‘ఎన్టీఆర్’ వంద రూ. నాణానికి మూడో కోణం

(శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపథి ముర్ము చేతులమీదుగా ఎన్టీఆర్ నాణెం విడుదల)

ఈ రోజుల్లో ఎవరైనా చనిపోతే, రెండోరోజే మరచిపోతున్నారు. అలాంటిది చనిపోయి పాతికేళ్లు అయినా తెలుగు వారి గుండెల్లో ఉన్నారు. ఆయనే చరిత్ర పురుషుడు విశ్వవిఖ్యాత నట సౌర్వభౌముడు నందమూరి తారక రామారావు. రెండు రోజుల క్రితం ఆయన శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో విడుదలైన ఎన్టీఆర్ నాణెం పై వివిధ విమర్శలు వింటున్నాం. ప్రశంసలు చూస్తున్నాం. ఎన్నికల సమయం కాబట్టి నాణెం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఎవరికి వాళ్ళు యమ రంజుగా నటిస్తున్నారు.
అది చెల్లని నాణెం అని తెలిసినా సరే, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు హైదరాబాద్ మింట్ కాంపౌండ్, చర్లపల్లి మింట్ కార్యాలయ కౌంటర్ కు. అదీ అభిమానం అంటే. అభిమానుల ప్రేమ ఇలాగే ఉంటుంది. ఎన్టీఆర్ నటన పరంగా పరిపాలన పరంగా అందరి హృదయాల్లో గూడు కట్టుకున్నారు. అందుకే వివిధ జిల్లాల నుంచి మింట్ కౌంటర్ కు వస్తున్నారు. గంటల తరబడి క్యూ లో నిలబడి కొనుగోలు చేస్తున్నారు. ఆన్ లైన్ లో కూడా అందుబాటులోకి తెస్తాం అని సంబంధిత అధికారులు ప్రకటించిన గంట లోపే లక్షల మంది మింట్ అని సెర్చ్ చేసారంటేనే అర్ధం చేసుకోవచ్చు.

నాణెం గురించి…
నాణేలు రెండు రకాలు. ఒకటి చెల్లని నాణెం. దీన్ని స్మారక నాణెం అంటారు. ఇంకొకటి మారక నాణెం. ఇది చెల్లుబాటులో ఉండే నాణెం. స్మారక నాణెం ఎవరైనా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. దగ్గుబాటి పురంధేశ్వరి గారు 14 వేల ఎన్టీఆర్ నాణేలు ముద్రించేందుకు డబ్బులు చెల్లించారు. కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతి తప్పనిసరి. ఆమె బీజేపీ లో కీలక నేత కాబట్టి సాధించుకున్నారు. రాష్టపతి భవన్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుని సక్సెస్ అయ్యారు.
కేంద్ర ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, మింట్ అని రెండు విభాగాలు ఉంటాయి. హైదరాబాద్ తో పాటు ముంబయి, కోల్ కతాలలో వున్న మింట్ లో చెల్లుబాటులో ఉండే నాణేలు తయారు చేస్తారు. నాసిక్ లో వున్న ప్రెస్ లో నోట్లు ముద్రిస్తారు. స్టాంప్, ప్రామిసరీ పేపర్లు కూడా అక్కడే ముద్రిస్తారు. స్మారక నాణేలు కూడా హైదరాబాద్ మింట్ లో ముద్రిస్తారు. ఎన్టీఆర్ నాణెం ఇక్కడే రూపొందించారు.

ప్రభుత్వం స్మారక నాణేలు వేయదు:
పి.వి. నరసింహారావు గారి నాణెం ఎందుకు వేయలేదని చాలా మంది మోదీని విమర్శిస్తున్నారు. అసలు ప్రభుత్వం ఎప్పుడూ స్మారక నాణేలు వేయదు. వారి కుటుంబ సభ్యులో, ట్రస్ట్ సభ్యులో, అభిమానులో పూనుకోవాలి. పి.వి. గారి కుటుంబం అందుకు ముందుకు రాలేదు. కాబట్టి ఈ విమర్శకు తావు లేదు.
లక్ష్మీపార్వతిని ఆహ్వానించలేదని ఆమె శాపనార్ధాలు పెడుతోంది. నిజానికి ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకోవడాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించలేదు. అందుకే కుటుంబ సభ్యులు అందరూ ఎన్టీఆర్ ను ఆ చివరి దశలో దూరం పెట్టారు. ఎన్టీఆర్ ను పట్టించుకోవడం లేదని, అందుకే తాను చూసుకోవాల్సి చేసుకోవాల్సి వచ్చింది అనేది లక్ష్మి పార్వతి వాదన. అలా కుటుంబ సభ్యులు దూరం కావడానికి కారణం ఒకటి లక్ష్మీపార్వతి దూకుడు. రెండు లక్ష్మీ పార్వతీపై ఎన్టీఆర్ మనసు పారేసుకోవడం. ఆ రెండూ కుటుంబ సభ్యులకు నచ్చలేదు.

నాణెం విడుదల చేసింది కేంద్రం కాదు:

ఎన్టీఆర్ నాణెం విడుదల చేసింది కేంద్రం కాదు. పురంధేశ్వరి నాయకత్వంలో జరిగింది. అలాంటప్పుడు లక్ష్మీపార్వతిని ఎందుకు పిలుస్తారు? ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చినప్పుడు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు గుర్తుకురాని భర్త ఇప్పుడు ఆమె కు గుర్తుకు రావడం రాజకీయమే. టీడీపీ వ్యతిరేక పార్టీ లో చేరడం కూడా ఆమె చేస్తున్న కక్షపూరిత రాజకీయమే. ఎన్టీఆర్ చనిపోయాక ఆమె రాజకీయాల జోలికి వెళ్లకుండా అలా సైలెంట్ గా ఉండి ఉంటే కొన్నాళ్లకు అయినా కలుపుకుని పోయేవారేమో. అలా కాదుగా. ఆమెకు నోరు ఎక్కువే, ఆవేశము ఎక్కువే. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. నిజానికి నాణెం ఏర్పాటులోనూ పురంధేశ్వరి ఫక్తు రాజకీయం నడిపారు. వేదిక పై ఎవరిని కూర్చోబెట్టాలో కూడా ఆమె చేసిన రాజకీయమే. కుమార్తెలు, కుమారులు మాత్రమే ఉండాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. తద్వారా చంద్రబాబు కు వేదిక అవకాశం ఇవ్వకూడదనే విషయంలో ఆమె గెలిచారు. అందుకే చంద్రబాబు ప్రేక్షక పాత్ర వహించారు. అలా నడ్డా పక్కన చేరి పులిహోర కలుపుకునే అవకాశం రావడం ఆయనకు కొంత ఉపశమనం. నారా లోకేష్ పాదయాత్ర లో ఉండటం, జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ బిజీ లో ఉండటం వల్ల వెళ్లలేక పోయారు.

బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రతాప్ నడ్డా హాజరు కావడం కూడా రాజకీయమే. చంద్రబాబు తన పార్టీ ఎంపిలు అందరిని వెంట పెట్టుకుని వెళ్లడం కూడా ఒక రాజకీయ ప్రచారమే. కుటుంబ సభ్యులు అందరూ ఒకే తాటి పై వున్నామని చెప్పే ప్రదర్శన కూడా ఇంకో రకపు రాజకీయమే. లక్ష్మీపార్వతిని ప్రెస్ మీట్ పెట్టించి తిట్టించిన వైనం వెనుక వై.ఎస్.ఆర్.సి.పి. రాజకియం. ఇలా నాణెం చుట్టూ రాజకీయం బొంగరాలాట ఆడింది.

రాజ్యసభలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయించింది కూడా అప్పటి కేంద్ర మంత్రిగా వున్న పురంధేశ్వరి గారే. అప్పుడు కూడా లక్ష్మీ పార్వతి కి ఆహ్వానం లేదు. అప్పుడు కూడా ఆమె ఆహ్వానం లేదని ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చింది. సరిగ్గా విగ్రహం ప్రారంభోత్సవం రోజు ఆమె వెళ్లి రాజ్యసభ గేటు దగ్గర పడికాపులు కాసింది. ఆ విషయం తెలిసి యలమంచిలి శివాజీ గారు ప్రత్యేక పాస్ ఇప్పించి లోపలకు పంపించారు.
ఇప్పటికే 14 వేల నాణేలలో రెండు వేలు పురంధేశ్వరి గారు తీసుకున్నారు. మిగిలిన 12 వేలలో రోజుకు రెండు వేల నాణేలు విక్రయిస్తున్నారు నిన్నటి నుంచి. ఇంకో మూడు రోజుల్లో నాణేలు అయిపోతాయి. ఎన్టీఆర్ అభిమానుల ఉత్సాహాన్ని డిమాండ్ ను అంచనా వేసిన అధికారులు కొన్ని రోజుల్లోనే తిరిగి అదనంగా ముద్రించి అందరికి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఇది కూడా చరిత్రే. మింట్ చరిత్రలో ఇంత వరకు రెండవ ముద్రణ చేసిన స్మారక నాణెం లేదు. అది ఎన్టీఆర్ రికార్డ్. అది చెల్లని నాణెం అయినా అదొక చారిత్రాత్మక నాణెం. అది ఇంట్లో ఉండటం అభిమానం గౌరవంగా భావిస్తున్నారు అభిమానులు. కొందరు పూజ గదిలో పెట్టుకుంటామని నాతో స్వయంగా చెప్పారు. అవును ఎన్టీఆర్ చాలామందికి దేవుడే.

ఎన్టీఆర్ నాణెం మూడు రకాలుగా రూపొందించారు. ఉడెన్ బాక్స్ లో ఉంచిన నాణెం ధర 4,850 రూపాయలు. ప్రూఫ్ నాణెం విలువ 4385 రూపాయలు, యూఎన్ సి నాణెం 4,050 రూపాయలు. సెప్టెంబర్ 4 వరకు అందుబాటులో వుంటాయని చెప్పారు కానీ, జన అభిమానం చూస్తే మరో రెండు రోజుల్లో నాణేలు మిగిలే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఆన్ లైన్ విక్రయాలు ప్రారంభించలేదని, తదుపరి ముద్రణ అనంతరం అందుబాటులోకి తెస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.

-డా. మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap