తెలుగు చిత్రకళ హృదయావిష్కరణం
తెలుగు చిత్రకళ అనగానే దామర్ల రామారావు గారి పేరు తొలుతగా స్పురణకు వస్తుంది. ఆధునికాంధ్ర చిత్రకళకు పితామహుడాయన. ఆయన శిష్యప్రశిష్యులైన యువచిత్రకారులు ఆయనలా చిత్రించాలని ఉవ్విళ్లూరే వారంటారు. అదొక కళా చైతన్యం.
ఆధునిక తెలుగు సాహిత్యం, ఆధునిక తెలుగు చిత్రకళ ఇంచుమించు ఒకే సమయంలో మొదలయ్యాయి. రెండింటి పైన అధివాస్తవిక ధోరణుల ప్రభావం సమానంగానే ప్రతిఫలించింది. అధునికాంధ్ర కవిత్వంలో మాదిరే చిత్రకళలోనూ ఎన్నో పోకడలు కనిపించాయి. దామెర్లవారు పూయించిన కొత్తపూలు తెలుగునాట చిత్రకళను ఒక అధ్యయనాంశంగా అభ్యాసం చేయాలనే ఆలోచనలకు దారితీశాయి. రాజమహేంద్రవరంలో దామెర్ల రామారావు లలితకళాశాల ఏర్పడింది.
దామెర్లవారి తరువాత తెలుగు చిత్రకారులను అమితంగా ప్రభావితం చేసిన బెంగాలీ చిత్రకళా ప్రముఖుల ప్రమాద కుమార ఛటోపాధ్యాయ, దేవీప్రసాద్ రాయ చౌధరి, అవనీంద్ర, నందలాల్ ప్రభృతులు ఎన్నదగినవారు.
భావ చిత్రాలు, రూపచిత్రాలు, దృశ్యచిత్రాలలో వాసికెక్కిన తెలుగు చిత్రకారుల కృషిని తెలుగు జాతి ఎన్నటికీ మరువ కూడదు. ఎవరెస్టు శిఖరమంత లోతైన భావాన్ని రంగులలో చూపించి అదిప్రోన్నతమైన ఆనందాన్ని కలిగింపచేసే కవితాత్మకత చిత్రకళలో ఉంటుందని నా భావన. కవిత్వంలో చిత్రకళ, చిత్రకళలో కవిత్వమూ తొంగి చూస్తుంటాయి.
ఆదిమ మానవుడు తన మాట ద్వారా, తన పాట ద్వారా, తన ఆట ద్వారా, తన చిత్రకళ ద్వారా తనను తాను చిత్రించుకోవటానికి, వ్యక్తపరచుకోవటానికి, ప్రదర్శించుకోవటానికి తాపత్రయపడ్డాడు. చిత్రకళ భాషకు ఆదిమరూపం. బొమ్మలే భాషకు వ్రాతపూర్వక ఆధారాలయ్యాయి. ఒక పురుగు ఇసుక మీద నడుస్తుంటే పడిన దాని పాద ముద్రలు చిత్రకళకు ఆలంబన. ఘుణాక్షరన్యాయం అంటారు దీన్ని. అక్షరాలను వ్రాయటానికి చిత్రకళ తోడ్పడింది. చైనా తదితర భాషల్లో చిత్రాలే అక్షరాలు ఈ నాటికి. సింధూ నాగరికతలో కనిపించిన ఫలకాలపైన అక్షరాలు అన్నీ బొమ్మల రూపంలోనే ఉన్నాయి. చేప బొమ్మ, బాణం బొమ్మ, కావడి మోస్తున్న వ్యక్తి బొమ్మ, కుందను మోస్తున్న వ్యక్తి బొమ్మ ఇలా ఉంటాయి సింధూలిపిలో అక్షరాలు. చిత్రకారుడు భాషకు ప్రేరకుడు అని చెప్పటమే నా ఉద్దేశం. భాషా సంస్కృతులలో చిత్రకళ ముఖ్యమైన భాగం కూడా!
తూర్పున వియత్నాం (చంపా దేశం) దక్షిణాన సింహళం, జపాన్ల వరకూ విస్తరించిన ఆంధ్ర మహాకళాసామ్రాజ్యానికి అధినేతలైన చిత్రకళా చక్రవర్తులకు మనం నీరాజనాలు పలకాలి. చిత్రకళలో తెలుగువారు ఇతరులకు ఏ మాత్రం తీసిపోరని అనేకమంది చిత్రకళా ప్రముఖులు తమని తాము నిరూపించుకున్న వారే! మనం విదేసీ కళల్నుంచి ఎదిగినవాళ్లం అనుకోవటం సరికాదని నిరూపించే చారిత్రక సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆంధ్ర దంతశిల్ప కళాకారులు ఇటలీలోని సాంసే నిర్మాణంలో పాల్గొన్నారు. పోర్చుగల్ చర్చీల్లో బందరు కలంకారీ చరిత్రకారులు చిత్రించిన అలంకరణలున్నాయి. తెలుగువారి లలిత కళా నైపుణ్యాన్ని ముచ్చటపడి అందుకున్న విదేశాల వైనాన్ని తెలియచెప్పే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు ప్రస్తావించుకోవటం దేనికంటే, మనవి పుచ్చుకునే చేతులు కావని, ఇచ్చిన చేతులేనని మన తరానికి తెలియ చెప్పటం ద్వారా మనోబలాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేయటం లక్ష్యం.
చరిత్రకారులు శిల్పకళ గురించి, దేవాలయాల నిర్మాణ చాతుర్యం గురించి చేసినంత పరిశోధన చిత్రకళ పైన చేసినట్టు కనిపించదు. దొరికిన కుండపెంకుల ఆధారంగా చరిత్ర నిర్మిస్తున్నారు గానీ, ఆ పెంకుల మీద కనిపించే చిత్రకళ ఏ చరిత్రను చెప్తోందో పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.
శాంతినికేతనంలో చిత్రకళను అభ్యసించిన “చిత్ర”, అమెరికా పార్లమెంటు భవనంలో తన చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయవల్సిందిగా అమెరికా ప్రభుత్వ ఆహ్వానాన్ని పొందిన ఏకైక తెలుగు చిత్రకారుడు ఆచార్య యశ్వీ రామారావు ఇలా ఎందరో తెలుగుచిత్రకళా ప్రతిభకు అద్దం పట్టిన మహానుభావులు మనకున్నారు. శ్రీయుతులు అడవి బాపిరాజు, కౌతా రామ్మోహన శాస్త్రి, మాధవపెద్ది గోఖలే, పిలకా లక్ష్మీ నరసింహమూర్తి, మరగంటి సీతారామాచార్యులు, అంట్యాకుల పైడిరాజు, వెల్లటూరి పూర్ణానంద శర్మ, అబ్బూరి గోపాలకృష్ణ, పోడూరి రామమూర్తి, వడ్డాది పాపయ్య, గోలి శేషయ్య, మారేమండ శ్రీనివాసరావు, కె.ఎస్. వాస్, దేవీ ప్రసాద్, శీలా వీర్రాజు, మైక్రో చిత్రకారుడు గేదెల అప్పారావు, ఇలా అనేకమంది ప్రముఖులు తెలుగు చిత్రకళా రీతులకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్రకారుడు బాపు మరణానంతరం వారి పేరున విజయవాడలో “బాపూ మ్యూజియం” ఏర్పాటు చేసి లలితకళలలో ప్రసిద్దమైన వాటిని ప్రదర్శనకు ఏర్పాటు చేయాలని సంకల్పించటం ముదావహం.
ఆంధ్రప్రదేశ్’లో పుట్టి పెరిగిన ఎందరో చిత్రకళారాధకుల గురించిన సంక్షిప్త పరిచయాలు, వారి ఫొటోలతో పాటు వారి చిత్రాలను కూడా సేకరించి గతంలో కళాసాగర్ “ఆంధ్రకళాదర్శిని’ ముద్రించారు. ఇప్పుడు మరింత విపులంగా “ఆంధ్ర శిల్ప చిత్రకళా శిఖరాలు’ పేరుతో ఒక గ్రంథాన్ని తీసుకురావటం చాలా ఆనందంగా ఉంది. సుంకర చలపతిరావు ఇందుకోసం చేసిన కృషి, పడిన శ్రమ కళ్లకు కడుతోంది. వెల్లటూరి పూర్ణానందశర్మ, సంజీవదేవ్ ఇంకా ఇతర పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతో కళారచయితగా శ్రీ చలపతిరావు ఎందరో చిత్రకళాకారుల పరిచయాలను ఈ పుస్తక రచనకు ఉపయోగించుకున్నారు. వ్యక్తిగత పరిచయం కూడా ఉ ండటాన ఆయా చిత్రకారుల గురించి, వారి చిత్రకళారీతి గురించి కూడా పరిచయం చేయగలిగారు. ఇది ఒక మంచి ప్రయత్నంగా భావిస్తున్నాను. చిత్రకారుడి గురించి, చిత్రకళ గురించి చక్కని విశ్లేషణ ఈ పుస్తకంలో కనిపిస్తుంది.
చిత్రకళను ఆస్వాదించే హృదయం కావాలి. సామాన్యుడు కూడా ‘ఆహా!’ అని నివ్వెరపోయే విధంగా చిత్రకళాఖండాలు సామాన్య ప్రజలకు చేరువ కావాలి. అందుకు ప్రభుత్వపరంగానూ, ప్రజలపరంగానూ, చిత్రకారులపరంగా కూడా గట్టి పూనిక ఉండాలని భావిస్తున్నాను. చిత్రకారులు కళాచైతన్యంతో తమ ఉనికిని సమస్త ప్రపంచానికీ చాటుకునే విధంగా తమని తాము తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు కూడా అవసరం.
ఇటీవలి కాలంలో గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక పక్షాన చిత్రకళాప్రదర్శనలు ముమ్మరంగా జరిగాయి. ప్రజలు తెలుగు చిత్రకళాఖండాలను చూసి ఆనందించారు. చిత్రకళని అవగాహన చేసుకుని ఆస్వాదించటం అనేది ఆ విద్యలోనే కళలను ఆస్వాదించే విషయంలో అవగాహన కల్పించే పాఠ్యాంశాలు కల్పిస్తే రేపటి తరంలో కళాదృష్టి పెంపొందించటం సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను. లలిత కళలను ఆస్వాదించి అభినందించటం (అప్రిసియేషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) అనేది చాలా ముఖ్యమైన విషయం. సుంకర చలపతిరావుగారు “ఆంధ్ర శిల్ప, చిత్రకళా శిఖరాలు” పుస్తకంలో ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చారు. వారికి నా అభినందలు.
– డా. మండలి బుద్ధప్రసాద్