చిత్రకళా బోధనలో పాతిక వసంతాల ‘అల్లు ‘

చేయితిరిగిన చిత్రకారుడు అల్లు రాంబాబు నటుడూ కూడా కావడం వల్ల ఆయన చిత్రాలు పటం కట్టిన రంగస్థలం లా వుంటాయి. తన శిష్యులు తనను మించిన చిత్రకారులు కావాలనే కాంక్షతో చిట్టి పొట్టి బాలలకు అలసట లేకుండా, కష్టం అనుకోకుండా ఎంతో ఇష్టంతో పాతికేళ్లుగా చిత్రకళ బోధన చేస్తున్నారు. అల్లు రాంబాబు బహుముఖ కళా ప్రజ్ఞుడు. విజయవాడ ఎన్.ఎస్.ఎం. పబ్లిక్ స్కూల్ నందు జులై 18 1994లో బొమ్మల మాస్టారుగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, నేటికి పాతికేళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్కూలు యాజమాన్యం వారు ఫిబ్రవరి 15న స్కూలు ఆవరణలో అల్లు రాంబాబు గారిని ఘనంగా సత్కరించారు. ఇది ప్రతి చిత్రకళ ఉపాధ్యాయునికి స్పూర్తినిచ్చే దిగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇంతకు మించి ఒక కళాకారుడు కోరుకునేది ఏముంది. ఈ సందర్భంగా అల్లు రాంబాబు గారిని 64కళలు.కాం పత్రిక అభినందిస్తుంది.

అల్లు రాంబాబు గారి పరిచయం పాఠకులకు అందించే క్రమంలో వారి జీవన, కళా ప్రస్థానం గురించి తెసుకుందాం. అవి 1993 సంవత్సరం విజయవాడ విక్రమ్ పబ్లికేషన్ లో నేను ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న చోటనే రాంబాబు గారు ఉద్యోగంలో చేరారు ఎందుకనో ప్రింట్ మీడియా ఉద్యోగంలో ఆయన ఇమడలేకపోయారు. కొద్ది నెలల్లోనే విక్రమ్ నుండి ఎన్. ఎస్. ఎం. స్కూల్ కి బొమ్మలు మాస్టారుగా వెళ్లిపోయారు. వెళ్లడమే కాదు, నేడు పాతికేళ్ల ఉద్యోగ జీవితాన్ని పూర్తిచేసుకుని రజతోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు.
శ్రీమతి అల్లు మహాలక్ష్మి, సూర్యారావు దంపతులకు జూలై 7, 1970న తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామంలో జన్మించిన రాంబాబుకు నాల్గవ తరగతి నుండే చిత్రకళపై ఆసక్తి ఏర్పడింది. తాను 2వ తరగతిలో వుండగా తన తండ్రి ఉద్యోగం రీత్యా కుటుంబం తుని నుండి విజయవాడకు తరలివచ్చింది. హైస్కూలులో ఉండగా గురువు గోవిందరాజులు గారి వద్ద చిత్రకళలో ఓనమాలు దిద్దిన రాంబాబు, ఆ తర్వాత వేరొక గురువు పినపాక సత్యనారాయణ మూర్తి గారి శిక్షణలో చిత్రకళలో డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలతో పాటు టి.టి.ని. కూడా పూర్తి చేశారు. 20 ఏళ్ళ వయస్సులో విజయవాడలో విజ్ఞాన విహార్ స్కూలు నందు ఆర్ట్ టీచర్ గా ఉద్యోగంలో చేరిన తర్వాత రాంబాబుకు తన ప్రవృత్తే వృత్తిగా మారడంతో విరివిగా చిత్రాలు వేయడం ప్రారంభించారు. రాజారవివర్మ, వడ్డాదిపాపయ్య, బాపు తదితర చిత్రకారుల చిత్రాలను ఆదర్శంగా తీసుకునే రాంబాబు మొదటికాలంలో మన హిందూ దేవతలకు చిత్రరూపాన్నిచ్చిన రాజారవివర్మ చిత్రాల ప్రేరణతో ఆరాధన పేరుతో దేవుళ్ళకు సంబంధించి అనేక చిత్రాలను వేశారు. ఈ కోవలో ఇతను వేసిన చిత్రాల్లో రవివర్మలా కేవలం దేవుళ్ళ రూపాలనే కాకుండా ఆ దేవుళ్ళను పలు విధాలుగా ఆరాదించి చరిత్ర కెక్కిన భక్తులను కూడా ప్రధానంగా చూపిస్తూ ఆయన వేసిన శివపార్వతులు, బాలాజీ, అన్నమయ్య, రాధాకృష్ణులు, శ్రీకృష్ణ మీరాబాయీ, శబరి, శ్రీరాముడు ఇలా ఒక ప్రత్యేక రీతిలో చిత్రాలు వేయడమే గాక 2003, సెప్టెంబర్ లో “ఎక్స్ ప్రెషన్స్” పేరుతో మరికొందరు మిత్ర చిత్రకారులతో కలసి సామూహిక చిత్రకళా ప్రదర్శనగా సృష్టి ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్ లో నిర్వహించారు.

విజ్ఞాన విహార్ స్కూలు నందు ఆర్ట్ టీచర్ గా పనిచేయడంతో అక్కడ పిల్లలలో ప్రధానంగా రేకెత్తించే జాతీయ భావాల స్పూర్తిగా అతను వేసిన వివిధ స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను కేవలం రూపచిత్రాలుగా మాత్రమే గాకుండా వాటికి ఆయా నాయకుల భావజాలాన్ని కూడా జోడిస్తూ వేసిన దాదాపు ముప్పై జాతీయ నాయకుల చిత్రాలు ఒక ప్రయోగంగా చెప్పుకోవచ్చు.
పిల్లలకు, యువతకు స్పూర్తిగా ఉండే ఈ చిత్రాలను జాతీయ పర్వదిన సమయాలలో విజయవాడ తను పనిచేసే స్కూలుతో పాటు అనేక ఇతర స్కూల్లలోనూ మరియు ముఖ్యమైన ప్రదేశాలలో నూ కలిపి ఇప్పటికి పదిసార్లకు పైగా ప్రదర్శలను చేయడం జరిగింది.

అందుకే సంస్కారభారతి (అఖిలభారత స్థాయి సంస్థ) లలితకళల ద్వారా మన సంస్కృతి, సాంప్రదాయాల విశిష్ఠతను తెలియజేస్తూ నాగపూర్ (మహారాష్ట్రలో 2012, నవంబరు 23-25 వరకు నిర్వహించిన ప్రతినిధుల సమావేశంలో దేశభక్తిని ప్రేరేపిస్తూ రాంబాబు చిత్రించిన ఈ చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.

పరిణామం అనేది ఒక విధంగా ప్రగతికి చిహ్నం. మార్పు లేని ప్రయత్నం, కృషి కొంత కాలానికి విసుగును కలిగిస్తాయి. అందుకే వేగవంతంగా మారుతున్న కాలంతో పాటు, వ్యక్తి చేసే కృషిలో కూడా ఆ మార్పు కనిపిస్తేనే చూసే ప్రేక్షకుడి కంటికి నవ్యత కనిపిస్తుంది. మొదట్లో రూపచిత్రాల మాదిరిగా ఆరాధన పేరుతో వేసిన వివిధ భక్తుల, దేవుళ్ళ చిత్రాల తర్వాత దేశభక్తి జాతీయ భావజాల చిత్రాలను సృష్టించిన అతని కుంచె ప్రస్తుతం పూర్తిగా జానపదం వైపుకు మళ్ళింది. అంతేగాక అనుభవం మీద వచ్చిన వ్యక్తీకరణతో కూడిన ఒక ప్రత్యేక శైలితో నూతన ఒరవడిలో సృష్టిస్తున్న ఈ జానపద చిత్రాలు రాంబాబుకు ఒక ప్రత్యేక గుర్తింపును తెస్తాయని చెప్పవచ్చు.
గ్రామీణ వాసుల జీవనం, వారి మనుగడకు సంబంధించిన వివిధ సంఘటనలు అనగా పొలంకేసి, ప్రకృతి స్త్రీ, పండగముందు, సువ్వి సువ్వి సందేళ, తొలిరాత్రి, ఎదురుచూపు లాంటి చిత్రాలతో పాటు పల్లెసంస్కృతికి ప్రతిరూపాలైన కోలాటం, తప్పెటగుళ్ళు, డోలు వాయిధ్యాలు, సన్నాయిమేళాలు, జానపద నృత్యాలు లాంటి గ్రామీణ కళారూపాలను కూడా ఒక ప్రత్యేకమైన శైలిలో ఆయన చిత్రించారు.
చిత్రకళనే తన జీవన లక్ష్యంగా చేసుకున్న రాంబాబు ఒకవైపు విజయవాడలో ఎన్.ఎస్.ఎమ్ పబ్లిక్ స్కూలు నందు ఆర్ట్ టీచర్ గా పనిచేస్తూనే తన ఈ కళకు ఉన్నత విద్యాపరమైన అర్హత సంపాదించాలనే లక్ష్యంతో పట్టుదలగా శ్రీ అల్లంప్రభు లలితకళా అకాడెమీ, మైసూర్ ద్వారా సార్వత్రిక పద్దతిలో M.F.A కూడా చేసి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మరో వైపు విజయవాడ ఆర్ట్ సొసైటి కి అధ్యక్షులుగా అనేక కార్యక్రమాలలో తన సహకారం అందిస్తున్నారు.

కేవలం చిత్రకారుడిగానే గాక నటుడుగా, చిన్న కథల రచయితగా స్టేజ్ డెకరేటర్ గా పలువిధాలుగా అతని ప్రతిభ విరాజిల్లుతుందని చెప్పడానికి ప్రస్తుతం అతను పనిచేస్తున్న విజయవాడ N.S.M పబ్లిక్ స్కూలునందు నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు తార్కాణంగా నిలుస్తాయి. తాను పనిచేస్తున్నది ఒక క్రైస్తవ మిషనరీకి చెందినది కావడంతో ఆ మిషనరీకి సంబంధించిన విదేశాలనుండి వచ్చిన పలు క్రైస్తవ పెద్దలు రాంబాబు చిత్రాలకు ముచ్చటపడి అతనిచే వారి వారి రూప చిత్రాలు వేయించుకోవడం వలన రాంబాబు వేసిన అనేక చిత్రాలు పలు విదేశీయుల ఇళ్లల్లో కూడా కొలువుదీరి ఉండడానికి కారణమయ్యింది.

-కళాసాగర్ 

6 thoughts on “చిత్రకళా బోధనలో పాతిక వసంతాల ‘అల్లు ‘

 1. అద్భుతమైన చిత్రకారులు అల్లు రాంబాబు గారి గురించి చక్కని వివరణ ఇచ్చారు …
  అల్లు రాంబాబు గారికి అభినందనలు తెలుపుతూ… కళసాగర్ గారికి ధన్యవాదములు…🌹

 2. అల్లు రాంబాబు గారికి అభినందనలు…

  కళాసాగర్ గారికి ధన్యవాదములు

 3. కళాసాధనకన్నా, కళాప్రోత్సాహం మిన్న
  కళాకారుడు ఉద్భవించడానికి ప్రోత్సహకాలు కారణం అలాంటి ప్రక్రియలో ఎంతో ఓర్పు నేర్పుతో కొనసాగుతున్న
  కళాసాగర్ గారికి నా అభినందనలు కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link