తెలుగు చిత్ర పరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ బరిలో దిగనున్నారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. దీంతో ప్రకాశ్ రాజ్ కు పోటీగా ఎవరు బరిలోకి దిగుతారు? ఆయనకు ఎవరి మద్దతు ఉంటుంది? ఇలా అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మద్దతు మీకు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి? మీరేమంటారు? అన్న దానికి ప్రకాశ్ రాజ్ సమాధానం ఇస్తూ.. ‘చిరంజీవి అందరి వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని ఆయన భావించినవారికి మద్దతిస్తారు. అన్నయ్యతో నాకున్న సాన్నిహిత్యాన్ని దీని కోసం వినియోగించుకోను’ అని సమాధానం ఇచ్చారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని, వాటిని అధిగమించడానికి తన వద్ద సరైన ప్రణాళిక ఉందన్నారు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే చాలా విషయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా పెద్దదన్న ప్రకాశ్ రాజ్.. ఒకప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాతలు ఇప్పుడు లేవని, దేశవ్యాప్తంగా ‘మా’కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ‘మా’కు ఇప్పటివరకూ సొంత భవనం లేదని, తాను అధ్యక్షుడిని అయితే, 100 శాతం సొంత భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు సాయం చేయడానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సహృదయం కలిగిన నటులు ఉన్నారని, వాళ్లందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తానని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ప్యానెల్ లో వీరేనా? ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో సీనియర్ నటులు శ్రీకాంత్, అలీ, బెనర్జీ తదితరులు చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రకాష్ రాజు వ్యతిరేకంగా శివాజీ రాజా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీలో మెజారిటీ వర్గాల మద్దతు ప్రకాష్ రాజ్ కే ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో రాబోయే ‘మా‘ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి రావడంతో ఇప్పటి నుంచే ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.