కవిత్వ పరిభాష తెలిసిన కవి

“కవులేం చేస్తారు
గోడలకు నోరిస్తారు
చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు.
ప్రభుత్వాల్ని ధిక్కరిస్తారు
ప్రజలకు చేతులిస్తారు

తెల్ల కాయితానికి అనంత శక్తినిస్తారు”

అని ప్రఖ్యాత కవి శివారెడ్డి గారు అంటారు. నిరంతర పఠనం, లేఖనం ఆయన స్వభావం. ఆయన కవులకు కవి. అంతకు మించిన మానవుడు. కవులను ఎంతగా ప్రేమిస్తారో మామూలు మనుషులను అంతగా ప్రేమిస్తారు. ఆయన ఒక కవిత్వం చెట్టు. ఎక్కడెక్కడి కవి ఖుక పికాలు ఆ చెట్టుపై వాలతాయి. ఎక్కడ ఏ కవి, కవిత పత్రికలో వచ్చినా, చదివి బాగుంటే ఫోన్ చేస్తారు. ఆయనొక నిరంతర కవితా యాత్రికుడు. ఎక్కడ ఆవిష్కరణ జరుగుతున్నా, ఎంతదూరమైనా వెళతారు. ‘రక్త సూర్యుడు’ దగ్గర నుంచి ఇరవై కవితా సంపుటులు రచించారు. సాహిత్య అకాడమీ అవార్డు దగ్గరనుంచి ఆయన అందుకోని అవార్డులు లేవు. ‘మోహనా! ఓ మోహనా’కు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ సంపుటిని అల్లాడి ఉమ, శ్రీధర్ ఇంగ్లీషులోకి అనువదించారు. చిదానందసాలి కన్నడంలోకి అనువదించారు. ‘అంతర్జనం’ సంపుటిని ఇంగ్లీషు, హిందీ, కన్నడంలోకి అనువదించారు. తానా వారి ఆహ్వానం మేరకు అమెరికాలో పర్యటించారు. 1999లో కువైట్లో సాహిత్య గోష్ఠుల్లో పాల్గొన్నారు.

2006లో ఫ్రాంక్ఫర్టె (జర్మనీ)లో జరిగిన బుక్ ఫెయిర్ సందర్భంగా భారతదేశం తరుపున ప్రత్యేక ఆహ్వానితులలో ఒకరుగా వెళ్ళి వివిధ సమావేశాలలో కవిత్వం వినిపించారు. ఆయన ప్రపంచ కవిత్వాన్ని అధ్యయనం చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు చేసారు. స్కూళ్ళలో, కాలేజీలలో కవిత్వం గురించి ఉపన్యాసాలు చెప్పారు. ముఖ్యంగా ఎందరో కవుల్ని తయారు చేసారు. ఎక్కడో తెనాలి దగ్గర కార్మూరి వారి పాలెంలో జన్మించి, కవితా పతాకాన్ని చేతబూని విశ్వమంతా ఎగరేసిన కవి. కవిత్వమే తానై, తానే కవిత్వమై జీవిస్తున్న కవి శివారెడ్డి గారు. కవిత్వం గురించి మహాకవి చెప్పే మాటలను వినడానికి హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళదాం పదండి!….

ప్రశ్న: చాలామంది కవులు కొంతకాలం రాసి తరువాత మానేస్తారు. ఈ ఎనిమిది పదుల వయసులోనూ యువతరంతో సమానంగా ఎప్పటికప్పుడు నవనవోన్మేషంగా కవిత్వం రాస్తూనే ఉన్నారు. నిత్య హరితరుతువులాగా కవిత్వాన్ని పండిస్తూనే ఉన్నారు. కారణమేమిటంటారు?
జవాబు: కవిత్వం రాయడం ఇదే మొదటి ప్రాధాన్యత కావాలి. ఒక అమోఘమైన ప్రేమ ఉండాలి. జీవితం పట్ల, మనుషుల పట్ల, సర్వప్రపంచం పట్ల ప్రేమ ఉండాలి. కవిత్వం అంటే ప్రేమే కదా! దాని కోసం జీవించు తపించు. ఆవేదనాగ్నిలో కాలి పదునెక్కినప్పుడు ఇంకేమీ ఉండదు కవిత్వం తప్ప, జీవితం తప్ప. సంక్షోభ భరితమైన జీవితాన్ని అనుభవిస్తూ దాన్ని కవిత్వకళగా మార్చేక్రమం ఒక గొప్ప ఆనందం. గొప్ప ఎరుక. అదొక ధన్యత. సర్వేంద్రియాలతో దేన్నైతే నేను రచిస్తానో, ఆనందిస్తానో, అనుభవిస్తానో అది ఇతరులకు అందజేసే వాహిక కవిత కదా! నాకాశ్చర్యం కవిత్వం రాయకుండా ఎలా ఉండగలరు అని. ప్రాణదాయువులాటిది. నిన్ను లోపలికి, ప్రతి వస్తువులోకి సర్వ సామాజిక ఘటనల్లోకి పంపే మార్మిక సూత్రం కదా కవిత్వమంటే. నిరంతరం రాయడం, నిరంతరం బతికుండటం, సచేతనంగా ఉండడం, సర్వప్రపంచాన్ని ఆఘ్రాణించడం, అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ అర్థమయ్యాక దాంట్లో భాగమయ్యాక రాయకుండా ఉండలేము. నీ చుట్టూ జరిగే సమస్త చర్యలు ఒక ఆకు రాలడం దగ్గరనుంచి, ఒక పూవు పూయడం దగ్గర నుంచి ఎలుక కోసం బొక్క దగ్గర కాపు కాచిన పిల్లి దగ్గర నుంచి ఒక విరాడ్రూప దశకు కవిత్వంలో వ్యాపిస్తాను. అదొక దుఃఖం, అదొక ఆనందం. అదొక విముక్తి. ఒకేసారి ఒక కవిత రాసి ఆగను. భిన్న వస్తువులతో ఉన్న అనేక కవితలు అలా వరసగా వస్తాయి.

ప్రశ్న: మరో కవికైనా, మామూలు మనిషికైనా బాల్యంలో ఒక మధుర స్మృతి. మీ బాల్యం, విద్యాభ్యాస, మిమ్మల్ని కవిత్వం రాయడానికి ప్రేరేపించిన సంఘటనలు గురించి వివరించండి?
జవాబు: నాకే ఆశ్చర్యం! ఎక్కడ బయల్దేరాను. ఎక్కడకు వచ్చాను అద్భుతమైంది, అనేక రహస్యాలతో నిండుకున్నది, గూడమైనది. దుర్గమారణ్యం లాంటి జీవితం అదిగో అక్కడ బయల్దేరా.. ఎంత వయస్సు.. ఆరేడేళ్ళు. తల్లి లేదు. తనే తల్లియైన తండ్రి ఉన్నాడు. గోపీ అన్నట్లు బాల్యం లేని బాల్యం నాది. చార్లెస్ రేంజ్ అన్నట్లు చిన్నపుడు దుర్భరమైన జీవితం గడిపేవాళ్ళకి అసాధారణమైన గ్రహణశక్తి వుంటుందని, ప్రతిదాన్నుంచి ఏదో కొంత సంగ్రహించి దాచుకొనే విలక్షణమైన లక్షణముంటుందని అంటాడు. శరీరం మొత్తం మెదడులాగా, హృదయంలాగా పనిజేసే శక్తి ఏదో ఆ బాల్యస్థితి నుంచి సంక్రమించి ఉంటుంది. ఊహ అనూహ్యంగా పెరుగుతుంది. కొంత మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగివచ్చిన ఈ బాలుడు సర్వ ప్రకృతిని, సర్వమానవ సమూహాలని ఆఘ్రాణించాడు. ఆనందించాడు. అఖండమైన కవితా ఖనిజ సంపద అక్కడ దొరికింది. ప్రతిదాన్నీ అంతర్లీనం చేసుకొనే నాజూకైన విద్య ఏదో అప్పుడు నాకు లభించింది. Advers car cum stance నన్ను బలోపేతుణ్ణి చేసాయి. ఒక ఆవావహం దృక్పథాన్ని అలవరుచుకొనేటట్లు చేసాయి. ఒకరకంగా గొప్ప ధైర్యశాలిని చేసాయి.

ప్రశ్న: అమ్మలేని బాల్యం దుర్భరం కదా! ఆ సందర్భంలో మీరెలా జీవించారు?
జవాబు: ఆ దుర్భర బాల్యానికి పొడిగింపే నా సమస్త జీవితం. నేను చేయని పని లేదు. ఇంటి పనులు, వంట పనులు, పొలం పనులు సమస్తం కరతలా మలకం. బహుశ కవిత్వంలో శిల్పానికి సంబంధించిన అంశాలన్నీ చిన్నప్పుడు నేను గమనించిన వ్యావసాయిక పనులనుంచి, మాతృమూర్తిలీ కలల్ని, కళల్ని అందిపుచ్చుకొనే తత్వం నుంచి వచ్చింది.

ప్రశ్న: ‘ఆసుపత్రి గీతం’ ఒక అద్భుతమైన కావ్యం. ఆసుపత్రి అంటే పేదలకు వైద్యం అందించాలి. కానీ పచ్చకాగితాలను చూస్తేనే వైద్యుడి గుండె కరుగుతుంది. వైద్యులు తెల్లకోటు వేసుకొంటారు. కానీ ఆ తెల్లదనం వారి మనసులకు ఉండదు. డబ్బున్న వారికే వైద్యం. దీన్నే ‘ఆసుపత్రి గీతం’లో “తెల్లదనం శాంతికి గుర్తంటారు. తెల్లదనం పవిత్రతకు ప్రతీకంటారు. నాకు మాత్రం తెల్లదనం చూస్తే బాగా బతికి కొవ్వు పట్టిన తెల్ల పిల్లుల జంగు పిల్లల స్పురణ” అని అంటారు మీరు. ఈ కావ్యంలో ఆసుపత్రి వాచ్యం, వ్యవస్థ వ్యంగ్యం!”. ఈ కావ్య నేపథ్యం వివరించండి!

జవాబు: జీవితం మొత్తం దశలు దశలుగా, ఘటనలు, ఘటనలుగా సాగిపోతుంది. కవిగా నువ్వు మేల్కొని వుంటే, సాంద్రమైన స్పందనా గుణం వుంటే ఏదీ పరిహరించ దగింది కాదు. 75లో మా రెండో అమ్మాయి శాంతికి డిసెంట్రీ పట్టుకొంది. డాక్టరుకి చూపించి మందులు వాడుతున్నా తగ్గలేదు. ఐపోయింది అనుకొన్నాము. అప్పుడు ‘నీలోఫర్’ తొలిసారిగా దగ్గరగా ఆస్పత్రిని చూడడం, ఆసుపత్రిలో 20 రోజులు ఉంచి మొదటిసారి ఆసుపత్రి గీతాలు రాసాను. ముళ్ళకంప దుఃఖాన్ని అనుభవించడం గురించి 7,8 కవితలు రాసాను. ఆ తరువాత నీలోఫర్తో సబంధం పెరిగిందే కానీ తగ్గలేదు.

ప్రశ్న: ఎంత ఆరోగ్యవంతుడికైనా ఎప్పుడో ఒకప్పుడు జబ్బు చేయక తప్పదు. ఆసుపత్రికి వెళ్ళక తప్పదు. అక్కడ నరకాన్ని అనుభవించక తప్పదు. ఆ నరకంలో నుంచి కావ్యం ఎలా ప్రభవించింది?
జవాబు: మా మూడవ అమ్మాయి గర్భంలొ ఉన్నపుడు సంవత్సరం పాటు నీలోఫర్ చుట్టూ తిరిగాం. నెలకు రెండుసార్లు చూపించుకొని రావాలి. అది గర్భమో కాదో తెలీదు. ఆఖరికి ఓపెన్ చేసారు. వారానికో, రెండు వారాలకో టెస్ట్ చేయించుకోవాలి. ఇలా 9 నెలలపాటు తిరిగాను. ఆసుపత్రి స్వభావం, స్వరూపం అవగతమైంది. నరకాలు ఎన్నున్నాయో తెలీదు కానీ, ఆసుపత్రి ఒక భయంకర నరకం. సమాజం మొత్తాన్నీ సూక్ష్మదశలో తెలుపుతుంది. ఇంత సమాచారం సేకరించాను.

ప్రశ్న: ఆ సమాచారానికి కావ్య పరిమళం ఎలా అద్దారు?
జవాబు: కావ్యం రాయాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? ఎక్కడ ట్రీట్ చెయ్యాలి. సూత్ర బద్ధత ఉండాలి కదా! అది ఒక మానసిక సంక్షోభం చెయ్యాలి. అలా మరిగి మరిగి బయటకు వచ్చిన కావ్యం ‘ఆసుపత్రి గీతం’ అలలు అలలుగా విభజించాను. ఆస్పత్రికి వచ్చే సమస్త వర్గ కులాల వాళ్లు ఏ రకంగా ఉపేక్ష చేయబడతారో చూపించాను. ఇప్పుడు మీరు చదువుతున్న రూపం తీసుకోవడానికి వర్ణన, నాటకీకరణ, పాత్రలు, సన్నివేశాలు కల్పించాను. చాలా స్పష్టంగా వర్గ సమాజం లాంటి ఆస్పత్రిని చూపించాను. అదొక రకమైన దృశ్యకావ్యం. కొద్ది మార్పులతో నాటకం చెయ్యచ్చు. సంవత్సరం తిరిగేసరికి రీప్రింటుకు వచ్చింది. ఇప్పటికీ అదింకా ఆదరింప బడడానికి నేటి సమాజమే కారణం. ఏమీ మార్పులు లేవు. అదే ఆసుపత్రి కొనసాగుతుంది.

ప్రశ్న: సమాజం శతాబ్దాలు గడిచినా మారదు. అదొక కొండచిలువల లాంటిది. ఆ తర్వాత ‘మోహనా! ఓ మోహనా!’ వచ్చింది. బతుకు మోహనా! బతుకు/ బతకడాన్ని ఓ పెద్ద పాపకార్యం యేసిన/ బతకడాన్ని ఓ పెద్ద బండ బరువు చేసిన/ బతకడాన్ని ఓ బడా వ్యాపారం చేసిన/ ఈ సుందర మయ వ్యవస్థలో బతుకు మోహనా! బతుకు’ అని బతుకులోని ఉత్సవ మాధుర్యాన్ని తెలిపిన కావ్యం వచ్చింది. దీనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అప్పటి అనుభూతి ఏమిటి?
జవాబు: ‘మోహనా! ఓ మోహనా’ నా ఆరవ పుస్తకం. ‘రక్త సూర్యుడు’, ‘చర్య’, ‘ఆసుపత్రి గీతం’, ‘నేత్రధనస్సు’, ‘భారమితి’, ‘మోహనాఁ ఓ మోహనా!’ నా ఆరవ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు రావడం ఆశ్చర్యమే. ముఖ్యంగా వామపక్ష భావజాలానికి సంబంధించిన కవికి అకాడమీ అవార్డు రావడం ఓ సంచలనం.

ప్రశ్న: మీ పుస్తకాలకు అకాడమీ అవార్డు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదా మీరు?
జవాబు: నేనుప్పుడూ ఊహించలేదు. టి.వి ల్లో చూసిందాకా నాకు తెలీదు. నాకు ఆశ్చర్యమే. నా కవితా యాత్రలో ఒక క్రమ వికాసం ఉంది. వస్తు రూపాలకు సంబంధించి ‘భారమితకే రావాల్సింది. అప్పుడు ఫైనల్కి వచ్చిందని నాకు తెలుసు. ‘భారమిత’, ‘మోహనా ఓ మోహనా’ ఒక దశకు సంబంధించినవి. వస్తు విస్తృతితో పాటు ఒక సైద్ధాంతిక భూమిక, రూపానికి సంబంధించిన విస్తృతి కూడా ‘మోహనా! ఓ మోహనా’లో కనిపిస్తుంది. ఒక మౌఖిక అంశ, ఒక జానపద వ్యక్తీకరణ ‘మోహనా ఓ మోహనా’లో కనిపిస్తుంది. ఆ సంవత్సరం అవార్డుకొచ్చిన పుస్తకాల్లో జూరీ మెంబర్లు దీనికి ఓటేయడం వలన అవార్డు వచ్చింది. గద్దర్ పాట ఆకట్టుకొన్నట్లుగా గొంతెత్తి చదివినపుడు వచన కవిత కూడా శ్రోతల్ని రంజింపజేసి ఆకట్టుకొని ఆనందింప చెయ్యాలి. క్రమ క్రమంగా కవిత వ్యాప్తి చెందే పద్ధతి ‘మోహనా ఓ మోహనా’లో చూడొచ్చు.

ప్రశ్న: కవిత్వంలో మీది వ్యక్తిత్వ పద్ధతి అంటారు గదా! అంటే ఏమిటి వివరిస్తారా?
జవాబు: వచన కవితను కూడా బాగా చదవచ్చు. సాహిత్య సమావేశాల్లోనే కాకుండా, స్కూళ్ళు, కాలేజీల్లో కూడా కవిత వినిపించి పిల్లల్ని ఆకట్టుకుంటానికి ఈ శిల్పం బాగా పనికొచ్చింది. అలా దృశ్యాలు దృశ్యాలుగా కవిత కదిలిపోతుంది. ఈ పద్ధతి బాగా ఆదరణ పొందినా దీన్నే సతీష్ చందర్ లాటి వాళ్ళు వక్తృత్వ పద్ధతి అన్నారు.

ప్రశ్న: కవితకు ప్రధానమైనవి వస్తు శిల్పాలు. వస్తువులో నవ్యత్వం ఉండాలి. శిల్పంలో నవ్యత్వం ఉండాలి. అప్పుడు ఆ కవిత పాఠకుని గుండెల్లో ప్రగాఢమైన ముద్ర వేస్తుంది. వీటి గురించి వివరిస్తారా?
జవాబు: శిల్పమంటే ఏమీలేదు. అవతలి వాడికి హత్తుకొనేట్లు చెప్పే పద్ధతి. వస్తువే శిల్పాన్ని నిర్ణయిస్తుంది. వచన కవిత్వం ఒక విశాలమైన వేదిక. ఇరుకిరుగ్గా పద్యం రాయాల్సిన అవసరం లేదు. సాము చేసే నేర్పు నీకుండాలే గాని ఈ విశాలమైన వేదికలో ఎన్ని పోకడలైనా పోవచ్చు.

ప్రశ్న: ‘రక్త సూర్యుడు’ దగ్గర నుంచి మీరు ఇరవై వరకు కవిత్వ సంపుటాలు రచించారు. మీ సంపుటాల్లో చాలా స్త్రీవాద కవితలు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనది ‘ఆమె ఎవరైతేనేం’. పగలంతా పని చేసి పడుకొనే ఒక స్త్రీ గురించి రాసిన కవిత ఇది. “రేప్పొద్దున వికసించే అద్భుత పుష్పంలా ఆమె పడుకుంటే పడుకోనీ/ ఒక సంక్షుభిత పగతి తరువాత/ ఒక వ్యాకుల కవిత శిధిల పగతి తర్వాత/ ఏ సౌందర్యమూ లేని, ఏ లాలిత్యమూ లేని/ భయంకర పశువు పగటి తరువాత” పడుకున్న ఆమెను లేపొద్దు అని అంటారు. ఈ పేరుతోనే కవితా సంకలనం కూడా వచ్చింది. వివరాలు…
జవాబు: గుడిపాటి, పెన్నా శివరామకృష్ణ, స్త్రీలపై శివారెడ్డి రాసిన కవిత్వం వేద్దామన్నపుడు పుస్తకానికి సరిపడా కవితలున్నాయా అని అనుమానం. పెన్నా అన్ని కవితా సంపుటాల నుంచి స్త్రీ సంబంధిత కవితలను పోగు చేసాడు. 60 కవితలు వచ్చాయి. వస్తుపరంగా విభజించి శీర్షికలు పెట్టాడు. అద్భుతమైన ముందుమాటలు రాసాడు. నాకూ ఆశ్చర్యమే అన్ని కవితలు రాసానా అని. సోమసుందర్ “ఏ కవి రాసాడు స్త్రీల మీద ఇన్ని కవితలు నువ్వు తప్ప” అన్నాడు.

ప్రశ్న: ప్రతి పురుషుడిలోనూ స్త్రీ హృదమం ఉంటుందని అంటారు గదా!
జవాబు: నాదొక పిచ్చి కోరిక ఉండేది. కొన్నాళ్ళు స్త్రీగా జీవించాలని. ప్రతి కవిలో సగభాగం స్త్రీయే. అర్థనారీశ్వరుడు అని శివుణ్ణి అన్నారు కానీ ప్రతి కవీ అర్థనారీశ్వరుడే. వాళ్ళ ఏంగిల్ నుంచి స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జీవితాన్ని చూడ్డం ఒక లాలిత్యం, ఒక లలితమైన ఊహా లాలిత్యం కవితల్లో చొరబడుతున్నాయి. ఈ సుదీర్ఘ జీవితంలో జీవితాన్ననుభవించడంలో స్త్రీ పాత్ర, వాళ్ళ దృక్కోణం ముఖ్యమైనవి. ఆ కోణం నుంచే చాలా కవితలు వచ్చాయి.

ప్రశ్న: మీ కవిత్వం కేసెట్లుగా వచ్చింది. మంజీరా రచయితల సంఘం మీ కవితలను కేసెట్లుగా తెచ్చారు. అంతకుముందు శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కేసెట్లుగా వచ్చింది. శ్రీశ్రీ తర్వాత మీవే కేసెట్లు వచ్చాయి.
జవాబు: ‘రక్త సూర్యుడు’, ‘చర్య’, ‘ఆసుపత్రి గీతం’, ‘నేత్ర ధనస్సు’, ‘భారమితి’, ‘మోహనా ఓ మోహనా’ డి. వెంకట్రామయ్య గారి గొంతుతో వచ్చాయి. చివరి మూడు కావ్యాలు నా గొంతులో వచ్చాయి.

ప్రశ్న: మీరు అనేక దేశాలు పర్యటించారు కదా! ఎన్నో భాషల్లోని విభిన్న కవితలు విన్నారు. వాటిలో తెలుగు కవిత్వానికి ఏ స్థానం వుంది?
జవాబు: మన కవిత్వం ప్రపంచ భాషల్లో ఏ కవిత్వానికీ తీసిపోదు. ఇతర భాషల వారికి మన తెలుగు కవిత్వం తెలియాలంటే ఇంగ్లీషు అనువాదాలు ఉండాలి. మనకి అనువాదకులు లేకపోవడం లోటు. అద్భుతంమైన కవిత్వం ఉంది. మంచి అనువాదం, మంచి పబ్లిషర్ ఉండాలి.

ప్రశ్న: మీ అభిమాన కవులెవరు?
జవాబు: నెరూడా, రిక్యస్ (గ్రీకు) మయకోవిస్కీ, ఎతూ షెంకో..

ప్రశ్న: సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. కానీ మీరు కవిత్వ మొక్కటే రాసారు. కారణమేమిటి?
జవాబు: నా స్వభావం కవిత్వానికి ఎక్కువగా సరిపోతుంది. ఆవేశం, ఉద్రేకం, క్రోథం ఈ గుణాలున్న వ్యక్తి కవిత్వానికే ఒదుగుతాడు. కనుక స్వభావరీత్యా కవిత్వమే రాసాను.

ప్రశ్న: కొంతమంది కవులు బాగా రాస్తారు కానీ, బాగా చదవలేరు. మీరు కవిత చదువుతుంటే శ్రోతలు ఒక రస ప్రవాహంలో విహరిస్తారు. ఇంగ్లీషులో సచ్చిదానంద్ గారు బాగా చదువుతారు. ఒక కవిత్వ ప్రపంచంలో తాదాత్మ్యం చెందుతారు శ్రోతలు. మళయాళంలో కవితలు పాడతారు. బాగా చదవాలంటే ఏం చెయ్యాలి?
జవాబు: మన తెలుగు కవులు కవితలను చదవడం కూడా నేర్చుకోవాలి. క్లాసులో పద్యం చదవడం కాదు. నీ ముందొక సమూహం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ సమూహాన్ని అడ్రస్ చెయ్యాలి. అంతే. కవితను ప్రదర్శించాలి. చదవడం అంటే ప్రదర్శించడం. దాన్ని సాధన చేసి నేర్చుకోవాలి.

ప్రశ్న: మీ దృష్టిలో ఉత్తమ కవిత్వానికి నిర్వచనం?
జవాబు: శ్రీశ్రీ చెప్పినట్లుగా నిన్ను కదిలించేదీ, పెను నిద్దుర వదిలించేదిగా ఉండాలి. నీ ఆలోచనలని, అవగాహనని విస్తృత పరచేది, నిన్ను మనిషిగా తయారు చేసేది అదే కవిత్వం.

ప్రశ్న: కవులకు మీరిచ్చే సందేశం..?
జవాబు: బాగా చదవండి… బాగా బతకండి… బాగా రాయండి

  • మందరపు హైమవతి

3 thoughts on “కవిత్వ పరిభాష తెలిసిన కవి

  1. భవిష్యత్ తరాల కవులకు చక్కని మార్గదర్శం ఈ ఇంటర్వ్యూ. అభినందనలు మందరపు హైమవతి గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap