(జూలై 14, ఎం.ఎస్. విశ్వనాథన్ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…)
సంగీతమనేది మానవుడికి భగవంతుడు ప్రసాదించిన వరం. అది ఒక అద్భుతం! సృష్టిలో దాని స్థానం అద్వితీయం. ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి యెలాంటి భావాలకైనా అద్దంపట్టేది సంగీతమే. వేదాలు కూడా సంగీత స్వరాలే. రాళ్ళనుకూడా కరిగించే గాంధర్వం సంగీతం. సంగీతం సాధించలేనిది యేదీ లేదు… యెందుకంటే స్వరాల ప్రభావం అమోఘం కనుక. “రాగస్వరశ్చ తాళశ్చత్రిభి: సంగీత ముచ్త్యతే” అని మన సంగీత శాస్త్రం చెబుతోంది. రాగం, తాళం, స్వరం సమ్మిళితమైనప్పుడు శ్రావ్యమైన సంగీతం ఉద్భవిస్తుంది. చలనచిత్ర సంగీతాన్ని జనరంజక సంగీత రూపంగా వర్గీకరించవచ్చు. అటువంటి సంగీతానికి శాశ్వతత్వాన్ని అందించిన స్వర్ణయుగపు సంగీత సామ్రాట్ “యమ్మెస్వి” అని అభిమానంగా పిలిపించుకున్న కళామతల్లి కంఠాభరణం ఎం.ఎస్. విశ్వనాథన్. జూలై 14, 2015 న పరమపదించిన విశ్వనాథన్ పన్నెండు వందల సినిమాలకు పైగా అద్భుతమైన సంగీతాన్ని అందించిన కలైమామణి. ఆ స్వరమాంత్రికుని గురించి కొన్నివిశేషాలు…
సంగీత ప్రపంచంలో తొలి అడుగులు…
యమ్మెస్వి అసలుపేరు ‘మనయంగత్ సుబ్రమణియన్ విశ్వనాథన్’. కానీ దక్షిణ భారత చలనచిత్ర రంగానికి అతడు ‘యమ్మెస్వీ’ గానే సుపరిచితులు. కేరళ రాష్ట్రం పాలక్కాడుకు దగ్గరలో వున్న ఎలప్పళ్ళి గ్రామంలో నారాయణ కుట్టి, సుబ్రమణియన్ దంపతుల యేడుగురు సంతానంలో తను ఒకడు. ప్రాధమికవిద్యను పల్లికున్ను లో పూర్తిచేశారు. పెరిగింది మలబారులోని కణ్ణనూరులో జైలు వార్డెనుగా పనిచేసిన తాతగారివద్ద. స్కూలు ఎగ్గొట్టి ప్రముఖ కర్ణాటక విద్వాంసుడు నీలకంఠ భాగవతార్ ఇంటిముందు నించుని ఆయన ఆలపించే కీర్తనలు, విద్యార్ధులకు బోధించే సంగీత పాఠాలు శ్రద్ధాసక్తులతో వినేవారు. ఒకసారి జైలు ఖైదీలు హరిశ్చంద్ర నాటకం వేస్తే అందులో యమ్మెస్వి లోహితాస్యుడుగా వేషం కట్టారు. ఆ నాటకంలో తొలిసారి గళం విప్పి పాడితే మనవడి అభిరుచికి ముచ్చటపడి తాతగారు ఆ నీలకంఠ భాగవతార్ వద్దే సంగీత పాఠాలు నేర్పించారు. హార్మోనియం చక్కగా వాయించే యమ్మెస్వి తన పదమూడవ యేటనుంచే లెఖ్ఖకు మించి సంగీత కచేరీలు చేసేవారు. తొలి ప్రదర్శన త్రివేండ్రం లో ఇవ్వడం జరిగింది. గంటలకొద్దీ సాగే ఆ సంగీత కచేరీలు చేస్తున్నప్పుడు ఆతనికి సినిమాల్లో పాడాలనే అభిలాష కలిగింది. నాటి తమిళ సూపర్ స్టార్ త్యాగరాయ భాగవతార్ పాటలంటే యమ్మెస్వి చెవికోసుకునేవారు. అలాగే సుబ్బులక్ష్మి నటించి గానం చేసిన ‘సావిత్రి’, ‘శకుంతల’, ‘మీరా’ సినిమాలను యెన్నిసార్లు చూశారో లెఖ్ఖేలేదు. తిరువూరులో వున్న మేనమామ యల్లార్జి నాయుడు సిఫారసుతో జూపిటర్ సంస్థ అధినేతలు సోమసుందరం, మొహియుద్దీన్ లను యమ్మెస్వి కలిశారు. వారు ‘కణ్ణగి’ సినిమా తీసేందుకు మద్రాసుకు వెళుతూ యమ్మెస్వి ని కూడా వారితో తీసుకెళ్ళారు. అలా మద్రాసులో యమ్మెస్వి తొలి అడుగు పడింది. ‘కణ్ణగి’, ‘మహామాయ’, ‘కుబేర-కుచేల’ వంటి తమిళ చిత్రాలకు యమ్మెస్వి ఆఫీస్ బాయ్ గా, ఆర్కెస్ట్రా సహాయకుడుగా, చిన్నచిన్న వేషాల నటుడిగా పనిచేశారు. సంగీతంపై మక్కువతో సంగీత దర్శకుడు యస్వీ. వెంకటరామన్ వద్ద యెన్నో మెళకువలు నేర్చుకున్నారు. ‘కుబేర-కుచేల’ లో తమిళ నటుడు టి.యస్. బాలయ్య నటించినప్పుడు యేర్పడిన పరిచయంతో ఆయన ట్రూపులో చేరి సేలం ప్రాతంలో నాటకాల్లో వేషాలువేస్తూ కొంతకాలం గడిపారు. సేలంలో వున్న మోడరన్ థియేటర్స్ సంస్థకు కె.వి. మహదేవన్ ఆస్థాన సంగీతదర్శకులు. ఆయన సెంట్రల్ స్టూడియో సంగీత దర్శకుడు ఎస్.ఎం. సుబ్బయ్యనాయుడుకు యమ్మెస్వి ని పరిచయం చేసి ఆయనవద్ద హార్మొనిస్టుగా కుదిర్చారు. సెంట్రల్ స్టూడియో కూడా జూపిటర్ వారి అధీనంలో ఉండడంతో వారు నిర్మించిన అన్ని చిత్రాలకు హార్మోనిస్టుగా రోజుకు పదహారు గంటలు పనిచేసి యమ్మెస్వి కష్టించి పనిచేసే వ్యక్తిగా మంచిపేరు తెచ్చుకున్నారు. అక్కడే యమ్మెస్వి కు యమ్జీఆర్, అన్నాదురై, కరుణానిధిలతో పరిచమేకాకుండా సి.యస్. జయరామన్, సిఆర్. సుబ్బురామన్, వయోలినిస్టు టి.కె. రామ్మూర్తి లతో కూడా పరిచయం పెరిగింది. వారంతా జూపిటర్ వారి ‘వేళైక్కారి’ (తెలుగులో సంతోషం సినిమా)కి పనిచేశారు. ఎస్.ఎం. సుబ్బయ్యనాయుడు సంగీత దర్శకత్వంలో ‘వీర అభిమన్యు’ సినిమా తయారవు తున్నప్పుడు “పుదు వసంతమే వాళ్విలే” అనే పాటకు యమ్మెస్వి సూచించిన బాణీ నాయుడుకు నచ్చి దానినే రికార్డు చేయించారు. అదే యమ్మెస్వి మట్టు కట్టిన తొలి పాట. యమ్మెస్వి పధ్ధతి మెచ్చుకున్న సుబ్బయ్యనాయుడు ‘విద్యావతి’, ‘రాజకుమారి’ ‘కందన్’ సినిమాల్లో కూడా యమ్మెస్వి చేత కొన్ని పాటలకు బాణీలు కట్టించారు. దాంతో సుబ్బయ్యనాయుడు జూపిటర్ వారికి యమ్మెస్వి ప్రతిభను గురించి చెప్పి ప్రోత్సహించమని సలహాయిచ్చారు. ఆ నేపథ్యంలోనే సి.ఆర్. సుబ్బురామన్ వద్ద యమ్మెస్వి హార్మోనిస్టుగా చేరారు. వయోలనిస్టు రామ్మూర్తితో స్నేహం బలపడింది. సుబ్బురామన్ వద్ద సహాయకుడిగా చాలా సినిమాలకు విశ్వనాథన్ పనిచేశారు.
సంగీత దర్శకునిగా రామ్మూర్తితో…
సి.ఆర్. సుబ్బురామన్, టిఆర్. పాప తనకు సినీసంగీత గురువులని యమ్మెస్వి సగర్వంగా చెప్పుకుంటారు. రామ్మూర్తితో కలిసి సంగీత దర్శకునిగా తొలి చిత్రమే యమ్మెస్వి కి పెద్ద హీరోతో మొదలైంది. మద్రాస్ పిక్చర్స్ వారు శివాజీ గణేశన్, పద్మినిలతో యన్. ఎస్. కృష్ణన్ దర్శకత్వంలో నిర్మించిన ‘పణమ్’ సినిమాకు ఇద్దరూ పనిచేశారు. అందులో ఉడుమలై నారాయణకవి రాయగా యం.ఎల్. వసంతకుమారి పాడిన “కుడుంబత్తిన్ విళక్కు” అనే పాట వీరికి తొలి రికార్డు. అదే సమయంలో గురువు సుబ్బురామన్ హటాత్తుగా మరణించడంతో, అర్ధాంతరంగా ఆగిపోయిన అతని ఆరేడు సినిమాలను విశ్వనాథన్ పూర్తిచేసి గురువుగారి ఋణం తీర్చుకున్నారు. అలా మొదలుపెట్టిన తొలి సినిమా వినోదా వారి ‘దేవదాసు’. ఆ సినిమాలో వున్న మొత్తం పదకొండు పాటల్లో తొమ్మిదింటికి సుబ్బురామనే బాణీలు కట్టివుంచారు. మిగిలిన రెండుపాటలు “జగమే మాయ… బ్రతుకే మాయ”, “ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా”(జావళి) పాటలు విశ్వనాథన్ మట్లు కట్టినవే. 1952లో చంద్ర పిక్చర్స్ వారు న్యూటోన్ స్టూడియోలో ఎం.జి.ఆర్, బి.యస్. సరోజ జంటగా ‘జనోవా’ అనే మలయాళ చిత్రాన్ని ప్రారంభిస్తూ యమ్మెస్విని సంగీత దర్శకునిగా నియమించారు. ఏయం. రాజా, లీల ఆలపించిన “లీలా లోలితమే” అనేదే యమ్మెస్వి రికార్డు చేసిన మొదటి పాట. దీనినే రెండు నెలల తరువాత తమిళంలో కూడా నిర్మించారు. దివంగత సుబ్బురామన్ సినిమాల రికార్డింగు, రీ-రికార్డింగులు పూర్తిచేశాక, ఒకరోజు మిడ్ ల్యాండ్ థియేటర్ లో రామ్మూర్తితో కలిసి సినిమాచూసి మౌంటురోడ్డులో నడుస్తుండగా “శంకర్-జైకిషన్ లాగా మనమిద్దరం జంటగా ఎందుకు మ్యూజిక్ డైరెక్షన్ చేయకూడదు” అని యమ్మెస్వి ప్రతిపాదించగా అందుకు రామ్మూర్తి సమ్మతి తెలుపగా, వారిద్దరూ జత కట్టారు. విశ్వనాథన్-రామ్మూర్తి కలిసి పనిచేసిన తొలి సినిమా 1952 లో ఎ.ఎల్. శ్రీనివాసన్ ఎన్.ఎస్. కృష్ణన్ దర్శకత్వంలో నిర్మించిన ‘పణమ్’. ఇందులో వీరి పేర్లు “రామ్మూర్తి-విశ్వనాథన్” అని వుంటుంది. ఆ తరువాత ‘విశ్వనాథన్-రామ్మూర్తి” గా పేరు మార్చుకొని విజయవంతమైన జంటగా 1965 వరకు 100 సినిమాలకు పైగా పనిచేశారు. తరవాత సి.ఎస్. జయరామన్ సలహామేరకు ఎం.ఆర్. రాధా ప్రతిష్టాత్మక నాటకం ‘రక్తకన్నీరు’ కు బ్యాక్ గ్రౌండ్ సంగీతం సమకూర్చారు. ఇద్దరూ కలిసి పనిచేసిన ఆఖరి సినిమా ‘ఆయిరత్తిల్ ఒరువన్’. వీరి జంట విడిపోయాక 1965-2013 మధ్యకాలంలో విశ్వనాథన్ ఒక్కడే 1100 సినిమాలకు పైగా సంగీత దర్శకునిగా పనిచేశారు. ఇద్దరూ విడిపోయాక దాదాపు 30 సంవత్సరాలవరకు వారిద్దరూ కలుసుకోక పోవడం విచిత్రమే! ఆ తరువాత ఇద్దరూ జతకట్టి 1995లో సత్యరాజ్ చిత్రం ‘ఎంగిరుంతో వందాన్’ సినిమాకు పనిచేశారు. తమిళంలో రామ్మూర్తితో కలిసి సంగీత దర్శకత్వం నిర్వహించిన సినిమాల్లో పుదయ్యళ్, భాగ పిరివినై, తంగ పథుమై, మన్నోడి మణ్ణన్, పాలుమ్ పళముమ్, పాశమలర్, ఆలయమణి, నెంజిల్ ఒరు ఆలయం, పాశం, వీర తిరుమగణ్, నెంజం మరప్పతిల్లై, సర్వర్ సుందరం, కర్ణన్, కాదలిక్క నేరమిల్లై, పణక్కార కుటుంబం, పుదియ పార్వై, ఎంగవీట్టు పిళ్ళై, అన్బేవా, వెన్నీరాడై వంటివి మచ్చుకు కొన్నిమాత్రమే. తెలుగు సినిమాల విషయానికొస్తే సంతోషం, మాగోపి, తెనాలి రామకృష్ణ, కుటుంబ గౌరవం, రాజా మలయసింహ, పెళ్లితాంబూలం మొదలైన సినిమాలకు ఇద్దరూ కలిసి పనిచేశారు.
విడిపోయిన సం(గీత)బంధం…
రామ్మూర్తితో పరిచయం యేర్పడినప్పుడు యమ్మెస్వి వయసు పదిహేనేళ్ళయితే రామ్మూర్తికి ఇరవయ్యేళ్ళు. ఏ ముహూర్తాన ఇద్దరూ కలిసి సంగీతదర్శకత్వ పయనం మొదలెట్టారోగానీ వారు పట్టిందల్లా సంగీతామృతంలా ప్రవహించి అద్భుతాలు సృష్టించింది. అయితే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోవడం బాధాకరమైన విషయమే! అందుకు వేదిక మద్రాసులోని ట్రిప్లికేన్ కల్చరల్ అకాడెమీ కావడం దురదృష్టం. జూన్ 16, 1963న విశ్వనాథన్-రామ్మూర్తి లకు నటుడు శివాజీ గణేశన్ “మెల్లిసై మన్నార్గళ్” (లలిత సంగీత సామ్రాట్టులు)బిరుదులు ప్రదానం చేశారు. హిందూ గ్రూప్ శ్రీనివాసన్, దర్శకుడు శ్రీధర్, చిత్రాలయ గోపు, రామచంద్రన్ ఈ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే ఈ జంట సాన్నిహిత్యాన్ని మాత్రం కొందరు ఈర్ష్యాపరులు జీర్ణించుకోలేకపోయారు. తరవాత 1964లో దర్శకుడు శ్రీధర్ నిర్మించిన ‘కలై కోవిల్’ సినిమా పెద్ద ఫ్లాపయింది. ‘కల్కి’ అనే పత్రిక ఈ సినిమాపై సమీక్ష రాస్తూ విశ్వనాథన్-రామ్మూర్తి ‘కాపీ’ సంగీతం కూడా సినిమా వైఫల్యానికి కారణమని ఘాటుగా విమర్శించింది. 1964 చివర్లో వచ్చిన ‘సర్వర్ సుందరం’ సినిమా అగ్నికి ఆజ్యం పోసింది. ఆ సినిమాలో ఇంటర్వల్ అవగానే వచ్చే “ఆవళి కణ్ణా… అళయిఘ ముఘం ఆవళి కణ్ణా” అనే పాట పల్లవిని విశ్వనాథన్-రామ్మూర్తి మ్యూజిక్ కండక్ట్ చేస్తుండగా చిత్రీకరించి, చరణాలను నగేష్, రమణి తిలకం లమీద తీయాల్సి వుంది. ఏవియం స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ తిలకించేందుకు ప్రఖ్యాత హిందీ చలనచిత్ర సంగీతదర్శకుడు నౌషాద్ వచ్చి స్టూడియో అధినేత మెయ్యప్ప చెట్టియార్ సరసన కూర్చున్నారు. చిత్రీకరణ సమయానికి రామ్మూర్తి రాలేదు. అప్పటికే విశ్వనాథన్ సూట్ ధరించి షాట్ కు రెడీగా వున్నారు. నౌషాద్ ను ఇబ్బందిపెట్టరాదని, అతని సౌకర్యం కోసం మెయ్యప్ప చెట్టియార్ షూటింగు మొదలు పెట్టించారు. దాంతో యమ్మెస్వి ఒక్కడే మ్యూజిక్ కండక్టర్ గా నటించడం జరిగింది. రామ్మూర్తి స్టూడియోకి చేరుకునే సమయానికి షూటింగు పూర్తయిపోయింది. అప్పటికే మెయ్యప్పన్, నౌషాద్ తో కలిసి వెళ్ళిపోయారు. చెప్పుడు మాటలువినిన రామ్మూర్తి యమ్మెస్వి కావాలనే తనను తప్పించాడని నమ్మాడు. తరవాత యమ్జీఆర్ నటించిన బి.ఆర్. పంతులు సినిమా ‘ఆయిరత్తిల్ ఒరువన్’ తో విభేదాలు తారాస్థాయికి చేరి ఇద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఎల్.ఆర్. ఈశ్వరి విషయంలో ఇద్దరికీ భేదాభిప్రాయలు వచ్చాయనేది కూడా ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తూ వుంటారు. ఏది ఏమైనా ఒక గొప్ప జంట విడిపోవడం సంగీత ప్రేమికులను బాధించే విషయమే.
ఒంటి చేత్తో సహస్ర చిత్రాలు…
రామ్మూర్తితో విడిపోయాక యమ్మెస్వి అద్భుతమైన సినిమాలకు అత్యద్భుతమైన సంగీతం అందించారు. తమిళ సినిమాల విషయానికొస్తే చంద్రోదయం, ఎంగపాప, గౌరీకల్యాణం, కుమరిపెణ్, నాడోడి, రాము, పేట్రత్తాన్ పిళ్ళయా, అనుభవిరాజా అనుభవి, బామా విజయం, ఇరుమలర్గళ్, కావల్ కారన్, తంగై, ఎన్ తంబి, గలాటా కల్యాణం, ఎంగవూర్ రాజా, ఒలి విళక్కు, పుదియభూమి, దైవమగణ్, నమ్ నాడు, పూవ తలైయ్య, తిరుడన్, తేడివంద మాపిళ్ళై, మహమ్మద్ బిన్ తుగ్లక్, నీరుం నెరుప్పుమ్, రిక్షాకారన్ వంటి సినిమాలు కొన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే యమ్మెస్వి పనిచేసిన వెయ్యి పైచిలుకు రత్నాలవంటి సినిమాల నుంచి కేవలం కొన్నింటిని మాత్రమే ఉదహరించడం యమ్మెస్వి ను అవమానించినట్లే అవుతుంది. అలాగే మలయాళంలో డెబ్భై సినిమాలకు పైగా యమ్మెస్వి సంగీతం సమకూర్చారు. విశ్వనాథన్ సంగీతంలో కనుపించని ఆకర్షణ ఏదో వుంది. అదే యమ్మెస్వి విజయానికి కారణం. కాలంతోబాటు యమ్మెస్వి తన సంగీత పంధాకూడా మార్చుకున్నారు. యువతరాన్ని ఆకర్షించగలిగారు. అలాగని క్లాసికల్ టచ్ ని విడనాడలేదు. ప్రముఖ సంగీత దర్శకులు జికె. వెంకటేష్, ఆర్. గోవర్దన్, శంకర్ గణేష్, హెన్రీ డేనియల్ యమ్మెస్వి జంటకు సహాయకులుగా వుండేవారు. ఇక తెలుగు సినీ రంగవిషయానికి వస్తే 1955లో విశ్వనాథన్ ‘సంతోషం’ సినిమాకు సంగీతం సమకూర్చారు. స్వతంత్ర నిర్దేశకునిగా అనేక విజయవంతమైన తెలుగు సినిమాలకు యమ్మెస్వి సంగీతం అందించారు. ఆయన చేసిన సంగీతానికి సింహభాగం పాటలు రాసింది ఆచార్య ఆత్రేయ. యమ్మెస్వి ప్రజాదరణ పొందిన పాటలు తెలుగులో కోకొల్లలు. “తనువుకెన్ని గాయాలైనా; “బుజ్జిబుజ్జి పాపాయి” (ఆడబ్రతుకు); “రేపంటి రూపం కంటి”(మంచి-చెడు); “తలచినదే జరిగినదా”(మనసే మందిరం); “అందాల ఓచిలకా’’; “కోడి ఒకకోనలో” (లేతమనసులు); ”నన్నుయెవరోతాకిరి”(సత్తెకాలపు సత్తెయ్య); “ఏమంటున్నది ఈ గాలి”(మేమూ మనుషులమే); “తాళికట్టు శుభవేళా”(అంతులేనికథ); “ఏ తీగ పూవునో”(మరోచరిత్ర); “సన్నజాజులోయ్”(సింహబలుడు); “అటుఇటు కాని హృదయము తోటి”(ఇది కథకాదు); “నువ్వేనా సంపంగి పువ్వుల”(గుప్పెడుమనసు); “కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు” (అందమైనఅనుభవం); “కన్నెపిల్లవని కన్నులున్నవని”(ఆకలిరాజ్యం); “కదిలే మేఘమా”(లైలా); “పల్లవించవా నా గొంతులో” (కోకిలమ్మ) పాటలు ఉదాహరణకు కొన్ని మాత్రమే. యమ్మెస్వి కొన్ని మలయాళ సినిమాల్లో నటించారు కూడా.
ముగింపు మాట…
విశ్వనాథన్ భార్య పేరు జానకి. వీరికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కలిగారు. 14, మే నెల 2012 న భార్య జానకిని కోల్పోయారు. తన గురువు ఎస్. ఎం. సుబ్బయ్యనాయుడు ఆర్ధిక ఇబ్బందులకు గురైనప్పుడు, యమ్మెస్వి అతని కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన కాలం చేశాక కూడా సుబ్బయ్య నాయుడు భార్యకు ఆర్ధిక సహకారాన్ని అందిస్తూనే వుండేవారు. అలా ఆమె గతించేదాకా ఈ సహాయం ఆమెకు అందుతూనే వుండేది. అలాగే ప్రముఖ హాస్యనటుడు జె.పి. చంద్రబాబు ను కూడా ఆర్ధికంగా ఆడుకున్నారు. వెయ్యికి పైగా సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన యమ్మెస్వి కు పద్మ పురస్కారం ప్రకటించకపోవడం సర్కారు వారు సిగ్గుపడాల్సిన విషయంగా సంగీతాభిమానులు గమనించాలి. సత్యభామ విశ్వవిద్యాలయం, సుందర నార్ విశ్వవిద్యాలయం యమ్మెస్వికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి. తమిళనాడు ప్రభుత్వం విశ్వనాథన్ కు కలైమామణి బిరుదు తోబాటు డాక్టరేటు ప్రదానం చేసి ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా 2012 ఆగస్టులో యమ్మెస్వి-రామ్మూర్తి జంటను “థిరై ఇసై చక్రవర్తి” (ఎంపరర్స్ ఆఫ్ సినీ మ్యూజిక్) బిరుదుతో సత్కరించింది. ఈ పురస్కారం లో భాగంగా ఇద్దరికీ అరవై బంగారు నాణేలు, ఒక కారు బహూకరించారు. ఏప్రిల్ 2013లో యమ్మెస్వి కుడి భుజం రామ్మూర్తి మరణించారు. జూలై 14, 2015 న 87 యేళ్ళ వయసులో చెన్నైలో ఎం.ఎస్. విశ్వనాథన్ మరణించారు.
–ఆచారం షణ్ముఖాచారి