మస్తిష్క మూలాన్నుంచి మెరిసిన సన్న మెరుపు మహనీయుల నోటి చిన్న పలుకు బీజమై ఉద్గ్రంథాన్ని వ్రాయించదా!! … అటువంటిది ఆర్తిగా చదివించుకున్న ఓ ఉత్తమ కావ్యం చిన్న పుస్తకం వ్రాయించలేదా? కచ్చితంగా …! దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ ‘అనేకులుగా… మాకినీడి!’
‘అనేకులుగా…!’ అన్న శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారి 53 కవితలను పొదుగుకున్న 17వ కవితాసంపుటిని (71వ పుస్తకం) చదివిన ఆనందోత్సాహం… నాచే వ్రాయించింది ఈ చిరు పుస్తకాన్ని!. శ్రీ మాకినీడిగారిని ఓ తాత్వికత నిండిన మార్మికుడిగా, ధార్మికత నిండిన నాస్తికుడిగా, మానవత్వం నిండిన సామ్రాజ్యవాద వ్యతిరేకోద్యమకారుడిగా, సమ్యక్ జ్ఞానంతో జీవితాన్ని తడిమిన సత్యశోధకుడిగా, కవిత్వ పరమార్థాన్ని తెలియజెప్పిన సాధకుడిగా ఈ పుస్తకంలో దర్శిస్తాం! ఎందుకంటే… ఆయన వ్రాసింది కవిత్వం!!
శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారి దినచర్యలో భాగమైన కవితారచన వదని వ్యసనమై… ఆత్మసౌందర్య దీప్తితో నిండిన అంతర్వీక్షణనీ, వివేచనతో కూడిన దిగులు గాఢతని, నిరీక్షణ నిగూఢతని మప్పి మనసుని పొంగించి ఈ కవితలను వ్రాయించింది. నూతన పదచిత్రాలకు, భావసాంద్రతకు తోడు పండిన అనుభవం నిండుగా ఉన్న కవి, మెండైన కవితల ఆసామి… మాకినీడి!!
– ఆత్మకూరు రామకృష్ణ (రచయిత – కవి – చిత్రకారుడు)
ప్రతులకు: 9493405152