వెండితెర ‘వీరమాత’… కన్నాంబ

(నేడు పసుపులేటి ‘కన్నాంబ’ జయంతి)

నాటకం రసవత్తరంగా సాగడం లేదు. నడవాల్సిన విధంగా సన్నివేశం నడవడం లేదు. నటించాల్సిన విధంగా పాత్రధారులు ఎవరూ నటించడం లేదు. అందులోనూ అది రోహిణీ కార్తె. పేరుకు మాత్రమే అది రాత్రి కానీ, వేడి, ఉక్క మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోజంతా భానుడి ప్రతాపానికి బలైపోయిన ప్రజలు, రాత్రివేళ, అంత ఉక్కబోతలోనూ ఆ నాటకం చూసి కొంతలో కొంత సేదతీరుదామని కొండంత ఆశతో వస్తే, ఇదుగో… ఈ హరిశ్చంద్ర నాటకం… ఇలా… చప్పగా… చేదుగా… సాగుతోంది. ప్రేక్షకులందరికీ విసుగూ, చిరాకూ క్షణక్షణానికీ పెరిగిపోతున్నాయి. ఇంతలో ఇంకొక విచిత్రం జరిగింది.

చంద్రమతి పాత్రధారి రంగస్థలం పైన శోకాన్ని అభినయించడం ప్రారంభించాడు. అతగాడి అభినయం చూసి, దుఃఖంతో వివశులైపోవాల్సిన ప్రేక్షకజనంలో కొందరు పగలబడి నవ్వారు. క్షణాలలో ప్రేక్షకులందరూ నవ్వడం ప్రారంభించారు. నాటకశాల అంతా నవ్వుల వేదికైపోయింది.

చంద్రమతి పాత్రధారి ప్రేక్షకుల హేళనను భరించలేకపోయాడు. ఆవేశంలో తన పాత్రను మరచిపోయాడు. కోపంతో ఊగిపోతూ గట్టిగా అరిచాడు. నా అంత మహానటుడ్ని, చూసి నవ్వుతున్నారా మీరు? ధైర్యముంటే, మీలో ఎవరైనా ముందుకొచ్చి, నటించి చూపించండి, లేదా మీరందరూ నోటికి తాళం వేసుకోండి అంటూ రంగస్థలంపై నుండి అరుస్తున్నాడు.

అన్నివందల మంది ప్రేక్షకులూ ఒక్క సారిగా మౌనం వహించారు. చీమచిటుక్కు మన్నా వినిపించే పరిస్థితి అది. ఎవరికీ ఏంచేయాలో తెలియడం లేదు. ప్రేక్షకుల అధైర్యం చూసి రంగస్థలంపై నున్న చంద్రమతి పాత్రధారి విజయదరహాసం చేస్తూ…

ఏం… ఎవరూలేరా… మీలో ఎవరూ లేరా? చంద్రమతి పాత్ర పోషించగలిగే మగాళ్ళు ఎవరూ లేరా? అంటూ గట్టిగా అరుస్తూంటే, ఉన్నాను… నేనున్నాను… అంటూ ఓ స్వరం వినబడింది.

ఆ స్వరం వినబడగానే ప్రేక్షక జనమందరూ ఆశ్చర్యంతో వెనక్కి చూశారు. ప్రక్కకి చూశారు. ముందుకు చూశారు. తాము విన్నది నిజమేనా అని మరీ… మరీ … చూశారు. రంగస్థలంపై ఉన్న నటుడికి కూడా అది లీలగా వినబడింది. దాంతో అతగాడు మరింత రెచ్చిపోయాడు. ఎవరు? ఎవరది? అంటూ గట్టిగా గద్దించాడు. ఎడమవైపు మండపం ప్రక్కనున్న స్తంభం దగ్గర కూర్చొన్న, ఓ అమ్మాయి లేచి నిలబడింది. దగ్గర్లో ఉన్నవాళ్ళు గబగబా అగ్గిపుల్లలు గీసి, ఆ వెలుగు ఆమె ముఖం దగ్గరకీ పెట్టారు.

పదహారేళ్ళ పడుచు. యవ్వనంలో అడుగుపెడుతున్న అందమైన రూపం, గ్రామీణ జీవనంలో కన్పించే ఓ వినమ్రత సహృదయం, సౌజన్యం అన్నింటికీ మించి, వెలుగుతున్న నక్షత్రాల వంటి ఆ కళ్ళు …. ఆ కళ్ళలో కన్పించే అనంతాంబరపు ఆలోచనా పథాలు … స్పష్టమైన నాసిక, పట్టుదల సూచించే నుదురు… ఆ అమ్మాయి వేదికవైపు నడిచింది. ప్రేక్షకులందరూ తప్పుకొని దారి ఇచ్చారు. రంగస్థలం సమీపించింది. మనసులో ఒక్కసారి నటరాజుకు నమస్కరించింది. రంగస్థలంపై ఎగిరి దూకింది.

ఆనాడు రంగస్థలంపై ఎగిరిదూకిన ఆ అమ్మాయే! ఆ పదహారేళ్ళ జవ్వనే! నాట్యకళా విశారద పసుపులేటి కన్నాంబ. అది జరిగింది దాదాపుగా 1926వ సంవత్సరం. ఆ రోజుల్లోనే పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడింది. అంతవరకూ కృష్ణాలో ఉన్న ఏలూరును పశ్చిమగోదావరికి ముఖ్యపట్టణం చేశారు. అదిగో… ఆ ఏలూరులోనే ఈ కథంతా జరిగింది.

ఇంతకీ రంగస్థలం మీద ఆ తరువాత ఏంజరిగిందో నేను చెప్పనేలేదు కదా! చంద్రమతి పాత్రలో ఆమె నటన అద్భుతంగా సాగింది. రంగస్థలంమీద పాత్రలో ఆమె కరిగిపోయింది. సమస్త ప్రేక్షకులూ కరుణ రసంలో తడిసిపోయారు. అదొక అపూర్వమైన ఘట్టం. అంతవరకూ అన్ని అరుపులూ అరిచిన చంద్రమతి పాత్రధారి అవాక్కయిపోయాడు. చేతులు జోడించి వినమ్రంగా నిలిచాడు. మరునాటి నుండే కన్నాంబ ఆనాటక సంఘంలో సభ్యురాలైపోయింది. ఎన్నెన్నో గొప్ప పాత్రల్ని పోషించడం ప్రారంభించింది.

కన్నాంబ ఎప్పుడు జన్మించింది ? నిజానికి ఇది చాలా పెద్ద ప్రశ్న. కొందరు ఆమె 1910లో జన్మించింది అనీ, మరికొందరు ఆమె జన్మ 1912లో అనీ, మరికొందరు ఆమె 1913లో జన్మించిందనీ పేర్కొన్నారు. పేర్కొంటున్నారు కూడా! వారి మాటల్ని, వారి వ్రాతల్ని కాదనడం లేదు, వాటిని అంగీకరిస్తూనే ఇంకా ఏదైనా మంచి ఆధారం దొరికే అవకాశం ఉందా అని ప్రయత్నించినప్పుడు, ఓ ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది.

1949వ సంవత్సరం అక్టోబర్ నెలలో “పేస్సుమ్పదమ్” అనే తమిళ సినీపత్రికకు పసుపులేటి కన్నాంబ ఓ ఇంటర్వ్యూ వచ్చింది. అందులో అనేక విషయాలు ముచ్చటిస్తూ, తన జననం 1911వ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీ అని ఆమె స్వయంగా వెల్లడించిందట. ఈ విషయాన్ని ఈ మధ్యనే ది హిందూ ఆంగ్ల దినపత్రికలో ప్రచురించారు.

తిరుమలలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి తొలిగడప వంటిది కడప. ఎందరెందరో మహానుభావులకు జన్మస్థలం కడప. అటువంటి కడపలో లోకాంబ, వెంకటనరసయ్య దంపతులు గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించింది కన్నాంబ. కడపలో జన్మించినా, కన్నాంబ బాల్యం పశ్చిమగోదావరిలోని ఏలూరులో సాగింది. ఆమె తాత ఆయుర్వేద వైద్యుడు. అమ్మమ్మ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేది. వారిద్దరిదీ అనుకూల దాంపత్యం. వారి ఆదరణలో పెరిగిన కన్నాంబ పై వారి ప్రభావం ఎంతో ఉంది. పైగా తాతగారి పాండిత్యం, సంగీతజ్ఞానం కూడా ఆబాలికను ఎంతగానో తీర్చిదిద్దాయి.

అనసూయ, సావిత్రి, యశోద వంటి గొప్ప పాత్రల్లో కన్నాంబ ప్రతిభ శతవిధాల కన్పించింది. పరిపూర్ణమైన రూపసంపద, స్వరబేధాలను విస్పష్టంగా చూపగల వాక్పటిమ, మధురాతి మధురమైన గానసంపద ఇలా ఈ త్రిశక్తులతో కన్నాంబ త్రివేణీ సంగమంలా, ప్రేక్షకులకు ఆరాధ్యనీయమూర్తిగా అనతికాలంలో గణుతి కెక్కింది. కన్నాంబ నటనా ప్రతిభకు అద్దంపట్టిన మరో గొప్పనాటకం రంగూన్ రౌడీ. మహా నటుడు దొమ్మేటి సూర్యనారాయణతో కలిసి వందలాది ప్రదర్శనలిచ్చి, రంగూన్ రౌడీ నాటకానికి ప్రాణప్రతిష్ట చేసింది కన్నాంబ.

1934వ సంవత్సరం ఏప్రిల్ నెల. అది ఆమెకు ఇరవై మూడవ ఏడు. వివాహానికి ఎదిగిన వయసు. నాటకసంస్థ నిర్వాహకులు, సహృదయులు అయిన కడారు నాగభూషణంతో ఆమె మనసు కలిసింది. వారిద్దరూ ఓ ఇంటివారయ్యారు. సాధారణంగా నటీమణుల జీవితాల మీద భాగస్వామి ప్రభావం ఎంతో ఉంటుంది. వివాహం అయ్యేక నటనసాగిస్తూ, నిలద్రొక్కుకోవడంలో జీవనభాగస్వామి పాత్ర ఎంతో ఉంటుంది. అందులో మోసపోయిన విధివంచితులు ఎందరో ఉన్నారు. విజయ హాసంతో జీవనసాగరాన్ని దాటి విశ్రాంతిగా నిలచిన వారూ మరెందరో, కన్నాంబది ఈ రెండో తరగతి. నాగభూషణం వివాహం కన్నాంబ నటజీవితాన్ని మరింతగా పండించింది. వారిద్దరూ కలసి వారి స్వంత నాటకసమాజాన్ని స్థాపించారు.
అదే సుప్రసిద్ధమైన శ్రీరాజరాజేశ్వరీ నాట్యమండలి. నాటకరంగంలో కన్నాంబ పేరు ఎంతగా ప్రసిద్ధికెక్కిందంటే ఆమెతో ఒక్కపాత్రనైనా నటించాలని కోరుకోని నటుడు. ఆమె ఆలపించే ఒక్కపద్యానికైనా, గీతానికైనా సంగీత సహకారం అందించాలని ఆశించని కళాకారుడు లేరంటే అతిశయోక్తి కాదు.

ముఖ్యంగా అనసూయ, చంద్రమతి పాత్రల్లో ఆమె ప్రతిభ అనన్యసామాన్యం. మరీముఖ్యంగా చంద్రమతి పాత్రలో ఆనంద, విషాద, శోక, కరుణ, రస ఘట్టాలలో కన్నాంబ చూపిన మహోన్నతమైన నటన, ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసి, ఏదో అలౌకికమైన భావనా స్థితిలోకితీసుకువెళ్ళిపోయేదిట. నాటకం పూర్తయిన నాలుగు అయిదు రోజుల వరకూ ప్రేక్షకులు ఆ పరిస్థితిలోనే ఉండేవారని మహానటులు మల్లాది సూర్యనారాయణ గారు నాతో ముఫ్ఫై అయిదేళ్ళ క్రిందట ఓసారి మాటల్లో అన్నారు.

కన్నాంబ నటజీవితం మరోమలుపు తిరిగింది.
స్టార్ కంబైన్స్ అధినేత ఎ. రామయ్య చలనచిత్రం నిర్మించదలచి ఆమెను కలవడం, ఆమె అంగీకరించడం, కొల్హాపూర్లోని శాలినీ సినీ టౌన్ లోహరిశ్చంద్ర చిత్రం రూపు దిద్దుకోవడం వెనువెంటనే జరిగాయి. ఆ తరువాత సరస్వతీ టాకీ కంపెనీ, బెజవాడ వారి ఆధ్వర్యంలో అదే కొల్హాపూర్లో సుప్రసిద్ధ చలనచిత్రం ద్రౌపదీ వస్త్రాపహరణం రూపు దిద్దుకొంది. అందులో ఆమె ద్రౌపదిగా తన విశ్వరూపాన్ని చూపింది. వేల్ పిక్చర్స్ వారి కనకధారతో, కన్నాంబ అగ్రశ్రేణి నటిగా ఎదిగింది. తెలుగు చలనచిత్ర పితామహుడిగా చెప్పుకోదగ్గ హనుమంత రెడ్డి మునియప్పరెడ్డి, హెచ్.ఎమ్. రెడ్డి)తో కలసి, గృహలక్ష్మితో నిర్మాణరంగంలో కాలుమోపింది. ఆతరువాత జయా ఫిలిమ్స్ వారి కాళిదాసులో నటించింది.

పాత్రపోషణలో కన్నాంబ చేసిన కృషి తెలుసుకొంటే,ఆమార్గాన్ని అనుసరించగలిగితే, నటనతో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు. 1940లో భవానీ ఫిలిమ్స్ చండిక చిత్రం తీసారు. అందులో కన్నాంబ చండిక పాత్ర నటించింది. అది అంతవరకూ ఆమె నటించిన పాత్రలు అన్నిటి కన్నా, భిన్నమైనది. కోపం ఆక్రోషం, ఆవేశం, క్రౌర్యం ముప్పిరిగొన్న పాత్ర అది. అందులో కన్నాంబ నటన మాటల్లో చెప్పలేనిది. ఆ చిత్రంలో చిరుతపులులతో నటించాలి. ఇలా స్త్రీలు క్రూరజంతువులతో నటించిన తొలి చిత్రం చండికే. అయితే అందులో చిరుతపులులతో సహజత్వాన్ని కోల్పోకుండా నటించడం కోసం, రోజూ ఖాళీ సమయాలలో పులులకి ఆహారం వేస్తూ, వాటిని మచ్చిక చేసుకొంటూ నటించే దంటే, ఒక్కసారి ఊహించండి, నటనపై ఆమె కున్న శ్రద్ధ, పాత్రపోషణలో ఆమెకున్న ఆసక్తి.

రంగస్థలం మీద ఆమె రాణి, వెండితెరపై ఆమె రారాణి. తెలుగు, తమిళ చిత్రసీమలు ఆమెకు జేజేలు పలికాయి. గారాబు చెల్లెలుగా, ప్రేమను పంచిన సహోదరిగా, అనురాగంగా పంచిన ధర్మపత్నిగా, అక్కున జేర్చుకొన్న అమ్మగా, కోడల్ని ఆరడి పెట్టే అహంకారి అత్తగారుగా, సకల సంపదలతో తులతూగే మహారాణిగా, అతి దీనస్థితిలో బ్రతుకుతున్నా ఆత్మాభిమానం కోల్పోని ఆదర్శగృహిణిగా సమస్త పాత్రల్నీ అభినయించి, సకల ప్రేక్షకుల హృదిని దోచిన నాట్యకళావిశారద కన్నాంబ.

నటిగా ఆమె ఎంత విఖ్యాతురాలో, అంతకన్నా ఘనతరమైన కీర్తి ఆమెకు ఆమె పాడిన గ్రామఫోన్ రికార్డుల వల్ల వచ్చింది. ఆమెపాడిన ఎన్నో గీతాలు సమస్త దక్షిణ భారతదేశాన్నే సంగీత సాగరంలో ఓల లాడించాయి. కృష్ణం భజే రాధా అన్న ఆమెగీతం ఒక్కటి చాలు. ఆమె నామాన్ని చిరస్థాయిగా నిలపడానికి. ఏమే ఓ కోయిలా, అక్షయ లింగవిభో వంటి పాటలు అశేషమైన జనా దరణను స్వంతం చేసుకొని, గ్రామఫోన్ కంపెనీకి కనకవర్షాన్ని కురిపించాయి.

కన్నాంబ నిర్మించిన నవజీవనం 1949లో ఉత్తమ చిత్రంగా ఎంపికై, ఆ దంపతులు మద్రాసు ప్రభుత్వం చేత ఘనంగా సత్కరించ బడ్డారు. ఆంధ్రనాటక కళాపరిషత్ కూడా ఆ దంపతుల్ని ఎంతో సత్కరించింది.

ఎంతో కీర్తిని, ఎంతో సంపదను అందు కొన్న మహానటి కన్నాంబ. రెండు చేతులా సంపాదించినా, ఆమెలో గర్వాహంకారాలు తలెత్త లేదు. ఈర్ష్యాసూయలు నిలబడలేదు. అవసరమైన వారికి ఎన్నో విధాలా సహాయ పడింది. ఆర్తుల్ని ఆదుకొంది. ఆపన్నులకు స్నేహ హస్తం అందించింది. వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితుల్ని ఓదార్చింది. చేతికి ఎముకలేకుండా దానధర్మాలు చేసి. నిలిచింది.

అందుకే 1964వ సంవత్సరం మే నెల ఏడవ తేదీ తెల్లవారు ఝామున 4.40కి భౌతిక ప్రపంచాన్ని వీడి, స్వర్గస్తురాలైనప్పుడు తెలుగు, తమిళ, కన్నడ ప్రపంచంతో పాటుగా, యావత్తు నాటకరంగం, అంతకుమించి అశేష ప్రజానీకం తమ రక్తసంబంధీకురాల్ని కోల్పోయినట్లుగా విలపించారు. మధురస్మృతుల్ని గుండెల్లో పదిలపరుచుకొంటూ నటీశిరోమణికి చేతులెత్తి జోహార్లర్పించారు. చాలామంది నాటకాభి మానులు ఆమె మరణించిన పదవరోజున కృష్ణా, గోదావరి నదుల్లో పుణ్యస్నానాలు చేసి, మరణించిన కన్నాంబ దివ్యస్మృతికి ధర్మోదకాలు సమర్పించారట. కేవలం రక్తసంబంధీకులు చనిపోయినప్పుడు ఇచ్చే ధర్మజలసమర్పణ, ఏ సంబంధంలేని ఓ నటికి అన్ని వందల, వేల మంది ఎందుకు సమర్పించారు? ఎలా సమర్పించారు? అదే నాటకం చెప్పే సత్యం. ఈ భవభందాలకన్నా,
ఈ రక్తసంబంధాలకన్నా, ఈ బంధుత్వాలకన్నా,ఈ చుట్టరికాలకన్నా గొప్ప బంధం, గొప్ప అనుబంధం నాటక నటనానుబంధం. దానికి కులం లేదు, మతం లేదు, గొప్ప తక్కువలు లేవు, భాషాబేధాలు, ప్రాంతీయ బేధాలు లేనేలేవు. ఉన్నదల్లా ఒక్కటే. అదే ప్రేమబంధం. అది పొందిన ,నటీనటుల బ్రతుకు ధన్యం, చిరస్మరణీయం.

అమ్మా! కన్నాంబా! అందుకే నీవు ధన్యురాలివి, చిరస్మరణీయురాలివి. నీనటనా ప్రతిభకు చేతులెత్తి నమస్కరిస్తూ, ప్రేమతో పలుకరిస్తున్నాం.

వాడ్రేవు సుందర్రావు
(నంది, గరుడ అవార్డుల గ్రహీత)
సెల్: 93964 73287

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap