విఠలాచార్య ‘బందిపోటు’ చిత్రానికి 60 ఏళ్ళు

(‘బందిపోటు’ చిత్రానికి 60 ఏళ్ళు పూర్తైయిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…)

“వైషమ్యం, స్వార్ధపరత్వం, కుటిలత్వం, ఈర్ష్యలు, స్పర్ధలు, మాయలతో మారుపేర్లతో చరిత్రగతి నిరూపించితే… ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు” అని మహాప్రస్థానంలో దేశ చరిత్రల్ని ఉటంకిస్తూ ఆనాడే మహాకవి శ్రీశ్రీ చెప్పారు. ఏ దేశచరిత్ర చూసినా ఇవన్నీ కనిపించకమానవనేది సత్యం. ఈ చారిత్రిక సత్యాలే జానపద చిత్రాలుగా మారి కోకొల్లలుగా తెలుగులో సినిమాలుగా వచ్చాయి. ఆ కోవలోనే జానపద విరించి విఠలాచార్య తొలిసారి నటరత్న ఎన్.టి.ఆర్ తో కలిసి పనిచేసిన సూపర్ గుడ్ చిత్రమే రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకం కింద సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన ‘బందిపోటు’ చిత్రం. ఈ చిత్ర విజయమే తదనంతరకాలంలో విఠలాచార్య-ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో 15 చిత్రాలువచ్చి విజయ దుందుభి మోగించేందుకు సహకరించిందన్న వాస్తవం సినీ చరిత్ర అంగీకరించే సత్యం! “మంచితనం కలకాలం నిలిచివుంటుంది… వంచన యేనాటికైనా నశించితీరుతుంది” అనే సందేశమే ఈ చిత్ర ఇతివృత్తం. ఆగష్టు 15, 1963 స్వాతంత్ర్య పర్వదినాన విడుదలైన బందిపోటు చిత్రం 5 కేంద్రాల్లో (దుర్గ కళామందిర్-విజయవాడ; క్రౌన్ టాకీస్- కాకినాడ; వీరభద్ర టాకీస్-రాజమండ్రి; ప్రభాత్ టాకీస్–హైదరాబాద్; విజయలక్ష్మి టాకీస్-నెల్లూరు) శతదినోత్సవం జరుపుకొంది.

జానపదం వైపు సుందర్ లాల్ నహతా, డూండీల దృష్టి:

1962లో శతదినోత్సవచిత్రం ‘రక్త సంబంధం’ నిర్మించిన నిర్మాతలు సుందర్ లాల్ నహతా, డూండీ తమ తదుపరి ప్రయత్నంగా ఒక జానపద చిత్రాన్ని తీయాలని జానపద బ్రహ్మ విఠలాచార్యను సంప్రదించారు. దీనికి కారణం ఆంధ్రదేశంలోని ఆబాలగోపాలం జానపద చిత్రాల్ని ఆదరించడమే! జానపద చిత్రాన్ని ఒక్కసారి కాదు పదేపదే చూడాలనిపిస్తుంది. ఈ జానపదాలపై మక్కువ మనదేశంలోనే కాదు, మలేషియా, సింగపూర్, బర్మా వంటి సరిహద్దు దేశాలకూ విస్తరించింది. బందిపోటు చిత్రం నిర్మించక ముందు రష్యాలో ‘స్టోన్ ఫ్లవర్’ అనే చిత్రం, చెక్-స్లోవేకియాలో ‘జనోసిక్’ అనే చిత్రం, హాలివుడ్ లో ఎన్నో జానపద చిత్రాలు తయారై యువతను సమ్మోహనపరిచాయి. ముఖ్యంగా గ్రామీణ జీవనంలో వున్న సామూహిక జనాన్ని మెప్పించే వీరోచిత గాధలు, సాహస మజిలీ కథలూ, నీతిదాయకమైన చిత్రాలు ఒక్క జానపద వాహిని ద్వారానే రంజింప చెయ్యగలవనే విషయం రుజువైంది. ఒక దుష్టుడు, మరో శిష్టుడు; ఒక యక్షుడు, మరో దక్షుడు; ఒక రాకుమారుడు, మరో రాకుమార్తె; ఒక దేవకన్య, మరో సాహసికుడు వంటి పాత్రలతో ఈ జానపద కథలు సాగుతూ నిజమైన వినోదం అందిస్తూ జ్ఞానపదాలుగా ప్రాచుర్యం పొందాయి. ఈ స్ఫూర్తితో నిర్మించసంకల్పించిన జానపదచిత్రమే ‘బందిపోటు’. నిర్మాతలు ఈ చిత్ర నిర్మాణాన్ని గురించి విఠలాచార్యతో చర్చించినప్పుడు “ఎన్.టి.ఆర్ వంటి మహానటుడితో నిర్మించే చిత్రం కలర్ లో తీస్తే బాగుంటుంది కదా” అని అభిప్రాయపడితే, కలర్ చిత్ర నిర్మాణం వ్యయంతో కూడుకున్నపని కనుక కొన్ని సన్నివేశాలు కలర్ లో తీసే ప్రయత్నంచేద్దామని నిర్మాతలు విఠలాచార్యని సమాధానపరిచారు. మంచి కథ కోసం త్రిపురనేని మహారథిని సంప్రదించారు. 1960లో హిందీలో వచ్చిన దిలీప్ కుమార్ ‘కోహినూర్’ చిత్రాన్ని, హాలివుడ్ ‘రాబిన్ హుడ్’ చిత్రాన్ని దృష్టిలో వుంచుకొని బందిపోటు చిత్ర కథను అల్లారు. ఎన్.టి. ఆర్ స్థాయికి దీటుగావుండేలా మహారథి మాటలు రాశారు. ఈ చిత్రాన్ని ఒక ‘రాజకీయ జానపదం’గా రూపొందించడం వలన సాధారణంగా విఠలాచార్య చిత్రాల్లో వుండే మాయలు, మంత్రాలు ఇందులో లేవు.

బందిపోటు చిత్ర విశిష్టతలు:

ఇంద్రజాలవిద్యను ఎవరైనా ప్రదర్శిస్తూ వుంటే, పిన్నలే కాదు పెద్దలుకూడా తమ దృష్టిని అటువైపు మరల్చక మానరు. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృధ్హి చెందని ఆరోజుల్లోనే ఆప్టికల్ వర్క్ తో మాయలు, మంత్రాలూ సృష్టించి ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన జానపదబ్రహ్మ విఠలాచార్య. ఈ ఆధునిక యుగంలో స్పీల్ బర్గ్ వంటి హాలివుడ్ దర్శకులు కంప్యూటర్ పరిజ్ఞానంతో రాక్షసబల్లుల్ని సృష్టిస్తే, మన విఠలాచార్య మాత్రం మనుషులకే ఆ జంతువుల వేషాలువేసి, వాటిని సహజంగా నడిపించి నిజంగా జంతువులే నడుస్తున్నాయనే భ్రమను ప్రేక్షకులకు కల్పించారు. బాల్యంలో జానపద కథలు విఠలాచార్యను బాగా ఆకట్టుకునేవి. అందుకే వాటిపైకి దృష్టిని మరల్చి జానపద చిత్రాల నిర్మాణానికి అంకురార్పణ జరిపారు. బందిపోటు చిత్రం విఠలాచార్యకు అసలు సిసలైన బ్రేక్ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర విజయంతో విఠలాచార్య ఎన్.టి.ఆర్ తో వరసగా అగ్గిపిడుగు, మంగమ్మశపధం, అగ్గిబరాటా, పిడుగురాముడు, చిక్కడు దొరకడు, కదలడు వదలడు, గండికోట రహస్యం, ఆలీబాబా 40 దొంగలు, లక్ష్మీకటాక్షం, రాజకోట రహస్యం, పల్లెటూరి చిన్నోడు తో కలిపి మొత్తం 15 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇవన్నీ కమర్షియల్ గా విజయం సాధించిన చిత్రాలే! బందిపోటు చిత్ర విజయంతో ఎన్.టి.ఆర్, కృష్ణకుమారి కాంబినేషన్ లో మరుసటి సంవత్సరం అగ్గిపిడుగు చిత్రం వచ్చింది. అదికూడా విజయవంతమైంది. బందిపోటు చిత్రంలో ప్రధాన నటీనటులతోబాటు రమణారెడ్డి, బాలకృష్ణ, రామకోటి, మీనాకుమారి, గిరిజ, పుష్పవల్లి సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్ర విజయానికి మహారథి సంభాషణలకు తోడు దాశరథి, నారాయణరెడ్డి, ఆరుద్ర, కొసరాజులు అల్లిన పాటలు, వాటికి ఘంటసాల సమకూర్చిన బాణీలు, సంగీతం ఎంతో సహకరించాయి.

పాటల పసందు:
చిత్రం చివరిలో వినిపించే ఒక పాట యీ సినిమా మొత్తానికి హై లైట్. ఆ పాట ఈ చిత్ర సారాంశాన్ని చెప్పడమే కాకుండా నీతిని కూడా ప్రబోధిస్తుంది. దీనులను పేదలని హీనంగా చూచే సేనాపతిని చలిచీమలొకటై సర్పాన్ని చంపినట్టు ప్రజలంతా యేకమైతే అతనిని వధించగలరని; బలహీనులని ప్రజలను చులకనగ చూస్తే గడ్డిపోచలు కలసి ఏనుగును బంధించినట్టు సేనాపతిని, అతని అనుచర గణాన్నిసామూహికంగా బంధించగలరని మారువేషంలో వున్న ఎన్.టి.ఆర్ రాజనాలకు చేసే హెచ్చరిక ఈ పాట. దాశరథి రాసిన ఈపాటలో మరో నీతిబోధ కూడా వుంది. “మంచితనము కలకాలము నిలిచి యుండును… ఇక వంచన యేనాటికీ నశించి తీరును” అనేది మౌలికసూత్రం. “ప్రజలమాటను మీరక రాజ్యమేలు రామచంద్రుడు యేలిన రమ్యభూమి.. శాంత్యహింసలకొరకు రాజ్యము త్యజించు బుద్ధభగవానుడలరిన పుణ్యభూమి.. పరమపావనభూమి ఈ భరతభూమి. అటువంటి పవిత్రభూమిని రాజ్యాధికారం కోసం రాకుమారిని బలవంతపు వివాహం చేసుకోబోతున్న సేనాపతీ! ఇపుడు ఈ రాజ్యం నీ హస్తగతమైతే యేరీతి యేలగలవో…” చెప్పమని ప్రజలమధ్యచేరి చిత్ర నాయకుడు అడిగే సాహసపు పాట. సినిమాలో సూపర్ హిట్లయిన మరో రెండు పాటలముందు ఈ పాటకు రావలసినంత పేరు రాలేదు. ఇక ఆ రెండు సూపర్ హిట్ పాటలు… మొదటిది ఆరుద్ర రచన “ఊహలు గుసగుసలాడే..నా హృదయము ఊగిసలాడే” అనే యుగళగీతం . ఇప్పటికీ సంగీత ప్రియుల మదిలో మరుమోగుతుండే పాట ఇది. ఎన్.టి.ఆర్, కృష్ణకుమారిల కోసం రాసిన ఈ స్వప్నగీతాన్ని “చంద్రకౌంస్” (కొంతమేరకు సౌదామిని రాగం) రాగంలో ఘంటసాల తన మేధస్సును రంగరించి స్వరపరిచారు. పున్నమిరాత్రి, నిండుజాబిలి చెంత ప్రేయసీ ప్రియులు ఊహల్లో తేలుతూ గుసగుసలాడుకునే సన్నివేశానికి సరిగ్గా అతికే రాగం చంద్రకౌంస్. అందుకే ఘంటసాల ఈ పాటకు ఈ రాగాన్ని ఉపయోగించారు. ఇక రెండోది “వగలరాణివి నీవే.. సొగసుకాడను నేనే.. ఈడు కుదిరెను, జోడు కుదిరెను మేడ దిగిరావే” అనే పాట. ఘంటసాల ముందుగా ఇచ్చిన ట్యూన్ కి సినారె రాసిన పాట యిది. చిత్రమేమంటే, విషాద సన్నివేశాలకు వుపయోగించే “శివరంజని” రాగాన్ని ఘంటసాల ఈ పాటకు వాడటం.. ఆ పాటను సూపర్ హిట్ చెయ్యడం! ప్రయోగాలు చెయ్యడం, వాటిని విజయవంతం చెయ్యడం ఘంటసాలకు వెన్నతోపెట్టిన విద్య. ఆల్ ఇండియా రేడియోలో వినిపించే ‘సిగ్నేచర్ ట్యూన్’ వయోలిన్ సోలో బిట్ కూడా “శివరంజని” రాగంలో చేసిందే! ఎన్.టి.ఆర్ స్థావరం తనకు తెలుసునని, అతణ్ణి బంధించి తీసుక వస్తానని కృష్ణకుమారి తండ్రితో చెప్పి గుర్రంమీద వస్తున్నప్పుడు చిత్రీకరించిన ఈ పాటలో నిర్జనప్రాంతంలో మాట్లాడితే వినవచ్చే ‘ఎకో’సౌండ్స్ ను కూడా ఘంటసాల వినిపించారు. ఈ సన్నివేశం ‘కోహినూర్’ హిందీ చిత్రంలో దిలీప్ కుమార్ అడవిలో పాడే “కోయీ ప్యార్ కి దేఖే జాదూగరీ” సన్నివేశాన్ని గుర్తుచేస్తుంది. ఈ చిత్రంలో వినిపించే మొదటిపాట సినారె రాసిన “మల్లియలో మల్లియలో మల్లియ్యలో.. మళ్లీ వస్తావొ లేదొ మరదలు పిల్లో” అనే కాముని పున్నమి పండుగలో పాడుకొనే బృంద గీతం. దీనిని పల్లెటూరి బాణీలో ఘంటసాల స్వరపరిచారు. మరొక పాట సినారె రాయగా లీల బృందం పాడిన “వయసున్నది.. సొగసున్నది.. అన్నీవున్నా వులకదు పలకదు.. అయ్యో పాపం చిన్నదీ” పాట. రాజోద్యానవనంలో చెలికత్తెలు కృష్ణకుమారిని ఉడికిస్తూ పాడే ఈ పాట చివర్లో ఎన్.టి.ఆర్ వచ్చి కాపలా సైనికుల్ని ఆటపట్టిస్తాడు. ఆ పోరాట పటిమ చూసి కృష్ణకుమారి ఎన్.టి.ఆర్ పట్ల ఆకర్షితురాలవుతుంది. “ఓ అంటే తెలియని ఓ దేవయ్యా … సరసాలు నీకేలా పో” అంటూ ఇ.వి. సరోజ పాడే ‘కవ్వాలీ’ పాటను కొసరాజు రాశారు. మారువేషంలో వుండే ఎన్.టి.ఆర్, రేలంగి (దేవయ్య) లను అన్వయిస్తూ సాగే ఈ పాటకు స్పూర్తి.. ‘కోహినూర్’ హిందీ చిత్రంలో “మధుబన్ మే రాధికా నాచేరే” అనే పాట. హిందీలో ముఖ్రి చేసే ఆలాపనను బందిపోటులో రేలంగిచేత విఠలాచార్య చేయించారు. “అంతా నీకోసం.. అందుకే ఈ వేషం” అనే సినారె రాసిన సరదాపాట కూడా ప్రేక్షకుల్ని అలరించిందే. చిత్రంలో పాటలన్నీ సన్నివేశానికి అతికేలా చేసినవి కావడం విశేషం.

చిత్రం హై లైట్స్:

ఈ చిత్ర టైటిల్స్ లో ఘంటసాల మొదట “ఊహలు గుసగుసలాడే” ట్యూన్ ని వినిపించారు. తరవాత ‘అభిమానం’ చిత్ర ట్యూన్ “రాధ రావే రాణీ రావే” వినిపిస్తుంది. చిత్రంలో సర్కస్ తదితర చివరి సన్నివేశాలు రంగుల్లో చిత్రించి, విఠలాచార్య కోరికను నిర్మాతలు కొంతవరకు తీర్చారు. గాంధార రాజు కొలువు సెట్టింగ్ ఎంతో రిచ్ గా వుంటుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లోనే, వున్నవనరులతో ప్రేక్షకుల్నిమరోలోకంలో విహరింపజేసేలా చేసారు విఠలాచార్య. ఎన్.టి.ఆర్ ఆవేశంతో రాజప్రాసాదానికి వచ్చి రాజనాలను హెచ్చరించి వెళ్లే సీన్ చాలా గొప్పగా చిత్రీకరించారు. కృష్ణకుమారిది స్వాభావికంగా ఈ సినిమాలో గడుసుతనం కలబోసిన గర్విష్టి పాత్ర. ఈ సన్నివేశం చివర్న ఎన్.టి.ఆర్ కృష్ణకుమారి గదిలోకి వెళ్లినప్పుడు “రాజాధిరాజులైనా పడిగాపులు పడే ఈ మహారాజ పుత్రికకి, తన రాజ్యంలో బతికే నీవంటి బానిసతో పెళ్లా” అని అవహేళన చేసినప్పుడు “ఒక సామాన్యుని సాహసాన్ని పరిహాసమాడకు. ఆనాడు నీసౌందర్యానికి ముగ్దుడనై మొహించాను. ఈనాడు నీలో నిద్రాణమైవున్న మానవత్వాన్ని మేలుకొలిపేందుకు సంకల్పించాను”అంటూ ఎన్.టి.ఆర్ సమాధానమిచ్చే మహారథి మాటలతుణీరాలు ఎంతగొప్పగా గుచ్చుకున్నాయో ప్రేక్షకులకు ఎరుకే! ఈ మాటలో కృష్ణకుమారి గడుసుదైనా గుణవంతురాలేనని కృష్ణకుమారి మనస్తత్వం చెప్పడమే మహారథి లక్ష్యం. విఠలాచార్య చిత్రించిన కొన్నిసన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఎన్.టి.ఆర్ రమణారెడ్డికి ముసుగువేసి వెళ్తే, అతడే ముసుగుమనిషని భ్రమించి రాజనాల దెబ్బలు తినిపించడం; ఎన్.టి.ఆర్ మనుషులు కాపుకాసి సైనికుల్ని మట్టుబెట్టే సన్నివేశంలో పెట్టిన ‘ట్రిక్ షాట్లు’ వంటివి ఎన్నో ఈ చిత్రంలో విఠలాచార్య చిత్రించారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ నిడివి చిత్రీకరణ జరిపి బందిపోటు చిత్రాన్ని షెడ్యూల్ కన్నా ముందే పూర్తిచేసిన ఘనత విఠలాచార్యకు దక్కుతుంది. బందిపోటు చిత్రం అప్పటివరకు వచ్చిన అన్ని జానపద చిత్రాలకంటే భిన్నంగా రూపొందించారు విఠలాచార్య. ఈ సినిమా సాధించిన విజయంతో విఠలాచార్య తెలుగు చిత్రసీమలోనే స్థిరపడిపోయారు. ఎన్.టి.ఆర్ కి ‘మాస్ ఫాలోయింగ్’ తెచ్చిన ఘనత విఠలాచార్యదే. చిత్ర నిర్మాణంలో పొదుపు ఎలా పాటించాలి? అనే ప్రశ్నకి దారి చూపింది విఠలాచార్యే. కళాదర్శకులు శ్రీనివాసన్, నీలకంఠంలతో ఒక పెద్ద రాజసౌధం సెట్ వేయించి దాన్నే రకరకాలుగా మార్చి, రాజుగారి మందిరం, రాణి ఏకాంత మందిరం, విలన్ గది, సమావేశ మందిరంగా ఉపయోగించిన మేధావి విఠలాచార్య. టి.వి ప్రభావం హెచ్చుమీరుతున్న ఈ రోజుల్లోకూడా బందిపోటు చిత్రంతోబాటు విఠలాచార్య ఎన్.టి.ఆర్ తో నిర్మించిన ఇతర జానపద చిత్రాలు సినిమా హాళ్లలో (ముఖ్యంగా‘బి’,‘సి’కేంద్రాల్లో) ప్రదర్శితమౌతూ ఇప్పటికీ ప్రేక్షకుల్నిఆకర్షిస్తున్నాయి. విఠలాచార్య బందిపోటు చిత్రం నిస్సందేహంగా ఒక కాలక్షేపనిక్షేపం!

ఆచారం షణ్ముఖాచారి

1 thought on “విఠలాచార్య ‘బందిపోటు’ చిత్రానికి 60 ఏళ్ళు

  1. నమస్తే, పాత సినిమాలలో “ఓ ఫై ఉందా” అనే హాస్య నటుదు వివరాలు తెలియచేయగలరు. (రాజబాబు కాదు… ఇంకా పాత నటుదు). అలాగె ఓ పాత సినిమాలో హాస్య నాటకం… కనకం గారు పాడినదని అనుకుంటున్నాను.. ఉంగారమా ఉంగారమా.. నా ముద్దుల ఉంగారమా… ఏ సినిమలోనిదో తెలియచేగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap