఆయన వచ్చి మమ్మల్ని చెన్నయ్ కు తీసుకువెళతానన్నారు. మా రైలు ఎనిమిది గంటలకి వెళుతుంది. కానీ, మా గురువుగారు రాలేదు. ఆ తరువాత రెండు గంటలు గడిచినా రాలేదు. మా డ్రైవర్‌ను పంపిస్తే, ఆ బంగళాకు తాళం వేసి ఉందని వచ్చాడు. పక్క వాళ్లను అడిగితే, చెన్నయ్ వెళ్లారని చెప్పారట. విషయం తెలిసి తీవ్రమైన వేదనతో ఇంటికి తిరిగి వెళ్లిపోయాం . ఆ తరువాత మూడు రోజులకు గురువుగారు మా ఇంటికి వచ్చారు. అతడ్ని చూసి మా నాన్న “ఏమిటి? మాతో ఇంకేమైనా పనుందా? నా కూతురితో ఆరంగేట్రం చేయిస్తానని మీరు మద్రాసు వెళ్లి వేరే ప్రోగ్రాం చేసి వచ్చినట్లు తెలిసింది. మాస్టారు! మీరు అడిగితే ప్రోగ్రాం కోసం నేనూ డబ్బులు ఇచ్చేవాణ్ణి. ఇలా మీరు అబద్దం ఎందుకు చెప్పారు?” అంటూ నిలదీశారు. అందుకాయన “నాయుడుగారు నేను ఓ మాట చెబుతాను మీరేమీ అనుకోవద్దు. శోభకు నాట్యం రావడం కష్టం” అన్నారు. ఆ మాట వినగానే నాన్న “ఏంటి! ఏం మాట్లాడుతున్నారు మీరు” అన్నారు. అందుకాయన “నిజమండీ! అమ్మాయికి నాట్యానికి కావలసిన ఆకృతి లేదు. మరో విషయం ఏమిటంటే అమ్మాయికి ప్రేక్షకుల్ని ఒప్పించే శక్తి కూడా లేదు. అందువల్ల మీరు ఊరికే తాపత్రయపడొద్దు. అలా అని మానిపించనూ వద్దు. నేర్పించండి ఎప్పటికైనా వస్తే వస్తుందేమో!” అన్నారు. వెంటనే నాన్న “చాలండి. ఇప్పటిదాకా నేర్పించింది చాలు. మీరు ఈ మాట అన్నారు కదా! ఆలస్యంగానైన చెప్పినందుకు సంతోషం”. అంటూ నమస్కరించి లోనికి వెళ్లిపోయారు. ఈ మాటలన్నీ నేను లోపల్నించి విన్నాను. ఎప్పటికైనా ఒక గొప్ప నాట్యకళాకారిణివి అవుతావన్న నా తొలిగురువు పిఎల్ రెడ్డిగారి మాటలు, ఈయన మాటలూ పోల్చుకున్నాను. నా తొలిగురువు మాటల్ని నేను రుజువు చేయాలనుకున్నాను. అందుకే వెంటనే మా అమ్మగారితో “నువ్వు ఎప్పటినుంచో చెన్నయ్ వెళ్లి నాట్యం నేర్చుకోమంటున్నావు కదా! పద వెళదాం. అక్కడే ఆరంగేట్రం చేస్తాను అన్నాను”. అమ్మకు పట్టరాని ఆనందం వేసింది. కానీ, నాన్నగారేమో తనముందు ఇంక నాట్యం ప్రస్థావనే తేవద్దు అన్నారు. అయినా అమ్మ వెనక్కి తగ్గలేదు. “ఓ రెండేళ్లలో నాట్యం నేర్చుకుని ఆరంగేట్రం చేసి తిరిగి వస్తుంది. ఆ తరువాత అమ్మాయిని డాక్టర్ ను చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టం” అంది. ఆ ఒప్పందం మీదే నన్ను చెన్నయ్ పంపించారు.
సత్యభామగా 30 ఏళ్లు
మా తాతగారు చెన్నయ్ లోని అన్ని డాన్స్ స్కూళ్లు చూపించారు నాకు. అదే క్రమంలో వెంపటి చినసత్యం గారు సినీ నటీమణులైన రేఖ నారదుడుగా, చంద్రకళ సత్యభామగా ఒక కూచిపూడి నృత్యనాటకం వేస్తున్నారు. అందులో చంద్రకళ నాట్యం చూసి అబ్బురపోయాను. అప్పటి వరకూ కూచిపూడి నాట్యం గురించి వినడమే తప్ప పెద్దగా ఏమీ తెలియదు. ఆ నాటకం చూశాక జీవితంలో ఒకసారైనా, సత్యభామ పాత్ర వేయాలనిపించింది. దానితో నేను వెంపటి చినసత్యంగారి వద్దే నేర్చుకుంటానని మా తాతయ్యతో చెప్పాను. ఆయన మరుసటి రోజే నన్ను ఆయన వద్ద చేర్పించారు. అలా నేర్చుకునే క్రమంలో ఆరంగేట్రం కూడా అయిపోయింది. అయితే సత్యభామ పాత్ర వేయాలన్న నా కోరికను గురువుగారు ముందు కాదన్నా కొన్ని పరిణామాల తరువాత మన్నించారు. సత్యభామ పాత్రను జీవితంలో ఒక్కసారి వేసినా చాలు అనుకున్న నేను ముప్పయి ఏళ్లుగా అంటే ఇప్పటికీ వేస్తూనే ఉన్నాను. నాకు అన్నింటికన్నా అమితమైన సంతృప్తినిచ్చేది ఇప్పటికీ ఆ పాత్రే.
ప్రాణంకన్నా మిన్నగా…
ఒకసారి మా గురువుగారు ఫస్ట్ హాఫ్ లో ‘మేనకా విశ్వామిత్ర’, సెకండ్ హాఫ్ లో ‘శాకుంతలం’ ఒకేసారి పెట్టారు. మేనకా విశ్వామిత్రలో రంభగా, శాకుంతలంలో శకుంతలగా వేస్తున్నాను. దాని కోసం మద్రాసు నుంచి హైద్రాబాదు ట్రెయిన్ లో వస్తున్నాను. దారిలో మాతోపాటే వస్తున్న గాయని నా ముఖం మీద పొక్కులు రావడం గమనించింది. ఇదేమిటీ అంటే ఏదో అలర్జీ అయి ఉంటుంది లేదా మొటిమలు అయి ఉంటాయిలే అనుకున్నాం. కానీ, పొద్దునకల్లా నా ముఖమంతా వచ్చేసి పొక్కులు చూసి అందురూ అరిచేశారు. హైద్రాబాద్ లో దిగి ఆర్గనైజర్లు బుక్ చేసిన లాడ్జ్ కి వెళ్లాం. జ్వర తీవ్రత బాగా పెరిగింది. మా గురువుగారు ఆర్గనైజర్‌ను పిలిచి “అమ్మాయికి జ్వరం 104 ఉంది. ఇప్పుడు నాట్యం చేసే పరిస్థితి లేదు… కాకపోతే, మిగతా అందరూ ఉన్నారు. సోలో ఐటమ్స్ చేస్తారు. అమ్మాయి లేకుండా ఈ నృత్య నాటకం వేయడం మాత్రం కుదరదు. కాదూ కూడదూ అంటే, మీరు అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేసి, మేము వెళ్లిపోతాం” అన్నారు. అందుకు వారు అసహనంగా “అదెలా అవుతుందండి? అడ్వాన్స్ అదీ కాదు. నృత్యనాటకం కోసం కదా ఇవన్నీ చేశాం! ఇప్పుడు కాదంటే ఎలా?” అంటూ చాలా గొడవచేశారు. “ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి” అన్నారు గురువుగారు. ఆయన గొంతులో తీవ్రమైన నిస్సహాయత, వేదనా ధ్వనించాయి. ఇవన్నీ లోపలి నుంచి వింటున్న నేను గబగబా బయటికి వచ్చి “మాస్టారూ! ఎలాగోలా నేను చేస్తాను” అన్నాను. గురువుగారు నాకేసి తీక్షణంగా చూస్తు” ఏమిటి నీకు మతేమైనా పోయిందా?” అన్నారు. “లేదు మాస్టారూ! మీరు అప్పుడప్పుడు ప్రాణమంటూ పోతే అది స్టేజ్ మీదే పోవాలి అంటూ ఉంటారు కదా! ఈ రోజున నేను ఆ మాటే అంటున్నాను. నాట్యం చేసేందుకు నన్ను అనుమతించండి” అన్నాను. కాదనలేక సరే అన్నారు. రెండు పాత్రలూ వేశాను. నాటకం పూర్తయిపోయింది. బయట కరతాళ ధ్వనులు వినిపిస్తున్నాయి. నాకు ఒళ్లు తెలియడం లేదు. నేను లోపలికి వచ్చి పడిపోయాను. ఎప్పుడూ ఎవరినీ పెద్దగా పొగడని మా గురువు గారు ఆ రోజు నన్ను ఉద్దేశించి, “ఈ రోజున నువ్వు నిజమైన ఆర్టిస్టువి అనిపించుకున్నావు” అంటూ అభినందించారు. ఇది నా జీవితంలో ఏనాటికీ మరిచిపోలేని సంఘటన. అయితే, ఇవన్నీ నేనేదో గొప్పగా చేశానని చెప్పడం కాదు, ఏదో శక్తి నన్ను నడిపించిందని మాత్రమే నేను అనుకుంటాను.
అనుకన్నది నెరవేరేదాకా…
1988లో రష్యా వెళ్లినప్పుడు అక్కడో ప్రోగ్రాం చేసి, బయటికి వస్తున్నాను. బాగా వర్షం పడుతోంది. ఆ పక్కనే ఉన్న ఓ చెట్టుకింద ఇద్దరు రష్యన్ అమ్మాయిలు నిలుచుని ఉన్నారు. వర్షంలో తడుస్తూ ఎందుకలా నిలుచున్నారు? అన్నానో లేదో వారు నా దగ్గరగా వచ్చి, మీ ఆటోగ్రాఫ్ కావాలన్నారు. ఆ వర్షంలోనే కాస్త పక్కకు జరిగి సంతకాలు చేశాను. నేను వెళ్లిపోతుంటే వాళ్లు నా వెనకాలే వస్తున్నారు. “సైన్ చేశాను కదా! మళ్లీ వస్తున్నారేమిటి?” అన్నాను. “లేదండి, మేము ఇండియాకు వచ్చి కూచిపూడి నాట్యం నేర్చుకోవాలనుకుంటున్నాము” అన్నారు. అప్పటికి రెండు దేశాల మధ్య అంత సఖ్యత లేదు. నేను వాళ్లకేసి తదేకంగా చూసి, “అది అయ్యేపని కాదులేమ్మా” అన్నాను. “మాకు మా జీవితంలో కూచిపూడి నాట్యం నేర్చుకోవడం తప్ప మరో లక్ష్యం లేదు. దయచేసి మాకు ఆ అవకాశం ఇవ్వండి” అన్నారు. “అది కాని పని. కాని వాటి గురించి మాట్లాడటం ఎందుకు? వర్షంపడుతోంది. బయల్దేరండి.” అంటూ మేము బసచేసే హోటల్ కు వెళ్లిపోయాను.
మరునాడు ఉదయమే ఫ్లైట్ ఉంది. హెటల్ మెట్లు దిగుతున్నాను. లాంజ్ లో ఆ ఇద్దరూ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు కూడా రాత్రి వేసుకున్న దుస్తుల్లోనే ఉన్నారు. ఏమనాలో తెలీక “ఏమిటిలా?” అన్నాను. మేము ఇళ్లకు వెళ్లలేదండి. రాత్రంతా ఈ హోటల్ పరిసరాల్లోనే ఉండిపోయాం ” అన్నారు “దేనికీ?” అన్నాన్నేను. “కూచిపూడి నాట్యం నేర్చుకునేందుకు మీ అనుమతి లభిస్తుందేమోనని!” అన్నారు. వారి ఆరాటం చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యమేసింది. “సరే! మీరు ఇండియాకు వచ్చేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను” అన్నాను. “అలా అని మీరు మాకు వాగ్దానం చేస్తారా?” అన్నారు. “లేదు. నేను వాగ్దానమైతే చెయ్యలేను” అన్నాను. ఆ వెంటనే ఎయిర్పోర్టుకు వెళ్లిపోయాం. లోనికి వెళ్లడానికి ముందు సెక్యూరిటీ చెకప్స్ అవుతున్నాయి. తిరిగి చూస్తే ఆ ఇద్దరమ్మాయిలు అక్కడే ఉన్నారు. మీరు నన్నెందుకిలా వెంబడిస్తున్నారు? అన్నాను. “మీరు మాకు వాగ్దానం చేస్తేనే తిరిగి వెళతాం” అన్నారు. వారిలోని పట్టుదల, తపన, ఆరాటం చూస్తే నా మనస్సు ఏదో తెలియని భావోద్వేగంతో ఊగిపోయింది. “మీకు నేర్పిస్తానని వాగ్దానం చేయను గానీ, అందుకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానని మాత్రమే వాగ్దానం చేస్తాను” అన్నాను. వారు సంతోషంగా వెళ్లిపోయారు. నేను ఇండియాకు వచ్చాక, ఇరు దేశాల ప్రభుత్వధినేతలకు ఉత్తరాలు రాస్తు, రెండేళ్లకు అనుమతి లభించింది. ఆ తరువాత ఇండియాకు వచ్చి మా డాన్స్ అకాడమీలోనే మూడేళ్లు నేర్చుకుని వెళ్లిపోయారు. నాట్యమే కాదు. స్పష్టమైన తెలుగు భాష నేర్చుకున్నారు. అక్కడికి వెళ్లాక కూచిపూడి డాన్స్ అకాడమీలు స్థాపించుకుని ఈ రోజున కూడా ఎంతోమందికి నాట్యం నేర్పిస్తున్నారు. నన్ను నిలబెట్టిందీ పట్టుదలే. మరెవరికైనా కావలసిందీ అదే. పట్టుదల ఒకటి ఉంటే దానికి అనుబంధంగా కావల్సిన వాటన్నిటినీ అదే సమకూర్చుకుంటుంది. ఆ రష్యన్ అమ్మాయిల పట్టుదలలో వెయ్యోవంతు ఉన్నా, అనుకున్న రంగంలో శిఖరాన్ని అందుకోవడం ఎవరికైనా సాధ్యమేనని నాకు బలంగా అనిపిస్తుంది.