మదిని కుదిపే ‘రంగమార్తాండ’

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఇంతవరకూ ఇరవై చిత్రాలను తెరకెక్కిస్తే అందులో రీమేక్ ఒక్కటంటే ఒక్కటే! కెరీర్ ప్రారంభంలో మలయాళ చిత్రం ‘చంద్రలేఖ’ను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. మళ్లీ ఇంతకాలానికి మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’ను ‘రంగమార్తాండ’గా పునర్ నిర్మించారు. అక్కడ ప్రముఖ నటుడు నానా పటేకర్ పోషించిన పాత్రను ఇక్కడ ప్రకాశ్ రాజ్ చేయగా, ఇటీవల కన్నుమూసిన ప్రముఖ రంగస్థల నటుడు విక్రమ్ గోఖలే చేసిన పాత్రను బ్రహ్మానందం పోషించారు. రకరకాల కారణాల వల్ల దాదాపు మూడు నాలుగేళ్లు సెట్స్పైనే ఉండిపోయిన ‘రంగమార్తాండ’ ఎట్టకేలకు ఉగాది కానుకగా జనం ముందుకు వచ్చింది.

కథగా చెప్పుకోవాలంటే.. చాలా పాతది! కానీ
ఇప్పటికీ వర్తించేది!! మనుషులు, వారి మనస్తత్వాలు మారనంత కాలం ఈ కథ నిత్యనూతనం. కెరీర్లో మునిగి తేలి, ఆపైన కుటుంబానికి తాను ఇవ్వాల్సి నంత ప్రాధాన్యం ఇవ్వలేదని గ్రహించిన ప్రముఖ రంగస్థల నటుడు రాఘవరావు (ప్రకాశ్ రాజ్) కథ ఇది. ముఖానికి ఇక రంగు వేసుకోకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత ఉన్న ఆస్తిపాస్తులను కొడుకు రంగా రావు (ఆదర్శ్ బాలకృష్ణ), కూతురు శ్రీదేవి (శివాత్మిక రాజశేఖర్)కి ఇచ్చేస్తాడు. అక్కడి నుండే అతనికి, అతను ముద్దుగా రాజుగారూ (రమ్యకృష్ణ) అని పిలుచుకునే భార్యకు కష్టాలు మొదలవుతాయి. కోడలు గీత (అనసూయ)తో అభిప్రాయభేదాలు రావడంతో ఇంటి నుండి బయటకు వచ్చేస్తారు. సొంతూరుకు వెళ్లి పోదామనుకున్న వాళ్లను కూతురు తన ఇంటికి తీసుకెళుతుంది. అక్కడ అల్లుడు రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్)తో సఖ్యత ఏర్పడినా.. అతని కెరీర్కు తండ్రి అతి చేష్టలు ఎక్కడ ఆటంకంగా మారతాయో అని కూతురు భయపడుతూ ఉంటుంది.

అక్కడ కూడా పొసగక పోవడంతో అర్ధరాత్రి కూతురు ఇంటి నుండి రాఘవరావు భార్యతో కలిసి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ చిత్ర కథ.
నటుడిగా వేదికపై రంగమార్తాండుడిగా చెలరేగి పోయిన ఓ వ్యక్తి నిజజీవితంలో ఎలా ఓడిపోయాడ న్నదే ఈ చిత్ర కథ. తనవి కాని పాత్రను ఆవాహన చేసుకుని అద్భుతంగా వాటికి జీవం పోసిన ఓ నటుడు, నిజ జీవితంలో తన పాత్రను సజావుగా పోషించలేక ఎలా సతమతమయ్యాడన్నదే ఇందులోని ప్రధానాంశం. రంగస్థల కళాకారులకు ఉండే బలహీనతలను కూడా రాఘవరావు, అతని స్నేహితుడు చక్రపాణి (బ్రహ్మానందం) పాత్రల ద్వారా చూపించారు. రంగస్థలం మీద వైవిధ్యమైన పాత్రలను అలవోకగా పోషించే ఈ నటులు నిజ జీవితంలో ఎలా రాజీ పడిపోతుంటారు, ఎంత బేలగా మారిపోతుంటారనే దానిని ఈ రెండు పాత్రల ద్వారా తెలిపారు. విశేషం ఏమంటే… ఈ మొత్తం కథలో మనకు నెగెటివ్ పాత్రలు ఏవీ కనిపించవు. మారుతున్న కాలం, మారిన సమాజం, వ్యక్తుల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పులు… తద్వారా ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని వారు అంచనా వేయడంలో జరిగే పొరపాట్లే ఉన్నాయి. ఇందులో తప్పు చేసిన ప్రతి పాత్ర ఆ తర్వాత ఆత్మ విమర్శ చేసుకుంటుంది. తన ప్రవర్తనకు కారణం ఇదని వివరించే ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాకు అది ఎంతో వన్నె తెచ్చింది. అదే సమయంలో ప్రతినాయక పాత్ర లేకపోవడంతో దర్శకుడి పని కత్తిమీద సాముగా మారిపోయింది. ఏ మనిషి పూర్తిగా మంచివాడు కాదు.. అలా అని పూర్తిగా చెడ్డవాడూ కాదు. చుట్టూ ఉండే పరిస్థితులే అతన్ని మంచి, చెడుల వైపు ప్రయాణం చేసేలా చేస్తాయి. ఇందులో పాత్రలన్నీ అలాంటివే. అయితే ప్రధాన పాత్రధారి రాఘవరావు పాత్ర ద్వారా దర్శకుడు చెప్పించిన కొన్ని మాటలు అద్భుతం. ఆంగ్ల భాష మోజులో పడి, అమ్మ భాషను నిర్లక్ష్యం చేయడం సరికాదని చెప్పడం, చిన్న పిల్లలతో అశ్లీల నృత్యాలు చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి సన్నివేశాలు థియేటర్లలో చప్పట్లు కొట్టిస్తాయి. నటీనటుల విషయానికి వస్తే జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ నటన గురించి చెప్పడానికి కొత్తగా ఏమీ లేదు. అద్భుతంగా నటించాడు. అతని భార్యగా రమ్యకృష్ణ హావభావాలతోనే సన్నివేశాలను రక్తి కట్టించింది. ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ చక్కగా తమ పాత్రలను పోషించారు. ఈటీవీ ప్రభాకర్, కాశీవిశ్వనాధ్, సన, అలీ రజా, వైజాగ్ సత్యానంద్, జయలలిత, భద్రం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. వీళ్లందరి నటన ఒక ఎత్తు కాగా బ్రహ్మానందం ఒక్కరిది ఒక ఎత్తు. ఇంతవరకూ ఉన్న ఇమేజ్కు పూర్తి భిన్నమైన పాత్రను ఆయన పోషించారు. ప్రేక్షకులు దీన్ని పాజిటివ్గా తీసుకుంటే… సినిమా కమర్షియల్గా మరో స్థాయికి చేరుకుంటుంది, లేదంటే ఓ మంచి చిత్రంగా మిగిలిపోతుంది. ఎందుకంటే.. బ్రహ్మానందం హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు అతనికి, ప్రకాశ్ జ్కు మధ్య జరిగే సుయోధన, కర్ణ సంభాషణలు ఈ మూవీకి హైలైట్. అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయితే గ్రేట్! సాంకేతిక నిపుణులలో అగ్రతాంబూలం స్వర్గీయ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి ఇవ్వాలి. రాఘవరావు జీవితాన్ని కాచివడబోసి ఆత్మ గీతంగా అద్భుతంగా రాశారు. దానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చడంతో పాటు తానే పాడారు. ఈ పాట సినిమాలో నేపథ్యగీతంగా ఐదారు కీలక సన్నివేశాలలో వస్తుంది. గుండెల్ని పిండి చేసేస్తుంది. అలానే లక్ష్మీ భూపాల ‘నేనొక నటుడ్ని’ అంటూ రాసిన షాయరీని చిరంజీవితో పాడించడం, అది టైటిల్స్ కార్డ్స్ మీద ప్లే చేయడంతో కథలోకి ఆడియెన్స్ను అలవోకగా తీసుకెళ్లినట్టు అయ్యింది. మరో రెండు పాటలను కాసర్ల శ్యామ్, విజయ్కుమార్ రాశారు. ఇలాంటి సినిమాలకు సంభాషణలే ప్రధాన బలం. ఆకెళ్ల శివప్రసాద్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. కొన్ని సన్నివేశాలను మరింత బలంగా, కాస్తంత భారీగా చిత్రీకరించి ఉండాల్సింది. కానీ బడ్జెట్ పరమైన పరిమితులు అడ్డువచ్చినట్టుగా అనిపిస్తోంది. దాంతో ప్రొడక్షన్ పరంగా సినిమా ఓ మెట్టు తక్కువగా ఉందనే చెప్పాలి. ఏదేమైనా.. కృష్ణవంశీ మరోసారి తనలోని ప్రతిభను వెలికి తీసి, ‘రంగమార్తాండ’ను ఓ అర్థవంతమైన, నేటి తరానికి అవసరమైన సినిమాగా మలిచారు. అందుకు ఆయనను, నిర్మాతలు మధు కాలిపు, ఎన్. వెంకటరెడ్డిని అభినందించాలి.
-అరుణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap