(‘లవకుశ’ సినిమా విడుదలై నేటికి 60 యేళ్ళు పూర్తైన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి ప్రత్యేక వ్యాసం…)
లవకుశ (1963) సినిమా పూర్తవడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. నిర్మాత శంకరరెడ్డి ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొని చిత్రాన్ని సకాలంలో పూర్తిచేయలేకపోయారు. ఘంటసాలకు నిర్మాత తన పరిస్థితిని వివరిస్తూ “మరొక గాయకునికి డబ్బులిచ్చి పాడించుకునే స్తోమతనాకు లేదు. అన్ని పాటలూ మీరే పాడితే నాకు వెసులుబాటు లభిస్తుంది. మీకు కూడా పాడినందుకు విడిగా డబ్బు ఇచ్చుకోలేను. సినిమా విడుదలై బాగా ఆడితే, మీ రుణం వుంచుకోను. సహకరించండి. వాల్మీకి పాత్రధారి నాగయ్య గారు పాడవలసిన పాటలు, పద్యాలు కూడా మీరే పాడండి” అంటూ ప్రాధేయపడ్డారు. “నాగయ్య గారికి పాడేటంత అర్హత నాకు లేదు… అంతకన్నా అపచారం కూడా వుండదు” అని నిర్మాతతో చెప్పి, ఘంటసాల నాగయ్య గారివద్దకు వెళ్ళి విషయం బయటపెట్టారు. నాగయ్య గారు కల్పించుకొని “నాయనా నేను కూడా ఇప్పుడు పాడే స్థితిలో లేను. కాబట్టి నాకు ఎవరో ఒకరు పాడకతప్పదు. అది నువ్వే అయితే నాకు అంతకన్నా సంతోషం మరొకటి వుండదు. అదేమీ అపకారం కాదు. పోనీ గురుదక్షిణ ఇచ్చుకున్నావనుకో. అపురూపమైన నీ కంఠాన్ని వింటుంటే అసూయ కలుగుతుంది. దాన్ని నాకు అరువిచ్చి నా జన్మ ధన్యం చెయ్యి నాయనా. నీ గాత్రాన్ని నా గాత్రంగా చేసుకునే వరాన్ని ఇవ్వు” అంటూ నాగయ్య గారు ఘంటసాలను ఆప్యాయంగా దీవించారు. అలాగే “సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా… ఒకే బాణమూ ఒకటే మాటా, ఒక్క భామకే రాముని ప్రేమా… మిన్నే విరిగిపడినా… వ్రతభంగమ్ము కానీడమ్మా…” అనే పాటను ఘంటసాల గురుదక్షిణ గీతంగా పాడారు. “రామో విగ్రహవాన్ ధర్మః” అన్నట్లు ధర్మానికి మారుపేరైన శ్రీ రామచంద్రుని ఏక పత్నీవ్రత దీక్షను అయోనిజ అయిన సీతాదేవిని సైతం మాయ ఆవహించి సందేహించిన సందర్భంలో వాల్మీకి మహర్షి సీతా మహాసాధ్వికి సంశయ నివృత్తి చేసే సన్నివేశంలో హిందోళ రాగంలో ఈ పాట పాడిన ఘంటసాల కూడా సందిగ్ధంలో పడిన సంఘటనకు కేంద్రబిందువైన చిత్రం లవకుశ. పూర్తి గేవా కలర్ లో బొంబాయి ఫిలిం సెంటర్ వారి సహకారంతో నిర్మించిన లవకుశ తెలుగులో మొట్టమొదటి కలర్ చిత్రంగా చరిత్రకెక్కింది. శ్రీశోభకృతు నామ సంవత్సరం శుద్ధ పంచమి శుక్రవారం (29-03-1963) ఉదయం 9.45 గం. ఆటతో విడుదలైన ఈ చిత్రం 4 కేంద్రాల్లో వజ్రోత్సవం, 14 కేంద్రాల్లో రజతోత్సవం, 26 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. లవకుశ సినిమా షష్టిపూర్తి జరుపుకుంటున్న సందర్భంలో ఆ చిత్ర విశేషాలు కొన్ని….*
లవకుశ చిత్ర నిర్మాత అల్లారెడ్డి శంకరరెడ్డి స్వయంగా పింగాణి పరిశ్రమ నిర్వహించే విద్యాధికుడు. నెల్లూరు స్వంత వూరు. కళలమీద వున్నఆసక్తితో మద్రాసు వెళ్లి మానవతి (52), చరణదాసి (53) చిత్రాలు నిర్మించారు. ఆరోజుల్లోనే యం.జి.ఆర్, భానుమతి నటించిన మొదటి కలర్ చిత్రం ‘ఆలీబాబా 40 దొంగలు’ తమిళ చిత్రం తెలుగులోకి డబ్ చెయ్యబడింది. అదే స్పూర్తిగా తీసుకొని శంకరరెడ్డి లవకుశ చిత్రాన్ని కలర్లో నిర్మించాలని సంకల్పించి, దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్యను సంప్రదించారు. “తారా బ్రహ్మ”గా కీర్తింపబడే పుల్లయ్య 1934లోనే ‘లవకుశ’ చిత్రాన్ని నిర్మించి వుండడంతో శంకరరెడ్డికి లవకుశ చిత్రం తీసిపెట్టేందుకు పుల్లయ్య అంగీకరించారు. భవభూతి విరచిత “ఉత్తర రామ చరితం” ఆధారంగా ఈ చిత్రకథ కు రూపకల్పన జరిగింది.
నేపథ్యంలోకి వెళితే….1933లో ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ, కలకత్తా యాజమాన్యం పుల్లయ్యను తెలుగులో ‘సతీ సావిత్రి’ చిత్రం నిర్మించి పెట్టవలసిందిగా కబురంపారు. అప్పటికే తెలుగు చలన చిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నెలకొల్పిన స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలిం స్టూడియో ద్వారా పుల్లయ్య చిత్రరంగ ప్రవేశం చేసి వున్నారు. ‘కాసులపేరు’, ‘చల్ మోహన రంగా’ వంటి స్వల్ప వ్యవధి చిత్రాలు ఆరోజుల్లోనే నిర్మించిన ఘనత పుల్లయ్యది. కానీ, మూడు గంటలపాటు సినిమా చూసే ప్రేక్షకులకు ఆ లఘుచిత్రాలు వంటబట్టలేదు… అది వేరే సంగతి! లవకుశ చిత్రాన్ని మొట్టమొదట బెంగాలీలో పృద్విరాజ్ కపూర్ రాముడుగా నటించగా దేవకీబోస్ దర్శకత్వంలో ఇదే సంస్థ నిర్మించింది. ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీతో బాటు ఆరోజుల్లో సాగర్ ఫిమ్స్, ఇంపీరియల్ ఫిలిమ్స్, వేల్ పిక్చర్స్ వంటి సంస్థలు మాత్రమే యితర భాషాచిత్రాలు నిర్మిస్తుండేవి. పుల్లయ్య లవకుశ చిత్రానికి స్టేజి నాటకాలకి కొంచెం భిన్నంగా ఉండేలా బలిజేపల్లి లక్ష్మీకాంతకవి చేత స్క్రిప్ట్ రాయించి ప్రభల సత్యనారాయణ చేత పాటలకు, పద్యాలకు బాణీలు కట్టించి చిత్రాన్ని మలిచారు. మైలవరం భారతీ సమాజం వారి నాటకాల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్న పారుపల్లి సుబ్బారావు చేత రాముడి వేషం వేయించారు. సుబ్బారావు స్ఫురద్రూపి. విశాల నేత్రాలతో హావభావ కాకుండా, తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల్ని బాగా అలరించారు. సీనియర్ శ్రీరంజని గా పేరుగాంచిన మంగళగిరి శ్రీరంజని ఈ చిత్రంలో సీతగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. చిత్రం అఖండ విజయం సాధించింది. జనం ఎడ్లబండ్లు కట్టుకొని మరీ సినిమా హాళ్లకు హాజరయ్యేవారు.
ఇక శంకరరెడ్డి లలితా శివజ్యోతి బ్యానర్ కింద నిర్మించిన ‘లవకుశ’ విషయానికొస్తే…. చిత్రానికి కథ, మాటలు రాసే అవకాశం ‘కథా శివబ్రహ్మం’గా పిలువబడే వెంపటి సదాశివబ్రహ్మంకి దక్కింది. సరళమైన భాషలో సంభాషణలు సమకూర్చి సామాన్య జనానికి కూడా అర్ధమయ్యే రీతిలో సదాశివబ్రహ్మం చిత్ర రచన చేసారు. అంతే కాదు… చిత్రంలో వున్న 37 పాటలు, పద్యాల్లో 20 వరకు సదాశివబ్రహ్మం రాసినవే కావడం విశేషం. వీరితో కలిసి కవికోకిల దువ్వూరి రామిరెడ్డి, కంకంటి పాపరాజు కూడా కొన్ని పద్యాలు రాశారు. పాటల విషయానికొస్తే…. సముద్రాల రాఘవాచార్యా, కొసరాజు రాఘవయ్య చౌదరి, సదాశివబ్రహ్మం పంచుకొన్నారు. లవకుశ చిత్రానికి సంగీతం సమకూర్చిన ఘంటసాల అజరామరుడయ్యారు. ఈ చిత్ర పాటల రిహార్సల్స్ కి లీల, సుశీలలు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. అలా దాదాపు 15 రోజులు కేవలం రిహార్సల్స్ కే వెచ్చించడం తో లీల ఘంటసాల మాస్టర్ ని “ఈ చిత్రానికి యిన్ని రిహార్సల్స్ అవసరమా” అని అడిగితే, “భవిష్యత్తులో ఈ చిత్ర సంగీతం చరిత్రలో నిలిచిపోతుందని ఘంటసాల సెలవిచ్చారట! ఈ చిత్రం లోని పాటలు, పద్యాలు LPలు గా, CDలు గా నేటికీ విరివిగా అమ్ముడు పోవడమే ఇందుకు నిదర్శనం.
చిత్ర కథనంలోకి వెళితే, రావణ సంహారానంతరం సీతా సమేతంగా అయోధ్యకు విచ్చేసిన శ్రీరామచంద్రుడిని వశిష్టుడు ప్రజా సమక్షంలో పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. ధర్మబద్ధంగా, జనరంజకంగా ప్రజాపాలన చేస్తానని ప్రమాణం చేసిన రామచంద్రుడు తన పరిపాలన గురించి వేగుల ద్వారా అనుక్షణం తెలుసుకుంటూవుంటాడు. భద్రుడు అనే గూఢచారి ద్వారా ఒక రజకుడు తన భార్యను అనుమానించి “పరాయి ఇంట వుండివచ్చిన భార్యను యేలుకోవడానికి, వెర్రి రాముడంటివాణ్ణి కాను” అని అన్నాడనే విషయం తెలుసుకొని గర్భవతిగా వున్న సీతను అడవిలో వదిలీ రమ్మని తమ్ముడు లక్ష్మణుడుని ఆదేశిస్తాడు. 1934లో నిర్మించిన లవకుశ చిత్రంలో ఈ సందర్భానికి సంబంధించిన కారణాన్ని సహేతుకంగా చూపించారు. కాని శంకరరెడ్డి లవకుశలో కేవలం రజక కుటుంబ కలహాన్ని మాత్రమే చూపారు. అసలు కారణానికి వస్తే…. రావణ సంహారానంతరం హతశేషులైన శూర్ఫణక, కరాళుడు మాయోపాయం చేత ఎలాగైనా సీతారాములపై పగ సాధించాలని అయోధ్యకు చేరి, రజకులుగా చలామణి అవుతూ తగిన సమయం కోసం వేచివుంటారు. గూఢచారి భద్రుడు చాకలి గూడెం వైపు రావడం గమనించి, శూర్ఫణక, కరాళుడు తమలో తాము తగవులాడుకొంటూ భార్యను సందేహించి యిల్లు వెడలగొట్టబోగా, వారించిన ఇరుగు పొరుగు వారితో కరాళుడు “పరాయి ఇంట వుండివచ్చిన భార్యను యేలుకోవడానికి వెర్రి రాముడంటివాణ్ణి కాను” అంటూ నిందను మోపుతాడు. భద్రుని ద్వారా ఈ వార్త రాముడికి చేరుతుంది. ఎందుకోగాని ఈ చిత్రంలో ఈ కారణాన్ని దర్శకుడు చూపలేదు. ఈ చిత్రంలో ఇంకో విషయం కూడా చూపలేదు. అది! సీతాదేవి రాముని నిరాదరణకు వగచి, కళంకంతో బ్రతకడంకంటే మరణించడమే మేలని గంగానదిలో ప్రాణాలు విడిచేందుకు సిద్ధపడగా, వాల్మీకి ఆమె ఇడుములను దివ్యదృష్టితో చూచి రక్షించే సన్నివేశం.
శంకరరెడ్డి గెవాకలర్ లో నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎల్. రాయ్ చాయాగ్రణ దర్శకత్వం నిర్వహించగా, ట్రిక్ ఫొటోగ్రఫీని రవికాంత్ నగాయిచ్ అందించారు. కళా దర్శకుడు టి.వి.యస్. శర్మ పనితనం చిత్రమంతటా కనిపిస్తుంది. అలాగే రీటా, యల్.విజయలక్ష్మి, సుకుమారిల చేత వెంపటి చినసత్యం అద్భుతమైన నాట్యాలు చేయించారు. ముఖ్యంగా రఘుకులాన్వయానికి మూల పురుషుడైన వంశ కర్త సూర్యభగవానునికి శ్రీరాముడు పుష్పాంజలులు సమర్పించే సీనులో కళాదర్శకుడు శర్మ ప్రతిభ ద్విగుణీకృతమవుతుంది. అలాగే స్వప్నావస్థలో వున్న శ్రీరాముడు సీతాదేవి సింహాసనం క్రింద పడిపోయినట్లు భ్రమించి ఆమెను రక్షించే ప్రయత్నంలో ఆ సింహాసనాన్ని తొలగించలేక, అది అమాంతంగా పెరిగిపోయే దృశ్యంలో కళాదర్శకుని ప్రతిభే కాదు… దర్శకుని చిత్రీకరణ కూడా అద్భుతం. సీతా స్వయంవరంలో శివధనుర్భంగం కావించిన రాముడికేనా ఈ దుస్థితి అని ప్రేక్షకుడు విలపించక మానడు. అంతేకాదు.. అది స్వప్నమే కదా అని సమాధానపడతాడు కూడా! ఎన్.టి.ఆర్, నాగయ్య, ధూళిపాళ, కాంతారావు, సత్యనారాయణ, శోభన్ బాబు, కే.వి.యస్. శర్మ, అంజలీదేవి, కన్నాంబ, సంధ్య, యస్.వరలక్ష్మి వంటి హేమా హేమీలు నటించిన ఈ చిత్రంలో కుశలవులుగా చిరంజీవులు సుబ్రహ్మణ్యం, నాగరాజు; ఆంజనేయునిగా శాండో కృష్ణ లు రాణించారు. అక్కినేని సంజీవి ఎడిటర్ గా వ్యవహరించారు.
ఇక పాటల వ్యవహారానికొస్తే…. 1934 లవకుశలో వున్న “జై జై శ్రీరామచంద్ర రఘుకుల సాంద్రా జగతాత్మజపతి జగదోద్ధారా” అని అయోధ్యావాసులు కీర్తించే పాటకు ప్రత్యామ్నాయంగా “జయజయ రామా శ్రీరామా.. దశరధ తనయా జయజయహో” పాటను చేర్చారు. చాకలి వీరన్న బృందం పాడే “ఏటోలే ఈ మురిపింత.. చందమామ లాంటి చక్కని మొగము” పాట స్థానంలో “ముద్దు మోము ఇటు తిప్పే పిల్లా మురిపిస్తావెందుకే, మూరఖిస్తావెందుకే” అనే పాటను వింటాం. కానీ “నే నోల్లనోరి మామా నీ పిల్లని.. అబ్బా నీ పిల్లా.. దీని మాటలెల్ల కల్లా .. సంసారమంత గుల్లా” అనే చాకలి వీరన్న పాటకు మూలగీతాన్ని వింటే కించిత్ అశ్లీలం చోటుచేసుకున్నట్లు మనకు అనిపిస్తుంది. “ఎల్లెల్లె నంజా నీ వాటము నాకెరికనేదా.. బెంజాలి నంజా.. సూరిగాడు నీకేసి సూసిన సూపు… నువ్వోద్దె నాకింకా తుంటరి గుంటా.. నిన్నొదిలేస్తే పోతాది నాకీ తంటా” అంటూ సాగే పాట నాటకీయతకు అనుగుణంగా రాసిందై ఉండవచ్చు. లక్ష్మణుడు పాడే పద్యం “ ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సుత్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతి జేసిరో” కి మూలం “ప్రభోధర్మమా శ్రీరామా..సుగుణ శీలయే రామా .. సతిన్ సాధ్వినీ.. విధి కానన్ బనుప న్యాయమా” అనే పాత లవకుశ పద్యం. అలాగే లవకుశులు ఆలపించే రామగానం పాత సినిమాలోఒక్క పాటతోనే ముగిస్తే కలర్ లవకుశలో మూడు పాటలుగా విభజించి రక్తి కట్టించారు. సముద్రాల రాసిన మూడు పాటల్లో ఏకసూత్రత కనిపిస్తుంది. రామ జననం మొదలు పట్టాభిషేకం వరకూ జరిగిన ఘట్టాలన్నిటినీ పాట రూపంలో అందించారు. “రామ కథను వినరయ్యా, ఇహపర సుఖముల నొసగే సీతారామ కథను వినరయ్యా” పాటను శుద్ధ హిందోళంలో; “వినుడు వినుడు రామాయణ గాధ వినుడీ మనసారా, ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథ” పాటను కరుణారసభరితమైన కీరవాణి, పీలూ రాగాల సమ్మేళనంలో; “శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా” పాటను శివరంజనితో మొదలయ్యే రాగమాలికలో ఘంటసాల మలిచారు. ఆకాశవాణిలో సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు మాట్లాడుతూ “లవకుశ చిత్రం ఘంటసాల కు బంగారు కిరీటాన్ని తెచ్చి పెట్టిందనవచ్చు. ఈ చిత్రంలో ఘంటసాల ప్రతిభా విశ్వరూపాన్ని మనం చూస్తాం” అని ప్రశంసించారు.
ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఘంటసాల కు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. నిర్మాతకు తలెత్తిన ఆర్ధిక ఇబ్బందులవల్ల చిత్ర నిర్మాణం 5 సంవత్సరాలు సాగింది. ఇతర గాయకులకు డబ్బు చెల్లించలేక అన్ని పాటల్ని ఘంటసాలనే పాడమని నిర్మాత ప్రాధేయపడ్డారు. వాల్మీకి పాడే “సందేహించకూమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా” పాటను, “జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే” బృంద గానాన్ని, “రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నార చీరలూనే” అనే కంకంటి పాపరాజు సీసపద్యాన్ని కూడా ఘంటసాలే పాడారు. ఈ పద్యం పాత లవకుశలో కూడా వుంది. సంవాద పద్యాలు ఇంచుమించు పాతసినిమా లోని సంఘటనల సమాహారం గానే సాగుతాయి కలర్ లవకుశలో స్నేహం, దయ, సౌఖ్యం కడకు జానకీ మాత నైనా లోకారాధనకై త్యజించుటకు వెనుకాడని మనస్తత్వం గల శ్రీరాముని పాత్రలో యన్.టి.ఆర్ ఒదిగి పొయ్యారు. ఇక సీతమ్మంటే అంజలీదేవి మాత్రమే. శ్రీరంజని సీతగా నటించినప్పుడు సినిమా ఆడే హాల్స్ వద్దకు ఆమె వెళితే ప్రేక్షక మహిళలు ఆమెకు కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చేవారు. అంజలీదేవి విషయంలో కూడా అదే జరిగింది.
పాత లవకుశ కథనానికి నాటక కర్త కె. సుబ్రహ్మణ్యశాస్త్రి రచనను ప్రామాణికంగా తీసుకొని వల్లభజోస్యుల రమణమూర్తి స్క్రీన్ ప్లే సమకూర్చితే, వెంపటి సదాశివబ్రహ్మం కూడా శంకరరెడ్డి లవకుశలో అదే పంధాను అనుసరించారు. ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరించిన జి.వి.ఆర్. శేషగిరిరావుకు పుల్లయ్య తీసిన ఒక షాట్ ఎందుకో నచ్చలేదు. గర్భవతిగా వున్న సీత పరుగు పరుగున రావడం ఆ షాట్ సారాంశం. స్క్రీన్ ప్లే లో అలాగే వుంది. ఆ సన్నివేశం కృత్రిమంగా వుంటుందని శేషగిరిరావు పుల్లయ్యకు చెప్పడంతో ఆలోచనలో పడ్డ ఆయన ఆ షాట్ ని మళ్లీ తీసారు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా ఇదే నటీ నటులతో తీసారు. తమిళంలో పద్యాలు వుండవు కనుక పద్యాల స్థానంలో సంభాషణలు చేర్చడం మినహా స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చెయ్యలేదు. చిత్ర నిర్మాణం ఆలస్యం కావడంతో అనారోగ్యంతో బాధపడుతున్న పుల్లయ్య స్థానాన్ని ఆయన తనయుడు సి.యస్. రావు భర్తీచేసి చిత్రనిర్మాణాన్ని పూర్తి చేసారు. “అంతటి రామరాజ్యంలో కూడా తాగుబోతులు, అబద్ధాల కోరులు వుండేవారా” అనే సందేహాన్ని పక్కనపెడితే, సన్నివేశానికి అది అవసరం అనిపిస్తుంది.. శూర్ఫణక, కరాళుల వృతాంతం ప్రస్తావించి వుంటే ఈ సంఘటనలకు అసలు కారణం తెలిసి ప్రేక్షకులు సమాధానపడి వుండేవారు. చిత్రంలో రమణారెడ్డి, సూర్యకాంతంల పాత్రలు తొలగించి శూర్ఫణక, కరాళుల బ్యాక్ డ్రాప్ చేర్చి వుంటే సన్నివేశం బాగా పండివుండేది. లవకుశ చిత్రం ఇప్పటి దాకా వివిధ భాషల్లో 11 సినిమాలుగా వచ్చింది. మొదటి లవకుశ 1919 లో మూకీ చిత్రంగా వచ్చింది. ఎటువంటి శృంగార సన్నివేశాలు లేకుండా తీసిన ఈ చిత్రం సాధించిన విజయాన్ని భారతీయ సినిమా తెరపై మరే చిత్రమూ సాధించ లేదనేది నిస్సందేహం.
–ఆచారం షణ్ముఖాచారి
REALLY VERY GOOD ARTICLE FROM CHARI GARU.
శూర్ఫణఖ, కరాళుల వృతాంతం ఏమిటో కొంచం వివరించగలరా?