సందేశాత్మకంగా సైకత శిల్పాలు

ఇసుక రేణువులు ఒక్కటై ఆయన చేతిలో అందమైన ఆకృతిని రాలుతాయి. సమాజంలోని దుష్టత్వాన్ని దునుమాడతాయి. మన చేత్తో మనం సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఎత్తిచూపుతూ మనల్ని ఆలోచింపజేస్తాయి, సందేశాన్నిచ్చి, మనల్ని ముందుకు నడుపుతాయి. ఆయనే సైకత శిల్పి దేవిని శ్రీనివాస్. తన జీవితాన్ని కళకు అంకితం చేసిన ఈయన నదీ పరివాహక ప్రాంతాల్లో, సముద్ర తరాల్లో సంచరిస్తూ, తన కళ్లతో చూసిన అన్యాయాలను తన కళతో ప్రశ్నిస్తాడు. చక్కని కేన్సర్లతో సూచన ప్రాయంగా హెచ్చరిస్తారు. శిల్పాలతో మంచిని ఉపదేశిస్తారు. సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చి, శిల్ప కళను తన ప్రవృత్తిగా ఎంచుకున్న శ్రీనివాస్ కళాభినివేశం గురించి 64కళలు.కాం పాటకుల కోసం.  

కళను కాసుల కోసం కాకుండా సమాజం కోసం. సంతృప్తి కోసం వినియోగిస్తారు. సైకత శిల్పి దేవిని శ్రీనివాస్ సందేశాత్మక సైకత శిల్పాలను మలచి, వాటిని కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజనుల ప్రశంసలందుకుంటున్న శ్రీనివాస్ 2019 లో విజయవాడ లో  జరిగిన సౌత్ ఇండియన్ సోషల్ మీడియా ఫెస్టివల్‌లో జిజ్ఞాన గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు.

శ్రీనివాస్ పుట్టింది. రాజమండ్రి సమీపలోని రంగంపేట ఈయన తల్లి మాణిక్యం, తండ్రి సుబ్బారావు వ్యవసాయ కుటుంబం. 1976 లో జన్మించిన శ్రీనివాస్ చిన్ననాటి నుంచి చదువుతో పాటు చిత్రకళా రంగం వైపు ఆసక్తి కనబరిచేవారు. హైస్కూల్లో చదివే రోజుల్లో కరణం నూకరాజు అనే డ్రాయింగ్ టీచర్ ప్రోత్సాహంతో 10వ తరగతి వరకు చిత్రకళపై ప్రత్యేక దృష్టి పెట్టి నేర్చుకున్నారు. ఇంటర్ విద్యకు పెద్దాపురంలోని మహారాణి కళాశాలలో చేరినా, మరో రెండు సంవత్సరాలపాటు ఆయన వద్దే ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అదే సమయంలో చిత్ర కళలో ఎన్నో బహుమతులను కూడా అందుకున్నారు. డిగ్రీ చదువుతున్న సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చిత్రకళను పక్కన పెట్టి పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవడం ప్రారంభించారు. చదువు పూర్తయ్యాక వ్యవసాయం చేస్తూనే పెళ్లి మండపాల డెకరేషన్, పూల అలంకరణను వృత్తిగా ఎందుకున్నారు. మరోవైపు నాటక సమాజాల్లో చేరి నటునిగా, స్టేజ్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ టెక్నిషియన్ గా పెద్దల ప్రశంసలు అందుకున్నారు. గణపతి నవరాత్రుల్లో ఫ్రెండ్స్ తో కలిసి రంపం పొట్టుతో గణపతి విగ్రహాన్ని తయారు చేసి, డ్రయి ప్రూట్స్ అందంగా అలంకరించారు. అప్పటి నుంచి వస్తువులతో రూపాలు తయారు చేయటం ప్రారంభించారు. కొంతకాలం పెన్సిళ్లు, సబ్బులు వంటి వాటిపై బొమ్మలు గీశారు. తరువాత ఇసుకతో బొమ్మలు తయారు చేయాలన్న ఆలోచన శ్రీనివాస్ ని  సముద్ర తీరం వైపు నడిపించింది. పెళ్లి ముహూర్తాలు లేని సమయంలో సైకత శిల్పాలపై దృష్టి సారించేవారు. సందేశాత్మక సైకత శిల్పాలతో… ప్రముఖ సైకత శిల్పి పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పాల ఫోటోలు అప్పుడప్పుడు పత్రికల్లో రావడం చూసారు. ఆయన స్ఫూర్తితో సందేశాత్మకమైన శిల్పాలు ఆవిష్కరణకు పూనుకున్నారు. ఇందుకోసం ఎంతో సాధన చేశారు. ఇప్పుడు తన కళా స్పర్శతో ఇసుకతిన్నెలు కొత్త సోయగాలతో హొయలు పోతున్నాయి. ఆయా సందర్భాలను బట్టి, ఇసుక తిన్నెల్లో సందేశాత్మక శిల్పాలకు ప్రాణం పోస్తుంటారు. ప్రత్యేక వార్షికోత్సవాలను, ప్రముఖుల జయంతులు, వర్థంతులు నేపథ్యంగా సైకత శిల్పాలను ఆవిష్కరిస్తూ వస్తున్నారు. చిన్న సైజు నుంచి 50 అడుగుల సైజు శిల్పాల వరకు ఆయన తయారు చేశారు. సెప్టెంబరు 1వ తేది పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో ‘కళను రాసుల కోసం కాకుండా సమాజం కోసం ‘ అని చాటి చెబుతూ కళాత్మకమైన మనసుతో ఎన్నో సైకత శిల్పాలను ఉచితంగా (తయారు చేసేందుకు అవసరం అయ్యే ఖర్చుతో) రూపొందించినందుకుగాను 2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బెస్ట్ ఎక్ష్ లెన్స్ అవార్డును అందుకున్న ఏకైక వ్యక్తి శ్రీనివాస్ గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ జరిగిన ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో తన సైకత శిల్పాన్ని ప్రదర్శించారు. కాకినాడ ఎన్టీఆర్ బీచ్, వైజాగ్ రిషికొండ బీచ్, విజయవాడ భవానీ ఐలాండ్, బాపట్ల బీచ్ల లో తన సందేశాత్మక సైకత శిల్పాలతో సందర్శకులను ఆలోచింపచేస్తూ, కనువిందు చేస్తూ సందేశాన్ని ఇస్తూ మనిషి హృదయాన్ని తట్టి లేపుతూ ఉంటాయి. ఈ మధ్య తొమ్మిది నెలల చిన్నారిని అత్యాచారం చేసిన సంఘటనను ఖండిస్తూ ‘ఈ చట్టాలు సరిపోతాయా ? ” అంటూ చిన్నారులను సంరక్షించండి’ అనే సందేశంతో రూపుదిద్దుకున్న శిల్పం అందరి హృదయాలనూ తాకింది. పుల్వామాలో సైనికులపై దాడి, బాలికల సంరక్షణ, తెలుగు భాష, ప్రకృతి, పర్యావరణ సంరక్షణ, కాలుష్యం తదితర అంశాలపై ఆయన శిల్పాలను రూపొందిస్తుంటారు. పేపర్ గుజ్జులో పలు రూపాలను, శిల్పాలను తయారు చేస్తున్నారు. నాలుగు అడుగుల ఎత్తు, మూడడుగుల వెడల్పు కలిగిన వెంకటేశ్వర స్వామి విగ్రహం మంచి పేరు తెచ్చిపెట్టింది.
______________________________________________________________
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, మహ శివరాత్రి సంధర్భంగా అటు ఆధ్యాత్మికతను ఇటు తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలిపేలా 108 శివలింగాలతో మహా శివుని జ్ఞాన నేత్రానికి వున్నంత శక్తి మాతృభాషకు వుందని తెలియజేస్తూ మూడవకన్ను స్థానంలో అ అక్షరాన్ని వుంచి మహ శివుని సాక్షిగా మాతృభాషను మరచిపోవద్దు అన్న నినాదంతో రూపొందించిన సైకత శిల్పం రూపొందిచారు తూర్పుగోదావరికి చెందిన సైకత శిల్పి దేవిన శ్రీనివాస్.
______________________________________________________________

– శ్రీనివాస రెడ్డి, జర్నలిస్ట్  (9885864418 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap