కార్టూనిస్ట్స్ డే – తెలుగు కార్టూన్ పయనం

నేషనల్ కార్టూనిస్ట్స్ సొసైటీ వారు 1990లో ‘మే 5’ వ తేదీని నేషనల్ కార్టూనిస్ట్స్ డే గా ప్రకటించారు. ఇదే రోజును ‘వరల్డ్ కార్టూనిస్ట్స్ డే ‘  గా కూడా కొందరు జరుపుకుంటున్నారు.
తెలుగు కార్టూన్ పయనం
ఇంగ్లీషులో ‘కార్టూన్’గా ప్రసిద్ధిలో ఉన్న మాటనే మనం తెలుగులో ‘వ్యంగ్యచిత్రాలు’గా వాడుతున్నాం. క్యారికేచర్ కూడా కార్టూన్లో ఒక భాగం కనుక – ‘కార్టూన్’ అనే మాటనే 1883లో ప్రస్తుతం మనం ఉదహరిస్తున్న అర్ధంలో ప్రాచూర్యంలోకి రానారంభించింది. ‘అన్ని బేల్’ కరక్కి’ అనే పెద్ద మనిషిని ఈ క్యారికేచరకు పితామహునిగా పేర్కొంటున్నారు. ఇక భారతీయ రాజకీయ వ్యంగ్య చిత్రాలకు పితామహునిగా ప్రసిద్ధుడు ‘శంకర్ పిళ్లే’ అయితే మన తెలుగు నాట కార్టూనకు శ్రీకారం చుట్టింది ‘తలిశెట్టి రామారావు’ వృత్తిరీత్యా న్యాయవాది, ప్రవృత్తి రీత్యా చిత్రకారుడు అయిన రామారావుగారు 1930 సం.లో గీసిన కార్టూన్లు ఆంధ్రపత్రిక, భారతి వంటి పత్రికల్లో ముద్రితమయ్యాయి. అంటే తెలుగు కార్టూన్ కుతొంబై యేళ్ళ చరిత్ర ఉంది. ఈ కాలంలో తెలుగు కార్టూనను పరిపుష్టం చేసిన కార్టూనిస్టులెందరో. బాపు, జయదేవ్, సత్యమూర్తి, బాలి, మోహన్, శ్రీధర్, సురేంద్ర, సుభాని, ఏ.వి.యమ్, శంకు,బాబు, ఎం.ఎస్. రామకృష్ణ , రాగతి పండరి, సరసి లాంటి అనేక మంది కార్టూనిస్టులు తమ కలాలను రుళిపించి తెలుగువాడి ‘వాడి’ని ‘వేడి’ని దశదిశలా వ్యాపింపచేశారు.
సుమారు 80వ దశకం వరకూ కార్టూన్ కళ ఉచ్ఛస్థితిలో కొనసాగిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ప్రింట్ మీడియాకు ఆదరణ తగ్గడం, పత్రికల్లో కార్టూన్లు స్థానే సినిమా టిట్ బిట్స్ పుట్టుకురావడంతో ఈ కళ వెనుకబడిపోయింది. పదిహేనేళ్ళ క్రితం తెలుగులో నూట ఏబైకి పైగా కార్టూనిస్టులుంటే ఆ సంఖ్య ఇప్పుడు ఏబై-అరవై లోపు కు తగ్గిపోయింది. దీనికి అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా రెమ్యూనిరేషన్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావాలను చెప్పుకోవచ్చు. తెలుగు పత్రికలకు పాఠకాదరణ తగ్గిపోవడంతో కార్టూనిస్టులను పోషించే (ప్రోత్సహించే) శక్తి సన్నగిల్లిపోయింది. కళాకారులను బతికించలేని ఏ కళైనా మనుగడ ఉండదన్నది జగద్వితీయం. ఇక్కడ జరుగుతున్నదీ అదే.
ప్రస్తుతం కార్టూన్లకు పత్రికల వారు చెల్లిస్తున్న రెమ్యూనిరేషన్ సగటున లెక్కిస్తే, కార్టూనిస్టు నెలకు జీవనభృతికి సరిపడా ఆదాయం రావాలంటే కనీసం నెలకు 300 కార్టూన్లు గీయాల్సి ఉంటుంది. ఈ సంఖ్యలో రెగ్యులర్ గా కార్టూన్లు గీయడమనేది అసాధ్యం. గీసాడే అనుకుందాం, ఆ సంఖ్యలో కార్టూన్లను ప్రచురించే పత్రికలేవి. రెమ్యూనిరేషన్ ఇవ్వగలిగే పత్రికలు (తెలుగులో) కేవలం వేళ్ళమీద లెక్కించేవిగా ఉన్నాయి. హాస్య ప్రధానంగా వెలువడే పత్రికలు సైతం కార్టూనిస్టులకు రెమ్యూనిరేషన్ చెల్లించే పరిస్థితులులేవు.
కార్టూన్ అంతర్జాతీయ భాష, ఏదేశం వారికైనా, ఏభాష వారికైనా కార్టూన్ (కాప్షన్స్లెస్) అర్ధం అవుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా కార్టూనిస్టులను ప్రోత్సహిస్తున్నది. కొన్ని టీవి ఛానల్స్ వారు న్యూస్ లో కార్టూన్ను యానిమేషన్ జోడించి చూపిస్తున్నారు. ఇలాంటివి ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తాయి. తెలుగులో ‘టీవి9’ వారు ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ముందున్నారు. కొన్ని ప్రాంతాలలో సిటీన్యూస్ వారు కూడా కార్టూన్లను ప్రసారం చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే. ఈ దిశగా ఇంకా ప్రయత్నాలు, ప్రయోగాలు జరగాల్సి ఉంది.

గ్లోబలైజేషన్‌ దేశాల సరిహద్దులు చెరిగిపోయి. ప్రపంచాన్ని ఇంటర్నెట్లో వీక్షించే సాంకేతిక – మానవ మనుగడలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఇది కార్టూనిస్టులకు గొప్పవరం. అంతర్జాతీయ కార్టూన్లను వీక్షించడానికి, దేశవిదేశాలలో జరిగే కార్టూన్ పోటీలు ప్రదర్శనలలో పాల్గొనడానికి మంచి అవకాశాలనే కల్పిస్తున్నదని చెప్పవచ్చు. ఈ దిశగా మన తెలుగు కార్టూనిస్టులు బానే కృషి చేస్తున్నారు. వీరిలో జయదేవ్, సుభానీ, ఇ.వి.ఎం.రాజు, ఆకుండి సాయిరాం, శ్యాంమోహన్, శంకర్, కొండా రవిప్రసాద్, నివాస్, సాయికృష్ణ, గాలిశెట్టి, అనుపోజు అప్పారావు, నాగిశెట్టి, కిరణ్,వెంకటేష్, వర్చస్వి, వేముల, రంగాచారి లను పేర్కొనవచ్చు. ఇలాంటి పోటీలో ప్రైజ్ మనీ కూడా పెద్ద మొత్తంలో ఉండటం హర్షనీయం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కార్టూనిస్టులకు మరింత వెసులుబాటు కలిగింది, తాము చిత్రించిన కార్టూన్లను అయా గ్రూప్లలో పోస్ట్ చేసి మిత్ర కార్టూనిస్టుల సూచనలను, అభిప్రాయాలను, ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. దీనికి మంచి ఉదాహరణగా జయదేవ్ బాబు గారి అధ్వర్యంలో నడుపబడుతున్న వరల్డ్ తెలుగు కార్టూనిస్ట్స్ వాట్స్యాప్ గ్రూప్ చెప్పుకోవచ్చు. 90 సంవత్సరాల చరిత్ర కల్గిన తెలుగు కార్టూనిస్టులందరి జీవిత వివరాలతో సమగ్ర పుస్తకం తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పటికి 88 నెలలుగా 64కళలు.కాం లో మన కార్టూనిస్టుల ఫీచర్ నిర్వహిస్తున్నాను.

కార్టూన్లను అమితంగా అభిమానించే వారిలో చిన్నపిల్లలు ముందుంటారు. రెండు మూడేళ్ళ క్రితం వరకు కొన్ని దేశాలవారికి మాత్రమే పరిమితమైన వాల్ డిస్నీ, మిక్కీమౌస్ లాంటి కార్టూన్ ఫిల్మ్ లను ఇప్పుడు టీవీలలో ఆయా ప్రాంతీయ భాషలలో చూసే అవకాశం కల్గడం నేటి చిన్నారులకు గొప్ప అనుభూతినివ్వడమే కాకుండా, వారిలో సృజనాత్మకతను పెంపొందించడానికి సహకరిస్తాయి. ప్రింట్ మీడియాలో ఆదరణ తగ్గినా యానిమేషన్ కార్టూన్ ఫిల్మ్ లాంటి రంగాలలో అవకాశాలు మెరుగుపడితే కార్టూనిస్టులకు మంచిరోజులు రావచ్చు. యానిమేషన్ రంగంలో ఒక్క హైదరాబాద్ లోనే నాలుగైదు స్టూడియోలు నెలకొనడం – ఇదంతా కార్టూనిస్టులకు మంచి భవిష్యత్ నే ఊరిస్తున్నా పైరంగాలలో రాణించడం పేపర్ పై నాలుగు బొమ్మలు గీసి పాఠకులను నవ్వించడం అంత తేలికకాదన్న సంగతి కార్టూనిస్టులు గర్తించాలి. దీనిక తగినంత కృషితో పాటు ఎంతో ఓర్పు కావాలన్నది ఏ  కార్టూన్  ఫిల్మ్ చూసినా మనకు అర్ధ అవుతుంది. ఇది మన తెలుగు కార్టూన్ గురించి రెండు దశాబ్దాలుగా నాకున్న అవగాహనతో వ్రాసింది. మీరూ ఆలోచించండి….. తెలుగు కార్టూన్ పయనం ఎటో…..?

-కళాసాగర్

2 thoughts on “కార్టూనిస్ట్స్ డే – తెలుగు కార్టూన్ పయనం

  1. మంచి వ్యాసం సార్.మీరన్నట్టు ప్రతి కార్టూనిస్ట్ పరిణితి సాధించాలి.కృషి చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap