ఆచార్య కేతు విశ్వనాథరెడ్డికి “విమలాశాంతి సాహిత్య” జీవిత సాఫల్య పురస్కారం
ప్రసిద్ధ అభ్యుదయ కథారచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డికి విమలాశాంతి జీవిత సాహిత్య సాఫల్య పురస్కారం ఇవ్వ నున్నట్లు పురస్కారం వ్యవస్థాపకులు డా.శాంతి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీమతి విమల గారు ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె స్మృతి చిహ్నంగా ఈ జీవిత సాఫల్య పురస్కారం ఏడాదికొక్క సీనియర్ కథానవలా రచయితకివ్వాలని సంకల్పించి, తొలి పురస్కారం కేతు విశ్వనాథరెడ్డికి ఇస్తున్నట్లు శాంతినారాయణ తెలిపారు. ఈ పురస్కార గ్రహీతను ఎన్నిక చేయడంలో జూరీ సభ్యులుగా ఆచార్య మేడిపల్లి రవికుమార్, డా. కె.పి.అశోక్ కుమార్, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి వ్యవహరించినట్లు తెలిపారు.
అభ్యుదయ కథానిక, అభ్యుదయ సాహిత్య విమర్శల అభి వృద్ధికి విశ్వనాథరెడ్డి చేసిన దోహదం చరిత్రాత్మకమైనది. కూలిన బురుజు, వాన కురుస్తే, అమ్మవారి నవ్వు, నమ్ము కున్న నేల, తేడా వంటి అనేక కథలలో రాయల సీమ జీవిత వాస్తవికతను ప్రతిబింబించారు.
ఆయనది సాహి త్యంలో మార్క్సియ మార్గం, వాస్తవికతావాదం. సామాజిక పరివర్తన ఆయన సాహిత్య లక్ష్యం. అభ్యుదయ రచయితల సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఇప్పుడు కడపలో నివాసం వుంటున్నారు. పుట్టింది 1939 లో కడప జిల్లా రంగసాయిపురంలో.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గ్రహీత, అప్పాజోశ్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ పురస్కార గ్రహీత అయిన కేతు విశ్వనాథరెడ్డికి విమలాశాంతి సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం అందించడం
ఆనందంగా వుందని పురస్కారం వ్యవస్థాపకులు డా.శాంతి నారాయణ పేర్కొన్నారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో 50,000/ రూపాయల నగదుతోపాటు సత్కారం చేయబోతున్నట్లు తెలిపారు.