నిజమైన కళ అంటే.. కనులకు, చెవులకు ఆనందాన్ని ఇచ్చేది కాదు. మనసును ఆహ్లాదపరిచేది. అలాంటి కళతో జనులను రంజింపజేసినవాడు చరితార్థుడవుతాడు. అన్నవరపు రామస్వామి ఆ కోవకు చెందిన వారే, పాశ్చాత్య పోకడల పెను తుపానులో సంగీత శిఖరమై నిలిచారాయన. ఆయన వయోలితో సృజించిన ప్రతి బాణీ సంప్రదాయ స్వరరాగ ప్రవాహమే. ఎన్నో అవార్డులు అందుకున్న వీరిని 94 యేళ్ళ వయస్సులో ‘పద్మశ్రీ’ వరించింది.
“అన్న”వరం: పశ్చిమగోదావరి జిల్లా, సోమవరప్పాడు గ్రామంలో 1926వ సం.లో నాదస్వర విద్యాంసుడైన పెద్దయ్య, లక్ష్మీదేవి దంపతులకు కర్ణాటక సంగీత నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించిన రామస్వామికి వీరి అన్నగారైన శ్రీ గోపాలం ద్వారా వయోలిన్ అభ్యాసానికి ప్రేరణ దొరకడం ఆ తదుపరి వీరి నేటి వికాసానికి ఓ వరం.
వరాలు-వారాలు: అన్నగారి ప్రోద్బలంతో, అమ్మానాన్నల ఆశీర్వచనాలతో సద్గురుని అన్వేషణలో లలితకళలకు కాణాచి అయిన విజయవాడ వచ్చిన వీరు గాయక సార్వభౌమ శ్రీ పారుపల్లి కృష్ణయ్య గారి ఇంట చేరి, వారాలు చేసుకుంటూ గురుశుబ్రూషలో సంగీత సాధనకు శ్రీకారం చుట్టారు. “ఆటపాటల వయసులోనే ఆటుపోటులన్నట్లు” వారాలన్నీ కుదరక తరచూ కుళాయి నీళ్ళతో కడుపునింపుకుని, పస్తులుంటూ, సప్తస్వరాలనే ఆహారంగా ఆరగిస్తూ…. గురువుగారి సంగీతగానం ఆలకిస్తూ, తానూ అలానే ఆలపిస్తూ వయోలిన్ వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించారు. తనకు అన్నం పెట్టి పున్నెంకట్టుకున్న అనేకమంది అమ్మల చల్లని వరాలతో ఆ సప్తస్వరాలలో ఈ ఏడు వారాలను మలచుకొని, క్షణక్షణం తన లక్ష్యాన్ని మదిలో నిలుపుకుని అనుకున్నది సాధించి గెలిచి నిలిచాడు. ఆకలిదప్పులనధిగమించి విశ్వవేదికలను ఆక్రమించాడు. అమెరికా, అబుదాబి వంటి దేశ విదేశాల్లో పర్యటించి, తనకు మనకు ఎనలేని గౌరవాన్ని తెచ్చి పెట్టాడు. అమెరికా, కెనడా, యు.కె. ఫ్రాన్స్, దుబాయ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాలలో తన సహధ్యాయి, బాల్యమిత్రుడు అయిన మంగళంపల్లి బాలమురళీకృష్ణతో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా కచ్చేరీలు చేశాడు.
అపరవీణాపాణికి పాణీ గ్రహణం: తనకోసమే పుట్టినట్టి పోతునూరి రంగనాయకులు, మాణిక్యంల గారాలపట్టిని చేపట్టినాడు. వీరి అన్యోన్య దాంపత్యానికి ఆనవాలుగా వీరికి అరుణకుమారి, మహాలక్ష్మి అనే ఇరువురు ఆడపిల్లలున్నారు.
అనుకూలవతి అయిన ఇంతి ఇంగితం కారణంగా ఇంటి నిండా శిష్యసమేతంగా నిరంతరం సంగీతం.
పరమావధిగా తలచిన తన వయోలిన్ విద్యతో జీవనోపాధికై అవకాశంగా తలుపుతట్టగా, విజయవాడ ఆకాశవాణిలో నిలయ విద్యాంసునిగా చేరి కృష్ణవేణి తరంగాలతో కలగలిపి, కనకదుర్గమ్మ సాక్షిగా తన వయోలిన్ వాయిద్యంతో శ్రోతల్ని దాదాపు నాలుగు దశాబ్దాలు అలరించిన సప్తస్వర శబ్దశాసనుడీతడు.
ఎంతో కొంత జీతం, ఎంతో సంతృప్తికర జీవితం.
ఆశయం అవకాశం అదృష్టం అన్నీ కలగలిపితే ఈ రామస్వామి అన్నవరం.
చదివింది 1వ తరగతి సాధించింది అపూర్వ ప్రగతి!
ఈ యాంత్రిక యుగంలోనూ లక్షలాది శ్రోతలను తన వయోలిన్ వాయిద్యంతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఈ సంగీత మాంత్రికుడు జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ, విజయలక్ష్మి పండిట్, పి.వి. నరసింహారావు వంటి మహామహుల ద్వారా వందలు, వేలు బిరుదులు సన్మానాలు, సత్కారాలు అందుకున్న అన్నవరం కేవలం 1వ తరగతి వరకే చదివిన నెంబర్ వన్ స్టూడెంట్ అంటే అందరికీ ఆశ్చర్యం కలగక మానదు.
ఆంధ్రదేశంలో తనకు ముందు తరంవారైన తిరుక్కోడ్ కావెల్, తిరిచ్చి గోవిందస్వామి, ద్వారం వెంకటస్వామి నాయుడుగార్ల సంగీత వారసత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ ఆ ఆసక్తినే తన శక్తిగా మలచుకుని నేటికీ దేశం నలుమూలలా పర్యటించి తన వయోలిన్ వాయిద్య జలధిలో శ్రోతల్ని ముంచి తేలుస్తున్నాడు. వీరి ‘ఆశయం :
పదిమందికి ఉచితంగా గురుకుల సంప్రదాయ రీతిలో ఉచితరీతిన సంగీతం నేర్పించటం. అమెరికా వంటి దేశాలకు వెళ్ళి పలుమార్లు ఉచితంగా ప్రవాస భారతీయులకు సంగీతం నేర్పించారు.
పలువురు మహామహులతో చేరి కచ్చేరీలు: గాయక సార్వభౌమ, పారుపల్లి రామకృష్ణపంతులు, అరయ్యకుడి రామానుజ అయ్యంగార్, భీమ్ సేన్ జోషి, సమ్మాంగుడి శ్రీనివాస అయ్యర్, టి.ఆర్. మహాలింగం, బాలమురళీకృష్ణ వంటి ఎందరెందరో ప్రముఖులతో కలిసి కచ్చేరీలు చేసిన రామస్వామి 2000లకు పైగా కచేరీలు చేసి “వింశతి సంగీత సభా సరస్వతి” గా గణతికెక్కినాడు.
ఈ సద్గురు చరణదాసుడు ఎ.వి.ఎస్. కృష్ణారావు, డా॥ప్రపంచం సీతారామ్, పాటిబండ్ల జానకి, సతీష్, మోదుమూడి సుధాకర్ (శిష్యుల పేర్లు) వంటి మేటి శిష్ట శిష్య హృదయ వాసుడు.
జలధిత రంగం వీరి స్వరం. స్వరరత్నాకరం వీరి శరీరం. శారద నారద వరం ఈ సంగీత విశారదుని కరం. శ్రీహరి చరణ కమలాలందు సుర గంగోద్భవం-వీరి కర కమలాలందు సుస్వర గంగోద్భవం. నిత్య నూతన బాణీకి రామస్వామి పెట్టింది పేరు. నిత్య సంగీత సాధనే నేటికీ వీరి తీరు. ఇంటా బయటా వేలమంది శిష్యులను ఆకర్షించిన గురువు రామస్వామి. దిన దిన ప్రవర్ధనమానమై ఎదిగి ఒదిగిన సంగీత మేరువు. పలు సంగీత ఉత్సవాలలో ఉత్సాహంగా పాలుపంచుకుంటూ వార్ధక్యాన్ని సార్ధక్యం చేసుకుంటున్న నవ యవ్వనుడు. ఎన్నటికీ వసివాడని గానగంధర్వుడు.
సప్తస్వరాలే సర్వస్వం అనే తపస్సు నేటి ఈయన యశస్సు, నిత్యం సురసరస్వతికి వయోలిన్ వాయిద్యమే వీరు సమర్పించే నైవేద్యం. అణకువన గురుసార్వభౌమునికి సామంతుడు, ఆదర్శ శిష్యరికంలో శ్రీమంతుడు. పద్మశ్రీ డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణునికి బాల్యమిత్రుడు ఈ రామస్వామి. మేటి గాయకులతో గట్టి పోటీలు, ప్రసంసలు, విమర్శలు అన్నీ వరాలే ఈ అన్నవరానికి!
నిర్మించిన స్మారకాలు:
1) గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి జ్ఞాపకార్ధం విజయవాడ అలంకార్ సెంటర్ లో కాంస్య విగ్రహ ప్రతిష్ఠ.
2) అన్నగారైన గోపాలం, తొలి గురువైన మాగంటి జగన్నాధ చౌదరి గార్ల పేరిట నాలుగు గదుల పాఠశాలను నిర్మించి, వారిపై తనకు గల అపారమైన గౌరవాన్ని ప్రదర్శించారు.
3) ఈ మధ్యనే తాను జన్మించిన ప.గో. జిల్లా, సోమవరప్పాడులో గురువుగారిపై తనకు గల ప్రతీకగా ఓ దేవాలయంలో రామ,కృష్ణ విగ్రహాల ప్రతిష్ఠ చేశారు.
వీరి ఇంటి తలుపు తడితే వినిపిస్తుంది తబలావాయిద్యం. ఇంట కాలుపడితే వినిపిస్తుంది వయోలిన్, వయోలా వాయిద్యం.
ఈ అన్నవరం వారి వంటింట జతిలయలతో నాట్యం చేస్తూ అన్నం మెతుకులు ఉడికినా మనకు వినిపిస్తాయట తటికిట, తటికిట, తరికిట, తరికిట.
ఈ సంగీత హిమగిరి తెలుగువారి లలితకళాసిరి. సప్తస్వరాలకు మానవాకారం ఈ రామస్వామి అన్నవరం. వీరి ఇంటా బయటా నిండివున్న బహుమానాలు కిటకిట.
ఈ అన్నవరపు రామస్వామి పదహారణాల తెలుగుతనానికి ప్రతీక.
వీరి నిజనివాసం వలన ధన్యత చెందినది విజయవాటిక.
వీరి సంగీత సాధనం శతవసంతానంతరమూ యిలాగే సాగాలని ఆకాంక్షిస్తూ…. వీరిని పద్మశ్రీ వరించిన సందర్భంగా 64కళలు.కాం శుభాభినందనలు తెలియజేస్తుంది…
-బి.ఎం.పి.సింగ్
__________________________________________________________________________
‘ఓ వయోలిన్ కథ’ రాసే ఘనత నాకు దక్కింది – రామకృష్ణ
నాదంటూ ప్రతిభ, గొప్పదనం ఏమీ లేవని తెలుసు. అయినా ఏదో తెలియని ఆనందం. కాస్తంత గర్వం కూడా. ఇంకా ఇంద్రియాలకు కట్టుబడిన మనిషినే కదా. అందుకే ఉదయాన్నే దినపత్రిక చదివిన క్షణం నుంచి ఒకటే ఆనందం. పులకరింత. సంగతేమిటంటే… వాయులీన సంగీత విద్వాంసులు శ్రీ అన్నవరపు రామస్వామి గారికి భారతప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందన్నది ఆ వార్త సారాంశం. అప్పటి నుంచి నా ఆనందానికి పట్టపగ్గాల్లేవ్. నాకు గదా ఇంతటి ఘనత లభించింది అని పొంగి పోయాను.
ఆయనకు పురస్కారం వస్తే నీకు ఘనతేమిటంటారా… నేను అంటున్నది నిజమే. నిజంగా ఘనత నాకే. అంతటి మహోన్నతమూర్తి జీవితచరిత్ర రాసిన ఘనత నాకు దక్కింది. శ్రీరామస్వామి గారి జీవితచరిత్రను ‘ఓ వయోలిన్ కథ’ పేరుతో నేను రాయగా విజయవాడకు చెందిన శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఇప్పటిదాకా నేను చేసిన రచనల్లో నాకు బాగా పేరు తెచ్చింది, నాకు బాగా ప్రియమైంది ఈ పుస్తకమే.
రాఘవేంద్ర పబ్లిషర్స్ అధినేత శ్రీ రాఘవేంద్రరావు గారితో కలిసి ఈ రోజు ఉదయం (26.01.2021) రామస్వామి గారి ఇంటికి వెళ్ళి నేరుగా శుభాకాంక్షలు తెలియజేశాను. ఆయన ఎంత ఆనందించారో. నిజానికి పద్మశ్రీ కన్నా నువ్వు చేసిన మేలే నాకు ఎంతో సంతృప్తినిచ్చిందంటూ తన జీవితచరిత్ర పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నారు. అంతా మా గురువు గారి దయ. ఆయనే లేకపోతే ఎక్కడో పొలంలో గేదెలు కాసుకుంటూ ఉండిపోయేవాడిని అంటూ చిన్నపిల్లాడిలా గురువుగారి చిత్రపటానికి దండం పెట్టుకుంటూ, ఎదురుగా గురువుగారు ఉన్నంత వినయంగా ఆయన చెబుతున్న మాటలు వింటున్న నాకు ఆయన పసిమనసు కనిపించింది.
ఆయన్ను పలకరించాలని అప్పటికే ఎంతో మంది వాకిట్లో వేచి ఉన్నారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు వచ్చినా వారికి వేచి ఉండమంటూ సూచించి మాతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. అధికమాసాలతో కలిపి ఈ ఏడాది మార్చిలో నూరేళ్ళ పుట్టిన రోజు చేసుకునే ఆ పరిపూర్ణ మానవుడికి మరోసారి నమస్కారం చేసుకుని గుండెల నిండా నింపుకున్న సంతృప్తితో ఆయన దగ్గర శెలవు తీసుకున్నాను.
నాదికదూ అదృష్టమంటే….
-డా. కప్పగంతు రామకృష్ణ
Congrats to Annavarapu Ramaswamy garu.
We are proud of you sir