ప్రజా కళలు, సాహిత్యాలకు జవసత్వాలు అందించిన బి.నరసింగరావు
సమ సమాజ వీరులం
నవ అరుణా జ్యోతులం
భారతదేశ వాసులం
భావిని నిర్మించుతాం
అతీతులం కులమతాలకు
మానవుడే మాకు దైవము
బీద, ధనిక భేదం లేని
సమాజమే మాకు గమ్యం
సికింద్రాబాద్ లోని ఆర్ట్ లవర్స్ పాఠశాల విద్యార్థుల కోసం ఆ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ సినీ దర్శకులు, సంగీత దర్శకులు, నటులు, స్క్రీన్ ప్లే రచయిత, కవి, రచయిత, చిత్రకారుడు,”ప్రజా” కళలకు, సాహిత్యానికి జవసత్వాలు అందించిన బి.నరసింగరావు 1971 లో రాసిన పాటలోని పల్లవి, ఒక చరణం మాత్రమే…
పై పాట తో “ఆర్ట్ లవర్స్” ఆశయం, లక్ష్యం ఆ రోజుల్లనే ఎలావుందో అర్థమవుతోంది.
బి.నరసింగరావు “ఆర్ట్ లవర్స్” వ్యవస్థాపకులు. ఆ సంస్థ జననాట్యమండలి గా ఆవిర్భావంలోను, ఆ తర్వాత కాలంలోనూ ఆయన సంస్థకు సారధ్య బాధ్యతలను నిర్వహించారు. అనంతర కాలంలో సినీ రంగంలోకి ప్రవేశించి ప్రజాభ్యుదయ, కళాత్మక సినిమాలను నిర్మించి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు అటు సినీ రంగం, ఇటు ప్రజాఉద్యమాలను దూరంగా ఉన్నట్టు కనిపించినా, ఆయన నిరంతరం సమాజాన్ని అధ్యయనం చేయడాన్ని మాత్రం ఆపలేదు. రచనా వ్యాసాంగాన్ని మానేయలేదు. తనకు అత్యంత ఆత్మీయుడు, ప్రజా సాంస్కృతికోద్యమ సహచరుడైన ప్రజా గాయకులు గద్దర్ మరణాంతరం గద్దర్ సంస్మరణ సభల్లో పాల్గొంటూ తరచుగా కనిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల తనను కలిసినప్పుడు ప్రస్తావించగా “మనిషిని మనిషి” అనిపించుకోవడం అంత సులభం కాదు, తాను మనిషిగా మనిషిని ప్రేమించడం, గౌరవించడమనే దారి నుండి ఎన్నడూ కూడా తప్పుకోలేదని స్పష్టం చేశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు కలిగిన బి.నరసింగరావు గతంలోకి మళ్ళీ ఒకసారి…
భూస్వామ్య కుటుంబానికి చెందిన బి.నరసింగరావు హైస్కూల్ విద్యనభ్యసిస్తున్నప్పుడే షెడ్యూల్ కులాలకు చెందిన తన తోటి విద్యార్థులు ఎదుర్కొన్న కుల వివక్షను ప్రత్యక్షంగా గమనించారు. అందరూ మనుష్యులే కదా, మనుష్యుల మధ్య ఈ కుల అడ్డుగోడలేమిటీ అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ రోజుల్లో అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన నరసింగరావు తన కుటుంబ సభ్యుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికి “కుల” వివక్షలపై ప్రశ్నించడాన్ని మానుకోలేదు. పైగా అమానవీయంగా కొనసాగుతున్న ఈ సామాజిక సమస్యపై అప్పటినుండే అధ్యయనం చేయడం ప్రాంభించారు.
సికింద్రాబాద్ అల్వాల్ లో స్కూల్ విద్యను ముగించుకున్న తర్వాత ఫైన్ఆర్ట్స్ కాలేజీలో పెయింటింగ్ లో ఎన్.డి.ఎఫ్.ఏ., చేసి, థియేటర్ ని జీవితంగా మార్చుకున్న నరసింగరావు ప్రజల నుండి నేర్చుకున్న కళారీతులను, ప్రజా సాహిత్యంతో జోడించి బృంద ప్రదర్శనలు, వీధి నాటకాల ద్వారా వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ఆయన వ్యవస్థాపనలో ఏర్పాటు చేయబడిన “ఆర్ట్ లవర్స్” స్థావరం హైదరాబాద్ నుండి 1970 లో అల్వాల్ కు మార్చబడింది. అప్పటికే ఏర్పడిన విప్లవ రచయితల సంఘం నక్సల్బరీ, శ్రీకాకుళం సాయుధ పోరాటాల భావజాలాన్ని సాహిత్యం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంలోనే “ఆర్ట్ లవర్స్” అల్వాల్ కేంద్రంగా నిరక్షరాస్యులైన యువకులకు రాత్రి పాఠశాలను నిర్వహిస్తూ, సాధారణ విద్యాబోధనతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలకు మూలాలను వివరిస్తూ, చిత్రలేఖనంలో కూడా శిక్షణ ఇచ్ఛేవారు. ఇవన్నీ నరసింగరావు పర్యవేక్షణలోనే మిత్రబృందం సహకారంతో కొనసాగేవి!
-ఎ. సమ్మయ్య