‘కొయ్యగుర్రం’తో ప్రభుత్వాన్ని కదిలించిన కవి

“వద్దు వద్దు / రా వద్దు
మానవుడి మూర్ఖత్వాన్ని రాక్షసత్వాన్ని అజ్ఞానాన్ని ఆక్రందల్ని
రెండు ప్రపంచ మహా సంగ్రామాల బూడిదని
కళ్ళులేని కామాన్ని
కోర్కెల కుష్ఠు రోగాన్ని అసూయల్ని ఆగ్రహాల్ని

నగరాల దుర్గంథాన్ని యింకా ఎన్నో మరెన్నో
పేరు తెలీని ప్రవృత్తుల్ని
20 శతాబ్దాల దారుణ మానభంగాల్ని
భ్రూణహత్యల్ని అంతులేని అంథకారాన్ని
ఇక్కడ దాచాను ఇక్కడ పూడ్చాను
వద్దు వద్దు
ఇక్కడికెవరూ రావద్దు”
అంటూ తన దిగంబర కవిత్వంతో తెలుగు కవిత్వంలో చెరగని ముద్ర వేసారు నగ్నముని. నిజాన్ని చెప్పలేక నిర్మలంగా బతకలేక ముసుగుని ముఖంనిండా కప్పుకున్న స్వార్థపరులు, రాజకీయ నాయకుల స్వభావాలు, స్వాతంత్య్రం వచ్చి అప్పటికి ఎన్నో ఏళ్ళు గడిచినా, ప్రజల బ్రతుకుల్లో మార్పు లేకపోవడానికి బాధపడి కలం పట్టి తనతోపాటు మరో అరుగురిని కలుపుకుని దిగంబర కవిత్వ ఉద్యమాన్ని సృష్టించారు. ఇప్పటికీ దిగంబర కవిత్వం ప్రాసంగితను కోల్పోలేదు. ఇప్పుడు దేశమంతా కాషాయవర్ణం అలముకొన్ని సందర్భంలో దిగంబర కవిత్వం ప్రాముఖ్యం ఇంకా పెరిగింది.

నగ్నముని గారు అనగానే ‘విలోమ కథలు’ గుర్తుకు వస్తాయి. వీటన్నిటినీ మించి ‘కొయ్యగుర్రం’ గుర్తుకు వస్తుంది. ఈ కావ్యం అనేక భాషల్లో అనువదింపబడింది. ఎంతోమంది కవులను ఉర్రూతలూగించింది. కవులనే కాకుండా సినిమా దర్శకులూ కొయ్యగుర్రం కవితాధ్వనులకు పరవశించారు. ఇటీవల తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ తన కొత్త సినిమా ‘మా మన్నన్’లో కొయ్యగుర్రంలోని “నేను బహుశా ఒకే పాట పాడుతున్నాను. నేను జీవితాంతం ఒకే పాట పాడతాను/ నా పొట్టలోంచి ఒక పేగును బయటకు పీకి ఏక్ తారాగా వాయిస్తూ వీధి వీధినా పాడుకుంటూ పోతాను” కవితను వాడుకున్నారు.
నగ్నముని ఏమి రాసినా ప్రజల పక్షాన కలమెత్తిన కవి. నిక్కమైన ప్రజాకవి. తన అక్షరాలనే కొరడాలుగా, కత్తులుగా, తుపాకీ తూటాలుగా గురి పెట్టిన తిరుగుబాటు కవి. ఆ మహాకవి ఆలోచనలను పంచుకోవడానికి అంతరంగాన్ని ఆవిష్కరించడానికి హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళదాం.. పదండి..!

ప్రశ్న: ‘నగ్నముని’ ఈ నాలుగక్షరాల పేరు వినగానే దిగంబర కవిత్వం గుర్తుకు వస్తుంది. అరవైలలో దిగంబరత్వం తెలుగు కవిత్వాన్ని ఒక కుదుపు కుదిపింది. ఆధునిక సాహిత్యాన్ని ఒక పెను మలుపు తిప్పింది. దిగంబర కవిత్వం నేపథ్యం, పుట్టు పూర్వోత్తరాలు చెప్పండి?
జవాబు: ఆధునిక కవిత్వం రాకముందు ఆభ్యుదయ కవిత్వం ప్రాభవం కోల్పోయింది. అభ్యుదయ కవులందరూ సినిమా రంగానికి మరలిపోయారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా ప్రజల బ్రతుకుల్లో మార్పు లేదు. అవినీతి పంకంలో మునుగుతూ ఆత్మానంద గీతాలు పాడుకుంటున్నారు పాలకులు. ఈ కుళ్ళిపోయిన కుష్ఠు వ్యవస్థపై, భ్రష్ఠు పట్టిన రాజకీయనాయకులపై కసితో కలం పట్టాను. దిగంబర కవిత్వాన్ని ప్రారంభించాను.

ప్రశ్న: దిగంబర కవిత్వం ఎన్ని సంపుటాలు వచ్చాయి?
జవాబు: దిగంబర కవిత్వం మూడు సంపుటాలు వచ్చాయి. మొదటి సంపుటి 1965లో వచ్చింది. రెండవ సంపుటి 1966 డిసెంబర్, మూడవ సంపుటి 1968లో వచ్చింది.

ప్రశ్న: ఏదైనా కవితా సంపుటిని ఒకరే రాస్తారు గదా! దిగంబర కవులు ఆరుగురున్నారు. అలా ఎందుకు రాయాల్సి వచ్చింది?
జవాబు: నేను చెప్పదలుచుకొన్న భావాన్ని ఇంకా కొంతమందితో కలిపి చెప్తే బలంగా ఉంటుందని నేను మిగతా ఐదుగురిని నాతో కలుపుకున్నాను.

ప్రశ్న: దిగంబర కవులు ఆరుగురి పేర్లు విభిన్నంగా ఉంటాయి! అలా ఎవరు పెట్టారు?
జవాబు: నేనే. కొత్త కవితోద్యమం తెస్తున్నపుడు మా పేర్లు కూడా కొత్తగా ఉండాలని పెట్టాను. నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్న పేర్లతో కవిత్వం రాసాము.

ప్రశ్న: మీ అసలు పేరేమిటి? తల్లిదండ్రులు వివరాలు చెప్పండి?
జవాబు: నా అసలు పేరు మానేపల్లి హృషీకేశ్వరరావు. మానేపల్లి లక్ష్మీకాంతమ్మ, సంగమేశ్వర కవి మా తల్లిదండ్రులు. నేను తెనాలిలో పుట్టాను. బాల్యం బందరులో గడిచింది. హైదరాబాద్ లో బి.ఎ. చదివాను. సాంకేతిక విద్యలు నేర్చుకున్నాను.

ప్రశ్న: మీ నాన్నగారు కవిగారా? సంగమేశ్వర కవి అన్నారుగా!
జవాబు: ఔను. ఆయన పద్యాలు రాసేవారు.

ప్రశ్న: ఐతే కవిత్వం మీ రక్తనాళాల్లో అనువంశికంగా ప్రవహిస్తున్నదన్న మాట. మీ దిగంబర కవిత్వం ప్రత్యేకత లేమిటి?
జవాబు: మా కవితల్ని ‘దిక్’ లని అన్నాము. ‘దిగంబర శకం నగ్న నామ సంవత్సరం ఆశ ఋతువు (సరిగ్గా క్రీ.శ. 1965 మే)న ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాద్న ప్రప్రథమంగా తాము దిగంబర కవులమని ప్రకటిస్తూ ఈ ప్రాపంచిక ఆచ్ఛాదశల్ని చీల్చుకొని కొత్తరక్తాన్ని ఇంజెక్ట్ చెయ్యడానికొస్తున్న నగ్నముని, నిఖిల్వేర్, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్నల గుండెల్లోంచి ధైర్యంగా, స్థైర్యంగా దూసుకొచ్చిన కేకల్ని ఈ పేజీల్లో పట్టుకోవడానికి ప్రయత్నించిన దిగంబర కవితా ప్రచురణ సమర్పణ’ అని ప్రచురించాము.

ప్రశ్న: దిగంబర కవిత్వాన్ని శ్రీశ్రీ మెచ్చుకొన్నాడు. నారా లాంటి విమర్శకులు దిగంబర కవిత్వాన్ని కవిత్వమే కాదు పొమ్మన్నారు. ఏమైనా దిగంబర కవిత్వం వచ్చినప్నటి నుంచీ ఇప్పటివరకు దాని సార్వజనీనతను కోల్పోలేదు. దిగంబర కవిత్వం వచ్చి ఇంచుమించు 6 దశాబ్దాలు గడిచినా పరిస్థితులలో మార్పులేదు. అప్పటికీ ఈ కవిత్వాన్ని ఆయా సందర్భాలలో తలచుకొంటూనే వున్నారు. దీనికి కారణమేమంటారు?
జవాబు: అప్పటి పరిస్థితులను అసహ్యించుకొని నిజాయితీగా, నిర్భీతిగా మా భావాలను వెలిబుచ్చాం. మేం నమ్మిన భావాలను, ధైర్యంగా చెప్పాము. అన్యాయాలను చొక్కా పట్టుకొని నిలదీసాం. దేశంలో పరిస్థితులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి కాబట్టి ఈ కవిత్వం బతికే వుంది.

ప్రశ్న: సామాన్యుడికో న్యాయం, ధనికుడికో న్యాయం. పెట్రోలు ధర రోజూ పెరుగుతూనే వుంటుంది. పాల ధర 2 రోజులకో సారి పెరుగుతుంటుంది. బోగీలో 100 మందికి చోటుంటే 400 మందికి టిక్కెట్లు అమ్ముతారు. టికెట్టు కొన్నా నిలబడి ప్రయాణిస్తూనే ఉంటారు. ఐనా ఎవరూ తిరగబడరు. ఈ విషయం మీద మీరు అప్పుడే దిగంబర కవిత్వంలో అద్భుతమైన కవిత్వం రాసారు..!
జవాబు: ఔను! “ఎన్నటికీ మనం తిరగ బడలేం కాబట్టి/ ఎప్పటికీ మనకి తిరగబడటం చాతకాదు కాబట్టి/ మన రక్తం నిండా కులాల మతాల మూత్రం ప్రవహిస్తున్నది కాబట్టి/ మనం పిరికి కుక్కలం కాబట్టి/ మన జీవితాన్ని శాశ్వతంగా కొనేసి పరిపాలిస్తున్న/ రకరకాల కుష్ఠు దేవుళ్ళని కొలవడానికే అంకిత మవుదాం.

ప్రశ్న: దిగంబర కవిత్వంలోని చాలా కవితలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతూనే ఉన్నాయి. దిగంబర కవిత్వం తర్వాత నగ్నముని పేరు చెప్పగానే ‘కొయ్యగుఱ్ఱం’ గుర్తుకు వస్తుంది. “కోయ్యగుఱ్ఱం స్తబ్దతకీ మూర్ఖతకీ, అజ్ఞానానికీ అహంకారానికీ/ అసమర్ధ పాలనకీ ప్రతీక/ కొయ్యగుఱ్ఱం భూమ్మీద నడవదు / ఇనప నాడాలో, చెక్క హృదయంతో ధనమదంతో/ అలగా జనం భుజాలమీద స్వారీ చేస్తుంది” అన్నారు కదా! ఏ సందర్భంలో రాసారు? తెలుగు కవిత్వంపై కలిగించిన ప్రభావాన్ని వివరించండి?
జవాబు: దివిసీమలో 1977లో తుఫాను వచ్చింది. ఆకాశవాణి వారు 10 నిమిషాల కార్యక్రమానికి రాయమంటే రాసాను. అప్పుడు రావూరి భరద్వాజ గారు కార్యక్రమ ప్రయోక్త. ‘సాహిత్యనందిని’ కార్యక్రమంలో ఈ కవిత ప్రసారమయింది. తరువాత ‘ప్రజాతంత్ర’ వారపత్రిక వారు అచ్చేశారు.

ప్రశ్న: కొయ్యగుర్రం అనేక భాషల్లో అనువాదమయింది కదండి. ఏ యే భాషల్లో అనువాదమయింది?
జవాబు: ఇప్పటివరకు రష్యన్, ఇంగ్లీషు, హిందీ, పంజాబీ, మరాఠీ, మైథిలి, ఒరియా, తమిళం, కన్నడం భాషల్లోకి అనువాదమయింది.

ప్రశ్న: మీ పుస్తకం ప్రచురణలోనూ ఎన్నో విజయాలను సాధించింది. ఆ వివరాలు చెప్పగలరు?
జవాబు: మొదట 1977 నవంబర్లో ఆకాశవాణిలో ప్రసారమయింది, 1978 జనవరిలో ప్రజాతంత్ర వారపత్రికలో 1980లో మొదట పుస్తకరూపంలో, రెండవ ముద్రణ 98 నవంబర్ లో, 3వ ముద్రణ 2007 జనవరిలో జరిగింది.

ప్రశ్న: మామూలుగా కవిత్వం పుస్తకాలు ఎక్కువ అమ్ముడవవు అని అంటారు గదా! కొయ్యగుర్రం ఇన్నిసార్లు ప్రచురితం అయిందంటే అది ఒక మహాకావ్యం…
జవాబు: ఈమాటే కొయ్యగుర్రం ముందుమాటలో చేరా అన్నారు. ఆధునిక తొలి మహాకావ్యం అని అన్నారు. ఈ పుస్తకం మీద విస్తృతంగా చర్చలు జరిగాయి. 28-2-1986 ఆంధ్రజ్యోతి వార పత్రికలో ప్రొ. వేల్చేరు నారాయణరావు గారితో అఫ్సర్ చేసిన ఇంటర్వ్యూ అచ్చయింది. చేరా రాసిన అభిప్రాయాలతో నారా ఏకీభవించలేదు.

ప్రశ్న: కారణం..?
జవాబు: శ్రీశ్రీ రాసిన ‘కవితా! ఓ కవితా!’ కుందుర్తి ‘నగరంలో వాన’ వీటికీ మహాకావ్య లక్షణాలున్నాయని నారా అన్నారు.

ప్రశ్న: కొయ్యగుర్రం మీద విశేషమైన చర్య జరిగిందన్నమాట..!
జవాబు: ఔను. ఆధునిక తెలుగు కావ్యాల్లో దేనిపై ఇంత చర్చ జరగలేదు.

ప్రశ్న: ఇంత చర్చ జరగడానికి కొయ్యగుర్రం విశిష్ఠ కవితా తత్వమే కారణం కావచ్చు. మీ పుస్తకాన్ని రష్యన్ భాషలో అనువదించిన కవి ఏమన్నారు?
జవాబు: రష్యన్ భాషలో అనువదించినది ‘నికితాగూరోప్’

ప్రశ్న: మీ కొయ్యగుర్రం అయనకెలా చేరింది?
జవాబు: కొయ్యగుర్రం కవిత ప్రచురించబడిన పత్రిక ప్రజాతంత్ర పోస్టులో చేరా గారింటికి వెళ్ళింది. ఏకబిగిన చేరా పెద్దగా చదివాడు. ఇంట్లో అందరికీ చదివి వినిపించాడు. తెలుగు సాహిత్యంలో అభినివేశమూ, అభిరుచి వున్న రష్యన్ మిత్రుడు నికీత, చేరా కలసి ఒకరోజు యూనివర్శిటీ గెస్టుహౌసులో కలసి చదువుకొన్నారు. అప్పుడు కొయ్యగుర్రాన్ని అనువదించాలని అనుకొని తర్వాత అనువాదం చేసాడు. అనువాదం చేసాక కొయ్యగుర్రం గురించి ఒకమాట అన్నారు.

ప్రశ్న: చెప్పండి ఏమన్నారో!
జవాబు: “సామాన్య మానవుని పట్ల కవి హృదయంలో వున్న ప్రేమ, వాటి దుఃఖ విచారం పట్ల అతని ప్రామాణికమైన సానుభూతి వీటన్నిటికి చకని నిదర్శనం’ నగ్నముని రచించిన కొయ్యగుర్రం..!

ప్రశ్న: ఇంకా ఎవరెవరు ఏమన్నారు?
జవాబు: కొయ్యగుర్రానికి కోటి దండాలు అని శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ, 1ది 3-1080న ఆంధ్రజ్యోతి వారపత్రికలో, Koyyagurram: A Long poem in telugu by Nagnamuni – M.Symala Rao దక్కన్ క్రానికల్లో వ్యాసాలు రాసారు. అంధలోకనం, కొయ్యగుర్రం దార్శనికత వ్యాస సంకలనాలు, శ్రీ కల్లూరి భాస్కరం రచించిన ‘గ్లోబల్ సందర్భంలో నగ్నముని కొయ్యగుర్రం’ గ్రంథాలు వచ్చాయి.

ప్రశ్న: “కొయ్యగుర్రానికి నిజం తెలుసు/ అయినా చెప్పదు/ కొయ్యగుర్రమెక్కి కొయ్య కత్తితో/ ఊరేగే ప్రభుత్వాలు దేవాలయాల మీద బూతుబొమ్మలు” అని ప్రభుత్వాన్ని ధిక్కరించారు. అసెంబ్లీలో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత్వం రాసారు. నిజాల నిప్పుకణికల్ని రాజేసారు. నిజంగా మీకు చాలా ధైర్యం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు మిమ్మల్ని ఏమీ అనలేదా?

జవాబు: అధికారుల చూపు సునిశితమైనది. 75 డిసెంబరులో శాసన సభలోని నా ఉద్యోగం తీసేసారు. 75 జూన్ లో ఎమర్జన్సీ విధించారు.

ప్రశ్న: ఆ తర్వాత…?
జవాబు:
లోక్సభకు ఎన్నికలు జరిగి కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడ్డాక (8 నెలల తర్వాత తిరిగి ఉద్యోగం వచ్చింది.
ప్రశ్న: ఆ తర్వాత మీరు ‘విలోమ కథలు’ రాసారు కదా! విలోమ కథలు బాగా ప్రసిద్ధి చెందినవి. విలోమ కథల నేపథ్యం వివరించండి?
జవాబు: 27 సంవత్సరాల క్రితం 1975 జూన్ అర్థరాత్రి ఇందిరాగాంధీ ఎమర్జన్సీ విధించింది. ఎమర్జన్సీలో రాజ్యాంగాన్నీ, చట్టాలను తుంగలో తొక్కి, పరిపాలన పేరుతో కిరాతకృత్యాలు జరిపారు. ఆ సమయంలో రాసిన కథలు ఇవి.

ప్రశ్న: విలోమ కథలంటే..?
జవాబు: విలోమ అంటే తలకిందులు. 48 సంవత్సరాల క్రితం జూన్ 26న నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన పదవిని పదిల పరచుకోవడం కోసం ‘ఎమర్జన్సీ’ని ప్రకటించింది. ఎమర్జన్సీ అంటే పోలీసు రాజ్యం.

ప్రశ్న: మనది ప్రజాస్వామ్య దేశం కదా!
జవాబు: పేరుకే ప్రజాస్వామ్యం. ఎమర్జన్సీ ప్రకటించినపుడు అన్ని పాలనా వ్యవస్థలు, కోర్టులు, మీడియా, పౌరహక్కులు అన్నీ పోలీసు బూటు కింద పని చేస్తాయి. ప్రతిపక్షంలోని ప్రముఖ నాయకుల్నీ, దేశంలోని ఆలోచనా పరులందర్నీ అరెస్టు చేసారు. జైళ్ళలో కుక్కారు. మొత్తం దేశాన్నే ఒక పెద్ద జైలుగా మార్చేశారు. ఆ చీకటి రోజులు, పాలన తలకిందులుగా నడవడం గమనించి నేను ‘విలోమ కథలు’ రాసాను. ఇవి రాజకీయ. ప్రతీక, ప్రయోగ, అధిక్షేప కథలు.

ప్రశ్న: ఈ కథలు 2 ముద్రణలు పొందాయి కదండీ!
జవాబు: ఔను. ఇటీవల మూడో ముద్రణ పొందింది. ఈ సంవత్సరం జూన్ 17వ తేదిన ఈ సంపుటిని ఓ మహాసభలో ఆవిష్కరించారు.

ప్రశ్న: విలోమ కథలు ఆరు కదా! ఆ కథల గురించి చెప్తారా?
జవాబు: మొదటి కథా శీర్షిక “ఇందుమూలముగా సమస్తమైన వారికి మన ముఖాలూ కాళ్ళూ చేతులూ వగైరా సర్వాంగాలను గురించి తెలియజేయడమేమనగా”

ప్రశ్న: శీర్షికే భలే కొత్తగా వుంది. కథాసారాంశాన్ని వివరిస్తారా?
జవాబు: ఈ కథలో ఒక రాజకీయ అవ్యవస్థలో మనిషి తాను ఉపయోగించడం మానేసిన జ్ఞానేంద్రియాల ఘోష వినబడుతుంది. ఎవరూ తమ స్వంత బుర్రలతో కాకుండా మరొకరి ఆలోచనలతో బతకాల్సిన దౌర్భాగ్యస్థితి వ్యంగ్యపు కొరడా చెళ్ళుమని మోత మోగిస్తుంది.

ప్రశ్న: వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది. రెండో కథ గురించి చెప్పండి!
జవాబు: రెండో కథ “పులి బెబ్బులి”. జీవితాన్ని వ్యాపార విలువలు ఆక్రమిస్తే మనిషిలోని జంతువు నిద్రలేచి చుట్టుపక్కల జీవితాల్ని ఆరగించేస్తాడనేది ఈ కథ సారాంశం.

ప్రశ్న: మూడో కథ దేన్ని ఉద్దేశించి రాసారు?
జవాబు: మూడో కథ “శిశుహత్య”. ఓ దిగువ మధ్యతరగతికి చెందిన విఘ్నేశ్వరరావు కథ ఇది. చేతివాచీ నుండి ఇంట్లో తప్పేలాల వరకు తాకట్టు పెట్టుకుంటే తప్ప సినిమా కూడా చూడలేని బతుకు అతనిది. మగపిల్లాడి కోసం మూడో కానుపుకో, నాలుగో కానుపుకో పెళ్ళాన్ని సిద్ధం చేసిన అతను ఓ రాత్రి పుట్టబోయే బిడ్డతో సంభాషిస్తాడు. ఓ విషాదకర ముగింపు తప్ప అలాంటి జీవితానికి మరేం మిగులుతుంది.

ప్రశ్న: నాలుగో కథ గురించి…?
జవాబు: నాలుగో కథ “లైకా మజ్ను ప్రళయగాథ”. దేశంలో ఏర్పడుతున్న నియంతృత్వ ధోరణులకు ప్రతీకగా లైకా అనే కుక్క, . ఆ కుక్క ముసలి రూపంలో వున్న మజ్ను అనే మరో పెద్ద నియంతతో ప్రేమలో పడి గర్భం దాల్చి, తన యజమానులైన ప్రజలకి కాపలా కాయాల్సిన తన ప్రాథమిక బాధ్యతల్ని విస్మరించి వారినే గాయపరిచే వైనమే ఈ కథాంశం. ఫక్తు రాజకీయ కథ ఇది.

ప్రశ్న: ఐదో కథ వివరాలు..?
జవాబు: ఐదో కథ “సిమెంటు సంతతి”. కాంక్రీటు సిమెంటు నిర్మాణాలకు మనుషుల్ని మించిన ఆయుర్ధాయం వుంటుంది. సిమెంటు శిలారూపంలో జంక్షన్లలో మనల్ని దివంగత నాయకులలో చేతులూపుతూనో, చిరునవ్వులతోనో పలకరిస్తున్నంత కాలం వారి దుర్మార్గ పరిపాలన భావజాలం కూడా సజీవంగా వున్నట్లే. పార్కులో ఓ మూల పడిపోయిన విగ్రహం సైతం అమాయక యువతిని మోసం చేయడం ఈ కథాంశం.

ప్రశ్న: ఆరవ కథ…?
జవాబు: ఆరవ కథ “గ్రహణం”. ఇప్పుడు పునర్ముద్రణలో కథా శీర్షికను ‘నరగ్రహణం” అని మారుస్తున్నారు. ఈ సంకలనంలోని అతిముఖ్యమైన కథ. అతి పెద్ద కథ కూడా ఇదే.

ప్రశ్న: విలోమ కథలు రాసేటప్పుడు మీకు ఉద్యోగం లేదుకదా!
జవాబు: ఔను! ఎమర్జన్సీ ప్రకటించాక అసెంబ్లీలో రిపోర్టర్ ఉద్యోగాన్ని తొలగించారు.

ప్రశ్న: అప్పటి దాకా కవిత్వమే రాశారు గదా మీరు. కథలు ఎందుకు రాసారు?
జవాబు: అప్పుడు ‘ప్రజాతంత్ర’ సంపాదకుడు దేవీప్రియ తన పత్రికలో ప్రచురణ కోసం కొన్ని కథలు రాసిమ్మని అడిగారు. ఆ సందర్భంలో రాసినవీ కథలు. ఆరు కథలు వరకు ప్రకటించి తర్వాత ఆపేసారు.

ప్రశ్న: ఎందుకని ఆపేసారు?
జవాబు: ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నానని ప్రచురించవద్దని నిషేదించారు.

ప్రశ్న: ఎమర్జన్సీ కాలంలో కవులెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించలేదా?
జవాబు: లేదు. సాటి కవులు జైల్లో మగ్గుతున్నపుడు శ్రీశ్రీ ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని వామపక్ష నియంతృత్వంగా వర్ణించాడు. ఇరవై సూత్రాల మీద పాట రాసాడు.

ప్రశ్న: ఆరుద్ర, సోమసుందర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదా?
జవాబు: లేదు. ఎమర్జన్సీని సమర్థిస్తూ కవితలు రాసారు.

ప్రశ్న: కవులు రెండు రకాలు. పాలక పక్షాన పలికేవారు, ప్రజల పక్షాన నిలిచేవారు. అన్ని కాలాల్లో వుంటారన్నమాట..?!
జవాబు: ఔను. ఈ కథలు రాసిన పరిస్థితులు ఇప్పటికీ అలాగే వున్నాయి. ఇప్పుడు మరింత అధ్వానమయ్యాయి. ఇప్పుడు ఎమర్జన్సీ లేదన్నమాటేగానీ, పాలకులు అలాగే వున్నారు. ప్రశ్నించడమే నేరం. నిజాలు చెప్పడమే ఘోరం. ప్రశ్నార్థకాలైన అక్షరాలను చెరసాలలో పెడుతున్నారు. ఎదిరిస్తున్న వారిని చట్టాల్లో ఇరికిస్తున్నారు. కనుక ఇప్పటికీ ఈ కథల అవశ్యకత ఉంది.

ప్రశ్న: మీరు ‘ఆకాశ దేవర’ అనే కథ కూడ రాసారు. ఆ కథ నొక్కదానినే ప్రత్యేకంగా పుస్తకంగా ప్రచురించారు. ఈ కథ విశేషాలు చెప్తారా?
జవాబు: ఈ కథ మొదట వార్త దినపత్రికలో సెప్టెంబరు 8, 25 ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది. పుస్తకంగా 2012లో జనవరిలో ముద్రితమైంది. రెండవ ముద్రణ ఏప్రిల్ 2012లో జరిగింది. ఇది కూడ విలోమ కథే. దీనిలో కథానయకుడు మిస్టర్ కారఫ్. దీనిలో తన గురించి తనే “నేను వ్యాపారస్థుణ్ణి. నా వ్యాపారం చాలా ఆధునికమైనది. మానవుడి మెదడును, అంటే ఆలోచనా సరళిని నేననుకొన్న విధంగా మార్చుకొనే వ్యాపారం” అని అంటాడు. దోపిడీ వ్యవస్థ యొక్క వికృత రూపాన్ని ఈ కథలో చెప్పబడింది.

ప్రశ్న: మీ రచనలన్నీ చదివాక పాఠకుల హృదయాలలో అల్లకల్లోలం చెలరేగుతుంది కదా!
జవాబు: కావ్య ప్రయోజనమంటే ఇదే. కావ్యం చదవకముందు స్తబ్ధంగా రాయిలాగా వున్న మనసు, చదివాక ఆగ్రహంతో జ్వలించాలి. ఆక్రోశంతో రగిలిపోవాలి.

మందరపు హైమవతి

3 thoughts on “‘కొయ్యగుర్రం’తో ప్రభుత్వాన్ని కదిలించిన కవి

  1. మందరపు హైమావతి గారు నమస్కారం నగ్నముని గారితో లోతైన ఆలోచనత్మక ఇంటర్వ్యూ చేశారు బాగుంది

  2. హైమావతి గారు మీ “పలకరింపు” కబుర్లు చాలా బావున్నాయి.

  3. హైమావతి గారు ‘పలకరింపు’ ఇంటర్ వ్యూలు చాలా బావున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap