కవితల మీగడ – పెరుగు రామకృష్ణ 

తెలుగు కవిగా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున నెల్లూరులోవుంటూ జాతీయ అంతర్జాతీయ వేదికలమీద కవితలు వినిపించిన ఏకొద్దిమంది కవుల్లో పెరుగు రామకృష్ణ ఒకరుగా పేరెన్నికకలవాడు. తనలోకి తాను ప్రవహిస్తూ ఎదుటివారిలోకి అదును పదునెరిగిన చూపుతో ప్రవహిస్తూ వర్తమాన సంక్షోభ సమాజ – అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్న కవీయన. తన కవిత్వానికి భావకత, పదప్రయోగం రెండు కళ్ళు గా భావిస్తూ కవిత్వాన్ని సామాన్యునిపక్షాన నిలుపుతున్న మాన్యకవిరామకృష్ణ, కవిత్వానికి చిరాయుస్సునిచ్చే దినుసైన దార్శనికతను పట్టుకున్న కవిగా, గొప్ప అధ్యయనశీలిగా, సమాజాన్ని ప్రేమిస్తూ లాలిస్తూ సంస్కరించాలనే తపనతో మున్ముందుకు పోతున్న అభ్యుదయవాది వినయం, విధేయత, వివేకం భావుకత, నిర్భీకత, నిష్పాక్ష పాతవైఖరి, ఆధ్యాత్మికత మీదమిక్కిలి – తాత్త్వికతల, సత్తువతో పెరిగిన కవి పెరుగు రామకృష్ణ, ప్రపంచమే వో కుగ్రామమైన ప్రవంచీకరణ వలితంగా, – జాతీయ, అంతర్జాతీయ వేదికలను అన్ని భాషల కవులు -ఎక్కుతున్నారు. వారి భావాలను వినిపిస్తున్నారు. అంతర్జాతీయ కవితావేదికలను అందిపుచ్చుకునే యోచనలో యోగ్యత సంపాదించడంలో కష్టనష్టాలను లెక్కచేయని కవితాప్రియుడీయన. స్వచ్ఛమైన, నిశ్చలమైన మనస్సుతో ఆలోచనా వైశిష్ట్యాన్ని అందలమెక్కిస్తూ, లోతైన భావాలకు ఊపిరిబదులుతూ ఆలోచనా వైశిష్ట్యాన్ని అందలమెక్కిస్తూ, లోతైన భావాలకు ఊపిరిబాదుతు, – నిర్మలమైన కవిత్వపు చేష్టలకు చైతన్యానందిస్తూ, దేశ – విదేశాల్లో రాణిస్తున్న వాడీయన. ఆలోచన, ఆవేశము పెనవేసుకొని జీవితంలో చొరబడిన యాత్ర కతను ప్రశ్నించేదిగా ఉంటుంది. వీరి – కవిత్వం. వీరు బహుగ్రంధ కర్త వీరు రాసిన కవితాసంపుటాలు…

వీరు ఈ సంవత్సరం ఆరు వదుల వయస్సుల్లోకి అడుగిడుతున్నారు. పదవీ విరమణ మే 31న చేసారు. వీరు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసారే కాని, వీరికి ప్రవృత్తిగా ఉన్న సాహిత్య రచన నుండి మాత్రం కాదు. పదవీ విరమణ సందర్భంగా (2018 నుంచి 2020) వీరు రాసిన కవిత్వాన్ని “దూదిపింజల వాన” శీర్షికతో కవితా సంపుటిని వెలువరిస్తున్నారు. ఈ సంపుటిలోని కొన్ని కవితలను పరమార్శ చేద్దాం.

2020 నూతన సంవత్సరం ప్రపంచాన్ని భయం గుప్పెట్లోకి నెడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ప్రపంచం మొత్తం మీద దీని బారినపడి లక్షల మంది జనం మరణించారు. ప్రపంచదేశాధినేతలకు కరోనా గొప్ప సవాల్ విసిరింది. దీన్ని అదుపుచేసేందుకు శాస్త్రజ్ఞలు అన్ని దేశాల్లో అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ వైరస్ వ్యాధి కారణంగా ప్రవంచంలో కరచాలనాలు కరువైనాయి. ముద్దుముచ్చట్లు వద్దురా బాబు అనిపిస్తున్నారు. నమస్కారమే సంస్కారంగా భావించడం జరుగుతుంది. మానవసంబంధాల మధ్య మర్యాదలుంటున్నాయే అనే భయంతో భౌతికదూరాలు పాటించడం జరుగుతుంది. ముక్కు మూతి కనబడకుండా మాస్కులేసుకొని మనుషులు కళ్ళతో మాట్లాడు కుంటున్నారు. కరోనామీద మంచికవితలు రాశాడో రామకృష్ణ,

గతంలో రామకృష్ణ ఆయన కవితత్వాన్ని గూర్చిచెప్తూ సాహిత్యం మనుషుల్ని కలిపే వాహికని, జీవితంలో ఓదార్పుకోసం కవిత్వాన్ని ఆశ్రయించానని, కవిత్వంలో మనిషిని అభిషేకించి మానవతవాదిగా పునీతుణ్ణి చేయాలన్నది తన సంకల్పమని పేర్కొన్నారు. నిర్మలమైన రసానుభూతిలో వాలలాడే నిజమైనకవి. సత్యాన్వేషణే కవిధర్మం. మూఢాచారాలను హేతుబద్ధతతో శాస్త్రీయ దృక్పదంతో ఎదిరించి మనిషిని గ్రుడ్డినమ్మకాల నుండి విముక్తుల్ని చేయగలిగిన కవిత్వాన్ని అందించాలి అనేది ఈకవి దృష్టి, దృక్పధం. కవి ఎప్పుడూ వికృత ఆలోచనలకు వక్రభావాలకు తావియ్యకూడదు. కవి సృజనశీలిగా వర్తమాన రుగ్మతలమీద కలం కదపాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది రామకృష్ణ భావన.

సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమకాలీన సమస్యలమీద కవులు ఎక్కువగా స్పందిస్తుంటారు. ఆ విధ్వంసక రూపం యొక్క మట్టు పూర్వోత్తరాలను, దాన్ని నశింపచేయడానికి అనువైన సూచనలను కవులుచేస్తుంటారు. అదే కోవలో కరోనా మీద కవితాయుధాన్ని ఎక్కుపెట్టాడీ రామకృష్ణ.

మనిషే ఒక శస్త్రం” అనే కవితలో కరోనా ఏ విధంగా మానవసంబంధాలను తుడిచివేస్తుంది. మనిషి ఎందుకు ఏకాంతర వాసానికి వెళ్లిపోతున్నాడో, దీన్ని తదముట్టించాలంటే మనిషిలో ఏవిధమైన మార్పు రావాలి అనే అంశాల్ని రేకెత్తించి రసవత్తరంగా కవిత్వాన్ని ఆవిష్కరించాడు.

“మనిషికి మనిషే శత్రువు చేసిన మహమ్మారి మనుషులు జీవచ్చవాలయినప్పుడు భయం రాత్రిపగలు ఒకటి చేస్తుంది.

కరోనా వైరస్ విజృంభింస్తున్న నేపథ్యంలో దేశ, విదేశాల్లో ప్రతి మనిషి అనుక్షణం భయం గుప్పెట్లో వణికిపోతున్నారు. మనుషులు జీవచ్చవాలై నిరాశ, నిస్పృహలతో దిగులు మొఖాలతో కనిపిస్తున్నారు.

రాత్రింబవళ్ళు ఒకటే తోడు అదేభయం భయంతో పారిపోవడం, మేధావుల ధర్మం కాదు. విపత్తును ధైర్యసాహసాలతో ఎదుర్కోవడం మనిషి వీరత్వానికి పరిశోధనా తత్త్వాణి, హేతువర్ధ నిర్ణయత్వానికి నిదర్శనం. అందుచేత
ప్రతి మనిషీ ఒక సైనికుడైన
రోగనిరోదకశస్త్రం కావాలి అని ఉద్బోధిస్తాడు కవి.
కవిత్వరహస్య మెరిగిన కవి రామకృష్ణగా చెప్పుకోవచ్చు. శస్త్రాలు లేవు, క్షిపణులులేవు. శత్రువు గుట్టురట్టు కానేలేదు. శవాలు మాత్రం గుట్టలుగా / మహమ్మారి మనిషి పైనే గురిపెట్టింది. అంటూ మందు కనుక్కోబడని ఈ వ్యాధి తీవ్రతను చెప్తూ అన్నిదేశాల్లో విపరీతంగా జనం మరణిస్తున్న విషయాన్ని ఎత్తి చూపుతాడు కవి. బహుశ దీనికి కారణం “పర్యావరణ స్పృహకోల్పోయినందుకు / క్షమించమంటున్నారు అంటూ నిశ్శబ్దము విశ్వయుద్ధంలో లో వ్యక్తపరుస్తాడు కవి.

ఈ కరోనాను తరిమికొట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ “మన బాధ్యత” కవితలో శుచి, శుభ్రత, పరిసరాల భద్రత ముఖ్యం… ప్రవంచమంతా ఒక విశాల రణరంగం అయింది అంటారు.

నాలుగు గోడల మధ్యవున్నా
భౌతిక దూరంపాటిస్తున్నా
భుజాల పై నున్న బాధ్యతమిన్న దాన్ని మరచిపోవద్దు అని హెచ్చరిక చేస్తాడు కవి.

ఒక కవితలో మనిషి తనం మొలకెత్తాలిప్పుడు అంటూ మనిషికి మానవత్వం ఉండాలి మనం యిప్పుడు మనిషి వాసన వస్తే చాలు అంటారు. ఇంకా…
కరోన మనిషిని సమూహం నుండి వేరుచేసి
ఏకాంతవాపు ఏకాకిని చేసింది అంటారు.

వసంతరుతువును కోకిల్లె పాడేకవులు సైతం “భయం గుప్పెట్లో వసంతగీతం పాడుతున్నారు. “సృష్టికొత్తగా పక్కకి వొత్తగిల్లినందుకు
కొత్త స్వరంతో కోకిల ఉగాదిగీతం పాడమంది
శార్వరి ముందు శిరసెత్తుకోలేక
వంచిన తలతో స్వాగతం పలుకుతూ
భయంగుప్పెట్లో వసంతగీతం రచిస్తున్నాను, అంటాడీకవి.

అంతటా లాక్ డౌన్ బయటకు రాటానికే వీలులేదు. భయటకు రావటానికే వీలులేదు. ఇలాంటి తీరిక సమయం అందామా! నిర్బంధపువేళ అందామా ! జ్ఞాపకాల్లోకి మనిషి వెళుతుంటాడో. జీవితాన్ని వెతుక్కుంటూ కవితలో
“నిశ్చలమైపోయిన బతుకుల్లో యిప్పుడు
జీవించిన క్షణాలు వెతుక్కుంటున్నాను.
నిశ్శబ్దం యింత నిర్వీరం చేస్తుందా!
అనుకుంటూ శబ్దరహిత సమాజాన్ని నిరసిస్తున్నాను
స్వార్దనదిని ఈది ఈది
అలసి నిర్బంధంలో నింపాది అయ్యాక
యిప్పుడు దానం, ధర్మం, గుర్తుకొస్తున్నాయి. అని మనిషిని ఎత్తిపొడుస్తూ కరోనా మనకిప్పుడు ఏ సమాధానాలు భోదించలేదని మనిషి పునర్జీవనం కావడానికి అనేకానేక ప్రశ్నలు మాత్రమే చూపింది. మనముందు ప్రశ్నలు మాత్రమే నిలబడ్డాయి. సమాధానాలు యింకా వాటికి ఎదురు పడడం లేదు. అనేది కవి భావన.

ఈ కవి వయస్సు పైబడే కొద్ది. కవిత్వంలో మాగిపోతు, ఒక తాత్త్విక వాసనతీస్తున్నాడు. అందుచేతనే ఈ క్షణం మాత్రమే నీది అనే కవిత రాశాడు. అందులో ఏది శాశ్వతం కాని సృష్టిలో ఆరాటపోరాటాలు నీక్షణాన్ని మననులో ఆనందించు ఈ క్షణం మాత్రమే నీది.

నలుగురికి క్షణాల విలువ తెలిసేలా
నీ జీవితం నీ సొంతం కావాలి
అంటూ అద్భుతమైన వో తాత్త్వికతను ఎత్తి చూపుతాడీ కవి.

పుట్టినపుడు పేరుండదు / ఊపిరొక్కటే ఉంటుంది
పోయేటప్పుడు ఊపిరుండదు / పేరు మాత్రమే ఉంటుంది.
అందుకే మనిషి ఊపిరి, పేరు లేకుండా మనిషి మాయమవ్వడం సర్వదండన మనిషి జీవితం అంటాడు. నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో / నలుగురినీ ప్రేమించడం నేర్చుకో
కాలంలో నువ్వొక రెప్ప మాత్రమే
అనంతంలో నీ ఉనికి సేవాభావం చేతనైనంత వరకు
వరోవకారిగా బతకమంటాడు కవి. “గుండెకొలిమి” కవితలో నేటి మనిషి నిజస్వరూపాన్ని ఎత్తి చూపుతూ మనుషలందరూ కాలం తీర్చిన యంత్రాలయ్యాక విలువలన్న తెరమీదనే ఆవిష్కరణ అంటారు.

ఎప్పుడూ నేను జీవిత విస్పోటనా వ్యధల్ని / మాత్రమే కవిత్వం చేస్తాను /
కవిత్వ గర్భాన్ని తవ్వితీసిన / ప్రజలంతా బ్రతుకుని అభిషేకిస్తాను.

నిలువుగా కూలిపోయిన వ్యధాభరితుల్ని ఓదార్చడమేలాగోనాకు నా తల్లి నేర్పింది శరీర వెన్నెముకను పాతుము జీవిత జెండాను నిర్భయంగా ఎగరేయడం నా తండ్రి నేర్పాడు. ఆత్మ శిధిలాలకు జీవం పోసి జాగృత సంచారాల కొరడాలతో ప్రపంచం చుట్టూ జైత్రయాత్ర చేస్తాను. అంటూ ఆత్మ విశ్వాసంతో ముందుకు పోతున్న పెరుగు రామకృష్ణ అన్నట్లు గానే ప్రపంచం చుట్టూ / జైత్రయాత్రగా కవితా యాత్ర చేస్తూనే ఉన్నారు. కోదండ రాముడిచ్చిన అభయంలో కవి రామకృష్ణ యిచ్చినమాట నిలబెట్టుకుంటూ కవితా యాత్ర కొనసాగిస్తూ శేష జీవితాన్ని కవిగానే రాణింపజేస్తాడని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను.
మే 31న ఉద్యోగ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తున్నాను.

-కొండ్రెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap