విజయవాడకు చెందిన ప్రముఖ లాండ్ స్కేప్ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు గారు నిన్న రాత్రి (శనివారం, 06-11-2021) కాకినాడలో కన్నుమూశారు.
నెల్లి బాబూరావు గారు పుట్టింది 20 సెప్టెంబర్, 1935 తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో. వీరి తల్లిదండ్రులు బంగారమ్మ, సోమన్న. వీరు గుడివాడకు చెందిన కొప్పాడ వేణుగోపాల్ గారి దగ్గర చిత్రకళలో శిక్షణ పొందారు. ఫైన్ ఆర్ట్స్ లో మద్రాసు హయ్యర్ పరీక్షలు పాసయి, విజయవాడ గాంధీజీ మునిసిపల్ హై స్కూల్ లో డ్రాయింగ్ టీచర్ గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. వడ్డాది పాపయ్య గారిని అభిమానించే బాబూరావుగారు వాటర్ కలర్స్ లో ఎక్కువగా చిత్రాలు చిత్రించారు. ముఖ్యంగా లాండ్ స్కేప్ చిత్రాలు గీయడంలో సిద్దహస్తులు. వేలాది లాండ్ స్కేప్ చిత్రాలు గ్రీటింగ్ కార్డ్స్ రూపంలో చిత్రించి మార్కెటింగ్ చేసేవారు.
1975లో ప్రపంచ తెలుగు మహాసభలలోను, అదే సంవత్సరం విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లచే సన్మానం అందుకున్నారు. 1995 లో డ్రాయింగ్ టీచర్ గా విజయవాడ సి.వి.ఆర్. మునిసిపల్ హై స్కూల్ నందు పదవీవిరమణ చేశారు. గత ఆగస్ట్ నెల వరకు విజయవాడలోనే వున్న వీరు ఇటీవలే తన పెద్ద కుమార్తె దగ్గరకు కాకినాడ వెళ్ళారు.
ఎంతో ప్రతిభావంతు లైన కళాకారులయినప్పటికి బాబూరావు గారి గురించి లోకానికి పెద్దగా తెలియదు. అందుకు కారణం ఆయన చిత్రకళా ప్రదర్శనలకు, సమావేశాలకు దూరంగా వుండేవారు. ఆయన చిత్రాలను ఎక్కడా ప్రదర్శించలేదు. వీరి మరణానికి 64కళలు.కాం ఎడిటర్ కళాసాగర్, విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు అల్లు రాంబాబు, బాబూరావు గారి శిష్యుడు డ్రీం చిడ్రన్ ఆర్ట్ అకాడెమి స్థాపకుడు పి.రమేష్, చిత్రకారులు మల్లేశ్వరరావు, చంద్రశేఖర్ తదితరులు సంతాపం తెలియెజేశారు.
–కళాసాగర్
చిత్రకళ లోకం గొప్పచిత్రకారుడను కోల్పోయాం.