“హాస్యమేవ జయతే” అంటున్న “సుమధుర కళా నికేతన్”

(సుమధుర 25 వ హాస్య నాటికల పోటిలు – విజయవాడలో 2022 జూలై 29, 30, 31 తేదిలలో…)

నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం…, 1973 వ సం.లో విజయవాడలో
ఓ శుభ ముహూర్తంలో, ధృడమైన, శుభసంకల్పంతో ఓ “నవ్వుల పువ్వు” మొగ్గ తొడిగింది.
దాని అందమైన పేరే…”సుమధుర కళా నికేతన్ “.

సుమధుర(O) కళానికేతన్ చరితం:సుమధుర” వ్యవస్థాపకులు శ్రీ యుతులు H.V.R.S. ప్రసాద్, J.S.T. శాయి, A. ప్రేమ్ కుమార్, P. రఘుబాబు, P. సాంబశివరావు, B.K. రాధ, V. ప్రభాకర్. వారు సహృదయంతో నాటిన “విత్తే” మొలకెత్తి, తెలుగు రాష్టాల్లో “కళా వృక్షం” అయింది.

“వేణువు మీద వున్న చిలుక” లోగోను తయారు చేశారు శ్రీ పుల్లేశ్వర్ గారు.

విజయవాడలో అప్పుడు “నెలవారీ ప్రేక్షక సభ్యుల సంస్థలు”
శ్రీ త్యాగరాజ సంగీత సభ, శ్రీ సద్గురు సంగీత సభ,
శ్రీ నటరాజ కళామండలి, ఆంధ్ర నాటక కళా సమితి,
శ్రీ కనక దుర్గ సేవా సమితి, శ్రీ శారద కళా సమితి,
ఆంధ్ర ఆర్ట్ అకాడమి, మొదలైన సంస్థల ప్రక్కన నిలబడి, ప్రతినెలా క్రమం తప్పకుండా
ప్రేక్షక సభ్యుల కోసం అనేక మంచి మంచి నాటకాలు, నాటికలు, సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించి, ప్రేక్షకుల, పత్రికల ప్రశంసలు పొందింది సుమధుర.

యువతలో నిబిడీకృతమైన ఆసక్తిని, కళాభిజ్ఞతను, ప్రతిభా పాటవాల్ని వెలికి తీయాలనే సదాశయంతో వక్తృత్వం, వ్యాసరచన, స్కిల్స్, మైమ్, కార్టూన్లు, సంగీతం, నృత్య రంగాలలో పోటీలు నిర్వహించి వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది సుమధుర.

ఇతరులు ప్రదర్శించిన కళారూపాలే కాకుండా, అనేక సాంఘిక నాటకాల, నాటికలు, హాస్య నాటికలతో వివిధ నాటక పరిషత్ లో పాల్గొని, బహుమతులు సాధించింది.
“అన్నమయ్య”,”క్షేత్రయ్య”, “వరూధిని -ప్రవరాఖ్య”. “ఆది శంకరాచార్య” లాంటి సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలను అత్యత్బుతంగా ప్రేక్షక జన సమ్మతంగా ప్రదర్శించి విజ్ఞుల ప్రశంసలు, పత్రికల అభినందనలు, అభిమానుల అభిమానం చూరగొంది “సుమధుర”.

“నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం”
ఈ ప్రపంచం మొత్తం జీవరాశిలో నవ్వించగల యుక్తి + నవ్వగల శక్తి ఒక్క మానవుడికే వుందని, అలాంటి మనిషికి అందిచే “నవ్వు”తో మనసుకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని, పంచి పెట్టాలని నటుడు+రచయిత+దర్శకుడు అయిన “హాస్య బ్రహ్మ” జంధ్యాలగారి సలహా స్పూర్తితో, అలాంటి సున్నితమైన హాస్యాన్ని ప్రేక్షకులకి అందించే ప్రయత్నంగా “హాస్య నాటికల పోటీలు” ప్రారంభించింది. విజయవాడలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా యావత్ భారత దేశంలోనే “హాస్య నాటికల పోటిలు” నిరవధికంగా నిర్వహించడం ఒక్క “సుమధుర కళా నికేతన్”, విజయవాడ అని చెప్పుకోవచ్చు అని నా భావన.

సుమధుర కళా నికేతన్ కళాసేవయే కాకుండా, సమాజ హితవు కోరి, స్థానిక విజయవాడ కళాకారుల ఆర్ధిక స్థితి గతుల మీద కూడా దృష్టి సారించి, ఏ ఆధారం లేని నిరుపేద కళాకారుల బిడ్డల కోసం “సుమధుర విద్యానిధి”, వయోభారం వల్ల బాధ పడుతున్న సీనియర్ కళాకారులకి “వృద్దాప్య పించన్” పధకాల ద్వారా ఇచ్చి ఆదుకుంది. అలాగే, ప్రపంచం మొత్తాన్ని గడగడ లాడించిన “కరోనా” “దుర్భర, దుర్భిక్ష, విషమ” పరిస్థితుల్లో చేసేందుకు పని లేక, తిండి లేక విలవిల లాడి పోతున్న స్థానిక కళాకారుల కుటుంబాలకు స్నేహ హస్తంతో, వంట సరుకులు, ఆర్ధిక సహాయం అందించి సహకరించింది సహృదయులైన “దాత”ల సహాయ సహకారాలతో “సుమధుర కళా నికేతన్”.

“సుమధుర” కార్యవర్గంలోని కళాకారుల్లో ఏంతో మంది కాలగర్భంలో కలిసిపోయినా, వున్నవాళ్ళే, కార్య భారాన్ని తమ భుజస్కంధాలపై పెట్టుకుని, క్రమశిక్షణతో, ఒకమాట+ఒకే బాటగా నడుస్తొంది సుమధుర.

వంట పదార్థాల రేట్లు ఆకాశాన్ని చుంబిస్తున్నా, రుచి కరమైన అనేక శాకాహార వంటకాలతో, “మీ రెవరు? ఎక్కడ నుంచి వచ్చారు?” అనే ప్రశ్నే లేకుండా, కమ్మటి భోజనాలు ఆత్మీయంగా వడ్డించి, తినేవాళ్ళ మొహాల్లో కనిపించే “తృప్తి” చూసి చిరునవ్వుతో ఆనందిస్తోంది సుమధుర.

ముమ్మనేని సుబ్బారావు సిద్దార్ధ కళాపీఠం” సౌజన్యంతో, సుమధుర 25 వ హాస్య నాటికల పోటిలను 2022 జూలై 29,30,31(శుక్ర, శని,ఆది) తేదిలలో మూడు రోజుల పాటు విజయవాడ, మొగల్రాజపురం, సిద్దార్ధ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించడానికి సర్వ సన్నాహాలు చేస్తోంది.

హాస్య నాటికల పోటిలు ముగింపు రోజయిన ఆదివారం నాడు రాత్రి జరిగే సభలో స్వర్గీయ జంధ్యాల స్మారక పురస్కారం ప్రముఖ సినీ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కు అందజేయనున్నారు.

ఈ మీ “నవ్వుల పండగ“లో పాల్గొనేందుకు “రండి, వచ్చి ఆనందించండి” అంటూ “స్వాగతం” పలుకుతోంది… సుమధుర కళా నికేతన్.


“కళామిత్ర” అడివి శంకరరావు
(మేకప్ ఆర్టిస్ట్) హైదరాబాద్.

1 thought on ““హాస్యమేవ జయతే” అంటున్న “సుమధుర కళా నికేతన్”

  1. సుమధుర విజయవాడ వారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap