(పద్మశ్రీ లక్ష్మా గౌడ్ గారి పుట్టిన రోజు సందర్భంగా….)
చిత్రకళా ప్రపంచంలో తనదైన రేఖతో, తన్మయపరచే రంగుల పూతతో, నూట్లాడని బొన్ములతో కోటి భావాలు పలికించే చిత్రకారుడు కె.లక్ష్మాగౌడ్. ఆయన పల్లెదనాన్ని కళ్లనిండా నింపుకున్నారు. శృంగార రసాన్ని కాన్వాసుపై ఒంపుతున్నారు. సంస్కృతికి అద్దంపట్టే బొమ్మలతో తన భావాలని మేళవించి సృజించారు. ఎన్నో ఏళ్ల ప్రయాణంలో ఎన్నెన్నో కళాఖండాలు ఆవిష్కరించిన కళాశ్రామికుడాయన. 2016 లో కేంద్ర ప్రభుత్వం లక్ష్మా గౌడ్ ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఎన్నో మైలురాళ్లు దాటిన ఆ కుంచె ప్రయాణమిది.
పల్లె సంస్కృతి, స్త్రీ పురుషుల సుఖదుఃఖాలు, కోపతాపాలు ఆయన కుంచెకి వస్తువులు. తెలంగాణ జీవన చిత్రాన్ని తన చిత్రాల్లో ప్రదర్శించి అంతర్జాతీయంగా గుర్తింపుపొందారు కలాల్ లక్ష్మాగౌడ్. చిత్రకళలో ఎప్పటికప్పుడు కొత్త రీతులను అనుసరిస్తూ గీసిన నిత్యనూతన చిత్రకారుడాయన. చిత్రకళలోనే కాక ముద్రణ, డ్రాఫ్టింగ్లలోనూ, శిల్పకళ, గాజుపై చిత్రకళలోనూ అపార అనుభవం ఆయన సొంతం. ఆయన మెదక్ జిల్లా నిజాంపూర్లో 1940 ఆగస్టు 21న పుట్టారు. తల్లిదండ్రులు వెంకాగౌడ్, అంతమ్మ. చదువు మీద శ్రద్ధకన్నా బొమ్మమీద ప్రీతి ఎక్కువ అది గుర్తించిన తండ్రి తనని చిత్రకళా కళాశాలలో చేర్పించి లక్ష్మా గౌడ్ ను ప్రోత్సహించారు. హైదరాబాదు ఫైన్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ కళాశాలలో డ్రాయింగ్, పెయింటింగ్లలో డిప్లొమా పూర్తిచేశారు. పీజీ డిప్లొమా బరోడా మహారాజా శాయాజీరావ్ గాయిక్వాడ్ విశ్వవిద్యాలయంలో చేశారు. అక్కడ కేజీ సుబ్రమణియన్ నేతృత్వంలో ఇంటి పైకప్పుల లోపలి భాగాలపై వేసే మ్యూరల్ పెయింటింగుల అధ్యయనం సాగించారు. ఆ సమయంలోనే ముద్రణ రంగంపై కూడా ఆసక్తి మొదలైంది. దాంతో ఆ విభాగంలో కృషిచేసి నూతన ఒరవడి సృష్టించారు. చదువు పూర్తయ్యాక తిరిగి తన పల్లెకు చేరుకున్నారు. పట్నంలో నేర్చుకున్న లౌకిక దృక్కోణంనుంచి బయటపడి, పల్లె జీవన సహజత్వాన్ని తన చిత్రకళా నేపథ్యంగా చేసుకున్నారు. తర్వాత పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్, మలేషియాలోని ఏషియా పసిఫిక్ టెలివిజన్ టైనింగ్ ఇన్స్టిట్యూట్లలో పనిచేశారు. ఆ సమయంలో సరోజినీనాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో పీజీ, పరిశోధన విద్య సిలబస్ రూపకల్పనకోసం హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆహ్వానం పై ఆ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడే అధ్యాపకుడిగా పనిచేసి 2001లో డీన్గా పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో ఎందరో వర్గమాన చిత్రకారుల గీత మార్చారు.
నిజాంపూర్ పేరుతో ఆయన గీసిన చిత్రాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. రాష్ట్రంలో నిర్వహించిన అనేక ప్రదర్శనల్లో అనేకసార్లు బంగారు పతకాలు సాధించారు లక్షాగౌడ్. జీవిత సాఫల్య పురస్కారంతో పాటు తెలంగాణ రాష్ట్ర పురస్కారం కూడా అందుకున్నారు. అంతర్జాతీయంగా భారతీయ సంస్కృతిని వర్ణించే బాధ్యత తనదే అన్నట్లు, 1873లో లండన్లో తన చిత్రాల విదేశీ ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. ఆ పరంపరలో వార్సా బుడాపెస్ట్, మ్యూనిచ్, టోక్యో, బ్రెజిల్, ఆమ్స్టర్డామ్ల సాక్షిగా కొనసాగుతూనే తొలినాళ్లనుంచీ సామూహిక ప్రదర్శనలు పదుల సంఖ్యలో చేశారు. శృంగార భావన కలిగించే చిత్రాలు గీశారే ఆవి అందరికీ ఆమోదయోగ్యమేనా అనే ప్రశ్న తలెత్తినప్పుడు… ‘మన సంస్కృతిలో భాగమైన అంశాల మీద నా కుంచె స్పందన ఆది. వాటిని కళాదృష్టితోనే చూడాలి’ అంటారాయన. తాను పుట్టి పెరిగిన నిజాంపూర్ తీరుతెన్నులు, అక్కడి జనజీవనం, పనులూ, వ్యాపకాలే ఆయన్ని నిత్యం ప్రేరేపిస్తాయి. గురుతుల్యులు జగదీష్ మిట్టల్ వద్ద తనివితీరా చూసిన కళాఖండాలూ స్ఫూర్తినింపేవే. పికాసో పాల్ వీక్లీ చిత్రాలంటే ఇష్టపడే ఆయన వారి ప్రభావం తనమీద ఉందన్నారంటే దానికి అధివాస్తవికత గల చిత్రాలే నిదర్శనం. ఆయన గీసిన నిండైన పొదుగులతో ఉన్న మేకల చిత్రాలు గ్రామీణ భారతావనికి ప్రతీకలు. ఆయన చిత్రాలు మానవుడి చిత్త ప్రవృత్తులను నిఖార్సయిన కోణంలో ఆవిష్కరిస్తాయి. యువ చిత్రకారులు ఒక దృక్పథం ఏర్పరచుకోవాలి, సృజన, కొత్తదనం, ప్రయోగాల వైపు పరుగులు తీయాలని కాంక్షించే వ్యక్తి ఆయన. 82 సంవత్సరాల వయస్సులోనూ నిత్య ప్రయోగాలతో లక్ష్మాగౌడ్ తన సృజనను కొనసాగించాలని 64కళలు.కాం కోరుకుంటుంది.
– కళాసాగర్
ప్రఖ్యాతమైన శ్రీ లక్ష్మాగౌడ్ గారు మన తెలుగువారు కావడం ఎంతో గర్వకారణం.