రోజారమణి-చక్రపాణిలకు ‘జీవిత సాఫల్య పురస్కారం ‘

హీరో తరుణ్ తల్లిదండ్రులైన రోజారమణి, చక్రపాణి దంపతులు, ‘ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం 2020 ‘కి ఎంపికయ్యారు. అమెరికా గానకోకిల శారద ఆకునూరి నిర్వహణలో వంశీ ఇంటర్నేషనల్ ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నెట్ ద్వారా.. స్వర్ణోత్సవ నటీమణి రోజారమణి, చక్రపాణి దంపతులకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారాన్ని అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం బహుకరించారు. ఈ దంపతుల తనయుడైన హీరో తరుణ్, తనయ అమూల్య తమ తల్లిదండ్రులను శాలువ, పుష్పగుచ్ఛం ఇచ్చి.. జీవిత సాఫల్య పురస్కారాన్ని వారి స్వగృహంలోనే ఈ అందజేశారు.

ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ.. “బాల్యంలో మా అమ్మ భక్త ప్రహ్లాద చిత్రంలో నటించి జాతీయ పురస్కారం అందుకోవడం, అలాగే నేను కూడా అంజలి చిత్రంలో బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకోవడం జీవితంలో ఒక మధుర స్మృతి. ఇప్పుడు ఈ పురస్కారం అమ్మనాన్నలకు దక్కడం చాలా సంతోషంగా ఉంది..” అని అన్నారు. నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. “రోజారమణితో నేను వస్తాడే మా బావ, భారతంలో ఒక అమ్మాయి చిత్రాలలో కలిసి నటించాను. ఆమె నటన అద్భుతం. ఆమెను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మొట్టమొదట నేనే పరిచయం చేశాను. 400 చిత్రాలకు పైగా ఆమె డబ్బింగ్ చెప్పారు. చక్రపాణి విషయానికి వస్తే.. మనకు ఎన్టీఆర్ వలే.. ఆయన ఒరియాలో పౌరాణిక పాత్రల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఆదర్శ దంపతులుగా వారు ఈ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది.. ” అని అన్నారు. రోజారమణి, చక్రపాణి మాట్లాడుతూ.. తమ జీవితమంతా కళలకు అంకితమైందని, కళల మయమైన జీవితం ఆనందాన్ని చేకూరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహారావు, తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, డా. ప్రసాద్ తోటకూర, జయశ్రీ పీసపాటి హాంగ్ కాంగ్, విజయ గొల్లపూడి, డా. తెన్నేటి సుధా, శైలజ సుంకరపల్లి, డా. వి.పి. కిల్లి, శిరోమణి వంశీ రామరాజు తదితరులు ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link