మన తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో ఐదుగురికి పద్మ అవార్డులు వచ్చాయి. అందులో పద్మ భూషన్ -పి.వి. సింధు ( ఆటలు), పద్మశ్రీ – చింతల వెంకటరెడ్డి (వ్యవసాయం), పద్మశ్రీ ఎడ్ల గోపాల్ రావు (నాటకం), పద్మశ్రీ – శ్రీభాష్యం విజయసారథి (సాహిత్యం – విద్య ), పద్మశ్రీ- దళవాయి చలపతిరావు (తోలుబొమ్మలాట ) వున్నారు.
నాలుగువేల సంవత్సరాల క్రితం చైనాలో పుట్టిన కళ తోలుబొమ్మలాట. అంతటి ప్రాచీన కళలను బ్రతికిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నిమ్మలకుంట గ్రామానికి చెందిన చలపతిరావు కుటుంబం. వంశపారంపర్యంగా అబ్బిన కళను నేర్చుకుని కళే జీవితంగా బ్రతుకుతున్న 72 ఏళ్ల దళవాయి చలపతిరావు ను పద్మశ్రీ వరించింది.
దేశ దేశాల్లో తోలు బొమ్మలాట వైభవాన్ని చాటిచెప్పిన అపురూపమైన కళాకారుడు దళవాయి చలపతిరావు. అందుకే ‘పద్మశ్రీ’ పురస్కారం ఆయన దగ్గరకు నడిచి వచ్చింది.
“నేను పెద్దగా చదువుకోలేదు. మాది అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామం. ఎప్పుడో మా తాత ముత్తాతల కాలంలో మా వాళ్లు మహారాష్ట్ర నుంచి ఇక్కడకు వలస వచ్చినట్టు నాకు మా పెద్దలు చెప్పారు. అప్పటి నుంచీ మా వృత్తి తోలుబొమ్మలాట. అమ్మ పార్వతమ్మ, నాన్న ఖడే రావు. మా బతుకుతెరువు తోలుబొమ్మలాట కావడంతో మా అమ్మానాన్నలు నన్ను పురిటి పిల్లవాడి వయసు నుంచీ పల్లెలు తిప్పేవారట! నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ బొమ్మలాట నేర్పించారు. నా చిన్నతనమంతా మా జిల్లా పల్లెల్లోనే గడిచింది. నెలపాటు ఒక్కో ఊళ్ళో ఉండే వాళ్లం. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తోలుబొమ్మలాటలు ఆడేవాళ్లం. అందుకే నాకు ఒక బడిలో చదువు అబ్బలేదు. నేను చదివింది ఐదోతరగతే. మా అమ్మా నాన్నలే నాకు గురువులు. నిజానికి నాకు తోలుబొమ్మలాటలో ప్రత్యేకమైన శిక్షణ ఏమీ లేదు. వాళ్ళను చూసే నేర్చుకున్నాను. ఐదేళ్ల వయసు నుంచీ నా జీవితం తోలుతోనే పెనవేసుకుపోయింది. మా నాన్న మేక తోలుపై బొమ్మ గీస్తే, నేను దానికి రంగులు వేయడం నేర్చుకున్నాను. ఆ తరవాత ప్రభుత్వ హస్త కళల సంస్థ వారు కొంత శిక్షణ ఇచ్చారు. పెద్దగా చదువుకోకపోయినా రామాయణ మహాభారతాలు మాకు కొట్టిన పిండి. ఆ కథలు చెబుతూ తోలుబొమ్మలాట ప్రక్రియను కొనసాగిస్తున్నాం.
తోలుబొమ్మలాటగా ‘గాంధీ చరిత్ర’
ఇందిరాగాంధీ ముందు ప్రదర్శన మా నాన్న ఖడేరావును అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధి పిలిపించు కున్నారు. నాన్న ‘గాంధీ చరిత్ర’ను తోలుబొమ్మలాట రూపంలో ఆడించే వాడు. దీన్ని గుర్తించి ఢిల్లీలో బంగళాలోనే నాన్నకు రెండేళ్లపాటు బస ఏర్పాటు చేశారు. కొందరితోపాటు శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత నాన్నకు అనారోగ్యం రావడంతో ఇంటికి వచ్చేశాడు. బొమ్మలు ఆడించడానికి కనీసం ముగ్గురు, హార్మోనియం, మద్దెలకు ఇద్దరు, తాళాలు, సామగ్రి అందించడానికి మరో ఇద్దరు ముగ్గురు… ఇలా ఒక నాటకానికి ఏడెనిమిది మంది అవసరమవుతారు. దీనికోసం రెండు మూడు కుటుంబాలకు చెందిన వాళ్ళం కళాకారులుగా తయారయ్యాం . అప్పట్లో ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి, నిమ్మలకుంటలో ఒక కాలనీని ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మాకు ఇళ్లు కట్టించారు. మేం దేశంలో ఎక్కడ ఎగ్జిబిషన్లు జరిగినా అక్కడకు వెళ్తున్నాం. మేము తయారు చేసిన తోలు వస్తువులను విక్రయిస్తున్నాం.
పది దేశాల్లో ప్రదర్శనలు
నేను ఇప్పటిదాకా పది దేశాల్లో తోలుబొమ్మలాటను ప్రదర్శించాను. అన్నిచోట్లా మా బృందానికి అభినందనలు లభించాయి. ఈ క్రమంలో రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. . నాకు ఇద్దరు కొడుకులు. ముగ్గురు కూతుళ్లు. ఈ వృత్తి తోనే వారిని పోషించాను. మా నాన్న తోలుబొమ్మలాట ద్వారా చేసిన కృషి నాకు అచ్చి వచ్చింది. అసలు ఇంత పెద్ద అవార్డు వస్తుందని నేను అనుకోలేదు. జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది. ఈ కళను బతికించడానికి ఏడు దశాబ్దాలు కృషి చేశాను. కానీ దీన్ని వారసత్వంగా కొనసాగించడానికి సహాయం కావాలి. ప్రభుత్వం తోలుబొమ్మలాట పరిరక్షణ కోసం, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటుచేయాలి.” అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
Here is the complete list Padma Awardees – 2020
”ఇంత పెద్ద అవార్డు వస్తుందని నేను అనుకోలేదు”అన్న పద్మశ్రీ- దళవాయి చలపతిరావు గారికి అభినందనలు. ఊహించని అవార్డు అందుకున్నప్పుడే కళాకారునికి ఆనందం కలుగుతుంది. వారికి ఆ అవార్డునిచ్చి ప్రభుత్య అవార్డులపై జనానికి నమ్మకాన్ని పెంచారు