(గాంధి జయంతి రోజున విజయవాడలో గాంధిజీ జీవితం-చిత్రకళా ప్రదర్శన)
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయిన సందర్భంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపై నడిపిన మహాత్ముడు గాంధిజీ చిత్రాలతో విజయవాడ కల్చరల్ సెంటర్ ఆర్ట్ గ్యేలరీలో ఒక ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2న ఆదివారం ప్రారంభమయ్యింది.
మండలి ఫౌండేషన్, కొలుసు ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు ఎన్. తులసీ రెడ్డి ముఖ్య అతిథిగా, సభాధ్యక్షులుగా ప్రముఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డి, ప్రత్యేక అతిథిగా తమ్మా శ్రీనివాస రెడ్డి, చిత్రకళా అతిథిగా న్యాయనిర్ణేత వై. శేషబ్రహ్మం, మాజీ శాసన సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రదర్శన సందాన కర్త కొలుసు సుబ్రహ్మణ్యం గార్లు పాల్గొన్నారు.
ముఖ్య అతిథి ఎన్. తులసీరెడ్డి గారు మాట్లాడుతూ గాంధీ ఇజం నేటికీ, ఏనాటికీ వుంటుందన్నారు. అందుకే గాంధి ప్రపంచ వ్యాపితంగా ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రదర్శనలో గాంధిజీ జీవితంలోని అనే సంఘటనలను తమ చిత్రాలలో చూపించిన చిత్రకారులను అభినందించారు. అనతరం బుద్దప్రసాద్ గారు మాట్లాడుతూ గాంధిజీ అంటే తమ తండ్రిగారికి ప్రత్యేక అభిమానమన్నారు. అందుకే మండలి వెంకట కృష్ణారావు గారి వర్థంతి సందర్భంగా ఈ పోటీలు నిర్వహించామన్నారు. తెలుగు చిత్రకళా కీర్తిని దశ దిశల వ్యాప్తి చేసిన వారిలో దామెర్ల రామారావు గారి లాంటి చిత్రకారులెందరో వున్నారన్నారు. మన తెలుగు సంస్కృతి – సంప్రదాయాలపై ఒక ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన నిర్వహించే ఆలోచన చేయాలన్నారు. ప్రత్యేక అతిథి, పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన శేష బ్రహ్మంగారు మాట్లాడుతూ ప్రదర్శనకు మంచి చిత్రాలు వచ్చాయన్నారు. ఇలాంటి ప్రదర్శనలు చిత్రకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు చక్కని వేదికన్నారు.
అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 30 మందికి పైగా చిత్రకారులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో మొదటి మూడు బహుమతులు వరుసగా దివాకర్ మహారాణా (విజయవాడ), కందిపల్లి రాజు(రాజమండ్రి), కొండా శ్రీనివాస్ (హైదరాబాద్) అందుకున్నారు. హైలీ టాలంటెడ్ ఆర్టిస్ట్స్ అవార్డ్స్ (రూ. 1000/- నగదు) పదిమంది చిత్రకారులు అందుకున్నారు.
పాల్గొన్న చిత్రకారులందరినీ భారత దేశ ప్రముఖ ఆర్టిస్టుల ఆవార్డులతోనూ. ప్రముఖ జాతీయ నాయకుల స్మారక ఆవార్డులతోనూ సత్కరించి, మెమెంటో అందజేశారు.
–కళాసాగర్
good programme