దారిపొడవునా తమిళం బోర్డులు కనిపించగానే హమ్మయ్య చెన్నై వచ్చేశాను అనుకున్నాను. మొదటిసారిగా చెన్నై నగరంలో అడుగుపెట్టాను. పచ్చని చెట్లతో విశాలమైన రహదారులతో వున్న తమిళ నగరాన్ని ఆ క్షణాన్నే ప్రేమించేశాను.
5 నవంబర్,2023 ఆదివారం సాయంత్రం 6 గంటలకు టి. నగర్లోని విజయరాఘవ రోడ్ లోని సమావేశ స్థలానికి వెళ్ళగానే మనసంతా నూతనోత్సాహం కలిగింది. అలవాటు ప్రకారం ఆలస్యంగా మొదలయ్యింది సభ. ఇంతకీ సభ వివరాలు చెప్పలేదుగా. అశేష తెలుగు ప్రజల అభిమన నటి సూర్యకాంతం శతజయంతి ఉత్సవ సభ, పుస్తక ఆవిష్కరణ. సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే సూర్యకాంతం గారి దత్త పుత్రుడు డా. అనంత పద్మనాభ మూర్తి గారు కనిపించారు, వారికి నమస్కరించి హాలు లోపలికి ప్రవేసించాను.
మాతెలుగు తల్లికి మల్లె పూదండ పాటతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. అనతరం తమిళ పాట కూడా పాడారు. హాలంతా సూర్యకాంతం అభిమానులతో నిండిపోయింది. కొంత మంది కూర్చోవడానికి కుర్చీలు లేక నిలబడ్డారు.
మొదట సూర్యకాంతం నటించిన సినిమాలలోని ముఖ్యమైన ప్రదర్శించారు. అనంతరం సభ కార్యక్రమం మొదలయ్యింది. సూర్యకాంతం గారి శతజయంతి సంచికను మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. గౌరవ అతిథులుగా శ్రీశ్రీ గారి చిన్న కుమార్తె, మద్రాసు హైకోర్ట్ న్యాయమూర్తి శ్రీమతి రమ గారు పాల్గొన్నారు. విజయా ప్రొడక్షన్ విశ్వనాథరెడ్డి, అలనాటి నటీమణులు రాజశ్రీ, జయచిత్ర, ఆస్కా అధ్యక్షలు సుబ్బారెడ్డి, సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, గోపురం అధినేత హరికృష్ణ, సినీ పాటల రచయిత భువన చంద్ర, ప్రముఖ ఆర్కిటెక్ట్ మాదాల ఆదిశేషయ్య పాల్గొన్నారు.
వెంకయ్య నాయుడు గారు మాతృభాషా ప్రాముఖ్యాన్ని గురించి, దానితో పాటు ఇతర భాషల నేర్చుకోవలసిన ఆవశ్యకతను వివరించారు. అలనాటి నటీమణులు రాజశ్రీ, జయచిత్ర లు సూర్యకాంతం గారితో వారికి గల అనుబంధం గురించి చెబుతూ… షూటింగ్ కి వారితో పాటు తెచ్చిన పిండి వంటలు అందరికీ పెట్టేవారని, వారి వితరణ స్వభావాన్ని గురించి కొనియాడారు. గయ్యాలి అత్త పాత్రల పోషణ చేయడంలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము. అందుకేనేమో ఆ పేరును తర్వాత కాలంలో తమ పిల్లలకు పెట్టడానికి ఎవరు సాహసించలేదు.
చివరిగా సూర్యకాంతం గారి శతజయంతి సంచికలో వ్యాసాలు రాసిన వారిని వేదిక పైకి ఆహ్వానించి అతిథుల చేతుల మీదుగా శతజయంతి సంచిక అందజేశారుకొందరికి ఇచ్చిన తర్వాత రాజశ్రీ తదితర అతిథులు వెళ్ళిపోవడంతో కొందరి రచయితలకు పుస్తకాలు సభాముఖంగా అందజేయలేకపోయారు నిర్వహాకులు. అనేక రాష్ట్రాల నుండి, ఎన్నో ప్రాంతాల నుండి వచ్చిన సూర్యకాంతం గారి అభిమాన రచయితలందరినీ పుస్తకంతో పాటు ఒక జ్ఞాపినతో వేదికపై అందిస్తే సంతోషించేవారమన్న రచయితలు అసంపృప్తితో… బాధా తప్త హృదయాలతో వెనుదిరిగారు. మొత్తం 198 వ్యాసాలు, సూర్యకాంతం గారి అందమైన ఫోటోలున్న ఈ పుస్తకం వెల కూడా రూ. 750/- కాస్త ఎక్కువ అనిపించింది.
–హైమావతి మందరపు
మొత్తం మీటింగ్ పరమ ఘోరంగా జరిగింది. అసలు ఆ ప్రాస మణి అనే అతివాగుడు మనిషిని సభ నిర్వహణకు ఎంచుకోవడం పెద్ద తప్పు. అందరూ ఆహ్వానితులే అని వాట్సప్ ల ద్వారా వేల మందికి మేసేజి లు పంపి అక్కడ వంద మందికి కూడా కూచునే ఏర్పాట్లు చెయ్యక పోవడం ఘోరం
really