(నేడు చిత్రకారుడు పి.యస్. ఆచారికి ఆచార్య రాజాజీగారి స్మారక పురస్కారం ప్రదానం)
ఆచార్య మాదేటి రాజాజీ గారు రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని పునరుజ్జీవింప చేసినటువంటి వ్యక్తి. వరద వెంకటరత్నం గారు దామర్ల రామారావుగారి ఆర్ట్ గాలరిని నిర్మించి రామారావు గారి కళను శాశ్వతమయ్యేటట్లు కృషి చేశారు. వారి శిష్యుడైనటువంటి మాదేటి రాజాజీ గారు చక్కని ఆర్టిస్టుగా గుర్తింపు పొందే సమయంలో బొంబాయిలో ఉంటూ శాంతారాం వంటి హిందీ డైరెక్టర్ దగ్గర ఆర్ట్ డైరెక్టర్లు పని చేసే అవకాశం వచ్చిన సమయం లోనే వరదా వెంకటరత్నంగారు ఆయన వృద్ధాప్యంలో రాజా… నువ్వే ఈ గ్యాలరీని చూసుకోవాలి, వచ్చేయ్ అని శాసించారు. గురువుగారు మాటను శిరోధార్యంగా తలచి రాజాజీ మాస్టారు గొప్ప అవకాశాలను వదిలిపెట్టుకుని గాలరీలో ప్రిన్సిపాల్ గా అనేక సంవత్సరాలు పనిచేసి ఎందరో శిష్యులను గొప్ప చిత్రకారులుగా తీర్చిదిద్దారు. అదే సమయంలో ఆర్ట్ గ్యాలరీ మరియు ఆర్ట్ స్కూల్ ఈ రెండు విభాగాలు ఒకే గ్యాలరీలో ఉండేవి కానీ ఈ రెండు విభాగాలు ఒకటి పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్లోనూ మరొకటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కీ చెందినవిగా ఉన్నాయి. ఈ రెండు వేరు వేరు డిపార్ట్మెంట్ల వల్ల ఆ గ్యాలరీని పట్టించుకునే నాధుడు లేకపోయారు. ఆ ప్రిన్సిపాల్ పోస్టులో అనేక సంవత్సరాలు తన జీవితాన్ని ధార పోస్తూ కృషి చేస్తున్న ఆయనకి అనేక సంవత్సరాలు ఆయనకు జీతం లేకపోయినా అదే గ్యాలరీను అంటిపెట్టుకొని గురువుగారి మాటలు తలదాల్చి ఎంతో నష్టానికి కష్టానికి ఓర్చుకున్నారు. జీతం లేకపోయినా సరే అలాగే పని చేశారు. రాజాజీ గారు 1937లో జన్మించారు. 1990లో పరమపదించారు. మొదటిలో జీవనం ఆయనకి పెద్ద నగరాల్లో ఉన్నప్పుడు ఆయనకి బాగానే సాగింది. రాజమండ్రి వచ్చాక ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. Bombay J.J SCHOOL OF ARTS లో డిగ్రీ పొంది అనేక శైలులలో అనేక చిత్రాలు చిత్రించారు. మన రాజమండ్రి సాంప్రదాయంగా సాంప్రదాయ శైలిని రామారావు గారు ప్రతిపాదించిన సాంప్రదాయ శైలిని, అదే విధంగా ఆధునిక శైలిలోనూ అనేక చిత్రాలు చిత్రించారు. తాంత్రిక శైలిలో చిత్రాలు చేసి ఒక ప్రదర్శన ఏర్పాటు చేయాలని జగన్మాత అమ్మవారి తాంత్రిక తత్వాన్ని ఆకలింపు చేసుకుని చిత్రాలు మొదలుపెట్టి ఒక మూడు చిత్రాలు వేసిన తర్వాత ఆయనకు మరణం సంభవించింది. లేకపోతే ఆయన అందులో ఒక గొప్ప స్థాయిని చేరుకునేవారు.
వీరు చిత్రించిన చిత్రం రాజరాజ నరేంద్రునికి నన్నయ “మహాభారతాన్ని రాసి అంకితమిస్తూన్న చిత్రం. నన్నయ్య మహభారతాన్ని రాజుగారు చేతికి అందిస్తున్నట్లుగా చిత్రించారు. అప్పుడు ఆ చిత్రంలో ఆయన చూపిన భావం మహారాజా అయినటువంటి రాజరాజ నరేంద్రుడు నమ్రతతో వంగి ఉంటే నన్నయ్యగారు చక్కగా ఠీవీగా నిల్చుని ఉంటారు. అంటే ఒక మహారాజు పదవి కంటే చరిత్రను తీర్చిదిద్దిన కవే గొప్పవాడని ఉద్దేశం. ఈ చిత్రం ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రదర్శితమైంది.
కానీ వారి జీవితమంతా ఎన్నో కష్టాలకి లోనై ఆయన జీవితమంతా గ్యాలరీకి అంకిత మైనది. అంత గొప్ప త్యాగమూర్తికి మన రాజమహేంద్రి సొంత ఊరు కావడం రాజమహేంద్ర ప్రజలకు ఒక గర్వకారణం. కానీ వారి జీవితంలో చీకటులను తొలగించే సాహసం మాత్రం ఎవరూ చేయలేదు. అటువంటి మహానుభావుని శిష్యులుగా మేము తలుచుకుంటూ ఒక చిన్న నివాళి కార్యక్రమంలో ఆయన స్మారక బహుమతిని ఒక ప్రముఖ చిత్రకారులకు అందించాలని తపనతో ప్రతి సంవత్సరము కార్యక్రమం చేస్తూ వస్తున్నాము. మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడెమి మరియు భగీరదీ ఆర్ట్ ఫౌండేషన్ సమ్యుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
నేడు రాజమహేంద్రవర ప్రఖ్యాత చిత్రకారులు, రాజాజీ మాస్టారి శిష్యులు పి.యస్.ఆచారిగారు మాదేటి రాజాజీగారి స్మారక పురస్కారం 5000/- రూ.లు, సన్మానము అందుకున్నారు. దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం (02-10-2022) ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.
ఎన్.వి.పి.ఎస్. లక్ష్మి
కళలను ప్రోత్సహిస్తున్న కళా సాగర్ గారికి ధన్యవాదములు.