తెలంగాణ విముక్తి కోసం తన కవితను ఆయుధంగా మలచి ఉద్యమించిన ‘సుకవి’ అతడు. నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రజల అగచాట్లను, కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలచి పీడిత ప్రజల గొంతును వెలుగెత్తి నినదించిన ఉద్యమ కారుడతడు. అందుకు ఆ నిరసనకారుడు ధారపోసిన కవితాధార ‘అగ్నిధార’. “ముసలి నక్కకు రాచరికంబు దక్కునే…ఓ… నిజాము పిశాచమా, కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని” అని గర్జిస్తూ “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని సగర్వంగా ప్రకటించి, విముక్తి ఉద్యమానికి ప్రేరణనిచ్చిన ప్రాతఃస్మరణీయుడతడు. “మనం జనం జనం మనం మనం వెనక్కు నడవం జనం వెనక్కు నడవరు’’ అంటూకన్ను త్యేరచి తెలంగాణ కన్ను తెరిచేలా ఎలుగెత్తి నినదించిన ధీరుడతడు. ఇందూరు కోట జైలులో పండ్లు తోముకోవడానికి నిజాం సిబ్బంది ఇచ్చే బొగ్గులను ఆయుధాలుగా మలిచి, “దగాకోరు, బడాచోరు, రజాకారు పోషకుడవు. దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది. దిగిపోవోయ్, తెగిపోవోయ్” అంటూ కవిత్వాన్ని వజ్రాయుధంగావాడి, ఆ జైలు గోడలమీద నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పద్యాలు రాసి కొరడా దెబ్బలు తిన్న విప్లవకారుడతడు. భావప్రేరిత ప్రసంగాలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన ధీశాలి. తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు నేటికీ ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నాయి. ఆ ధీమంతుడే ‘దాశరధి’ అని ప్రేమగా పిలిపించుకున్న దాశరథి కృష్ణమాచార్యులు. ఆయన ఓ మరపురాని మధురమూర్తి. చలన చిత్రసీమలో కూడా దాశరథి తన మార్కు పాటల్ని రాసి ‘శభాష్’ అనిపించుకున్నారు. జూలై 22 న దాశరథి జయంతి సందర్భంగా ఆ కవితా పయోనిధిని సంస్మరించుకుంటూ, ఆయనను గురించి కొన్ని విశేషాలు…
బాల్యం నుంచే విప్లవబాటలో ….
జూలై 22 1925 న జన్మించిన దాశరథి కృష్ణమాచార్యుల బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. మెట్రిక్యులేషన్ పరీక్షను ఉర్దూ మీడియంలో చదివారు. తెలంగాణా విమోచనోద్యమం కారణంగా చదువు కుంటుపడడంతో 1952లో ఉస్మానియా విశ్వవిద్యాలయ సాయంకళాశాలలో చేరి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నారు. చిన్నతనం నుంచే పద్యాలు అల్లడంలో ప్రావీణ్యత సాధించారు. సంస్కృత, ఉర్దూ, పారశీక భాషల్లో దాశరథి ధిట్ట. తొలినుంచి వామపక్ష భావాలు కలిగిన దాశరథి, కమ్యూనిస్టు సిద్ధాంతాలు, వాటి వైఖరి నచ్చక రెండవ ప్రపంచ యుద్ధసమయంలో బయటకు వచ్చారు. సాయుధ రైతాంగ పోరాటానికి నడుంబిగించారు. మెట్రిక్యులేషన్ పూర్తవగానే కొంతకాలం ఉపాధ్యాయునిగా, పట్టా పుచ్చుకున్న తరవాత పంచాయతీ తనిఖీ అధికారిగా పనిచేశారు. 1956 నుండి 1963 వరకు ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రంలోను, 1963 నుండి 1971 వరకు ఆకాశవాణి, మద్రాసు కేంద్రంలోను సాహిత్య విభాగంలో ఉద్యోగం చేశారు. ఆంధ్రమహాసభలో విప్లవాత్మక సందేశాలు ఇచ్చినందుకు నిజాం ప్రభుత్వం 1948లో దాశరథిని జైలులో పెట్టింది. నిజామాబాదు ఇందూరుకోట జైలులో వున్నప్పుడు పండ్లు తోముకోవడానికి జైలు సిబ్బంది ఇచ్చే బొగ్గుముక్కలతో ఆ జైలు గోడల నిండా నిజాం కు వ్యతిరేకంగా పద్యాలు రాసి కొరడాదెబ్బలు తిన్నారు. జైలునుంచి విడుదలైయిన తరవాత తెలంగాణ రచయితల సంఘాన్ని నెలకొల్పి యువతలో సాహితీ చైతన్యాన్ని రగిలించి కవితా సేవలు విస్తరింపజేశారు. ఆయన మంచి వక్త, వాగ్బాణాలు సంధించడంలో ధిట్ట కావడంతో ఊరూరా పర్యటిస్తూ ప్రజలను ప్రభావితం చేశారు. దాశరథి రచించిన తొలి పుస్తకం ‘అగ్నిధార’ ను 1949లో దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవంలో విడుదల చేశారు. నిజాం నిరంకుశత్వం, భారత స్వాతంత్ర్య సమరం, ప్రజల అగచాట్లు, నిజాం ప్రభుత్వ పతనం వంటి అంశాలు ‘అగ్నిధార’ ఖండికల రచనకు పునాదులని దాశరథి స్వయంగా చెప్పుకున్నారు. తరవాత ‘రుద్రవీణ’, ‘మహా ఆంధ్రోద్యమం’, ‘పునర్నవం’, ‘కవితా పుష్పకం’, ‘తిమిరంలో సమరం’ వంటి కవితాగ్రంధాలు వెలువరించారు. కథలు, నాటికలు కూడా రాశారు. 1965లో ‘గాలిబ్ గీతాలు’ రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఉత్తమ అనువాద గ్రంధ బహుమతి, 1967లో ‘కవితా పుష్పకం’ సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. 1974లో ‘తిమిరంలో సమరం’ రచనకు కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో, ఆగ్రా విశ్వవిద్యాలయం ‘డాక్టర్ ఆఫ్ లెటర్స్’ పట్టాతో దాశరథిని సత్కరించారు. 1977లో దాశరథి ఆంధ్రరాష్ట్ర ఆస్థాన కవిగా నియమితులయ్యారు.
సింహద్వారం గుండా చలనచిత్ర సీమకు ….
దాశరథి సినీరంగ ప్రవేశానికి ముందే ఎన్నో లలితగీతాలను రాసి ఆకాశవాణి ద్వారా ప్రసారం చేయించారు. ‘నవమంజరి’ పేరుతో లలిత గీతాల సంపుటిని వెలువరించారు. దాశరథికి సూఫీ కవిత్వమంటే ప్రత్యేక అభిమానం. ఆ కోవలోనే 1960లో మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్ళను ‘గాలిబ్ గీతాలు’ పేరుతో క్లుప్తత చెడకుండా రెండు పాదాలలోనే గాలిబ్ భావాలను విశదీకరిస్తూ అనువదించారు. ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు అంకితమిచ్చారు. ఆనాటి సభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. దాశరథి రాసిన గాలిబ్ గీతాలను దుక్కిపాటి మధుసూదనరావు చదవడం జరిగింది. దాశరథి రచనా శైలి ఆయనను ఆకట్టుకుంది. దాశరథికి ప్రత్యుపకారం చేయనెంచి, సినిమాల్లో పాటలు రాయమని అక్కినేని, దుక్కిపాటి ఇద్దరూ కోరారు. తనకు సినిమా సంగీత పరిజ్ఞానం లేదని దాశరథి సమాధానమివ్వడంతో, మధుసూదనరావు “అదేమీ పెద్ద విషయం కాదు. మీరు సరేనంటే అంతా మేము చూసుకుంటాం” అన్నారు. దాశరథి అందుకు సరేనంటూ మద్రాసుకు ప్రయాణం కట్టారు. అక్కడ సాలూరు రాజేశ్వరరావు కొన్ని ట్యూనులు వినిపించి “మీరు ట్యూనుకు పాట రాస్తారా, లేక ముందు పాట రాస్తే నేను బాణీ కట్టనా” అని దాశరథి ని అడిగారు. దాశరథి రాజేశ్వరరావుకే అవకాశమిస్తూ “ట్యూను ఇవ్వండి సార్. పాట రాసేందుకు ప్రయత్నం చేస్తాను” అని వినయంగా చెప్పారు. రాజేశ్వరరావు ఒక ట్యూను వినిపించి పాట రాయమని దాశరథి కి చెప్పి తాంబూల చర్వణం కోసం బయటకు వెళ్లి మరో పది నిమిషాల్లో తిరిగి వచ్చారు. అప్పటికే పాట రాసిన దాశరథి, కాగితాన్ని రాజేశ్వరరావు చేతిలో పెట్టారు. రాజేశ్వరరావు ఆశ్చర్యపోతూ ఆపాటసాహిత్యాన్ని హార్మోనియంమీద పలికిస్తూ, రాగాలాపనచేసి సరిచూసుకుంటే బాణీకి/మీటర్ కి అతికినట్లు సరిపోయింది. వెంటనే చరణాలకు బాణీ చెప్పి దాశరథి వాటిని రాసేలోపల నిర్మాత మధుసూదనరావు వద్దకు వెళ్లి “సార్… ఈ రచయిత అఖండుడండీ. నేను వారికి ఇచ్చింది చాలా కఠినమైన ట్యూను. ‘ది కింగ్ స్టన్ ట్రయో’ ఆలపించిన ‘హ్యాంగ్ డవున్ యువర్ హెడ్ టామ్ డూలీ’ పాట ఆధారంగా ఇచ్చిన ట్యూనది. అవలీలగా పదినిమిషాల్లోనే ఆ ట్యూనుకి పల్లవి రాసిచ్చారు. ట్యూనుకు అతికినట్లు సరిపోయింది” అంటూ రాజేశ్వరరావు ప్రశంసల వర్షం కురిపించారు. చరణాలు కూడా అద్భుతంగా అమరాయి. అదే “ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా” అంటూ ఉర్దూ పదాల మేలవింపుతో దాశరథి రాసిన తొలి పాట. ఈ పాటను ఊటీలో చిత్రీకరించేటప్పుడు అక్కినేని ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని పాట బ్యాక్ గ్రౌండ్ సంగీతానికి అనుగుణంగా కాళ్ళు కదిలించేలా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. పైగా “చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలసిపోదామా హాయిగా, నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా” అనే చరణాన్ని మాత్రం ఇండోర్లో చిత్రీకరించారు. అవుట్ డోర్ షాట్ కు ఇన్ డోర్ షాట్ కు ఎక్కడా తేడా కనిపించకుండా చిత్రీకరించడం ఈ పాట గొప్పతనం. అందుకే దాశరథి రాసిన తొలి పాటే సూపర్ హిట్ గా నిలిచింది. ఉర్దూ భాషలో దాశరథికి మంచి ప్రవేశం వుండడం, ఖవ్వాలీ పాటల తీరుతెన్నులు బాగా తెలిసి ఉండడంతో, దాశరథి చేత ఒక ఖవ్వాలీ పాటను కూడా రాయిస్తే సినిమాలో కొత్తదనం కనిపిస్తుందని దాశరథి చేత “నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి” అంటూ ఖవ్వాలి ప్రాసలో పాట రాయించారు దుక్కిపాటి. ఈ పాట కూడా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నదే! ‘ఇద్దరుమిత్రులు’ సినిమా నిర్మాణ సమయంలోనే ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో ‘వాగ్దానం’ సినిమా రూపుదిద్దుకుంటోంది. దాశరథిని ఆత్రేయ ఆహ్వానించి ఒక పాట రాయమన్నారు. సంగీత దర్శకుడు పెండ్యాల దర్శకనిర్మాత వి.శాంతారాం నిర్మించిన ‘నవరంగ్’ సినిమాలో “ఆదా హై చంద్రమా రాత్ ఆధీ” అనే పాట ట్యూనుని రేఖామాత్రంగా సూచిస్తూ దాశరథిని పాట రాయమంటే “నాకంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా” అంటూ అద్భుతంగా రాసి ఇచ్చారు. ముఖ్యంగా ఈ పాటలో ‘‘ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో, జాబిలి వెలిగేను మనకోసమే”/ “ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా”/ “అందాలను, తీపి బంధాలను, అల్లుకొందాము డెందాలు పాలించగా’’ వంటి అద్భుత పద ప్రయోగాలను చరణాలలో జొప్పించారు. ఈ పాటను అక్కినేని, కృష్ణకుమారిల మీద డ్రీం సాంగ్ గా చిత్రీకరించారు. దాశరథి తొలిపాటను ‘ఇద్దరుమిత్రులు’ సినిమాకోసం రాసినా, ‘వాగ్దానం’ సినిమా ముందుగా 05-10-1961 న విడుదలైంది. ‘ఇద్దరుమిత్రులు’ సినిమా కాస్త ఆలస్యంగా 29-12-1961 న విడుదలైంది. రికార్డు విడుదల ప్రకారం తీసుకుంటే దాశరథి రాసిన తొలి తెలుగు పాట ‘ఇద్దరుమిత్రులు’ సినిమాలోని ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ” గానే పరిగణించాలి.
దాశరథి రచించిన వైవిధ్య గీతాలు
దాశరథి ఎన్నో భక్తిగీతాలను సినిమాలకోసం రాశారు. ఆ పాటలన్నీ శ్రోతలు మెచ్చినవే. “తిరుమల మందిర సుందరా”(మేనకోడలు), “నను పాలింపగ నడచీ వచ్చితివా” (బుద్ధిమంతుడు), “శరణం నీ దివ్య చరణం” (మట్టిలో మాణిక్యం), “నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో” (రంగులరాట్నం), “రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా” (రాము) పాటలు దాశరథి రాసిన భక్తి పాటల్లో కొన్ని. రక్తి పాటలను కూడా దాశరథి అద్భుతంగా ఆవిష్కరించారు. వాటిలో కొన్ని “తనివి తీరలేదే నా మనసు నిండలేదే” (గూడుపుఠాణి), “వెన్నెలరేయి ఎంతో చలీ చలీ” (ప్రేమించిచూడు), “ఓ చెలీ కోపమా అంతలో తాపమా” (శ్రీకృష్ణ తులాభారము), “విన్నవించుకోనా చిన్న కోరికా” (బంగారు గాజులు), “ఎన్నెన్నో జన్మలబంధం నీది నాది” (నోము), “ఈవేళ నాలో ఎందుకో ఆశలు” (మూగనోము), “ఒక పూలబాణం తగిలింది మదిలో” (ఆత్మగౌరవం), “ఓ బంగరు రంగుల చిలకా పలకవే” (తోటరాముడు). వీణ పాటలంటే వెంటనే గుర్తుకొచ్చేది దాశరథి గీతాలే. వాటిలో కొన్ని “పాడెద నీ నామమే గోపాలా” (అమాయకురాలు), “వేణుగానలోలునిగన వేయి కనులు చాలవులే” (రెండు కుటుంబాల కథ), “నేనె రాధనోయి గోపాలా” (అంతా మనమంచికే), “మ్రోగింది వీణా పదేపదే హృదయాలలోనా” (జమీందారుగారి అమ్మాయి), “మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే” (ఆత్మీయులు). అలాగే దాశరథి రాసిన ఖవ్వాలీ పాటలు కూడా జనరంజకాలే. “నవ్వాలీ నవ్వాలీ నీ నవ్వులు నాకే ఇవ్వాలి” (ఇద్దరుమిత్రులు), “అందాల ఈ రేయి రాదోయి రాదోయి” (లేతమనసులు), “దీపాలు వెలిగె పరదాలు తొలగె” (పునర్జన్మ) పాటలు ఆ కోవలోనివే. కొన్ని మంచి ఆవేదనాభరిత గీతాలను కూడా దాశరథి రాసి హిట్ చేశారు. వాటిలో “మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనమూ నీకేలా” (రాము), “కన్నయ్యా నల్లని కన్నయ్యా” (నాదీ ఆడజన్మే), “నీవురావు నిదుర రాదు నిలిచిపోయె ఈ రేయి” (పూలరంగడు), “బాబూ వినరా అన్నాతమ్ములా కథ ఒకటి” (పండంటి కాపురం) మచ్చుకు కొన్ని మాత్రమే. మరికొన్ని మంచి పాటలను ఉదహరించాలంటే… “అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం” (ఆడపడుచు), “నన్ను వదలి నీవు పోలేవులే” (మంచిమనసులు), “వినిపించని రాగాలే” (చదువుకొన్న అమ్మాయిలు), “అందాల ఓ చిలుకా అందుకో నా లేఖా” (లేతమనసులు), “రాశాను ప్రేమలేఖలెన్నో” (శ్రీదేవి), “దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే” (తేనెమనసులు), “అందాల బొమ్మతో ఆటాడవా” (అమరశిల్పి జక్కన్న), “గోదారి గట్టుంది, గట్టుమీద చెట్టుంది” (మూగమనసులు), “కిలకిల నగవుల నవమోహినీ ప్రియ కామినీ” (వసంతసేన), “కనరాని దేవుడే కనిపించినాడే” (రంగులరాట్నం). ఇలా చెప్పుకుంటూ పొతే దాశరథి రాసిని కొన్ని వందల పాటల్లో యేపాటను తీసివేయగలం! నంది పురస్కారాలు ప్రారంభించేనాటికే దాశరథి దాదాపు సినిమా పాటలు రాయడం మానివేయడంతో ఆ బహుమతులు దాశరథి అందుకోలేకపోయారు.
కొన్ని విశేషాలు….
దాశరథికి విమాన ప్రయాణమంటే చాలా భయం. ఎవరైనా ఈ విషయాన్ని దాశరథి వద్ద ప్రస్తావిస్తే ‘’మహాత్మా గాంధి అంతటివాడు ఎక్కని విమానంలో ప్రయాణించడానికి మనం ఎంతవరకు అర్హులం’’ అని సమర్ధించుకుంటూ ఎదురు ప్రశ్నించేవారు. అయితే ఒకసారి దాశరథి ముక్త్యాల రాజా గారితో కలిసి మద్రాసు నుంచి హైదరాబాద్ కు విమానంలో రావలసిన అవసరం యేర్పడింది. ఆరోజుల్లో ఇప్పటిలాగా బోయింగ్ వంటి భారీ విమానాలు లేవు. తక్కువమంది ప్రయాణీకులను చేరవేసే డకోటా, వైకౌంట్ రకం విమానాలు వుండేవి. విమానం టేకాఫ్ అవుతుండగా రాజుగారితో దాశరథి ‘’బాబూ ఈ వైకౌంట్ విమానం మనల్ని వైకుంఠానికి తీసుకెల్తుందేమో. పరధ్యానంలో వుండకుండా కాస్త ఓం అనుకుంటూ హరి ధ్యానంలో వుండండి. వైకుంఠయాత్ర తప్పుతుంది’’ అని చమత్కరించారు.
పాటల కంపోజింగ్ లో కుడి అరచేతిని నోటికి అడ్డం పెట్టుకొని నెమ్మదిగా మాట్లాడేవారు. అందరినీ చిరునవ్వుతో పలకరించేవారు. దాశరథి వినయశీలి, వేదాంతి. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన మిత్రుడైన పాత్రికేయుడు మాగాపు రామన్ సంతాపసభకు మద్రాస్ లో హాజరైనప్పుడు దాశరథి చేసిన అశ్రుతర్పణం రాధాకృష్ణన్ ను కదిలించింది. దాశరథిని వారు ఆలింగనం చేసుకున్నారు. హైదరాబాద్ శాసన సభకు సమీపంలో వుండే గోపి హోటల్ అంటే దాశరథికి చాలా ఇష్టం. హైదరాబాద్ ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు, ముఖ్యంగా శాసనసభ సమావేశాలకాలంలో పాత్రికేయులతో ఆ హోటల్లో కూర్చొని వేడి వేడి ఇడ్లీ ఆరగిస్తూ సాహిత్య గోష్టి చేయడం దాశరథికి అలవాటుగా వుండేది.
దాశరథి అన్నపూర్ణా వారు నిర్మించిన ‘చదువుకున్న అమ్మాయిలు’ చిత్రంలో ఓ చిన్న వేషం వేశారు. అలాగే సౌభాగ్య కళాచిత్ర వారు నిర్మించిన ‘శబాష్ పాపన్న’ చిత్రంలో కూడా చిన్న పాత్ర ధరించారు. బాబూ మూవీస్ వారి ’మంచి మనసులు’ చిత్రంలో దాశరథి ‘నన్ను వదలి నీవు పోలేవులే అనే పాటను రాశారు. అందులో ‘రంగులీను నీ మెడలో బంగారపు తాళి కట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే అన్న పంక్తులు దర్శకుడు ఆదుర్తిని ఎంతగానో ప్రభావితం చేశాయి. మరో రెండు పాటలు రాయమని, మద్రాసు రావలసిందిగా ఆదుర్తి కోరినా అనివార్య కారణాల వలన దాశరథి వెళ్లలేకపోయారు. వాటిని ఆత్రేయ, ఆరుద్ర రాయడం జరిగింది.
1983లో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆస్థాన కవి వంటి పదవులు అనవసరమని భావించి ఆ పదవిని రద్దుచేశారు. అప్పుడు దాశరథి ఆ పదవిలో వున్నారు. దాంతో దాశరథి వ్యాకులత చెందారు. అదీ కాకుండా క్రమంగా ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. అలా నవంబరు 5, 1987 న దాశరథి హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు.
ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)
శ్రీ దాశరథి గారి గురించి మీరు వ్రాసిన అద్భుతమైన వ్యాసం ఎంతో హృద్యంగా వుంది.శ్రీ దాశరథి గారి గురించి విశేషాలు అందించినందుకు ధన్యవాదాలు