గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు రంగస్థల, సాహిత్య రంగాలకు నటప్రయోక్త, నాటక సమాజ నిర్వాహకునిగా, వక్తగా, విమర్శకునిగా, సాహితీవేత్తగా చరిత్ర పరిశోధకునిగా విశేషించి NTR కళాపరిషత్ వ్యవస్థాపకునిగా అవిశ్రాంతంగా సేవలనంది స్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మన్నె శ్రీనివాసరావుకి NTR శతాబ్ది రంగస్థల పురస్కారం ప్రదానం గావించడమనేది తెలుగు సాహిత్య, కళా రంగాలని గౌరవించడమేనని ప్రముఖ రంగస్థల నటప్రయోక్త KST శాయి తన ప్రసంగంలో కొనియాడారు.
పూర్వ అమాత్యవర్యులు ఆలపాటి రాజేందప్రసాద్ సారథ్యంలో సుప్రసిద్ధ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ అధ్యక్షతన మార్చి 25 న తెనాలిలో జరిగిన ఈ పురస్కార వేడుకలలో కేసన కోటేశ్వరరావు, భీమవరపు సునీత వంటి రాజకీయ ప్రముఖులు, రంగస్థల కళాకారులు చలసాని కృష్ణ ప్రసాద్ ప్రభృతులు పాల్గొని మన్నె శ్రీనివాసరావు, రంగస్థల సినీ టీవీ నటీమణి నాగమణి లకు NTR శతాబ్ది రంగస్థల పురస్కారం క్రింద NTR జ్ఞాపిక, సన్మాన పత్రం, శాలువ, పట్టు వస్త్రాలు, గజమలతో పాటు పది వేల రూపాయల నగదు ప్రదానమ్ గావించి అపూర్వంగా సత్కరించారు.
వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన NTR అభిమానసంఘ ప్రతినిధులు వంకాయలపాటి హరిబాబు (కంకటపాలెం), బొప్పన ప్రవీణ్ కుమార్ (హైదరాబాద్), పులిపాక శ్రీకర్ (గుంటూరు), అమరనేని హరిబాబు (బాపట్ల) ప్రభృతులు మన్నె శ్రీీనివాసరావుకు NTR పురస్కారం గావించటం NTR అభిమానులందరినీ సత్కరించడమేననినిర్వాహకులని అభినందిస్తూ మన్నె ని NTR అభిమానసంఘాల తరుపున ఘనంగా సత్కరించారు.
సినీ, రాజకీయ రంగాలలో చరిత్ర సృష్టించిన NTR శత జయంతి ఏడాది పాటు నిర్వహించుతూ అందులో సినీ కళాకారులతో పాటు రంగస్థల కళా కారులను సత్కరించటం చాలా ముదావహ అంశం అని సభా పరిచయ కర్త సహజకవి డాక్టర్ అయినాల నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు. సన్మానగ్రహీతల జీవితవిశేషాలను, ప్రతిభాపాటవాలను, సేవలను సంగ్రహంగా వర్ణించుతూ సన్మాన పత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా పురస్కారగ్రహీత మన్నె మాట్లాడుతూ “తన ఆరాధ్య దైవం NTR పేరిట పురస్కారం దక్కడంతో తన జన్మధన్యమైందని.. ఆ యుగపురుషుని జీవిత చరిత్రను వెండితెర వేలుపు, కారణ జన్ముడు అనే రెండు భాగలుగ పరిశోధించి అందిస్తునట్టు… అదేవిధంగా NTR నటించిన 302 చిత్రాల సమగ్ర విశ్లేషణ NTR సినీ విజ్ఞాన సర్వస్వం పేరిట 5 సంపుటాలుగా అందించబోతున్నట్టు తెలుపుతూ… తనని సత్కరించిన నిర్వాహకులకు, అభిమానులకు కృతఙ్ఞతలు” తెలుపుకున్నారు.
ఈ సందర్భముగా అభిమానుల కోరిక మేరకు సమ్రాట్ అశోకలోని అశోకుడు సంభాషణలు NTR కనుల ముందు నిలేపేరీతిలో చెప్పి మన్నె ఆందరి అభినందనలు విశేషంగా అందుకున్నారు.
చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో సాంప్రదాయ బద్ధంగా ప్రారంభమై ఆద్యంతం ఉత్సాహభరితముగా సాగిన ఈ సభలో పుర ప్రముఖులు, కళాకారులు, సాహితీవేత్తలు, NTR అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
-కళాసాగర్