గురువు కు సెల్యూట్ – మహ్మద్ రఫీ

నేడు అరుణ్ సాగర్ జయంతి!

అరుణ్ సాగర్ అందరి వాడు! కానీ, ఒకప్పుడు నా బాస్! జర్నలిజం లో నాకు గురువు! ఎలా రాయాలో చెయ్యి పట్టి నేర్పించిన బాస్!
ఆంధ్రజ్యోతి లో 1994 ఏప్రిల్ లో సబ్ ఎడిటర్ గా చేరాను బిక్కు బిక్కు మంటూ! అప్పట్లో విజయవాడ లబ్బీపేట లో ! ఎడిటోరియల్ ఫ్లోర్ లో అటు చివర నుంచి ఇటు చివర వరకు డెస్క్ ఇంచార్జి లు అంతా మేధావులే ! మధ్యలో ఒక మూల ఎడిటర్ నండూరి రామ్మోహన్ రావు గారి క్యాబిన్! అటు చివర నుంచి వస్తే శశికాంత్ శాతకర్ణి గారు, వెంకట్రావు గారు, తోటకూర రఘు గారు, త్రిపురనేని శ్రీనివాస్ గారు, డ్యానీ గారు, శ్రీవత్స గారు, శ్యాం మోహన్ గారు, మధ్యలో నళిని రంజన్ గారు, దిన్షా బాబు గారు, ఈ చివర పొనుగోటి కృష్ణారెడ్డి గారు, దండమూడి సీతారాం గారు, నంద కిషోర్ గారు, అరుణ్ సాగర్ గారు…అందరూ హేమా హేమీలే! వీళ్లందరి మధ్య సాంబశివరావు, దేశరాజు శ్రీనివాస్, రామ్మోహన్, అవ్వారు శ్రీనివాస్, నేను, ఇంకా చాలా మంది సబ్ ఎడిటర్లం! ఏదో జిల్లా రాజకీయ వార్తలు ఎడిట్ చేసుకుంటూ సూపర్ లీడ్ లు రాసుకుంటూ మంచి హెడ్డింగ్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్న తరుణం లో ఫీచర్స్ డెస్క్ స్టార్ట్ చేస్తూ అరుణ్ సాగర్ ను ఇంచార్జ్ ను చేసేసారు నండూరి గారు! స్పెషల్ డెస్క్ అని పేరు పెట్టారు! సాంబు (ఇప్పుడు టీవీ 9)ను, నన్ను అక్కడకు షిఫ్ట్ చేశారు! అరుణ్ సాగర్ తో అదే పరిచయం! “ఏం లేదు బాస్…ఆడుతూ పాడుతూ ఐటమ్స్ రాసేయడమే”…ఇది ఫస్ట్ నాతో అరుణ్ సాగర్ మాట్లాడిన మాట! అయన నాకు బాస్! నేనేదో భయంగా అయన దగ్గరకు వెళితే ఆయనెంతో ఫ్రెండ్లీ గా నన్నే బాస్ అని సంబోధించడం తో ఆశ్చర్యపోయాను ! డేబోనాయర్ మేగజైన్ లో రెండు పేపర్స్ పరపరా చించి translate చేసేయమ్మ అనేశాడు! నాకు గుండె జారి గల్లంతు అయినంత పని! అదే నా మొదటి అనువాదం ఆంగ్లం నుంచి తెలుగు లోకి! ఏదో రాసేశా! నాకే తృప్తి లేదు! నేను కృష్ణా డెస్క్ కు వెళ్ళిపోతాను అనేశాను ! “లేదు, నేను పోలిష్ చేసేస్తాను, నీలో స్టఫ్ వుంది, జిల్లా వార్తల్లో కిక్ వుండదమ్మా” అని ఎంతో భరోసా ఇచ్చారు! రోజూ రావడం ఏదొక ఇంగ్లీష్ మేగజైన్ లో ఆర్టికల్ తీసి ఇవ్వడం, నేను రాయడం లైన్ లైన్ గ్యాప్ ఇచ్చి, మళ్ళీ అయన స్టయిల్లో ఆ గ్యాప్ లైన్ లో అదే ఆర్టికల్ సాగర్ రాయడం…ఇలా రెండు నెలలు నాతో రాయించాడు, రాయడం నేర్పించాడు సాగర్! ఆ తరువాత మహిళల కోసం నవీన పేజీ, కుర్రాళ్ళ కోసం యంగ్ తరంగ్ మొదలుపెట్టి రోజుకో ఆలోచన ఇచ్చి ఐటెం రాయించేవారు ! మార్పులు చేర్పులు చేసి కలిమి శ్రీ (ప్రస్తుతం మల్లె తీగ పత్రిక ఎడిటర్) తో డిజైన చేయించడం, ఉదయాన్నే పేపర్ లో ప్రింట్ రూపం లో చూసుకుని ఉబ్బి తబ్బిబ్బు అయిపోవడం! ఇదే తంతు! ఆ తరువాత 1996 లో హైదరాబాద్ కు బదిలీ… డెస్క్ మొత్తాన్ని! ఇక్కడ వాటితో పాటు యువత కోసం 20 ప్లస్ పేజీ కూడా తోడు అయ్యింది! ఇదే సెక్షన్ లో నంద కిషోర్ గారు కెరీర్ గైడ్ అని రోజు ఎడ్యుకేషన్ పేజీ, కృష్ణారెడ్డి గారు రైతుల కోసం, సాహిత్యం కోసం! ఆ పక్కన సండే సెక్షన్ ఆర్.ఎం.ఉమా మహేశ్వరరావు గారు, పసుపులేటి గీత గారు, ఖదీర్ మామగాడు, అటు పక్క దాట్ల నారాయణ మూర్తి గారి తరువాత నామిని గారు, వల్లూరి రాఘవరావు…ఇలా మొదలయ్యింది అరుణ్ సాగర్ తో ప్రయాణం!

సాగర్ చాలా మంచోడు! సున్నిత మనస్కుడు! ఎంత క్లిష్ట మయిన అంశాన్ని కూడా ఇట్టే ఈజీ గా పరిష్కారం చూపించేవాడు ! తెలుగు కు మోడరన్ టచ్ ఇచ్చి అక్కడక్కడా ఇంగ్లీష్ పదాలను నిరభ్యంతరంగా వాడొచ్చు అంటూ జర్నలిజానికి కొత్త అర్ధం చెప్పి కొత్త పుంతలు తొక్కించిన తొలి జర్నలిస్ట్ అరుణ్ సాగర్! తెలుగు జర్నలిజానికి హై ఫై ఫ్యాషన్ తో తళుకులు అద్దిన తొలి జర్నలిస్ట్ సాగర్! ఇలా ఎన్నో ప్రయోగాలు చేశాడు, చేయించాడు! అందరితో ఎంతో స్నేహంగా ఉండేవాడు ! మా డెస్క్ లో కొన్నాళ్ళకు గంగాధర్ చేరడం తో ఇక నవ్వులే నవ్వులు! (పాపం గంగడు కూడా సాగర్ వెళ్లి పోయిన కొన్నాళ్లకే ఇక సెలవ్ బాబాయ్ అంటూ వెళ్ళిపోయాడు!) వనం దుర్గా ప్రసాద్, పారుపల్లి శ్రీధర్ గారు, బంగారు వెంకట్రావు బాబాయ్, చిదంబరం గారు, భాస్కర్ గారు… ఇంకా మిత్రులు చాలా మంది!

మా డెస్క్ పక్కనే ఉండే వల్లూరి రాఘవరావు ఉంటే ఎక్కడయినా రచ్చ రంబోలే ! అయితే ఏ రచ్చ అయినా, ఏ పార్టీ అయినా సాగర్ ప్లాన్ చేయాల్సిందే ! 1998 లో నా పెళ్ళికి సాగర్ అందరిని తీసుకుని వినుకొండ వచ్చారు! సాగర్ ఆధ్వర్యంలో రాఘవరావు నుంచి అందరు డాన్సులు చేసి హంగామా చేసారు! ఆలా 2000 డిసెంబర్ 31న ఆంధ్రజ్యోతి లాక్ డౌన్ వరకు సాగర్ నీడనే సాగర్ శిష్యుడు గా వున్నాను! ఎన్నో అనుభూతులు! ఎన్నెన్నో జ్ఞాపకాలు!

సాగర్ ఎంతగా ప్రేమిస్తాడో అంత అభద్రతా భావం లో ఉంటాడు! పాపం మొదటి నుంచి కూడా ఆరోగ్యం అంతంత మాత్రమే! నన్ను, సాంబు ను తండ్రిలా అన్నలా జాగ్రత్తగా కాపాడుకుంటూ తనకు ఇష్టంగా మలచుకుంటూ వచ్చారు! సాంబు ఏదీ పట్టించుకోడు, అన్నీ లైట్ తీసుకుంటాడు! నేను ఆలా కాదు! కొన్ని విషయాల్లో సాగర్ ను నేను విభేదించే వాడ్ని! లౌక్యం నాకు అప్పట్లో కొంచెం కూడా తెలియదు! అతని ఆలోచనలు నచ్చకపోతే ఎదిరించేవాడ్ని! ఒక్కోసారి అలిగి వారం పది రోజులు ఆఫీస్ కు వెళ్ళేవాడిని కాదు! అది సాగర్ కు నచ్చేది కాదు! అయినా సరే, పెద్ద మనసు తో క్షమించే వాడు! టీ కి తీసుకెళ్లి పెద్దన్న లా క్లాస్ పీకి అక్కున చేర్చుకునే వాడు! నా బాధ ఒక్కటే…డెస్క్ లో సాగర్ దగ్గర ఏడేళ్లు పని చేసినా మా రాతల గురించి ఎవ్వరికి తెలియదు! సహజ, చంద్రలేఖ, మమత…ఇలా ఏవో అమ్మాయిల పేర్లతో బై లైన్ ఇచ్చేవారు ! గుర్తింపు ఉండేది కాదు ! కానీ, చాల ప్రయోగాలు చేయించాడు! ఒకసారి సమయానికి కవిత కావాల్సి వచ్చింది! పేజీ లో పెట్టి తీరాలి ఆరోజు! రాసేయ్ అన్నాడు! రాయలేను అన్నాను, ఎప్పుడూ రాయలేదు అన్నాను! రాయగలవు … అంటూ నా తొలి కవిత “తెగని రాగం” పది నిముషాల్లో నాతో రాయించి పేజీ లో పెట్టేయించేసాడు! అంటే, అంత మోటివేటర్ సాగర్! నాతో ప్రతి గురువారం ఒక కథ చొప్పున 80 కథలు రాయించాడు! అంతటి మెంటార్ సాగర్! ఏదయినా చేయగలడు! ఏమయినా చేయించగలడు ! అసాధ్యం అంటూ సాగర్ కు ఏదీ ఉండదు! సాగర్ లో నచ్చనిది నాకు ఒక్కటే! కోడిపెట్టలా తన భుజాల కింద అదిమి పెట్టేసుకున్నాడు! అందుకే, ఆంధ్రజ్యోతిలో ఆయన దగ్గర పని చేసిన ఏడేళ్ల కాలం లో నేను ఎవ్వరికి తెలియదు!

అక్కడ నుంచి వార్త లో చేరాక మురళి వర్దెల్లి గారు నా బాస్! ప్రస్తుతం సాక్షి ఎడిటర్. నా రాతలను, నా ప్రతిభ ను ఒక్క నెలలోనే పాఠకులకు తెలియ చేసిన మహానుభావుడు! వార్త లో నేను పని చేసిన ఆ తొమ్మిదేళ్లు నా కెరీర్ లోనే గొప్ప మలుపు! నాతో అద్భుత ఐటమ్స్ రాయించి, గొప్ప ఇంటర్వ్యూ లు చేయించి నన్ను మంచి జర్నలిస్ట్ గా అంతెత్తున కూర్చోబెట్టిన ఘనత మురళి గారిదే! నన్ను తీర్చి దిద్దిన బాస్ అరుణ్ సాగర్ స్మారక పురస్కారం, నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన బాస్ మురళి గారు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ప్రెస్ క్లబ్ లో స్వీకరిస్తున్నారు ! అందుకే చాలా సంతోషంగా వుంది.

అరుణ్ సాగర్ వ్యక్తిత్వపు రెండు కోణాలు తెలిసిన జర్నలిస్టులు నాలా ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు! అందరికి తెలిసింది ఒక్క కోణమే ! అందుకే అందరి వాడు అరుణ్ సాగర్! అలాంటి అదృష్టం కొందరికే ఉంటుంది! అందులో అరుణ్ సాగర్ ది అగ్రేసర స్థానం! ఎందుకంటే జర్నలిజం రంగం లో ఇంకా ఎంతో మంది మేధావి జర్నలిస్టులు కనుమూశారు! కానీ, సాగర్ కు దక్కిన గౌరవం అందుకోలేక పోయారు! సాగర్ చనిపోయినా చిరంజీవి లా వర్ధిల్లడానికి, ఈ తరానికి ఆ తరానికి అందరు గుర్తు పెట్టుకోవడానికి కారణం సాగర్ స్నేహ బంధం! స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు! ఇవాళ సాగర్ జయంతి! చిన్న వయసులోనే అల్విదా అంటూ వెళ్లిపోవడం తలచుకుంటే బాధగా ఉంటుంది ! సాగర్ జ్ఞాపకాలు ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉంటాయి! ఒకసారి అకస్మాత్తుగా ఆఫీస్ లో నేను కుప్ప కూలిపోతే, వెంటనే జిఎం ప్రసాద్ గారి తో మాటాడి ఆఫీస్ కార్ లో తన ఒడిలో నన్ను పడుకో బెట్టుకుని నిమ్స్ లో చేర్చి సపర్యలు చేసిన సాగర్ ను నేను మరచిపోలేను ఈ జన్మలో ! ఇలా చాలా విషయాల్లో వేలు పట్టి నడిపించిన సాగర్ ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది! మా ఇద్దరి మధ్య భేదాభి ప్రాయాలు పలు మార్లు వచ్చినా మళ్ళీ మన రఫీ అంటూ కలుపుకు పోయిన గొప్ప మనసున్న మిత్రుడు బాస్ సాగర్! కానీ, నా ధైర్యాన్ని, నా చొచ్చుకు పోయే తత్వాన్ని భరించేవాడు కాదు! నా రాతలను తొక్కి పెట్టేవాడు! నాకు కనీస గుర్తింపు లేకుండా చేయడం లో సక్సెస్ అయ్యాడు! ఆంటే, నా డామినేషన్ పవర్ నచ్చేది కాదు! అప్పట్లో అమ్మాయిల పేర్ల తో రాసిన ఐటమ్స్ కు ప్రేమ లేఖలు వచ్చేవి! తట్టుకోలేక పోయేవాడు ! అందుకే ఆంధ్రజ్యోతి మళ్ళీ తెరుచుకున్నాక తన టీం లోకి నన్ను తీసుకోలేదు ! ఆ తరువాత tv9, tv10, tv5 లోకి ఆయన వెళ్ళినప్పుడల్లా నన్ను ఆహ్వానించినా నేను సుతారంగా నవ్వుతూ దాటేసాను !

కొన్ని విషయాలు ఇప్పుడు అప్రస్తుతం ! పోయినోళ్ళు మంచోళ్ళు అంటారు! నిజానికి సాగర్ చాలా మంచోడు! అద్భుత జర్నలిస్ట్! గొప్ప మానవతావాది! కమ్యూనిస్ట్ బిడ్డ ! కత్తి లాంటి కవి! అద్భుతం గా రాయగలడు ! ఏదయినా రాయగలడు! దేని గురించి అడిగినా తడుముకోకుండా చక్కగా వివరించగలడు! అంత నాలెడ్జి గల జర్నలిస్ట్ నాకు తారస పడలేదు! సాగర్ సృజన నేనెవ్వరిలోను చూడలేదు! పదేళ్ల ముందు చూపుతో ఆలోచిస్తాడు ! అనుకున్నది అప్పుడే చేసేస్తాడు! ఏ జనరేషన్ ను అయినా ఆకట్టుకోగల నేర్పరి ప్రతిభ అతని సొంతమ్! అయినా సరే, అతను బ్రతికి వున్న రోజుల్లో అతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు! గుర్తింపు కోసం తపించాడు! విచారకరం, మన సమాజమే అంత! బతికి వున్నప్పుడు పట్టించుకోదు! పోయాక కూడా పట్టించు కోరు కానీ, సాగర్ విషయం లో కాస్త మార్పు కనిపించింది! అతన్ని మిత్రులు చిరంజీవి ని చేసేసారు! అల్లం నారాయణ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉండటం కూడా ఒక కారణం! ఎందుకంటే సాగర్ ప్రతిభను బాగా తెలిసినవారు, దగ్గరుండి చూసిన వారు నారాయణ గారు! అందుకే సాగర్ మన మధ్య లేకున్నా చిరంజీవిలా వర్ధిల్లుతున్నారు !

Rafee

అద్భుత మేధావి సాగర్ ని చిన్న వయసులోనే కోల్పోవడం నిజంగా దురదృష్టకరం! సాగర్ కు కన్నీటి శ్రద్ధాంజలి!

  • డాక్టర్ మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap