తెలుగు సినీ రాకుమారుడు… కత్తి కాంతారావు

(కాంతారావు జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి ప్రత్యేక వ్యాసం)

తెలుగు చలనచిత్ర పితామహులుగా కీర్తించబడే హెచ్. ఎం. రెడ్డి చేతులమీదుగా చలనచిత్ర రంగప్రవేశం చేసి, స్వయంకృషితో జానపద, పౌరాణిక, సాంఘిక, క్రైమ్ చిత్రాలలో హీరోగా, క్యారక్టర్ నటుడుగా తనదైన శైలిలో రాణించిన అద్వితీయ నటుడు కత్తి కాంతారావు గా పిలిపించుకున్న తాడేపల్లి లక్ష్మీకాంతారావు. రాజభోగాలతోబాటు విషాద సంఘటనలు, చెడు అనుభవాలను సమానంగా అనుభవించిన కాంతారావు స్నేహశీలి. నటనలో జీవించాలి అనే సదాశయంతో నటననే పరమయోగంగా భావించి, నారదుడు, కృష్ణుడు, రాముడు, శివుడు వంటి పౌరాణిక పాత్రలకు వన్నె తెచ్చిన నటుడు కాంతారావు. జానపద చిత్రాల్లో కత్తి యుద్దాలతో దుష్టనాయకులను చిత్తుచేసి, రాకుమారిల మనసు దోచుకున్న అందాల రాకుమారుడతడు. ‘కత్తి కాంతారావు’ గా మన్నన లందుకున్న జానపద హీరో. “తెలుగు చిత్రపరిశ్రమకు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళయితే, ఆ రెండు కళ్ళపైన, ఫాలభాగంమీద అనునిత్యం శోభిల్లే మంగళ తిలకం కాంతారావు” అని దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రశంసలు చూరగొన్న మనసున్న నటుడు కాంతారావు. నవంబర్ 16 న కాంతారావు జయంతి సందర్భంగా ఆ సినీమహావీరుని జీవిత విశేషాలు మీకోసం…

బాల్యం… చదువు…

‘కత్తి కాంతారావు’ అని అభిమానులు ఆప్యాయంగా పిలుచుకొనే హీరో కాంతారావు పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. పుట్టింది 16, నవంబరు 1923 న కోదాడకు దగ్గరలో వున్న గుదిబండ గ్రామంలో. తండ్రి కేశవరావు, తల్లి సీతారావమ్మ. తండ్రి రెవెన్యూ కార్యాలయంలో శిరస్తదారుగా పనిచేసేవారు. కాంతారావు ప్రాధమిక విద్యాభ్యాసం కోదాడలోను, హైస్కూల్ చదువు ఖమ్మంలోను సాగింది. చిన్నతనంలోనే భారత, భాగవత, రామాయణ పురాణ కథలను ఆకళింపు చేసుకున్నాడు. ‘సీతాకల్యాణం’, ‘సతీ సావిత్రి’, ‘సత్యహరిశ్చంద్ర’, ‘రుక్మిణీ కల్యాణం’ వంటి నాటకాల రికార్డులు వింటూ ఆ పద్యాలను కరతలామలకం చేసుకున్నాడు. స్కూలు వార్షికోత్సవ సందర్భంగా ‘సతీసక్కుబాయి’ నాటకంలో వేషంకట్టి, ఆ నాటక నిర్వహణ భారాన్ని తనే మోశాడు. ఏకపాత్రాభినయాలు, విచిత్ర వేషధారణలు, పద్యపఠనం వంటి వినోదకార్యక్రమాలను ప్రదర్శించాడు. ఒకసారి కాంతారావు సైకిలు మీద పాలేరు కాలవను దాటబోతూ పట్టుతప్పి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా ఒడ్డున వున్నవాళ్ళు కాపాడారు. ఇంట్లో విన్యాసాలు చేస్తూ చెయ్యి విరగ్గొట్టుకున్నాడు. స్నేహితులతో కలిసి ‘బాలమిత్ర నాట్యమండలి’ స్థాపించి చిలకమర్తి వారి ’గయోపాఖ్యానం’, పానుగంటి వారి ‘మధుసేవ’ వంటి నాటకాలను ప్రదర్శించాడు. సురభి నాటక సమాజంలో చేరాలని కాంతారావుకు ఆసక్తిగా వుండేది. అతి కష్టం మీద సురభి వాళ్ళు ప్రదర్శించే ‘శ్రీకృష్ణ లీలలు’ నాటకంలో బ్రహ్మ పాత్రను ధరించాడు. తరవాత సురభి వారి ‘కనకతార’, ‘తెలుగుతల్లి’, ‘గయోపాఖ్యానం’ నాటకాల్లో కాంతారావు నటిస్తూ వచ్చాడు. ఆ తరవాత సురభి సమాజాన్ని వదలి తెనాలి పట్టణం చేరుకున్నాడు.

వివాహం…ఉద్యోగం…

తెనాలిలో కాంతారావు మకాం ప్రసిద్ధ నటుడు పులిపాటి వెంకటేశ్వర్లు గారి ఇంటిలో. అప్పుడే పులిపాటి ‘హరిశ్చంద్ర’ సినిమాలో నక్షత్రకుడి పాత్ర వేసేందుకు మద్రాసు వెళ్ళారు. ఒక మిత్రుడి సహకారంతో కాంతారావు మాధవపెద్ది వెంకట్రామయ్యతో పరిచయం కలిగింది. ఇంతలో కాంతారావుకు విజయవాడ నుంచి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. తర్జన భర్జలమధ్య వేలమూరి సుశీల అనే అమ్మాయితో పెళ్లయింది. అప్పుడు కాంతారావు వయసు పదిహేడు సంవత్సరాలే. తరవాత కాంతారావు ఏలూరులో తన పిన్నివాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ బందా కనకలింగేశ్వరరావు వంటి పెద్దలతో పరిచయం పెరిగింది. దాని తరవాత కాంతారావు గుదిబండకు వచ్చి ‘మాలీ పటేల్’ (మునసబు) ఉద్యోగంలో చేరాడు. అప్పట్లో తెలంగాణా ఉద్యమం పెద్దపెట్టున సాగుతోంది. సాంఘిక ప్రయోజనాల నేపథ్యంలో వుండే నాటకాల్లో చురుగ్గా పాల్గొనడంతో కాంతారావును కమ్యూనిస్టు సానుభూతి పరుడుగా ముద్ర వేశారు. ఆయన మీద అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. 1948లో హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన తరవాత వారెంట్ ను ఎత్తివేశారు. 1950లో కాంతారావు భార్య తీవ్రమైన జబ్బుచేసి మరణించింది. ఆమె జబ్బుతో మంచంలో వుండగానే జగ్గయ్యపేట లోని ఓరుగంటి సత్యనారాయణశాస్త్రి అనే బందువుల అమ్మాయి హైమవతిని పెళ్లి చేసుకోవలసిందిగా తన భార్య సుశీల కోరడంతో, ఆమె ఆఖరి కోరికను మన్నించి కాంతారావు హైమవతి ని 1950లో వివాహమాడారు. సంపాదన లేకుండా వున్న ఆస్తిని హరిస్తూ కాలం గడుపుతున్నాడని తల్లి అంటున్న మాటల్ని సహించలేక ప్రత్యామ్నాయ ఉపాధికోసం కాంతారావు అన్వేషణ మొదలెట్టాడు. కొందరు మిత్రులు “నీకు మంచి రూపురేఖలు, అంగసౌష్టవం వున్నాయి, చక్కగా పాడగలవు, నాటకానుభవం వుంది…మద్రాసు వెళ్లి సినిమాలో ప్రయత్నించు” అని సలహా ఇచ్చారు. అప్పుడే కాంతారావు కు ‘బాలనాగమ్మ’ సినిమాలో బాలవర్దిరాజు గా నటించిన విశ్వం గుర్తుకొచ్చాడు. అతనిది జగ్గయ్యపేట. విశ్వంతో కాంతారావుకు సత్సంబంధాలు, రాకపోకలూ వున్నాయి. దాంతో మద్రాసు వెళ్లి సినిమాల్లో ప్రయత్నిద్దామనే నిర్ణయం తీసుకున్నాడు కాంతారావు.

Kantharao

మద్రాసు మహానగరంలో…

1950లో 28 ఏళ్ళ వయసులో కాంతారావు మద్రాసులో అడుగు పెట్టారు. అతని మామగారి మిత్రుడి ఇంటిలో ఆశ్రయం దొరికింది. అప్పట్లో టి. హయగ్రీవాచారి మేనల్లుడు కృష్ణమాచారి ‘రోహిణీ’ సంస్థలో సహాయ దర్శకుడిగా పనిచేస్తూ ఉండేవాడు. అతడు తన పేరును ‘టి.కృష్ణ’ గా మార్చుకొని వ్యవహరించేవాడు. కాంతారావు రోజూ కృష్ణతో కలిసి ‘రోహిణీ’ కార్యాలయానికి వెళ్ళేవారు. రోహిణీ సంస్థ అధిపతి ‘టాకీపులి’ గా పేరుతెచ్చుకున్న హెచ్.ఎం.రెడ్డి (హనుమప్ప మునియప్పరెడ్డి) కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో పెద్ద సాహసి. విలన్ పాత్రలు ధరించే ముక్కామలను ‘నిర్దోషి’ (1951) చిత్రంలో హీరోగా, హీరోయిన్ పాత్రలు పోషించే అంజలీదేవిని వ్యాంప్ గా నటింపజేసిన ఘనత రెడ్డి గారిదే! అప్పుడే కాంతారావు కు ‘మేవార్’ అనే నాటకంలో మొహబ్బత్ ఖాన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. కాంతారావు నటనతోబాటు ఉర్దూ ఉచ్చారణ పురుషోత్తమరెడ్డి, సార్వభౌమరావులకు ఎంతగానో నచ్చింది. అప్పట్లో రోహిణీ సంస్థలో పురుషోత్తమరెడ్డి ప్రొడక్షన్ మేనేజర్ గా, సార్వభౌమరావు సహకార దర్శకుడుగా పనిచేస్తుండేవారు. వారి సిఫారసుతో వెంటనే కాంతారావును ‘నిర్దోషి’ చిత్రంలో రైతుబిడ్డగా ఒక చిన్న పాత్రలో నటింపజేశారు. ఒకే షాట్ లో తన డైలాగులను ఒకే చేసి హెచ్.ఎం. రెడ్డి దృష్టిని కాంతారావు ఆకర్షించారు. షాట్ అయిపోగానే రెడ్డిగారికి ధన్యవాదాలు చెప్పేందుకు కాంతారావు వెళ్ళగానే, హెచ్.ఎం.రెడ్డి కెమెరామన్ పి.ఎల్. రాయ్ కి కాంతారావును చూపుతూ “హౌ యీజ్ దిస్ బాయ్స్ ఫేస్” అని అడిగారు. “వెరీ గుడ్. ఫోటోజెనిక్ సార్” అనే సమాదాన మొచ్చింది. మైక్ ఇంజనీర్ రామచంద్రన్ వైపు తిరిగి “హౌ యీజ్ హిస్ వాయిస్” అని అడిగారు. “స్మార్ట్ వాయిస్ సార్” అని జవాబొచ్చింది. వెంటనే హెచ్.ఎం. రెడ్డి “ఐ ఫౌండ్ ఎ హీరో ఫార్ మై నెక్స్ట్ పిక్చర్” అని బాహాటంగా ప్రకటించారు.

ప్రతిజ్ఞ చిత్రంలో కథానాయకుడిగా…

‘నిర్దోషి’ చిత్రం దెబ్బతిన్నది. నష్టం పూడ్చేందుకు హెచ్.ఎం. రెడ్డి ‘ప్రతిజ్ఞ’ సినిమా తీసేందుకు ఉపక్రమించారు. పూర్ణా పిక్చర్స్ మంగరాజు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టారు. అందులో కాంతారావు హీరోగా ఎంపిక కాగా, చిన్నచిన్న పాత్రలు పోషిస్తున్న సావిత్రిని హీరోయిన్ గా తీసుకున్నారు. హీరో చెల్లెలు పాత్రకు గిరిజను ఎంపిక చేశారు. విలన్ పాత్రకు కొత్త నటుడు రాజనాలను తీసుకున్నారు. కాంతారావుకు నెలకు రూ. 250 జీతం తోబాటు ఒక సంవత్సరానికి అగ్రిమెంటు కుదిరింది. ‘చిత్రానంద’ గా పిలుచుకొనే కె.వి. రావు ఆ చిత్రానికి ప్రొడక్షన్ ఇన్ చార్జి గా నియమితుడయ్యారు. ఈ చిత్రానికి హెచ్. ఎం. రెడ్డి మనవడు వై.ఆర్. స్వామి దర్శకత్వం నిర్వహించారు. ప్రతిజ్ఞ సినిమా రెండు వర్షన్లలో నిర్మించారు. తెలుగులో ఈ చిత్రం 27, నవంబరు 1953న విడుదలైంది. విజయవాడ ‘వినోదా’ టాకీసులో ఆరు వారాలు, తరవాత రామా టాకీసుకు మార్చగా అక్కడ మరో ఎనిమిది వారాలు ఆడి శతదినోత్సవం చేసుకుంది. కానీ తమిళంలో మాత్రం పెద్దగా నడవలేదు. ఈ సినిమా తరవాత చాలాకాలం వరకు కాంతారావుకు సినిమాలలో నటించే అవకాశం రాలేదు. 1955లో విఠలాచార్య సొంత బ్యానర్ మీద ‘కన్యాదానం’ సినిమా నిర్మిస్తూ హీరో గా కాంతారావు ను బుక్ చేశారు. ఈ సినిమాను కేవలం 28 రోజుల్లోనే నిర్మించడం విశేషం. కాంతారావు సరసన హీరోయిన్ గా జానకి నటించింది. ఆమె తండ్రిగా అద్భుతంగా నటించిన సి.ఎస్.ఆర్ పుణ్యమా అంటూ ఆ చిత్రం సుమారుగా నడిచింది. ఆ సమయంలో ఎన్.టి. రామారావు సొంత చిత్రం ‘జయసింహ’ (1955) ను ప్రారంభిస్తూ, అక్కినేనిని హీరో తమ్ముడి పాత్రకు తీసుకుందామనుకుంటే, కాల్షీట్లు సర్దుబాటు కాలేదు. దాంతో ‘వద్దంటే డబ్బు’ సినిమా షూటింగు విరామంలో పరిచయమైన కాంతారావు కు తమ్ముడు ‘వీరసింహుడు’ పాత్రను కట్టబెట్టారు. అయితే కాంతారావు కు అనుకోకుండా ‘నత్తి’ వచ్చింది. అది తెలుసుకున్న హెచ్. ఎం. రెడ్డి కాంతారావుకు ఒక తెలిసిన డాక్టర్ సత్యనారాయణ ద్వారా వైద్యం ఇప్పించి, నయం చేయడమే కాకుండా ధైర్యాన్ని నూరిపోశారు. ఈ చిత్రం విడుదలై నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. కాంతారావుకు సహాయనటుడిగా మంచి పేరొచ్చింది. తరవాత ఎన్.టి.ఆర్ నటించిన ‘గౌరీ మహాత్మ్యం’ (1956) లో శివుడి పాత్ర పోషించారు. పౌరాణిక చిత్రాల్లో నటించడం కాంతారావుకు అదే తొలిసారి. అదే స్పూర్తితో బి.ఎస్. రంగా మూడుభాషల్లో నిర్మించిన ‘భక్త మార్కండేయ’ (1956) సినిమాలో కూడా కాంతారావు శివుడుగా నటించారు. తరవాత శివుడి వేషంలో కాంతారావు కనుపించిన చిత్రం ‘శ్రీరామాంజనేయ యుద్ధం’(1958). దీనికి ముందు ‘సతీ అనసూయ’ చిత్రంలో కాంతారావు విష్ణుమూర్తి పాత్రలో నటించారు.

నారద పాత్రలో అలరిస్తూ…

విజయగోపాల్ ప్రొడక్షన్స్ నిర్మాతలు జెట్టి చంద్రశేఖరరెడ్డి, ముంగమూరు బ్రదర్స్ 1958లో ‘గంగా గౌరీ సంవాదం’ సినిమా నిర్మిస్తూ కాంతారావు కు నారదుడు పాత్రను ఇచ్చారు. చాయాగ్రాహకుడు వి.ఎన్. రెడ్డి (హిందీలో ‘మయూర్ పంఖ్’, ‘పూరబ్ అవుర్ పశ్చిమ్’ వంటి అద్భుతమైన సినిమాలకు చాయాగ్రాహకుడు గా పనిచేశారు)దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ సినిమాలో శివుడుగా సిహెచ్. నారాయణరావు, గౌరిగా జానకి, గంగ గా కృష్ణకుమారి నటించారు. అశ్వరాజ్ పిక్చర్స్ నిర్మాత కె. గోపాలరావు రజనీకాంత్ దర్శకత్వంలో భారీ తారాగణంతో ‘దీపావళి’ సినిమా నిర్మించారు. అందులో ఎన్.టి.ఆర్ కృష్ణుడుగా, ఎస్.వి. రంగారావు నరకాసురుడుగా, సావిత్రి సత్యభామగా నటించగా నారదుని పాత్ర కాంతారావు పోషించారు. నారదుడి పాత్ర పోషణ గమనినించిన రామారావు ముగ్ధుడైపోతూ “కాంతారావు గారూ నేను రాముడు, కృష్ణుడు, శివుడు వంటి పాత్రలన్నీ ధరిస్తాను. కానీ, నారదుడి పాత్రను జీవితంలో ధరించను. ఆ పాత్ర ఎప్పటికీ మీకోసమే రిజర్వు అయివుంటుంది” అన్నారు. అన్నమాట ప్రకారం రామారావు ఎన్నడూ నారదుని పాత్రను పోషించలేదు. తరవాత కాంతారావు నారదుడుగా ‘తారాశశాంకం’ (1969) వంటి అనేక సినిమాలలో రాణించిన విషయం తెలిసిందే. వెంకటేశ్వర ప్రొడక్షన్స్ వారు ‘సతీ సుకన్య’ (1959) సినిమా నిర్మిస్తున్నప్పుడు విఠలాచార్య సెట్లోకి రావడం జరిగింది. కాంతారావుతో మాట్లాడుతూ ‘’కన్యాదానం’ సినిమా సరీగా పోలేదు కనుక ఈ సారి జానపదచిత్రం నిర్మిస్తాను. అందులో నువ్వే హీరో” అని చెప్పి ‘జయవిజయ’ (1959) చిత్రాన్ని నిర్మించాడు. సినిమా బాగా ఆడింది. శ్రీరామ పిక్చర్స్ వారు ‘భక్త అంబరీష’ (1959) సినిమా నిర్మిస్తే అందులో కాంతారావు జూనియర్ శ్రీరంజని సరసన నటించారు. సుందర్లాల్ నహతా హిందీలో విజయవంతమైన ‘బడా భాయి’ సినిమాని తెలుగులో సి.ఎస్. రావు దర్శకత్వంలో ‘శభాష్ రాముడు’ పేరుతో పునర్నిర్మిస్తూ కాంతారావు కు ఇనస్పెక్టర్ పాత్రను ఇచ్చారు. సినిమా బాక్సాఫీస్ హిట్టయింది. తరవాత సుందర్లాల్ నహతా అశ్వత్థనారాయణ తో కలిసి నిర్మించిన ‘శాంతినివాసం’ (1960) చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు అన్న పాత్రను కాంతారావుకు ఇచ్చారు. ఆ సినిమా బాగా ఆడింది. తరవాతి కాలంలో ‘శాంతినివాసం’ చిత్రాన్ని జెమినీ వాసన్ హిందీలో ‘ఘరానా’ పేరుతో పునర్నిర్మించారు. అక్కినేని పాత్రను రాజేంద్రకుమార్, కాంతారావు పాత్రను రాజకుమార్ పోషించారు. హిందీలో ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా రవి కి ఉత్తమ సంగీత దర్శకునిగా, షకీల్ బదాయుని కి ఉత్తమ గేయ రచయిత (హుస్న్ వాలే తేరా జవాబ్ నహీ పాటకు) గా ఫిలింఫేర్ బహుమతులు, తెచ్చిపెట్టాయి. బి.ఎస్.నారాయణ నిర్మించిన ‘మాంగల్యం’ (1960) సినిమాలో దేవికకు జంటగా కాంతారావు నటించగా ఆ చిత్రం విజయవంతమైంది. 1960లో కాంతారావు ఏకంగా పది సినిమాల్లో నటించారు. జగన్నాథ్ దర్శకత్వంలో ‘శ్రీకృష్ణ రాయబారం’ లో అర్జునుడుగా నటించాక, గుత్తా రామినీడు దర్శకత్వంలో ‘చివరకు మిగిలేది’లో సావిత్రికి జోడీగా కాంతారావు నటించారు. బెంగాలీ చిత్రం ‘దీప్ జల్ జాయ్’ కి ఈ చిత్రం రీమేక్. కరీంనగర్ కు చెందిన పురుషోత్తమరెడ్డి, సత్యనారాయణరావు కలిసి ‘మంజీరా’ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య రెండవ హీరోగా నటించగా, డాక్టర్ ప్రభాకరరెడ్డి ఈ సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేశారు…అదీ డాక్టర్ పాత్రలో! సినిమా గొప్పగా ఆడకపోయినా సావిత్రి, కాంతారావు నటనకు మంచి మార్కులు పడ్డాయి. తరవాత ఘంటసాల నిర్మించిన ‘భక్త రఘునాథ్’ సినిమాలో కథానాయకుడిగా, ఎస్.డి. లాల్ నిర్మించిన ‘సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి’లో రాకుమారిని రక్షించే రాకుమారుని పాత్రలో కాంతారావు నటించారు. సినిమా బాగా ఆడింది. ఇందులో రాకుమారిగా దేవిక నటించింది. అప్పటినుంచి కాంతారావు-దేవిక హిట్ పెయిర్ గా గణుతికెక్కారు. తరవాత చిత్తజల్లు పుల్లయ్య నిర్మించిన ఫ్యాంటసీ చిత్రం ‘దేవాంతకుడు’ సినిమాలో విష్ణుమూర్తి పాత్రను కాంతారావు పోషించారు. కాంతారావు ఆహార్యానికి ముగ్ధుడైన పుల్లయ్య తరవాత శంకరరెడ్డి నిర్మించిన ‘లవకుశ’ సినిమాలో లక్ష్మణుడి పాత్రను ఇచ్చి కాంతారావుకు మంచి పేరు తెప్పించారు. అలాగే విఠలాచార్య నిర్మించిన ‘కనకదుర్గ పూజా మహిమ’ చిత్రంలో కాంతారావు కృష్ణకుమారి సరసన హీరోగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 1961లో నటి కన్నాంబ నిర్మించిన ‘ఉషాపరిణయం’ సినిమాలో కాంతారావుది అనిరుద్ధుడి పాత్ర. జమున హీరోయిన్ గా నటించింది. సినిమా బాగా ఆడలేదు. పాలగుమ్మి పద్మరాజు దర్శకత్వం వహించిన ‘బికారిరాముడు’లో నాగభూషణం తమ్ముడుగా కాంతారావు నటించారు. అది బాక్సాఫీసు వద్ద విఫలమైంది. హైదరాబాద్ మూవీస్ వారు నిర్మించిన ‘పెళ్ళికాని పిల్లలు’ చిత్రంలో కాంతారావు నెగటివ్ పాత్రలో నటిస్తే ప్రేక్షలు హర్హించలేదు. ఎ.వి.ఎం. సంస్థ హిందీలో నిర్మించిన ‘భాయి భాయి’ సినిమా ఆధారంగా సుందర్లాల్ నహతా, డూండీ తెలుగులో నిర్మించిన ‘శభాష్ రాజా’ సినిమాలో కూడా కాంతారావుది నెగటివ్ పాత్రే. అందులో కాంతారావు బాగా రాణించారు. తరవాత ‘సతీ సులోచన’ (1961)లో కాంతారావు రాముడి పాత్ర ధరించారు.

సీతారామ కల్యాణంలో రామారావు తో…

ఎన్.టి.ఆర్ ‘సీతారామ కల్యాణం’ (1961) సినిమా నిర్మిస్తూ గతంలో చెప్పినట్లే నారద పాత్రను కాంతారావు కు ఇచ్చారు. “బ్రదర్ ఈ చిత్రం లో హాస్యానికి తావులేదు. శివరావు పాత్ర వున్నా అది సామాన్య జనులకోసమే. కాస్తోకూస్తో హాస్యం పండాలంటే అది నారదుడి పాత్ర ద్వారే కావాలి. అందుకు మీరే సమర్ధులు. మీకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇస్తున్నాం. ఎలా అభినయించాలో మీరే నిర్ణయించుకోండి” అంటూ రామారావు కాంతారావు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సినిమా బాక్సాఫీస్ హిట్ కావడమే కాకుండా కాంతారావు ధరించిన నారద పాత్ర ప్రేక్షకులను రంజింపజేసింది. అప్పుడే జయంతి పిక్చర్స్ బ్యానర్ మీద కె.వి. రెడ్డి ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’(1963) సినిమా నిర్మించదలచి కృష్ణుడిగా ఎన్.టి.ఆర్ ని, అర్జునుడుగా అక్కినేనిని, సుభద్రగా బి. సరోజాదేవిని తీసుకున్నారు. కాంతారావుకు నారదుడు పాత్ర దక్కింది. ”కె.వి. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటించడం ఒక గొప్ప అనుభూతి” అని కాంతారావు చెప్పుకునేవారు. విఠలాచార్య దర్శకత్వంలో నిర్మాత డూండేశ్వరరావు హిందీలో హిట్టయిన ‘ఖైదీ నంబర్ 911’ సినిమాను తెలుగులో ‘ఖైదీ కన్నయ్య’ పేరుతో రీమేక్ చేశారు. సినిమా హిట్టయింది. అలాగే బి.ఏ. సుబ్బారావు నిర్మించిన ‘భీష్మ’ చిత్రంలో కాంతారావు కాశీరాజు పాత్రను పోషించారు. ఆ సినిమా కూడా హిట్టయింది. కానీ, కె.బి. తిలక్ నిర్మించిన ‘చిట్టితమ్ముడు’ (ఆలివర్ ట్విస్ట్ కు తెలుగు రూపకం) సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. సుందర్లాల్ నహతా చిత్రం ‘రక్తసంబంధం’ (తమిళ పాశమలర్ చిత్రానికి రీమేక్) లో హీరో ఎన్.టి.ఆర్ కాగా కాంతారావుది నెగటివ్ పాత్ర. సూపర్ హిట్టయిన ఈ సినిమాలో దుష్టపాత్రకు కాంతారావుకు మంచి మార్కులే పడ్డాయి. తోటలోపిల్ల కోటలోరాణి, ఆడబ్రతుకు, జ్వాలాద్వీప రహస్యం, పాండవవనవాసము, ప్రతిజ్ఞాపాలన, వీరాభిమన్యు, పల్నాటి యుద్ధం, శ్రీక్రిష్ణ పాండవీయం, అగ్గిదొర, కంచుకోట, చిక్కడు దొరకడు, దేవకన్య, రణభేరి, బొమ్మలు చెప్పిన కథ, సప్తస్వరాలు, సుగుణసుందరి కథ, ఆనందనిలయం, ఏకవీర, శ్రీకృష్ణ సత్య, దేవుడుచేసిన మనుషులు, ఓ సీత కథ, వంశవృక్షం, ముత్యాలముగ్గు మొదలైన సినిమాలు కాంతారావుకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. కాంతారావు చివరిసారిగా నటించిన చిత్రం కె. రాఘవేంద్రరావు నిర్మించిన ‘పాండురంగడు’(2008).

చేతులు కాల్చిన సొంత సినిమాలు…

వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో కాంతారావు 1969లో హైమా ఫిలిమ్స్ సంస్థను స్థాపించి, ‘సప్తస్వరాలు’ సినిమా నిర్మించారు. ఇందులో కొంత పౌరాణికం, కొంత జానపదం సమ్మిళితమై వుంటాయి. సినిమా నిర్మాణ వ్యయం ఆరు లక్షలు దాటింది. అప్పుడే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఊపందుకుంది. సినీరాజకీయ కారణంతో భావనారాయణ ‘లవ్ ఇన్ ఆంద్రా’ సినిమా తీసి కాంతారావు సినిమాకి పోటీగా విడుదల చేశారు. దాంతో ప్రాంతీయ భావాలు పెచ్చురిల్లి రెండు సినిమాలూ ఘోరంగా దెబ్బతిన్నాయి. కాంతారావు మరో చిత్రాన్ని నిర్మించి నష్టాలు పూడ్చుకోవచ్చని కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో ‘గండర గండడు’ అనే చిత్రాన్ని నిర్మించారు. సినిమా విజయవంతమైంది. కానీ ‘సప్తస్వరాలు’ మిగిల్చిన నష్టం పూడలేదు. అందుకోసం 1971లో కె.ఎస్. ఆర్. దాస్ దర్శకత్వంలో క్రైస్తవుల ఇతివృత్తం గల ‘ప్రేమజీవులు’ అనే సాంఘిక చిత్రాన్ని కృష్ణ హీరోగా, రాజశ్రీ హీరోయిన్ గా నిర్మించారు. అందులో కాంతారావుది నటనకు అవకాశమున్న గ్లామర్ లేని పాత్ర. గుమ్మడి ఈసినిమాను తీయవద్దని వారిస్తున్నా కాంతారావు ఆ సలహాను తేలికగా తీసుకున్నారు. చిత్రం ఘోరంగా విఫలమైంది. ఇంత నష్టం వాటిల్లుతున్నా తనవద్ద సహాయకుడిగా పనిచేసిన చక్రవర్తి హిందీ సినిమా ‘గుమ్ నామ్’ ఆధారంగా ఒక కథ తయారుచేసి కాంతారావు చేత పన్నెండు లక్షలు ఖర్చు పెట్టించి ‘గుండెలు తీసిన మొనగాడు’ (1974) చిత్రాన్ని కలర్ లో నిర్మింపజేశాడు. దానికి దర్శకుడు కూడా చక్రవర్తే. ఆ సినిమా కాంతారావును అన్నివిధాలా నష్టపరుస్తూ 16 లక్షల అప్పును మూటకట్టించి, విషాధానుభూతిని మిగిల్చింది. అపురూపంగా కట్టుకున్న ఇల్లు అమ్మి అప్పు తీర్చాల్సివచ్చింది. ఇంత జరిగినా కాంతారావు నటి వాణిశ్రీ చెప్పిన మాటలు నమ్మి చివరిసారిగా 1989 లో ‘స్వాతిచినుకులు’ సినిమా నిర్మించి నగానట్రా కూడా అమ్ముకొని లక్షలకొద్దీ అప్పుల వూబిలో పూర్తిగా కూరుకుపోయారు. దాంతో కాంతారావు మద్రాసు నగరాన్ని విడిచిపెట్టి రావలసివచ్చింది.

వ్యక్తిగతం…

1990లో కాంతారావు మద్రాసు వదలి హైదరాబాదులో నల్లకుంట లోని అద్దె ఇంటికి మకాం మార్చారు. ఆ ప్రదేశంలోనే వున్న 1200 గజాల దివ్యమైన స్థలాన్ని అమ్ముకున్నారు. కాంతారావుకు పుట్టపర్తి సాయిబాబా అంటే విపరీతమైన భక్తి. ఆయనకు నలుగురు కొడుకులు, ఒక కూతురు సుశీల. ఆమెకు ఆరోగ్యం క్షీణిస్తుంటే బాబా ఆశీస్సులతోనే ఆరోగ్యం మెరుగైంది. మొదటి కుమారుడి పేరు ప్రతాప్ (కాంతారావు తొలి సినిమా ‘ప్రతిజ్ఞ’ లో హీరో పేరుకు గుర్తుగా పెట్టారు). రెండవ కుమారుడు కేశవరావు (కాంతారావు తండ్రి పేరుకు గుర్తుగా పెట్టారు). మూడవ కుమారుడి పేరు రాజేశ్వరరావు (రాజా అని పిలుస్తారు). రాజా ‘సుడిగుండాలు’ సినిమాలో బాలనటుడిగా నటించాడు. తరవాత కాంతారావు నిర్మించిన సొంత సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కూడా నటించాడు. చివరి కుమారుడి పేరు సత్యం (సత్యసాయిబాబా పేరు పెట్టుకున్నారు). 2000 సంవత్సరంలో కాంతారావుకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారం లభించింది. కాంతారావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 22 మార్చి 2009 న హైదరాబాదులో మరణించారు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “తెలుగు సినీ రాకుమారుడు… కత్తి కాంతారావు

  1. తెలుగు వారి ప్రియమైన రాకుమారుడు కాంతారావు గారి గురించినశ్రీ షణ్ముకా చారి గారి వ్యాసం ఎంతో సమగ్రం గా ఆసక్తి కరం గా వుంది.ఒక మంచి అనుభూతి కల్గింది. రచయిత కు, మీకూ ఎంతో అభినందనలు మరియూ కృతజ్ఞతలు. Bomman. విజయవాడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap