సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా దీపికారెడ్డి

(తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా నర్తకి దీపికారెడ్డి నియామకం)
తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా ప్రముఖ నర్తకి, కూచిపూడి నాట్యగురు శ్రీమతి దీపికారెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

గతంలో మూడేళ్ళ పాటు టిఆర్ఎస్ నేత నాటక ప్రియుడు బాద్మి శివకుమార్ ఈ పదవిలో కొనసాగారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ పగ్గాలు ఈసారి మహిళకు అందునా నాట్యరంగానికి లభించింది. హైదరాబాద్ కు చెందిన దీపికారెడ్డి నియమితులుకావడం సంతోషకరం. దీపికారెడ్డి భారత రాష్ట్రపతి ద్వారా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. .

ఇప్పటికే కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతగా, అనేక సంచలనాత్మక నృత్య రూపకాలు ప్రదర్శించిన నర్తకీమణిగా ఆమె అందరికి సుపరిచితురాలు. తన పై నమ్మకంతో ఇంతటి పెద్ద బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి దీపికారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సంగీత నాట్య నాటక రంగాలను తన వంతు బాధ్యతగా పరిరక్షించేందుకు పరిఢవిల్లేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు. తనపై ముఖ్యమంత్రి కెసిఆర్ నమ్మకం ఉంచి అకాడమీ అప్పగించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

పురస్కారాలు
2007లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ‘కళారత్న’ అవార్డు, 2016లో తెలంగాణ రాష్ట్ర అవార్డు, దేవదాసి జాతీయ అవార్డు, అక్కినేని నాగేశ్వరరావు స్వర్ణకంకణం, ఎఫ్‌సీసీఐ ఫ్లో ఉమన్‌ అచీవర్‌, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ‘కీర్తి’ పురస్కారం, దూరదర్శన్‌ ఏ-టాప్‌ గ్రేడ్‌ కళాకారిణిగా గుర్తింపు, రీజినల్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు, నంది సినిమా అవార్డుల జ్యూరీ, తెలంగాణ ఉగాది పురస్కారాల సెలక్షన్‌ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. దీపికారెడ్డి భర్త శ్యాంగోపాల్ రెడ్డి బిజినెస్‌మ్యాన్‌. వారికి ఇద్దరు పిల్లలు.. అమ్మాయి శ్లోకారెడ్డి కూచిపూడి నృత్య కళాకారిణి కాగా.. అబ్బాయి అభినవ్‌ టెన్నిస్‌ ఆటగాడు.

కళారంగం
దీపికారెడ్డి తన 6 ఏళ్ళ వయసులోనే నృత్యరంగప్రవేశం చేసింది. 1976లో రవీంద్రభారతిలో అప్పటి ముఖ్యమంత్రి సమక్షంలో తొలి ప్రదర్శన ఇచ్చింది. ప్రఖ్యాత నాట్యగురువు సుమతీ కౌశల్‌ దగ్గర కొంతకాలంపాటు శిక్షణ పొంది, తర్వాత చెన్నై వెళ్ళి వెంపటి చినసత్యం మాస్టారు వద్ద నాట్యకళను అభ్యసించింది. నృత్యరంగంలో రాణించి అక్కినేని నాగేశ్వరరావు చేతులతోనే ‘స్వర్ణకంకణం’ తొడిగించుకున్నాను.

నృత్య దర్శకురాలిగా కోవిడ్, ప్రకృతి రక్షతి రక్షితః, రాంగ్, శివ సత్యం, శాంతి జీవనం, జయోస్తు కూచిపూడి, స్త్రీ త్రయం, త్యాగరాజ భక్తి వైభవం, ఆంధ్రము, గృహకల్పం, తెలంగాణ వైభవం, రీతు సంహార, నమస్కార్, షణ్మతం, ఓడ్ టు ఘంటసాల, వందన, స్వాగతంజలి, తేజస, వైద్యో నారాయణో హరిహి, దర్శనీయ హైదరాబాద్, తెలంగాణ సాహితీ సౌరభం, ప్రతిసంధి రామాయణం, రుక్మిణి కృష్ణ వంటి నృత్యరూపాలను రూపొందించి ప్రదర్శించింది. నాట్య ఇళవరసి, నాట్య విశారద, పంచరత్న మహిళా పురస్కారం, కళాతరంగ్, రాష్ట్రీయ వికాస్ శిరోమణి, నాట్య మణి వంటి బిరుదులు కూడా పొందారు.

Deepika Reddy Rukmini Krishna Dance Ballet

ఢిల్లీలో ‘ద్రౌపది’ ప్రదర్శన ఇచ్చింది. ఖజురహో, కోణార్క్, హంపీ, చిదంబరం, మహాబలిపురం, ముద్ర, చాళుక్య వంటి ప్రతిష్టాత్మక జాతీయస్థాయి నాట్యోత్సవాల్లో ప్రదర్శనలతోపాటు సాంస్కృతిక రాయబారిగా ప్రభుత్వం తరఫున మాస్కో, ఫ్రాన్స్‌, అమెరికా, దక్షిణ కొరియా, బ్యాంకాక్‌ దేశాల్లో శిష్యులతో కలిసి స్వీయ దర్శకత్వంలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.

డ్యాన్స్ ఇన్స్టిట్యూట్
కూచిపూడి నృత్యాన్ని తదుపరి తరానికి అందించాలనే ఉద్దేశ్యంతో దీపికారెడ్డి 2000లో దీపాంజలి అనే సంస్థను స్థాపించింది. కేంత్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. పలువురు విద్యార్థులు తమ ప్రదర్శనలు ఇచ్చారు. దీపికారెడ్డి దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు సిసిఆర్టీ స్కాలర్‌షిప్‌లు, దూరదర్శన్ ద్వారా గ్రేడ్‌లు కూడా పొందారు.

  • డా. మహ్మద్ రఫీ

1 thought on “సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా దీపికారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap