(ఘనంగా హైదరాబాద్ లో మువ్వా పద్మావతి, రంగయ్య పురస్కారాల ప్రదానోత్సవం)
ప్రముఖ కవి మువ్వా శ్రీనివాసరావు తన తల్లిదండ్రుల పేరిట ప్రతి సంవత్సరం నిర్వహించే మువ్వా పద్మావతి, రంగయ్య పురస్కారాలప్రదానోత్సవం ఆగస్ట్ 12 న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో క్రిక్కిరిసిన సాహితీ వేత్తలు, కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, భాషాప్రియుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది.
మువ్వా శ్రీనివాసరావు సృష్టించిన సాహిత్యం పై వివిధ సాహితీ వేత్తల అభిప్రాయాలతో వెలువడిన సమీక్షా వ్యాసాల బృహత్ సంకలనం 366 వ్యాసాలతో, 1,300 కు పైగా పేజీలతో కూడిన “ఆనితరుడు” అనే ఉద్గ్రంధాన్ని సభకు అధ్యక్షత వహించిన పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. ఈ గ్రంథానికి సంపాదకులుగా వ్యవహరించిన ఖాదర్ మొహిద్దీన్, అనిల్ డానీ ప్రభృతులను నిర్వాహకులు ఉచితరీతిన సన్మానించారు.
మువ్వా కవిత్వంపై కొండ్రెడ్డి వెంకటేశ్వర రచించిన “దృశ్యం@ 572 మెగా పిక్సెల్” గ్రంధాన్ని ప్రముఖ కవి కె.శివారెడ్డి ఆవిష్కరించారు. మువ్వా తెలుగులో రచించిన “సమాంతర ఛాయలు” కవితా సంపుటిని శాంత సుందరి హిందీ భాషలోకి అనువాద చేసిన గ్రంధాన్ని ప్రముఖ కవి నగ్నముని ఆవిష్కరించారు.
సమాంతర ఛాయలు సంపుటిని కన్నడ రచయిత లకూరి ఆనంద్ కన్నడంలోకి అనువదించిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఖాదర్ మొహియుద్దీన్, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, కె. ఆనందాచారి లకు “మువ్వా పద్మావతి“ రంగయ్య పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
నవస్వరాంజలి పేరుతో యువ, నవకవులైన లహరి, స్ఫూర్తి కందివనం, గోళ్ళ వెంకట నారాయణ, రూప రుక్మిణి, లావణ్య, సైదీశ్వర్ , విద్యాసాగర్, మహమ్మద్ గౌస్, షేక్ రిజ్వానా ప్రభృతులకు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు.
తెలంగాణ సాహిత్య అకాడెమీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్, ప్రముఖ కవి, తెలంగాణా శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న, డా. తోటకూర ప్రసాద్, డా. కోయి కోటేశ్వరరావు, పులికొండ సుబ్బాచారి, గుంటూరు లక్ష్మీనరసయ్య, కె.వేణుగోపాల్, కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, డా. రఘు, రజాహుస్సేన్, డా. కాత్యాయని విద్మహే, కన్నెగంటి అనసూయ మొదలైన ప్రముఖులు వేదికనలంకరించారు.