కాస్త ఆలోచన.. మరికాస్తంత ఆసక్తి.. ఇంకొంత సృజనాత్మక కలగలిపి అద్భుత కళారూపాలు తీర్చిదిద్దుతున్నారు గోపాలపట్నం ప్రాంతానికి చెందిన మోక సతీష్ కుమార్. కేవలం కాగితమే ఇతని ఆయుధం. అనుకున్న రూపాన్ని అచ్చుగుద్దినట్టు తీర్చిదిద్దడమే అతని ప్రతిభ.ఎటువంటి రంగులు వాడకుండా తాను రూపొందించిన ఆకృతుల్లో సప్తవర్ణాలను కళ్లముందు ఉంచుతారు. అందుకనే వీటిని కాగితపు శిల్పాలనొచ్చు.
గతంలో నాగపూర్ లో ప్రయివేట్ సంస్థలో పనిచేసిన సమయంలో సతీష్ కుమార్ అక్కడో ఎగ్జిబిషన్‌కు వెళ్లాడు. ఒక విదేశీయుడు ప్రదర్శించిన పేపర్ కొలాజ్ ఆకృతులను చూసి ఆకర్షితుడయ్యాడు. ఏకలవ్యుడిగా మారి కాగితాలకు రూపునిచ్చే పనిలో పడ్డాడు. పదిహేనేళ్ళుగా ఈ రంగంలో కృషిచేస్తున్న సతీష్ ఇప్పటి వరకు 70-80 కాగితపు కళారూపాలను తయారుచేశాడు. ఎటు వంటి కృత్రిమ రంగులు లేకుండా కేవలం కేన్సన్ పేపర్ (ఇంపోర్టెడ్ చార్ట్) ఉపయోగించి వీటిని రూపొందించాడు. ఒక్కో చిత్రానికి రోజుల కొద్దీ శ్రమిస్తే గాని సంతృప్తికరంగా రాదని సతీష్ చెబుతారు. మనిషి జుత్తు, అలంకరించుకునే ఆభరణాలు, ముఖం మీద మడతలు ఆన్నీ కాగితాలతోనే తయారు చేస్తాడు. పురువిప్పిన నెమలి, ఈగ, పులి వంటి పక్షులు, జంతువులే కాకుండా వినాయకుడు, కృష్ణుడు, బుద్ధుడు, వెంకటేశ్వరుడు లాంటి దైవ స్వరూపాలను ఎన్నో కాగితంతోనే తయారు చేశాడు. తాజ్ మహల్ కాగితపు చిత్రాన్ని రూపొందించడానికి సుమారు సంవత్సర కాలం పట్టిందంటే ఇది ఎంత కష్టతరమైన కళో అర్ధం చేసుకోవచ్చు. సినీ నటి సమంతా తదితర ప్రముఖుల కాగితపు రూప చిత్రాలను రూపొందించి ప్రసంశలందుకున్నారు.
ఒక చిత్రం రూపొందించాలంటే వారం నుంచి నెల రోజులు పడుతుందని సతీష్ చెబుతున్నాడు. జాతీయస్థాయి అవార్డు ఎంపికకోసం ఇటీవల భారతరత్న సచిన్ టెండూల్కర్ కాగితపు చిత్రపటాన్ని రూపొందించి హైదరాబాద్ లేపాక్షి సంస్థకు పంపించాడు.
బి.కాం. చదువుకున్న సతీష్ 10 మార్చి 1971లో గోపాలపట్నం, విశాఖ జిల్లా లో జన్మించారు. చేస్తున్న ఎక్కౌంట్స్ జాబ్ ను కూడా వదలుకొని గురువనే వారు లేకుండా స్వయంగా నేర్చుకొని పరిణితి చెందారు. ఒకటిన్న అంగుళాల మందంతో రూపొందిచే ఈ కాగితపు చిత్రపటాన్ని రూపొందించడానికి చాలా ఖర్చవుతుందని, ఒక్కో కాగితపు చిత్రం 40 లేదా 50 వేలు విలువ చేస్తుందని. ఆ స్థాయిలో ప్రొత్సాహం లేదని అప్పుడప్పుడు కొన్ని ఆర్డర్లు వస్తున్నాయని వాటితోనే ఈ కళా సృజనలో సంపృప్తి ని పొందుతున్నానన్నారు. కళను కాసులతో లెక్కిస్తే ఇంత కాలం కళాకారునిగా కొనసాగలేనని, ప్రభుత్వం కూడా ఇలాంటి కళాకారులను ప్రోత్సహించాలసిన అవసరం వుందన్నారు. ఈ తరహా కళాకృతులను రూపొందించేది ఇండియా లో తానొక్కడినే సతీష్ అన్నారు.
తానా వారి ఆహ్వానం మేరకు 2017, 18 సంవత్సరాలలో వర్జీనియా లో ఈ పేపర్ క్రాఫ్ట్ పై వర్క్ షాప్ నిర్వహించారు.
అవార్డులు:
-ఏ.పి. ప్రభుత్వ నుండి 2018 లో ఉగాది పురస్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా అందుకున్నారు.
-ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ తో పాటు పలు సంస్థల నుండి సత్కారాలు అందుకున్నారు.
సతీష్ కుమార్ ను అభినందిచాలన్న, అయన కాగితపు కళాకృతులు కావాలన్న ఈ నంబర్లో సంప్రదించండి…(98494 18968)
-కళాసాగర్