బాలీవుడ్ కొంటె కోణంగి…కిశోర్ కుమార్

(ఆగస్టు 4న కిశోర్ కుమార్ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం….)

ప్రముఖ గాయక నటుడు, రచయిత, సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు కిశోర్ కుమార్ ది ఓ వింత మనస్తత్వం. అవి విజయా వారి ‘మిస్సమ్మ’ చిత్రాన్ని ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ అధినేత మెయ్యప్ప చెట్టియార్ ‘మిస్ మేరీ’ (1957) పేరిట హిందీలో నిర్మిస్తున్న రోజులు. అందులో అక్కినేని నాగేశ్వరరావు ధరించిన డిటెక్టివ్ పాత్రను కిశోర్ కుమార్ పోషించాడు. మద్రాసు ఎ.వి.ఎం స్టూడియోలో నిర్మితమైన ఈ చిత్రానికి ఎల్.వి. ప్రసాద్ దర్శకుడు. బొంబాయి నుంచి మీనాకుమారితో బాటు కిశోర్ కుమార్ కూడా వచ్చాడు. ఒక షెడ్యూలులో కిశోర్ కుమార్ కు మేకప్ చేయించి షూట్ కు పిలవకుండా దర్శకుడు రెండురోజులు అట్టే కూర్చోబెట్టారు. కిశోర్ కుమార్ కు కోపమొచ్చి దర్శకుడితో గొడవపడ్డాడు. ఎల్.వి. ప్రసాద్ తక్కువ వాడా…”నీతో ఎప్పుడు చిత్రీకరణ జరపాలో నాకు తెలుసు. షెడ్యూలుకు డబ్బిచ్చిన తరవాత మా ఆధీనంలో ఉండడమే నీ పని” అన్నారు. దాంతో చిర్రెత్తిన కిశోర్ “నాతో ఎలా పని చేయించుకుంటారో చూస్తాను” అని సెలూన్ కు వెళ్లి గుండుకొట్టించుకొని వచ్చాడు. ఎల్.వి.ప్రసాద్ ని బలేగా యేడిపించాను అనుకుంటూ చంకలు గుద్దుకున్నాడు. దర్శకుడు సంగతి కిశోర్ కు తెలియదు పాపం. వెంటనే కిశోర్ నెత్తిన టోపీ పెట్టి షెడ్యూలు పూర్తిచేశారు ప్రసాద్. గుండుతో బొంబాయి వెళితే అక్కడ హృషికేష్ ముఖర్జీ సినిమా ‘ముసాఫిర్’ ప్యాచ్ వర్క్ మిగిలి వుంది. పాపం హృషిదా కు మొహం చూపించలేక విగ్గుపెట్టుకొని పని పూర్తిచేశాడు. ఇంకొక విషయం… కిశోర్ కుమార్ యెంతటి అల్లరివాడంటే, తన వార్డన్ రోడ్ బంగాళా ముందు ‘బి వేర్ ఆఫ్ కిశోర్’ అనే సైన్ బోర్డు రాయించి పెట్టారు. అలాగే సినిమా పాటల్లో జిమ్మీ రోడ్జర్స్, టెక్స్ మోర్టాన్ లను అనుకరిస్తూ ‘యోడిలింగ్’ ప్రక్రియను ప్రవేశపెట్టిన తొలి గాయకుడు కిశోర్ కుమార్. ఇలాంటి కొంటెపనుల అల్లరి నటుడు కిశోర్ కుమార్ జయంతి ఆగస్టు 4 న జరిగిన సందర్భంగా ఈ ‘గంగూలీ’ గురించి కొంచెం తెలుసుకుందాం…

అశోక్ కుమార్ కు ముద్దుల తమ్ముడిగా…

మధ్యప్రదేశ్ లోని ఖండవా పట్టణంలో కిశోర్ కుమార్ ఆగస్టు 4, 1929న జన్మించాడు. అతని అసలు పేరు అబ్బాస్ కుమార్ గంగూలీ. ఆయన తండ్రి కుంజన్ లాల్ గంగూలి పేరుమోసిన న్యాయవాది. తల్లి గౌరీదేవి ఆదర్శ గృహిణి. వారిది సంపన్న బెంగాలీ కుటుంబం. ఖండవా జమీందారు కామవిశాదర్ గోఖలే సంస్థానంలో కిశోర్ కుమార్ తండ్రి వ్యక్తిగత వకీలుగా ఉండడంతో వారి కుటుంబం అక్కడే స్థిరపడింది. కిశోర్ కుమార్ అన్న ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు అశోక్ కుమార్. అశోక్ కుమార్-కిశోర్ కుమార్ ల మధ్య వయసులో 18 ఏళ్ళ వ్యత్యాసం వుండేది. అందుకే అశోక్ కుమార్ ని కిశోర్ తండ్రిలాగే భావించేవారు. అనూప్ కుమార్ కిశోర్ కి మరొక అన్న. అతను కూడా నటుడే. కిశోర్ కుమార్ కు సతీదేవి అనే అక్క కూడా వుంది. ఆమె భర్త ఫిల్మాలియా స్టూడియో నిర్మాత శశిధర్ ముఖర్జీ. కిశోర్ కుమార్ చిన్నవాడుగా ఉండగానే అశోక్ కుమార్ బొంబాయి హిందీ చలనచిత్రసీమలో హీరోగా స్థిరపడ్డారు. ఇండోర్ క్రిస్టియన్ కాలేజిలో చదివి కిశోర్ కుమార్ పట్టా పుచ్చుకున్నాడు. 1946లో తల్లిదండ్రులతోబాటు కిశోర్, అనూప్ బొంబాయిలో అన్న అశోక్ కుమార్ ఇంటికి చేరారు.

కోరస్ గాయకుడిగా ప్రస్థానం మొదలు…

కిశోర్ కుమార్ ప్రస్థానం బాంబే టాకీస్ వారికి కోరస్ పాడే గాయకునిగా ప్రారంభమైంది. అప్పుడు అశోక్ కుమార్ ఆ స్టూడియో వారి సినిమాల్లో హీరోగా నటిస్తూ వుండేవారు. అన్న అశోక్ కు తమ్ముడు కిశోర్ నటుడు కావాలి వుండేది. కానీ కిశోర్ మాత్రం గాయకుడు కావాలని ఆరాటపడేవాడు. అప్పుడే అబ్బాస్ కుమారే తనపేరును ‘కిశోర్ కుమార్’ అని మార్చుకున్నాడు. 1946 లో ఫిల్మిస్థాన్ కంపెనీ వారు ‘షికారి’ అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో అశోక్ కుమార్, పారోదేవి హీరో హీరోయిన్లు. అనిల్ చంద్ర సేన్ గుప్తా సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సచిన్ దేవ్ బర్మన్ గాయకుడిగా పరిచయమయ్యారు. అందులో కిశోర్ కుమార్ అరుణ్ కుమార్ ముఖర్జీ, పారో లతో కలిసి “ఓ రంగీలా“ అనే పాటకు కోరస్ పాడాడు. ఒక చిన్న వేషం కూడా కట్టాడు. 1945లో బాంబే టాకీస్ వారు షహీద్ లతీఫ్ దర్శకత్వంలో నిర్మించిన ‘జిద్ది’ చిత్రంలో తొలిసారి దేవానంద్ కు ఖేమ్ చంద్ ప్రకాష్ సంగీత దర్శకత్వంలో “మర్నే కి దువాయే క్యోం మాంగూ” అనే పాట పాడాడు. ఈ పాటే కిశోర్ కుమార్ పాడిన తొలి పాటగా రికార్డులకెక్కింది. అదే చిత్రంలో లతాజీ తో కలిసి దేవానంద్, కామినీ కౌశల్ కు “ఏ కౌన్ ఆయా రే” అనే డ్యూయట్ కూడా పాడాడు. ’జిద్ది’ సినిమా తరవాత కిశోర్ కుమార్ కు హీరోగా అవకాశాలు వచ్చాయి. బాంబే టాకీస్ వారు ఫణి మజుందార్ దర్శకత్వంలో నిర్మించిన ‘ఆందోళన్’ (1951) చిత్రంలో కిశోర్ కుమార్ హీరోగా, గౌరీదేవి హీరోయిన్ గా నటించారు. ఇందులో పన్నాలాల్ ఘోష్ సంగీత దర్శకత్వంలో మన్నాడే తో కలిసి కిశోర్ “సుభా కి పెహలె కిరణ్ తక్ జిందగీ” అనే దేశభక్తి గీతాన్ని ఆలపించాడు. 1946-55 మధ్యకాలంలో కిశోర్ కుమార్ 22 సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే వాటిలో 16 సినిమాలకు పైగా పరాజయం పాలైనవే కావడం విశేషం. దాంతో కిశోర్ కుమార్ ను నిర్మాతలు కానీ, దర్శకులు గానీ దగ్గరకు రానీయలేదు. అయితే 1953 లో వచ్చిన ఎ.వి.ఎం. వారి ‘లడ్కి’ (తెలుగులో సంఘం చిత్రం) సినిమా హిట్టయింది. ఇందులో భరత్ భూషణ్, వైజయంతిమాల, అంజలీదేవి కూడా నటించడం విశేషం. కిశోర్ నటించగా విజయవంతమైన మరో చిత్రం 1954లో బిమల్ రాయ్ నిర్మించి దర్శకత్వం వహించిన ‘నౌకరి’. కిషోర్ సరసన శైలా రమణి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు సలీల్ చౌదరికి కిశోర్ శైలి నచ్చలేదు. తీరా ఆతను పాడుతుంటే తన్మయత్వంలో మునిగిపోయారు. దాంతో తానే ఉషా మంగేష్కర్ తో కలిసి పాడాల్సిన యుగళగీతం “చోటా సా ఘర్ హోగా” ను కిశోర్ చేత పాడించి హిట్ చేశారు. 1955 లో వచ్చిన ‘చార్ పైసే’ చిత్రం కూడా విజయవంతమైంది. అందులో కిశోర్ కుమార్ సరసన శ్యామా నటించగా అగర్తలాకు చెందిన బి.డి. బర్మన్ (ఎస్.డి. బర్మన్ కాదు) సంగీతం సమకూర్చారు. ఫ్లాపు చిత్రాలతో కనువిప్పు కలిగిన కిశోర్ చాలాశ్రద్ధ వహించి సినిమాల్లో నటించడంతో 1955-66 మధ్యకాలంలో వచ్చిన సినిమాలు బాగా విజయవంతంయ్యాయి. 1956లో వచ్చిన న్యూఢిల్లీ, నయా అందాజ్, భాగమ్ భాగ్, భాయి భాయి, 1957లో వచ్చిన ఆశా, చల్తి కా నామ్ గాడి, ఆ తరవాత వచ్చిన డిల్లీ కా ఠగ్, బాంబే కా చోర్, చాచా జిందాబాద్, మన్-మౌజి, ఝుమ్రూ, మిస్టర్ ఎక్ష్ ఇన్ బాంబే, శ్రీమాన్ ఫంతూష్, ఏక్ రాజ్, గంగా కి లహరే, హమ్ సబ్ ఉస్తాద్ హై, ప్యార్ కియే జా సినిమాలు కిశోర్ కుమార్ లో వున్న హాస్యనాయకుణ్ణి బయట పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయవంత మైనవే. తన సినిమాలో పాటలన్నే కిశోర్ వీలయినంతవరకు తనే పాడుకునేవాడు.

గాయకుడిగా…

సంగీత దర్శకుడు రామచంద్ర చితాల్కర్ కిశోర్ కుమార్ లో వున్న సంగీతకారుణ్ణి వెలికితీశారు. 1957లో వచ్చిన ‘ఆశా’ చిత్రంలో “ఏనా మీనా డీకా” ఇందుకు దృష్టాంతం. తరవాత శంకర్ జైకిషన్ సంగీత నిర్దేశికత్వంలో ‘నఖరేవాలి దేఖ్నే మే దేఖ్ లో హై” (నయీ దిల్లి), రవి సంగీత దర్శకత్వంలో “సి.ఎ.టి క్యాట్ క్యాట్ మానె బిల్లి” (దిల్లి కా ఠగ్), చిత్రగుప్త దర్శకత్వంలో “ఛేడో న మేరి జుల్ఫే సబ్ లోగ్ క్యా కహెంగే” (గంగా కి లేహరే) పాటలు గాయకుడిగా కిశోర్ ను సుస్థిరపరచాయి. కిశోర్ కుమార్ కు గాయకుడుగా వూతమిచ్చినవారు సచిన్ దేవ్ బర్మన్. ఒకసారి బర్మన్ అశోక్ కుమార్ ఇంటికి వెళ్ళినప్పుడు కిశోర్ కుమార్ కె.ఎల్. సైగల్ గొంతును అనుకరిస్తూ పాట పాడడం తటస్థించింది. కిశోర్ కుమార్ ను అభినందిస్తూ “నీ సొంత శైలిలో పాటలు పాడడం అభ్యాసం చెయ్యి” అంటూ సలహా ఇచ్చారు. తన గాత్ర శైలిని మార్చుకున్న తరవాత 1950 నుంచి 70 వ దశకం తొలి రోజులవరకూ దేవానంద్ సినిమాలకు బర్మన్ కిశోర్ తోనే పాడించారు. దాంతో కిశోర్ కుమార్ మంచి గాయకుడిగా ఎదిగారు. దేవానంద్ నటించిన మునీంజీ, టాక్సీ డ్రైవర్, హౌస్ నంబర్ 44, నౌ దో గ్యారా, పేయింగ్ గెస్ట్, గైడ్, జ్యూవెల్ తీఫ్, ప్రేమ్ పూజారి, తేరే మేరె సప్నే సినిమాలకు కిశోర్ కుమార్ పాటలే హైలైట్. కిశోర్ కుమార్ 1958 లో నిర్మించిన ‘చల్తీ కా నామ్ గాడి’ సినిమాకు సచిన్ దేవ్ బర్మన్ సంగీతం సమకూర్చారు. “మానా జనాబ్ నే పుకారా నహీ” (పేయింగ్ గెస్ట్), “హమ్ హై రాహీ ప్యార్ కే” (నౌ దో గ్యారా), “అయ్ మేరి టోపీ పలట్ కే ఆ” (ఫంతూష్), “ఎక్ లడ్కి భీగీ భాగి సి”, “హాల్ కైసా హై జనాబ్ కా” (చల్తి కా నామ్ గాడి) పాటలు రోజూ ఏదో ఒక చానల్ లో వినిపిస్తూనే వుంటాయి. ఇక బర్మన్ దా పేయింగ్ గెస్ట్ లో “ఛోడ్ దో ఆంచల్”, నౌ దో గ్యారా లో “ఆంఖోం మే క్యా జీ”, చల్తి కా నామ్ గాడీ లో “పాంచ్ రుపయ్యా బారా ఆనా”, తీన్ దేవియా లో “అరె యార్ మేరి తుమ్ భి హో గజబ్” డ్యూయట్లను ఆశా భోస్లే తో కలిసి పాడించారు. సినిమాల్లో చేరిన తొలిరోజుల్లో కిశోర్ కుమార్ మీద కె.ఎల్. సైగల్ ప్రభావం మెండుగా వుండేది. కిశోర్ తొలిరోజుల్లో ఆలపించిన పాటల విధానం గమనిస్తే ఈ విషయం సులభంగానే గ్రహించవచ్చు. అలాగే రవీంద్రుని సంగీతం కూడా తవ మీద చాలా ప్రభావం చూపింది. హిందీ, బెంగాలి, మరాఠి, అస్సామీ, గుజరాతీ, భోజ్ పురి, కన్నడ, మళయాళ, ఒరియా భాషల్లో వేలాది పాటలు పాడిన కిశోర్ కుమార్ ఉత్తమ గాయకుడిగా ఎనిమిది సార్లు ఫిలింఫేర్ బహుమతులు అందుకున్నారు. ఈ రికార్డు ఇప్పటికీ పదిలమే. కిశోర్ మధ్యప్రదేశ్ లో జన్మించినందున ఆ ప్రభుత్వం హిందీ సినిమాకు ఉదాత్తమైన సేవలు అందించిన వారికి ‘కిశోర్ కుమార్ అవార్డ్’ ను ప్రవేశపెట్టింది. 1961లో శంకర్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘ఝుమ్రూ’ సినిమాలో కిశోర్ కుమార్ సరసన మధుబాల నటించింది. ఈ సినిమాకు కిశోర్ కుమార్ కథ సమకూర్చడమే కాకుండా సంగీత దర్శకత్వం కూడా వహించారు. సచిన్ దేవ్ బర్మన్ కిశోర్ కుమార్ మీద వుండే అవ్యాజమైన ప్రేమతో ఆ సినిమాకు మ్యూజిక్ బ్యాండ్ ను సమకూర్చారు. అందులో కిశోర్ కుమార్ స్వరపరచిన “కోయి హమ్ దమ్ న రహా” పాట చాలా పాపులర్ అయింది. తరవాత కిశోర్ కుమార్ ‘దూర్ గగన్ కి ఛావో మే’ సినిమాను 1964లో సొంతంగా నిర్మించి ఆ సినిమాకు కథ, సంగీతం సమకూర్చాడు. కిశోర్ కుమార్ 1966 తరవాత స్టూడియోలకు ఆలస్యంగా రావడం, సంగీత దర్శకులకు చుక్కలు చూపించడం మొదలెట్టాడు. ఆ సమయంలోనే ఇన్ కమ్ టాక్స్ అధికారులు కిశోర్ కుమార్ ను ఇబ్బందుల్లోకి నెట్టారు. 1968 నుంచి రాహుల్ దేవ్ బర్మన్ ప్రభంజనం మొదలైంది. మెహమూద్ సొంత చిత్రం ‘పడోసన్’లో “మేరె సామనే వాలి కిడ్కి మే”, “కెహనా హై”, “ఏక్ చతుర్ నార్” వంటి పాటలు కిశోర్ కుమార్ ను ముందువరసలో నిలబెట్టాయి. 1969 లో శక్తి సామంత నిర్మించిన ‘ఆరాధన’ సినిమా కిశోర్ కుమార్ సంగీత ప్రస్థానంలో పరాకాష్ట అని చెప్పవచ్చు. “రూప్ తేరా మస్తానా”, “మేరె సపనోం కి రాణి”, “కోరా కాగజ్ కా ఏ మన్ మేరా” పాటలు ఒక ఊపు వూపడమే కాకుండా కిశోర్ కుమార్ కు ఉత్తమ గాయకుడుగా తొలి ఫిలింఫేర్ బహుమతి తెచ్చి పెట్టాయి. 1970-80 మధ్యకాలంలో కిశోర్ కుమార్ రాజేష్ ఖన్నా, అమితాబ్ బచన్, ధర్మేంద్ర, జితేంద్ర, దేవానంద్, సంజీవ్ కుమార్, శశికపూర్, వినోద్ ఖన్నా, షమ్మికపూర్, దిలీప్ కుమార్, రిషికపూర్, సంజయ్ దత్, అనిల్ కపూర్, వంటి ఎందఱో టాప్ హీరోలకు పాటలు పాడారు. రాజేష్ ఖన్నా ఒక్కరికే 92 సినిమాల్లో 245 పాటలు పాడిన ఘనత కిశోర్ కుమార్ ది. ఈ రికార్డు నేటికీ పదిలమే. తరవాతి స్థానం అమితాబ్ బచన్(131) దే. ఆర్.డి. బర్మన్ కటీపతంగ్, ఖుష్బూ, అమర్ ప్రేమ, ఆప్ కి కసమ్, గోల్మాల్, అగర్ తుమ్ న హోతే, నమ్కీన్, రాకీ, జవాని దివానీ వంటి సినిమాల్లో కిశోర్ కుమార్ చేత అద్భుతమైన పాటలు పాడించారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కల్యాణ్ జి ఆనంద్ జి, రవి, శంకర్ జైకిషన్, సలీల్ చౌదరి, ఖయ్యాం, రాజేష్ రోషన్ వంటి మరెందరో సంగీత దర్శకులకు అద్భుతమైన పాటలు పాడాడు.

వైవాహిక జీవితంలో…

1950లో కిశోర్ కుమార్ బెంగాలి గాయని రుమ గుహ ను వివాహమాడాడు. వారి వైవాహిక జీవితం ఎనిమిదేళ్ళలో కొండెక్కింది. వీరికి అమిత్ కుమార్ పుట్టాడు. తరవాత కిశోర్ హీరోయిన్ మధుబాలను వివాహమాడాడు. రుమ గుహ కు విడాకులు ఇవ్వకుండానే 1960లో మధుబాలను కిశోర్ కుమార్ వివాహమాడాడు. అందుకోసం ముస్లిం మతం స్వీకరించి తన పేరును కరీం అబ్దుల్ గా మార్చుకున్నారు. నెలరోజులకే మధుబాల కిశోర్ కుమార్ ఇంటిలో ఇమడలేక పోయింది. తరవాత సుస్తీ చేయడంతో 1969లో ఆమె చనిపోయింది. తరవాత 1976లో కిశోర్ కుమార్ నటి యోగితా బాలి ని వివాహమాడాడు. ఆ ముచ్చట కేవలం రెండేళ్ళే వుంది. చివరిసారి లీనా చందావర్కర్ ను కిశోర్ కుమార్ వివాహమాడాడు. వీరి వివాహబంధం కిశోర్ కుమార్ మరణించేదాకా కొనసాగింది.

మరిన్ని విశేషాలు…
1962 లో బాంబే టాకీస్ వారు కాళిదాస్ దర్శకత్వంలో ’హాఫ్ టికెట్’ సినిమా నిర్మించారు. అందులో కిశోర్ కుమార్, మధుబాల హీరో హీరోయిన్లు. సంగీతం సలీల్ చౌదరి సమకూర్చారు. అందులో “ఆకే సీది లాగి దిల్పే జిససే కతారియా” అనే పాట ఒకటి వుంది. ఈ పాటలో కిశోర్ కుమార్ ఆడవేషంలో విలన్ ప్రాణ్ ను ఆటపట్టిస్తూ కనిపిస్తారు. అసలు ఈ పాటను కిశోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడాల్సి వుండగా, ఆమె అందుబాటులో లేకుండడంతో కిశోర్ కుమారే అటు ఆడగొంతుకలోను, ఇటు మగ గొంతుకలోను పాడి అలరించారు. సినిమాలో ఈ పాట బాగా పాపులర్ అయింది. అయితే కిశోర్ ఆ దర్శకుణ్ణి ఏడిపించుకుతిన్నాడు. సెట్స్ మీదకు వచ్చేవాడు కాదు. వచ్చినా తనకు మూడ్ లేదని చెప్పి షూటింగ్ వాయిదా వేయించేవాడు. చివరకు ఆ సినిమాకు ఆర్ధిక సహకారం అందించిన కిషన్ చాబ్రియా ఇన్ కం టాక్స్ వాళ్లకు కిశోర్ ను పట్టించాడు. అదో పెద్ద కథ.

ఒకసారి దర్శక నిర్మాత హెచ్.ఎస్. రావైల్ కిషోర్ ఇంటికి వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. కిశోర్ వెంటనే అతని చెయ్యి కొరికాడు. విస్తుబోయిన రావైల్ “ఏమిటీ పెంపుడు కుక్క వ్యవహారం” అంటే కిశోర్ కుమార్ వెంటనే తన బంగాళా ముందున్న ‘బి వేర్ ఆఫ్ కిశోర్’ అనే సైన్ బోర్డు చూపించారు. ఇక నవ్వటం రావైల్ వంతయింది. అనవసర అతిథులు ఇంటికి రాకుండా వుండాలని తన లివింగ్ రూమ్ ఎదురుగా మనిషి కపాలం దాని మధ్య రెండు ఎముకలు పెట్టి ఎర్రటి లైటు వెలిగేలా చేసేవారు.

ఇందిరా గాంధి 1975 లో విధించిన ఎమర్జెన్సీని కిశోర్ కుమార్ వ్యతిరేకించాడు. ఆమె ప్రకటించిన 20 అంశాల కార్యక్రమాన్ని బహిరంగంగా వ్యతిరేకించాడు. దాంతో ప్రభుత్వం ఆకాశవాణి వివిధభారతి కార్యక్రమంలో రెండేళ్లపాటు కిశోర్ కుమార్ పాటలను ప్రసారం చేయనీయలేదు.

ఒకసారి ఓ నిర్మాత కిశోర్ కుమార్ కు ఇవ్వవలసిన పారితోషికంలో సగమే చెల్లించి, సినిమా నిర్మాణం పూర్తయ్యాక మిగతా సంగం చెల్లిస్తానని చెప్పాడు. మరుసటిరోజు కిశోర్ కుమార్ సగం మీసకట్టుతో సెట్స్ కు హాజరయ్యారు. చేసేది లేక పారితోషికం మొత్తం చెల్లించి ఆ నిర్మాత కిశోర్ కుమార్ చేత షూటింగ్ పూర్తిచేయించాడు.

కిశోర్ కుమార్ హాలీవుడ్ నటుడు, గాయకుడు డానీ కాయే కు వీరాభిమాని.తను నివసించే గౌరీకుంజ్ బంగాళా లివింగ్ రూమ్ నిండా డానీ ఫోటోలు తగిలించి ఉండేవి. రోజూ కిశోర్ ఆ ఫోటోలకు నమస్కరించకుండా స్టూడియో కు వెళ్ళేవాడు కాదు. కిశోర్ అభిమానించిన మరొక నేపథ్య గాయకుడు అహమద్ రష్ది. అతడంటే కిశోర్ కు ఎంత అభిమానమంటే లండన్ రాయల్ ఆల్బర్ట్ హాలులో ప్రదర్శన ఇచ్చినప్పుడు అహమద్ రష్ది ఆలపించిన కొన్ని పాటలను శ్రోతలకు వినిపించిన స్నేహశీలి కిశోర్. జిమ్మీ రోడ్జర్, టెక్స్ మోర్టాన్ ల ప్రభావంతో ‘యోడిలింగ్’ సాధన చేసి కృతకృత్యుడయ్యారు. “తుమ్ బిన్ జావూ కహాఁ”, “జిందగి ఎక్ సఫర్ హై సుహానా”, “చలా జాతా హూ” పాటలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.

ఒకసారి ఢిల్లీలో కిశోర్ కుమార్ సంగీత విభావరి జరిగింది. నిర్వాహకులు కిశోర్ కుమార్ పేరుచెప్పి డబ్బు బాగా వసూలు చేశారు. ప్రోగ్రాం కు ఆహ్వానించి స్టేజి ఎక్కబోయేముందు పారితోషికం ఇస్తామన్నారు. తీరా ప్రోగ్రాం మొదలు కాబోయేముందు నిర్వాహకులు ఇంకా డబ్బు అందలేదన్నారు. సభాస్థలి జనంతో నిండిపోయింది. కిశోర్ కుమార్ కు చిర్రెత్తింది. మైకు పుచ్చుకొని “పైసే లావో, మేరా పైసే లావో, జల్దీ లావో, లావో” అంటూ అప్పటికప్పుడు వరసకట్టి పాట పాడటం ఆరంభించాడు. ఆడిటోరియంలో వున్న ప్రేక్షకులకు విషయం అర్ధమైంది. నిర్వాహకులమ మీద ప్రేక్షకులు తిరగబడ్డారు. ఇక లాభం లేదని వెంటనే కిశోర్ కుమార్ కు వాళ్ళు డబ్బు అందజేశారు. సంగీత విభావరి సజావుగా సాగింది.

ఇలా చెప్పుకుంటూపోతే కిశోర్ కుమార్ గురించి చాలా విషయాలు చెప్పొచ్చు. కానీ స్థలాభావం కూడా ముఖ్యమేగా.

కిషోర్ కుమార్ కు ఉత్తమ గాయకునిగా మొత్తం ఎనిమిది (8) ఫిల్మ్ ఫేర్ బహుమతులు వచ్చాయి. ఇప్పటికీ ఈ రికార్డును ఏ గాయకుడు కూడా అందుకోలేదు. ఆ ఎనిమిది పాటలు ముందుగా వినిపించి, నామినేట్ అయిన పాటలను కొన్ని వినిపిస్తాను
రూప్ తేరా మస్తానా – ఆరాధనా (1970)
దిల్ ఐసా కిసీ నే -అమానుష్ (1976)
ఖైకే పాన్ బనా రస్ వాలా – డాన్ (1979)
హజార్ రాహే ముఢ్కె దేఖ్ – తోడిసీ బేవాఫా (1981)
పగ్ గుంఘ్రూ బంద్ – నమక్ హలాల్ (1983)
టైటిల్ సాంగ్ – అగర్ తుమ్ న హోతే (1984)
మంజీలే అప్ని జాగా హై – షరాబి (1985)
సాగర్ కినారే – సాగర్ (1986)

ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap