తొలి తెలుగు మహిళా కార్టూనిస్ట్ – రాగతి పండరి

(నేడు తెలుగు వ్యంగ్య మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి జయంతి)

కార్టూన్లు-నవ్విస్తాయి… కార్టూన్లు-కవ్విస్తాయి… కార్టూన్లు-ఆలోచింపజేస్తాయి… కార్టూన్లు ఆయుష్సును పెంచుతాయి.
అందుకే కార్టూన్లంటే అందరికీ ఇష్టమే. కార్టూన్ అసామాన్యులనే కాదు, సామాన్యులను కూడా ప్రభావితం చేయగల కళ. తెలుగు కార్టూన్ కు ఎనిమిది దశాబ్దాల చరిత్రవుంది. నాటి తలిశెట్టి నుండి నేటి నాగిశెట్టి వరకు ఎందరో కార్టూనిస్టులు తెలుగు కార్టూన్ రంగాన్ని సుసంపన్నం చేసారు. ఫిబ్రవరి 19 న 6 వ వర్థంతి సందర్భంగా మహిళా కార్టూనిస్టు కుమారి రాగతి పండరి గారిని ఒక సారి తలచుకుందాం.

సుఖం-దు:ఖం, నవ్వు-ఏడుపు ప్రతీ మనిషి జీవితంలో సహజం. అయితే లేని కష్టాల్ని సృష్టించుకొని జీవితాన్ని ఏడుస్తూ గడిపేవారు కొందరైతే, ఉన్న విచారాన్ని మరిచిపోయి నవ్వుతూ గడపటమే కాక తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ నాలుగు దశాబ్దాల పాటు కార్టూన్లు గీసారు కుమారి రాగతి పండరి. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి మహిళా కార్టూనిస్టుగా ఎనిమిదేళ్ళ వయసులో 1972 సం.లో ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ద్వారా ఆరంగేట్రం చేసి అప్రతిహాసంగా కార్టూన్లు, కార్టూన్ ఫీచర్స్, కార్టూన్ కథలూ, కార్టూన్ సీరియల్స్ వివిధ పత్రికలలో సుమారు పదమూడు వేలకు పైగా గీసి తెలుగు పత్రికా ప్రపంచంలోని కార్టూన్ సామ్రాజ్యానికి ఆమె మకుటంలేని మహారాణిగా వెలుగొందారు.

Ragati Pandari with Parents

ఆంధ్రభూమి వీక్లీ, డైలీ పేపర్లో సంపాదకుడు సి.కనకాంబరరాజుగారు పండరీగార్ని బాగా ప్రోత్సహించేవారు. అంధ్రభూమి వీక్లీలో రాజకీయ చెదరంగం ఫీచర్ పది సంవత్సరాల పాటు నిర్వహించి కార్టూనిస్టుగా ఎందరో పాఠకుల ప్రశంసలందుకున్న వీరు, అనేక బహుమతులు, అవార్డులు అందుకున్నారు. “నవ్వుల విందు కార్టూన్లు పసందు” పేరుతో రెండు వందల కార్టూన్లు పుస్తక రూపంలో కూడా వచ్చాయి. 1965 జూలై 22న విశాఖలో గోవిందరావు, శాంతకుమారిగార్లకు జన్మించిన ఈమె పూర్తి పేరు రాగతి పండరి బాయి. పుట్టిన సంవత్సరంలోనే విధి పోలియో సర్పమై కాటేసినా, జీవితాన్ని సవాలుగా తీసుకొని చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఇంటర్మీడియట్ వరకూ చదివి, స్వయంకృషితో కార్టూన్ రంగంలో ప్రవేశించి సమాజంలో ప్రతీ సమస్యా, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన సమస్యలను తన కార్టూన్ల ద్వారా ప్రతిఫలింపజేశారు. చిన్నపాటి గీతలతో ఆమె సృష్టించే బోమ్మలు, వాటికి తగ్గట్టుగా ఆమె రాసే వ్యాఖ్యలు నవ్వుల పువ్వులు పూయిస్తాయి. ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ గారికి ఏకలవ్య శిష్యురాలనని చెప్పుకొనే పండరి స్వశక్తితో కార్టూన్ కళనభ్యసించి, దాదాపు అన్ని తెలుగు పత్రికలలోనూ కార్టూన్లు గీసారు.

వీరి కృషికి గుర్తింపుగా 2011 సం.లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డుతో సత్కరించింది. కళారత్న అవార్డు కార్టూన్ రంగానికి ప్రకటించిన మొదటి సంవత్సరమే తనకు ఇచ్చినందుకు ఆమె చాలా సంతోషపడ్డారు. వీరు రాసిన ఆత్మకథ “నా గురించి నేను’ 64కళలు డాట్ కాం పత్రికలో ధారావాహికగా వెలువడి, పుస్తక రూపంలో సంతరించుకుంది. చిత్రకళా పరిషత్వా, విశాఖపట్నం రు 2008 సంవత్సరంలో ఈమె “ఆత్మకథ నా గురించి నేను” ప్రచురించారు. ఈ పుస్తకాన్ని, ప్రముఖ సాహితీవేత్త ద్వా.నా. శాస్త్రి చేతులమీదుగా 2008లో విశాఖపట్నంలో ఆవిష్కరించారు.

Ragati Pandari

“అంగవైకల్యం వల్ల నేను గడపదాటి ఎక్కడికి వెళ్లలేకపోయినా అభిమానులు రాసే ఉత్తరాలే నాలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. కార్టూనిస్టులు ఎవ్వరైనా విశాఖపట్నానికి వచ్చినపుడు మా ఇంటికి వచ్చేవారు. ఒకసారి జయదేవ్ గారు తన ఫ్యామిలీతో పాటు మా ఇంటికి వచ్చి కొన్ని కార్టూన్లు గీసి చూపించారు. అలాగే మా ఆతిధ్యం కూడా స్వీకరించారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన”అంటూ చెప్పుకొనేవారు.

రాగతి పండరి తనకంటూ ప్రత్యేక శైలిని, పాత్రలను సృష్టించుకున్నారు. పొడుగమ్మాయి, పొట్టి అమ్మాయిలతో ఇద్దరమ్మాయిలు, రాజకీయ చదరంగం, కవయిత్రి ఇలా తనదైన ఒరవడిని కార్టూన్ ప్రపంచంలో ఆమె సృష్టించుకున్నారు. తొలి కార్టూన్ కు నాలుగు రూపాయల పారితోషకం అందుకున్నానని గర్వంగా చెప్పుకొనే రాగతి పండరి గారు తెలుగులో ఎందరో మహిళా కార్టూనిస్టులు కలం పట్టడానికి కారకులయ్యారు. పద్మ, భార్గవి, వాగ్దేవి, జయ లాంటి మహిళా కార్టూనిస్టులు ఆమె స్ఫూర్తితోనే కలం పట్టారు.

ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఫిబ్రవరి 19న, 2015 లో విశాఖలో కుమారి రాగతి పండరి కలం గీతలు ఆగిపోయినా, వారు పంచిన నవ్వులు పాఠకుల పెదవులపై నేటికీ నిలిచేవున్నాయి.

-కళాసాగర్

cartoon

1 thought on “తొలి తెలుగు మహిళా కార్టూనిస్ట్ – రాగతి పండరి

  1. బొమ్మన్ ఆర్టిస్ట్ & కార్టూనిస్ట్. విజయవాడ. says:

    రాగతిపండరి మనం మరచిపోలేని గొప్ప కార్టూనిస్ట్. ఆమె లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదే !—-బొమ్మన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap