కళపట్ల నిజమైన ఆసక్తి అభిలాష వుండాలేకాని కళాకారుడు తన ప్రావీణ్యం ఎన్నో విధాల ప్రదర్శించవచ్చు. ఇందులో చిత్రకళ ఓ ప్రత్యేకమైన కళ. ఒకరు పేపర్ పై పెన్సిల్ తో బొమ్మలు వెస్తే, మరొకరు కాన్వాస్ రంగులతో రంగుల చిత్రాలు చిత్రీకరిస్తారు. పెన్సిల్, కుంచెలు లేకుండా కేవలం తన చేతి గోళ్ళనే కుంచెగా చేసుకొని దళసరి పేపర్ పై చిత్రాలు గీయగలగడం అద్భుతం కదా… అలాంటి చిత్రాలు గీసే నఖ చిత్రాకారుడే పల్లా పర్సినాయుడు. పి.పి.నాయుడు వీరి కలం పేరు.
కేవలం తెల్లకాగితంపై మానవశరీరంలోని నిర్జీవ పదార్థంగా వ్యర్థంగా భావిస్తున్న కొనగోళ్లతో జీవం తొణికిసలాడే కళాఖండాలు అత్యద్భుతంగా రూపొందిస్తున్న కళాకారుడు పి.పి.నాయుడు. పెన్సిలు, రబ్బరు, ఇంక్, రంగులు, కుంచెలు ఇవేవి వాడకుండా కుడిచేతి బొటలవేలు చూపుడువేలుకున్న కొనగోళ్ల మధ్య తెల్లకాగితంవుంచి తనలోని భావాన్ని అందంగా అపురూపంగా కళ్లకు కట్టినట్లు అతితక్కువ వ్యయంతో ఒక కళాఖండాన్ని రూపొందించగలరు పర్సినాయుడు.
వీరు విజనగరం జిల్లా చినకుదుమలో 1949లో ఒక పేద కుటుంబంలో జన్మించారు. వీరి తల్లి పారమ్మ, తండ్రి స్వర్గీయ పల్లా జగన్నాథం నాయుడు తాపీమేస్త్రి. ఇంటికి కావల్సిన సిమెంటు పనులు రకరకాలైన డిజైన్లతో బొమ్మలతో చేసేవారు. తండ్రి కళాచాతుర్యం నాయుడిని పరిశీలనాశక్తి తో చూసి తనూ కళాకారుడు అవ్వాలని అభిలషించేవారు. ఊహ తెల్పినప్పటి నుండి బొగ్గు, పెన్సిల్ ఉపయోగించి చిత్రాలు గీస్తుండేవారు. తదుపరి రావివలస ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్న ప్రముఖ కవి, సినీ గేయరచయిత జాలాది, అల్లు దాలినాయుడు గార్ల వద్ద చిత్రలేఖనంలో మెళకువలు నేర్చుకున్నారు.
నఖ చిత్రకళలో ప్రవేశం:
1969 సం.లో రాయిఘడ ట్రైనులో పయనిస్తున్న సమయంలో ప్రముఖ కార్టూనిస్ట్, నఖ చిత్రకారులు శ్రీ శంబంగిగారితో నాయుడుగారికి పరిచయమై ఆయన ద్వారా నఖచిత్రలేఖనం మెళకువలు, గీసేవిధానం నేర్చుకొన్నారు. ప్రధమంగా సిగరెట్ రేపర్లపై స్కూలు పిల్లల ప్రొఫైల్స్ గీసి వారికిచ్చేవాడిని వాటిని వారు ఆసక్తిగా గమనించేవారు. ఎటువంటి పరికరములు లేకుండా కేవలం చేతిగోళ్ళతో, ఎట్టి ఖర్చులులేని అబ్బురమనిపించే నఖచిత్రాలు గీసేవిధానం నాకెంతో ఆసక్తిని రేపి అవిరళకృషితో వేలాది చిత్రాలు గీయడం జరిగింది.
ఇంతలో ప్రముఖ చిత్రకారులు శ్రీ శిష్టా రామకృష్ణారావుగారి చిత్రాలను విశాఖ పొటోగ్రాఫర్ ఆప్పారావు గారు పోటోలు తీసి లైఫ్ ఇస్తున్నారని తెలుసుకొని వారి దగ్గరకు వెళ్ళగా నాయుడు గారి నఖచిత్రాలను కూడా పోటోలు తీసి ఎంతగానోప్రోత్సహించారు. అట్లే విశాఖ సింధియాలో నున్న ఆర్ట్ క్రిటిక్, ప్రముఖ పాత్రికేయులు శ్రీ సుంకర చలపతిరావు గారు నాయుడుగారి నఖచిత్ర ప్రదర్శన ఏర్పాటుచేసి వివిధ పత్రికలలో వీరి పరిచయ వ్యాసాలు రాసి ఎంతో ప్రోత్సహించారు. దశావతారాలు, అభిజ్ఞానశకుంతలం, భాగవతం నందలి కొన్ని ఘట్టాలను సామాజిక, ప్రకృతి చిత్రాలు, కవులు, కళాకారులు, దేశనాయకులు చిత్రాలు వేలాదిగా గీశారు.
వీరి నఖచిత్ర ప్రదర్శనలు 50 వరకు జరిగాయి వివిద పట్టణాలలో. 1985లో విజయనగరంలో తొలిసారి వీరి చిత్రకళా ప్రదర్శన జరిగింది. ముఖ్యంగా విశాఖపట్టణం, సబ్బవరం, ఒంగోలు, చెన్నై, బెంగులూరు, హైదారాబాద్ (కర్నాటక) ఖరంపురం, ఒరిస్సాలలో జరిగాయి (అంతర్జాతీయ తెలుగు మహాసభలలో భాగంగా).
ప్రస్తుతం నా నఖచిత్రాలు కౌముది.నెట్ పత్రికలో సిరీస్గా వస్తున్నాయి. తెలుగు, హాస్యానందం పత్రికలలోను కార్టూన్లు గీస్తున్నాను.
వీరి కవితలు, బాలగేయాలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఉపాధ్యాయ వార్త, భక్త సమాచారం, బాలబాట మొదలగు పత్రికలలో ప్రచురించారు.
పి.పి.నాయుడు గారి నఖచిత్రాలను పార్వతీపురం స్నేహకళాసాహితివారు ‘నఖచిత్రరేఖ‘ పేరుతో ఒక పుస్తకంగా ప్రచురించారు.
విజయనగరం జిల్లా నాగూరు పాఠశాలలో హెచ్.ఎం.గా పనిచేసి పదవీ విరమణ పొందారు. భార్య పార్వతమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం.
అవార్డులు:
- పార్వతీపురం శారదా కళాస్రవంతి వారిచే 1985లో ‘చిత్ర, నఖచిత్ర కళావిశారద’ బిరుదు ప్రదానం.
- శ్రీ రాజీవ్ గాంధీ ఎక్స్ లెన్సీ అవార్డ్ (1987)
- నాటి ముఖ్యమంత్రి గౌ. శ్రీ ఎన్.టి. రామారావు గారిచే తెలుగు యూనివర్సిటీ ఉగాది పురస్కారం (1989)
- నాటి ముఖ్యమంత్రి గౌ. శ్రీ మర్రి చెన్నారెడ్డి గారిచే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ (1990)
- ఢిల్లీ తెలుగు ఆకాడమీ వారి పురస్కారం (1994)
- రాష్ట్రపతి గౌ. శ్రీ శంకర్ దయాళ్ శర్మగారిచే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ (1996)
…………………………………………………………………………………….. - పి.పి.నాయుడు గారి మధుర జ్ఞాపకాలు:
- ఒక పర్యాయం ఆనాటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీగారు కరువు ప్రాంత పర్యటనలో భాగంగా ‘నాగూరు’ గ్రామం వచ్చినప్పుడు ఆ కొద్ది సమయంలోనే రాజీవ్ ప్రొఫైల్ ను గోటితో గీసి బహూకరించగా చూసి ఎంతో ఆనందించి, ప్రక్కనున్న సోనియాగాంధీ గారికి కూడా చూపించి ప్రశంసించారు. డిల్లి వెళ్ళిన వెంటనే ఒక ప్రశంశాపత్రాన్ని పంపించారు వీరికి.
- హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖనర్తకి శ్రీమతి శోభానాయుడు కూచిపూడి నృత్య కార్యక్రమ సందర్భంగా శ్రీ అక్కినేనిగారు, శ్రీ సి.నారాయణరెడ్డి గార్ల ప్రొఫైల్స్ నఖచిత్రాలుగా గీసి ఇచ్చి, ప్రశంశలు అందుకున్నారు. ఆ సందర్భంలోనే వీరి గోళ్ళను చూసిన సి.నా.రె. గారు “నఖే నఖే సరస్వతి” అని వీరిని ఆశీర్వదించారు.
- విజయనగరం సంస్కృత కళాశాల నాటి ప్రిన్సిపాల్ మధుర వాచస్పతి శ్రీమానాప్రెగడ శేషసాయిగారు. నీవు “గోరంతపని చేసి కొండంత కీర్తి” గడించగలవని ఆశీస్సులందించారు వీరికి.
-కళాసాగర్
CONGRATS Sri P P Naidu garu.
Super mamayya Garu 👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳🇮🇳
నఖ చిత్రాలుకూడా జీవం ఉట్టిపడుతూ అద్భుతంగా ,అందం గా వుంటాయని మీ వి చూశాకే తెలిసింది నాయుడు గారూ.. హృదయపూర్వక అభినందనలు
శెభాష్ నాయుడు ! 64 కళలు వెబ్ మేగజైన్ లో నీ పరిచయం చదివి
చాలా సంతోషించాను.నీకు అభినందనలు, కళా సాగర్ గారికి ధన్యవాదాలు.
నాయుడు గారు మీ నఖ చిత్రాలు అద్భుతం.
శ్రీ పల్ల పరిసి నాయుడు మాస్టర్ గారు నఖ చిత్రములు నా చిన్న నాటి నుండి చూస్తున్నాను. వారి నఖ చిత్రాలు
మన దేశ సంపదగా భావించవచ్చు.ఇటువంటి చిత్రాలను ప్రభుత్వం వెంటనే డిజిట లైజేషన్ చేసే ఏర్పాట్లు చేస్తూ,భావితరాలకు పాఠ్యపుస్తకాలు లో పాఠాలు గా అందించగలిగితే ఈ నఖ చిత్రాలు మరెన్నో సంవత్సరాల పాటు గుర్తింపు లభిస్తుంది.
Beautiful work, congrats Naidu garu