అనగనగా ఒక అచ్యుతరావు గారు. ఆయన ఒక దర్జీ. విజయనగరంలో అన్నిటి కన్నా పాత టైలర్ షాపు వారిదే. దాని పేరే ’”అచ్యుత రావు టైలర్స్”.
‘కుట్టుకథలు’ అనే ఈ పుస్తకం వ్రాసిన వ్యక్తి పేరు వెంకట్రావు. ఈ వెంకట్రావు గారు ఆ అచ్యుతరావు గారి అబ్బాయి. ఆయనా దర్జీనే. 1972 లో పదవతరగతి పరీక్షలు రాసేసి, పరీక్ష హాలు నుండి తిన్నగా నాన్నగారి కొట్టుకెళ్ళి పోయి అక్కడే ఒక కుట్టు మిషిన్ మీద టకటకా బట్టలు కుట్టేస్తూ కుట్టేస్తూ ఆయన ఎక్కిన మిషిన్ చక్రం గిర్రున తిరిగి 50 సంవత్సరాలయింది. అలా కొలతలు తీసుకుంటూ తీసుకుంటూనే, కటింగ్ మార్కులు పెడుతూ పెడుతూనే, బట్టలు కుడుతూ కుడుతూనే, కత్తెరతో ఒడుపుగా కచకచా చకచకా కత్తిరిస్తూ తన చుట్టుకూచున్న శిష్యులతో, మిత్రులతో మాట కలుపుతున్న ముచ్చటైన పద్దతిన తన యాభయేళ్ల వృత్తి జీవితంలో తనకు ఎదురైన అనుభవాలని అరవై కథలుగా కుట్టి మనకు తొడుగుతున్నారు.
దారం చలాగ్గా- పొడుగ్గా ప్యాంట్ కు పమ్మకాలు కుట్టినట్లు చెప్పిన కథలివి. ఇవికద కథలంటే అనిపించే కథలివి ! ఇట్టివి కదా నిజ పాత్రలంటే అనిపించే అచ్చమైన జనం కథలివి! ఇందులో కనిపించే ప్రతి పాత్రా మన కళ్లముందు కొత్త చొక్కా తొడుకున్నట్టో. ప్యాంట్ బిట్టు కొనుక్కుని తెచ్చుకున్నట్టో, ఆల్తీలు కొలిపించుకున్నట్టో, మాజూరు బేరమాడుతున్నట్టో మనకు తెలిసిపోతూ ఉంటారు. అనుభవమయ్యి ఉండిపోతారు.
ఈ కథల్లో ఒక కామేశు అనే షర్ట్ మేకర్ ఉంటారు. ఆయన కొట్లో పని చేస్తూనే అటు వైపు తిరిగి ఒక గుక్క మందు, ఇటు వైపు తిరిగి ఒక మందు గుక్క వేస్తూనే ఉంటారు. బట్టలు కుడుతూనే ఉంటారు. ఒకసారి మందు ఎక్కువైన కామేశు ని బైకు గుద్దిందో, బైకుని కామేశు గుద్దారో తెలీదు. మొత్తానికి దెబ్బ తగిలింది కామేశు కాలికే. కోతి పుండు బ్రహ్మ రాక్షసి అయినట్లు, అశ్రద్ద వల్ల అతగాడి కాలికి తక్షణ వైద్యం అందకపోతే కాలు మొత్తం తీసెయ్యాల్సి వస్తుందని డాక్టర్ సలహా ఇస్తారు. చికిత్సకు బోలెడు డబ్బులు కావాలి. కామేశు సంపాదనంతా తాగుడుకే దిగిపోతుంటే, దాచుకున్నదెక్కడా? అందుకని వెంకట్రావు గారే కామేశు ఇల్లాలిని పిలిపించి ఆవిడకు ఫైనాన్సు లో డబ్బులు అప్పు ఇప్పించి అత్యవసరంగా ఆపరేషన్ చేయించమంటాడు. ఆపరేషన్ పూర్తవుతుంది. మెల్లిమెల్లగా కామేశు కాలు కుదుటపడింది. అయితే కొంతకాలం తరువాత కొట్టు యజమానికి తెలుస్తుంది అసలు కామేశు తను మాట్లాడిన ఆసుపత్రిలో వైద్యానికే వెళ్ళలేదని. ఆయన అశ్చర్య పోయి కామేశు భార్యని అడుగుతాడు “ఇదేమిటమ్మా” అని.
“అవునండి అక్కడ చేయించలేదు, ఏదైతే అదే అవుతుందని, పెద్దాసుపత్రికి తీసుకెళ్ళాము, అదృష్టం, కాలు బాగయింది”.
“ఎంతయింది?”
“ఆటో చార్జీలతో వంద”
“కాలు పోతే?”
“పోతే… ఏం అవుతుంది? ఇంట్లో కూర్చుంటాడు. కాలు బాగయిందా అంతకు ముందు లాగా పని చేసుకుంటాడు. రోజుకి వంద అతగాడే కట్టుకుంటాడు. లేదా నాకు ఎలాగూ తప్పదు. మీరు ఫైనాన్సు లో ఇప్పించిన డబ్బు ఇంట్లోకి వాడుకుంటున్నాను. ఇక తిండి అంటారా? అది అప్పుడూ తప్పదు. ఇప్పుడూ తప్పదు. కుక్క ఇంటి ముందుకు వస్తే ఇంత పడేస్తాం. ఇదీ అంతే.
అక్కడితో ఆ కథ ముగుస్తుంది. ఆ ఇంటి ఇల్లాలి నిట్టూర్పు మాటతో కథ ముగుస్తుంది. ఇది కథ కాదు జీవితం, అవి పాత్రలు కావు జీవితాలు. ఇజాల పేరుతో కుప్పలుగా వచ్చిపడే చాలా కథల్లో ఇల్లాంటి పాత్ర కానీ, ఇటువంటి గొంతుక కానీ వినబడుతుందా అసలు? చెరువులో తెప్పలుగ నిండిన కథక కప్పలు పది వేలు, వంద వేలు. వేల వేలు. కాని కథలేవి? అందులో నీరు, రక్తం కలిసిన మనుషులేరీ? ఈ కథ పేరు ట్రిప్పుల బండి.
వెంకట్రావు గారు ఉన్నది ఉన్నట్టు వ్రాశారు కాబట్టి ఇవి మంచి కథలయ్యాయి. ఆయనలోని కథకుడు వీటిలోకి కాస్త ఊహను, డ్రామాని ప్రవేశపెట్టి ఉంటే ఇవి గొప్ప కథలయ్యేవి. ఆంధ్ర దేశం లో గొప్ప రచనలు, ప్రముఖ రచయితలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వెంకట్రావు గారు తెలుగు సాహితి తల్లికి ఒక మంచి కథకుడుగా మిగిలిపోవడమే మంచిది. అటువంటప్పుడే కథల మీద గౌరవం మిగులుతుంది.
నేను ఈ పుస్తకంలో ప్రతి కథ గురించి చెప్పదలుచుకోలేదు. దాని వల్ల రచయితకు అన్యాయము. పాఠకుడికి అగౌరవము. పుస్తకం కొనుక్కోవడం, కొని చదువుకొవడం మనకూ ఇంకా దానికి గౌరవమని భావిస్తూ పుస్తకాల కొరకు సంప్రదించడానికి 9247235401 మరియు 9866115655 అనే ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను. ఇంకా హైద్రాబాద్ బుక్ ఎక్జిబిషన్లో “లోగిలి” వారి స్టాల్ లో ఈ పుస్తకం దొరుకుతుంది.
రచయిత శ్రీ వెంకట్రావు గారు కుట్టుపనిలో నిపుణులు, కానీ పుస్తకం కుట్టే పని అనేది వేరు ఉంటుంది. నా బుర్రకు తోచి ఈ పుస్తకం కవర్ పేజీగా వెలసిన అచ్యుతరావు గారి బొమ్మని పుస్తకపు లోపలి పేజీల్లో కానీ వెనుక అట్ట పైన కానీ వేసి. ఏదైతే వారి టైలర్ షాపు “అచ్యుత రావు టైలర్స్” అని ఉన్నదో ఆ షాపు ముందు భాగం కానీ, ఆ షాపు సైన్ బొర్డ్ ని కానీ కవర్ గా వాడి ఉంటే పుస్తకం ఆకర్షణీయంగా కనపడేది. అంతే కాదు ఈ పుస్తకం లోని ప్రతి కథకు బొమ్మ ఉండాలి. మామూలుగా ఎవరైనా రచయిత రాసిన ప్రతి కథ బొమ్మని డిమాండ్ చేయదు, కానీ వెంకట్రావుగారి శైలి లో బొమ్మ వచ్చి బుద్దిగా కూచునే గుణం ఉన్న రచన ఆయన పనితనంది. ఆయనకు సాదా బట్టముక్కను ఎట్లా చొక్కాగా, పట్లాం గా కుట్టాలో తెలుసు. అదే వ్యాకరణం కొద్ది మామూలు అక్షరాలను కథలుగా ఎలా కుట్టాలో ఈ పుస్తకం ద్వారా కొంతమంది, లేదా చాలామంది తెలుగు రచయితలకు చెబుతున్నారు కూడా. నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత. ఈ పుస్తకం ఇంకా ముద్రణలు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ వచ్చే ముద్రణలలో అచ్చు తప్పులు ఉండకూడదని కూడా నేను గట్టిగా కోరుకుంటున్నాను.
చివరగా… సత్యం శంకరమంచి గారి అమరావతి కథలని శ్రీశ్రీశ్రీ శ్యాం బెనగల్ గారు దృశ్యకావ్యాలుగా మలిచారు. ఆ కథల స్థాయిని ఆయన తీసుకెళ్ళిన ఎత్తు చాలా అందనిది. అది మన అదృష్టం. సత్యంగారి కథల్లోని “వయసొచ్చింది” ని శ్యాం బెనగల్ కెమెరా కళ్లనుండి చూసిన నాకు ఈ కుట్టు కథలలో ప్రతి కథ కు అలా సెల్యూలాయిడ్ మీద పలికే శక్తి ఉందనిపించింది. ప్రతి కథ లోనూ నాకు శ్యాం బెనగలే కనిపించారంటే ఏమి ఆ భాగ్యం.
–ఆర్టిస్ట్ అన్వర్