“కలిమిశ్రీ”కి కుసుమ ధర్మన్న సాహిత్యసేవాపురస్కారం

గతేడాది జాతీయసాంస్కృతిక సంబరాలు నిర్వహించి నవ మల్లెతీగలా విజయవాడను అల్లుకున్న సాహిత్యపరిమళాలు ఎల్లడలా తెలుగుప్రజల హృదయాలను తాకి.. కనకదుర్గమ్మ తల్లి సంకల్ప బలంతో నేడు దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమ ధర్మన్న పేరిట తొట్టతొలి సాహిత్యసేవా పురస్కారాన్ని కలిమిశ్రీ అందుకుని ఆయన అందరికీ చెలిమిశ్రీగా నిలిచారని సాహితీ ప్రముఖులు పలువురు అభినందనల ప్రశంసలజల్లు కురిపించారు.

స్వాతంత్య్రపారాటానికి సంబంధించి గరిమెళ్ళ ‘మాకొద్దీ తెల్లదొరతనము’ పాటను రాస్తే… సామాజిక పోరాటానికి సంబంధించి మాకొద్దీ నల్లదొరతనము అని రాసిన దళిత వైతాళికుడు కుసుమ ధర్మన్న అని వక్తలు అన్నారు. మనిషిగా పుట్టి మనిషిగా గౌరవించని సమాజంలో, భిన్న పోరాటాలు జరుగుతున్న సమయంలో మాకొద్దీ నల్లదొరతనం అని రాయడం వెనుకు కుసుమ ధర్మన్న ఆర్తి, ఆవేదన, ధైర్యం కనిపిస్తున్నాయన్నారు. జయభేరి పత్రికతో గొప్ప సామాజిక ఉద్యమం నడిపిన కుసుమ ధర్మన్న వంటి సామాజిక మూర్తి పేరుతో ఇస్తున్న అవార్డును సాహిత్య సామాజిక ఉద్యమకారుడు కలిమిశ్రీకి ఇవ్వడం గొప్ప విషయంగా భావిస్తున్నామన్నారు.

ఈ మేరకు ఆదివారం (16-7-23) ఉదయం విజయవాడ, ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో కుసుమ ధర్మన్న సాహిత్యసేవాపురస్కార ప్రదానోత్సవ సభ ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. వ్యాఖ్యాన కళాశిరోమణి వేముల హజరత్తయ్య గుప్తా అధ్యక్షత వహించిన ఈ సభలో సుప్రసిద్ధ సినీ గేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, నవభారత్ నిర్మాణ సంఘం వ్యవస్థాపకుడు సూరేపల్లి రవికుమార్, గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్టు వ్యవస్థాపకులు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్, కుసుమ ధర్మన్న కళాపీఠం చైర్మన్ డాక్టర్ రాధా కుసుమ, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ రాష్ట్ర సభ్యుడు డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, బుద్ధభూమి ఎడిటర్ బొర్రా గోవర్ధన్, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఘంటా విజయ్ కుమార్, కవి డాక్టర్ సి. నారాయణస్వామిలతోపాటు పలువురు కవులు, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు.

స్వాతంత్య్రానికి ముందే భవిష్యత్తును ఊహించిన గొప్పవ్యక్తి ధర్మన్న

తొలుత హజరత్తయ్యగుప్తా అధ్యక్షోపన్యాసం చేస్తూ.. ఒక కవి అనగానే ముందుగానే ఒక ఊహాలోకంలో విహరించి కొన్ని భావనలను తన హృదయంలో నిక్షిప్తం చేసుకుని దానికి అక్షర రూపమిచ్చి జాగృతిలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించేవాడే కవి అని నాకు తెలిసి. ధర్మన్నగారు స్వాతంత్య్రానికి ముందే రానున్న పరిస్థితులెలావుంటాయో ఊహించి పాటలు రాసారంటే నిజంగా వారికి ఏదొక అతీతమైన శక్తి వారిని నడిపించింది.. వారి చేత కవితలు రాయించిందని మనకు దోహదపడుతుంది. మాకొద్దీ నల్లదొరతనం అంటూ ఆ రోజుల్లోనే ఆయన నినదించారంటే… రానున్న పరిస్థితులు ఎలావుంటాయో వారు ముందుగానే పసిగట్టారు. ఈ రోజు మనం గాంధీ మహాత్ముడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం.. అహింస అనే నినాదంతో ఆయన స్వాతంత్ర్యం తీసుకువస్తే… మరి ధర్మన్నగారు ఆ రోజుల్లోనే అలా రాసారంటే… ఈ రోజు ఎక్కడ ఎటువంటి పరిస్థితులు తాండవిస్తున్నాయో మనం చూస్తున్నామంటూ ప్రస్తుత పరిస్థితులను వివరించారు. అలాగే అంతటి గొప్పవ్యక్తి పేరిట ఓ అవార్డు స్థాపించి.. ఆ అవార్డుని విజయవాడ నగరంలో మొట్టమొదటగా ఇవ్వడానికి వచ్చి రాధగారు కలిమిశ్రీకి కుసుమ ధర్మన్న పేరిట తొట్టతొలి సాహిత్యసేవా పురస్కారాన్ని అందజేస్తుండడం ప్రశంసనీయమన్నారు.

ప్రవృత్తే.. వృత్తిగా మార్చుకున్న కలిమిశ్రీ: డాక్టర్ ఇండ్ల

సుప్రసిద్ధ సైకియాట్రిస్టు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘కలిమిశ్రీతో దాదాపు 20 ఏళ్ల పరిచయం ఉంది. ఆయన నిర్వహించే అనేక సాహితీసభల్లో పాలుపంచుకున్నాను. ఆయన పేరులో కలిమి ఉంది.. శ్రీ ఉంది.. కానీ ఆయన వద్ద సంపద లేదు. నిజంగా చాలా సాదాసీదా మనిషి. ఆయన తాహతు మించి సాహిత్యకార్యక్రమాలు నిర్వహిస్తుంటే మాకే ఆశ్చర్యమేస్తుంది. రాష్ట్ర, దేశ నలుమూలలనుంచి తెలుగుకు సంబంధించి కవులు, సాహితీపరులు, కళాకారులను రప్పించి నవ్యాంధ్ర రచయితల సంఘం తరఫున ఓ పెద్ద సమావేశం ఏర్పాటుచేశారు. నేను కూడా పాల్గొన్నాను. ఎంతోమంది కవులను, కళాకారులను, రచయితలను ప్రోత్సహిస్తున్నారు. ప్రతిఒక్కరికీ వృత్తి, ప్రవృత్తి రెండు వుంటాయి. వృత్తి అంటే బతుకుదెరువు. ప్రవృత్తి అంటే ఒక ఫ్యాషన్. కానీ కలిమిశ్రీకి ప్రవృత్తే వృత్తి, ప్రవృత్తినే వృత్తిగా మార్చుకున్నారు. ఆ ప్రవృత్తే ఈ సాహితీవ్యాపకం. కలిమిశ్రీకి ఇది ఒక ప్రత్యేక అవార్డుగా భావిస్తున్నా. ఇది విజయవాడ వాసులకు గర్వకారణం. అవార్డులతో గౌరవం, గుర్తింపు లభిస్తుంది. కానీ ఆయన మాత్రం అలానే వుంటారు. కలిమిశ్రీకి మరిన్ని అవార్డులు, ప్రభుత్వం నుంచి కూడా రావాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను.’ అని అభినందనలు తెలిపారు.

గొప్ప సాహితీవేత్తలను ఈ తరానికి పరిచయం చేయడానికే…

కుసుమ ధర్మన్న కళాపీఠం చైర్మన్ డాక్టర్ రాధా కుసుమ మాట్లాడుతూ మరుగున పడిపోతున్న గొప్ప సాహితీవేత్తలను ఈ తరానికి పరిచయం చేయాలనే సంకల్పంతో అటువంటి గొప్ప వ్యక్తి కుసుమ ధర్మన్న పేరిట కళాపీఠం స్థాపించినట్లు చెప్పారు. తానుకూడా సాహిత్యంలో ఎంతోకొంత సేవచేస్తున్నానని చెబుతూ కుసుమ ధర్మన్న కళాపీఠం తొలి సాహిత్య సేవాపురస్కారాన్ని కలిమిశ్రీ లాంటి వారికి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ధర్మన్న దళితచైతన్య జయభేరి…

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ కుసుమ ధర్మన్న తన కవితాప్రస్థానాన్ని, సామాజిక సేవాప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన కవిగా, వక్తగా, వ్యాసకర్తగా, జయభేరి పత్రిక సంపాదకులుగా తన జీవిత ప్రస్థానాన్నికొనసాగించారు. కాబట్టి వారిని ధర్మన్న దళిత చైతన్య జయభేరిగా మనం భావిస్తున్నాం. వారు వైద్యవృత్తిలోవున్నాకూడా ప్రజా అనారోగ్య నివృత్తి వారి ప్రధాన ఆశయంగా ప్రవృత్తిగా వారు కొనసాగించి అందరి హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. ఆయన జయభేరి పత్రికాసంపాదకులు అయితే, ఈ నాటి ఆయన పేరుతో పురస్కారాన్ని అందుకుంటున్న కలిమిశ్రీ మల్లెతీగ సంపాదకులు కావడం.. బంగారు ఉంగరానికి ఉత్తమ రత్నాన్ని పొదగడంలాంటిదని అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో తొలుత శ్రీ నటరాజ నృత్యాలయం, ఆంధ్రనాట్యం రాయన శ్రీనివాసరావు శిష్యబృందం నృత్యప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కవి సమ్మేళనంలో పలువురు కవులు తమ కవితలతో అలరించారు.
-వి.రామక్రిష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap