“రేపల్లె చరిత్ర”కు పురస్కారం

పాత రేపల్లె తాలుకా ప్రాంతపు చారిత్రాత్మక, ఆధ్యాత్మిక, సామాజిక రాజకీయాది రంగాల చరిత్రను క్రీ.పూ. నుంచి వర్తమానం వరకు వెలికితీస్తూ సుప్రసిద్ధ సాహితీవేత్త, చరిత్ర పరిశోధకులు మన్నె శ్రీనివాసరావు రచించిన “రేపల్లె చరిత్ర” కు ప్రతిష్టాత్మకమైన “రాజా వాసిరెడ్డి ఫౌండేషన్(హైదరాబాద్)” వారి ఉత్తమ చరిత్ర పరిశోధనా గ్రంథ పురస్కారం ప్రకటించారు. పాత రేపల్లె తాలూకాలో ఎర్పడిన రాజ్యాలు, జమిందారీ సంస్థానాలు, 100 గ్రామాల పుట్టుపూర్వోత్తరాలను – జరిగిన స్వాతంత్ర్య ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, చేనేత ఉద్యమాలు తీరుతెన్నులను – ఈ ప్రాంతాన జన్మించిన 200 పైబడిన వివిధ రంగాల ప్రముఖుల జీవిత చరిత్రలను తొలిసారిగా మన్నె శ్రీనివాసరావు ఈ రేపల్లె చరిత్రలో గ్రంథస్థం చేశారు.
చరిత్రప్రియులను, సాహితీవేత్తలను విశేషముగా అలరించిన ఈ గ్రంధానికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కినందుకు రచయిత ‘మన్నె’ను ఈ ప్రాంతపు ప్రముఖులందరూ అభినందనలు తెలిపారు.

మన్నె కు ఈ పురస్కారాన్ని ఈ నెల 24 వ తేదీ న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన వేదికలో సీబీఐ మాజీ డైరెక్టర్ జె.డి.లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రభ ఎడిటర్ వై.యస్.ఆర్.శర్మ ఇత్యాది ప్రముఖుల చేతులమీదుగా ప్రధానం గావించనున్నట్టు ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శలు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరీ, బిక్కి కృష్ణలు తెలిపారు.

మన్నె నేటిదాకా వివిధ సాహిత్య ప్రక్రియల్లో 60 పైబడి గ్రంధాలు రచించారు. వీరి రచనల్లో కోన ప్రభాకరరావు జీవిత చరిత్ర, రేపల్లె రంగస్థలి(పరిశోధనా గ్రంథం), బుద్ధం శరణం గచ్ఛామి (పద్య నాటకం), సమ్రాట్ అశోక(చారిత్రాత్మక నాటిక), దివ్యధాత్రి (పద్య కావ్యం) వంటివి విశేష ప్రాచుర్యం పొందాయి.
గతంలో నోరి నరసింహశాస్త్రి సాహిత్యపురస్కారం, గురజాడ అప్పారావు పురస్కారమ్ వంటి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను, నాట్యశ్రీ, నాట్యభూషణ్ వంటి జాతీయస్థాయి అవార్డులను, అభినయ కళాప్రపూర్ణ, రంగస్థల రత్న వంటి అనేక బిరుదులను పొందారు.

ఈ సందర్భంగా రచయిత మన్నె మాట్లాడుతూ… “ఈ గౌరవం, పురస్కారం రేపల్లె ప్రాంతానికే చెందుతుంది. ఈ పుస్తకాన్నీ ముద్రింపచేసి ఈ ప్రాంత ఘనత వెలుగులోకి తెచ్చిన మైనేని సుబ్బారావు గారికే ఈ ఘనత దక్కుతుందని ” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap